
ఆ హీరోయిన్ పాట వింటూ.. గురక పెట్టారు!
బాలీవుడ్ నటి పరిణీత చోప్రా తొలిసారి గొంతు సవరించుకుంది. 'మేరి ప్యారి బిందు' సినిమా కోసం ఆమె తొలిసారి పాట పాడింది. 'మానకే హమ్ యార్ నహి' అంటూ ఆమె మధురంగా ఆలపించిన పాటకు శ్రోతలు, బాలీవుడ్ ప్రముఖుల నుంచి జేజేలు లభిస్తున్నాయి. ఆమె సింగింగ్ టాలెంట్‌ను అందరూ వేనోళ్ల కొనియాడుతుండగా.. 'గోల్‌మాల్-4'లో ఆమె సరసన హీరోగా నటిస్తున్న అజయ్ దేవ్‌గణ్ మాత్రం ఒక విచిత్రమైన పోస్టు పెట్టారు. పరిణీత పాటను వింటూ తామంతా గురకపెట్టి నిద్రపోయామంటూ ఓ ఫొటోను ట్వీట్ చేశారు.
'మానకే హమ్ యార్ నహీని పాటను మాతో బలవంతంగా వినిపించడం ఇది పదోసారి. అయినా పాటను ఇష్టపడుతున్నాం. గ్రేట్ జాబ్ పరిణీత' అంటూ అజయ్ ఓ ఫొటో ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో పరిణీత మొబైల్ ఫోన్‌లో తన పాట వినిపిస్తుండగా అజయ్, దర్శకుడు రోహిత్ శెట్టీ సహా యావత్ చిత్ర బృందమంతా గాఢనిద్రలోకి జారుకున్నట్టు కనిపిస్తున్నారు. రోహిత్ శెట్టీ కామెడీ ధమాకా అయిన 'గోల్‌మాల్-4' కోసం అజయ్‌తో ఈసారి పరిణీత చోప్రా జత కట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తుషార్ కపూర్, అర్షద్ వార్సీతోపాటు టబూ కూడా నటిస్తున్నది.