నిబంధనలను తుంగలో తొక్కిన ఆరోగ్య శాఖ అధికారులు
అర్హతలేని కంపెనీలకు అడ్డగోలు అనుమతులు
రూ.10లక్షలు టర్నోవర్ లేని కంపెనీలకు రూ.50 కోట్ల పనులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల కోసం కొనుగోలు చేయాల్సిన ఔషధాల టెండర్లలో భారీగా గోల్‌మాల్ జరిగింది. నిబంధనలను గాలికొదిలిన ఔషధ నియంత్రణ అధికారులు, ఆరోగ్యశాఖ అధికారులు కలిసి ఊరూపేరూ లేని కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారు. నకిలీ ధ్రువపత్రాల సాయంతో అర్హతలేని కంపెనీలు రూ.కోట్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకున్నాయి. మొత్తం 315 ఔషధాల కోసం టెండర్లు పిలిస్తే.. 120 కంపెనీలు పాల్గొన్నాయి. 3, 4 మినహా మిగతావన్నీ పరాయి రాష్ట్రాలకు చెందినవే కావడం గమనార్హం. చిరునామాలు కూడా సరిగ్గా లేని ఆ కంపెనీలను అధికారులు వంతపాడడం విమర్శలకు తావిస్తోంది. మంత్రిగారి అండదండలతో కొందరు కాంట్రాక్టులను దక్కించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ ఉల్లంఘనలు...
ఏడాదికి రూ.2.5కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీనే టెండర్లలో పాల్గొనాలి. కానీ, రూ.10లక్షలు కూడా చేయని కంపెనీ రూ.50కోట్ల కాంట్రాక్టులను దక్కించుకుంది.
జీవో నెంబర్ 1357 ప్రకారం.. కాంట్రాక్టు పొందగోరుతున్న ఉత్పత్తిపై సంబంధిత కంపెనీకి మార్కెట్ స్టాండింగ్ సర్టిఫికెట్ ఉండాలి. ఇప్పుడు టెండర్లలో పాల్గొన్న చాలా కంపెనీలు అలాంటి మందులను ఉత్పత్తి చేసిన పాపాన కూడా పోలేదు.
పంజాబ్‌కు చెందిన జాక్సన్ కంపెనీ 130 మందులను టెండర్‌లో దక్కించుకుంది. ఈ కంపెనీ 20 మందులను కూడా ఉత్పత్తి చేయని పరిస్థితి ఉంది. అమృతసర్‌లో ఉన్న ఈ కంపెనీపై గత ఏడాది టెండర్లలో పాల్గొనకుండా అనర్హత వేటు వేశారు. కానీ ఈ ఏడాది ఆ కంపెనీకి అనుమతి లభించడంపై విమర్శలు తలెత్తాయి.
ఆర్‌ఓసీ (రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్) నుంచి సమాచారం సేకరిస్తే ఆయా కంపెనీల్లో చాలా వరకూ రూ. 50 లక్షలు కూడా టర్నోవర్ చేసినట్టు లేదు.
బిడ్ ఫైనలైజేషన్‌కు ఫైలు: ఈ ఫైలు మంగళవారం బిడ్ ఫైనలైజేషన్ కోసం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి వద్దకు వచ్చింది. కానీ ఇన్ని అవకతవకలు, గోల్‌మాల్‌ల మధ్య ముఖ్య కార్యదర్శి ఎలా స్పందిస్తారనేది అసలు ప్రశ్న. ఇప్పటికే ఆయా కంపెనీల తీరుపై కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులొచ్చాయి.
తర్వాతైనా పరిశీలిస్తాం
టెండర్లు దక్కించుకున్నాకైనా కంపెనీలను పరిశీలిస్తాం. ఆ తర్వాతైనా వాటిని రద్దు చేయవచ్చు. ప్రస్తుతం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. జాక్సన్ కంపెనీని గతేడాది అనర్హత చేసింది నిజమే. కానీ ఈ ఏడాది కూడా అలాంటి కంపెనీలను పరిశీలిస్తాం.
- డా. మధుసూదన్‌రావు, జీఎం, రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ
ఔషధాల టెండర్లలో గోల్‌మాల్!
Published Wed, Jan 8 2014 3:16 AM | Last Updated on Fri, May 25 2018 2:57 PM
Advertisement
Advertisement