Ajay Devgn: సీక్వెల్‌ స్టార్‌ | Singham star Ajay Devgn gears up for 8 sequels | Sakshi
Sakshi News home page

Ajay Devgn: సీక్వెల్‌ స్టార్‌

Published Fri, Apr 5 2024 4:17 AM | Last Updated on Fri, Apr 5 2024 4:17 AM

Singham star Ajay Devgn gears up for 8 sequels - Sakshi

యాక్షన్‌ హీరోగా, ఫ్యామిలీ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిస్తున్నారు అజయ్‌ దేవగన్‌. ఇప్పుడు ఈ హీరోకి ‘సీక్వెల్‌ స్టార్‌’ అని ట్యాగ్‌ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఒకటి కాదు... రెండు మూడు కూడా కాదు... ఏకంగా ఎనిమిది చిత్రాల సీక్వెల్స్‌ అజయ్‌ దేవగన్‌ డైరీలో ఉన్నాయి. సీక్వెల్‌ చిత్రాల్లో నటించడం పెద్ద విషయం కాదు కానీ వరుసగా ఎనిమిది చిత్రాలంటే మాత్రం పెద్ద విషయమే. ఇక అజయ్‌ సైన్‌ చేసిన సీక్వెల్‌ చిత్రాల్లో ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్‌ దశలో ఉండగా కొన్ని ఆరంభం కావాలి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.

అజయ్‌ దేవగన్‌ కెరీర్‌లో ‘సింగమ్‌’ చిత్రానిది ప్రత్యేక స్థానం. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో పోలీసాఫీసర్‌ సింగమ్‌గా అజయ్‌ దేవగన్‌ విజృంభించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత అజయ్‌ దేవగన్‌–రోహిత్‌ శెట్టి కాంబినేషన్‌లోనే ‘సింగమ్‌’కి సీక్వెల్‌గా ‘సింగమ్‌ రిటర్న్స్‌’ (2014) రూపొంది, సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘సింగమ్‌ రిటర్న్స్‌’ విడుదలైన దాదాపు పదేళ్లకు ఈ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగమ్‌ ఎగైన్‌’ పేరుతో ఓ మూవీ రూపొందుతోంది.

అజయ్‌ దేవగన్‌ హీరోగా ఈ చిత్రానికి కూడా రోహిత్‌ శెట్టియే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్‌ కానుందని సమాచారం. అదే విధంగా అజయ్‌ దేవగన్‌ హీరోగా రాజ్‌కుమార్‌ గుప్తా  దర్శకత్వంలో వచ్చిన ‘రైడ్‌’ (2018) మూవీ ఘనవిజయం సాధించింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘రైడ్‌ 2’ తెరకెక్కుతోంది. అజయ్‌ దేవగన్‌ హీరోగా డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వాణీ కపూర్, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ కీలక పాత్రధారులు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్‌ 15న రిలీజ్‌ కానుంది.

ఇదిలా ఉంటే.. ‘సింగమ్‌’ వంటి హిట్‌ సీక్వెల్స్‌ ఇచ్చిన హీరో అజయ్‌ దేవగన్‌–దర్శకుడు రోహిత్‌ శెట్టి కాంబినేషన్‌లో వచ్చిన మరో చిత్రం ‘గోల్‌మాల్‌’ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అజయ్‌ దేవగన్‌–రోహిత్‌ శెట్టి కాంబినేషన్‌లోనే వచ్చిన ‘గోల్‌మాల్‌ రిటర్న్స్‌’ (2008) సూపర్‌ హిట్‌ అయింది. ‘గోల్‌మాల్‌’ ఫ్రాంచైజీలో ‘గోల్‌మాల్‌ 3’ (2010), ‘గోల్‌మాల్‌ 4’ (2017) కూడా వచ్చాయి. ‘గోల్‌మాల్‌ 5’ రానుంది.

అజయ్‌ దేవగన్‌–రోహిత్‌ శెట్టి కాంబినేషన్‌లోనే రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందట. ఇకపోతే అజయ్‌ దేవగన్, రకుల్‌ ప్రీత్‌సింగ్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘దే దే ప్యార్‌ దే’. అకివ్‌ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో రిలీజై సూపర్‌ హిట్‌ అయింది. దాదాపు ఐదేళ్లకి ‘దే దే ప్యార్‌ దే 2’ సినిమాని ప్రకటించారు మేకర్స్‌. ఇందులోనూ అజయ్‌ దేవగన్‌ లీడ్‌ రోల్‌లో నటించనున్నారు.

అయితే ‘దే దే ప్యార్‌ దే’కి అకివ్‌ అలీ దర్శకత్వం వహించగా.. ‘దే దే ప్యార్‌ దే 2’ మూవీని కొత్త దర్శకుడు అన్షుల్‌ శర్మ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని 2025 మే 1న విడుదల చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. అలాగే అజయ్‌ దేవగన్‌ హీరోగా అశ్వినీ ధీర్‌ దర్శకత్వం వహించిన యాక్షన్‌ కామెడీ చిత్రం ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌’. 2012లో విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. సునీల్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మర్యాద రామన్న’ (2010) చిత్రానికి ఇది రీమేక్‌.

ఇక ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌’ వచ్చిన పుష్కరం తర్వాత సీక్వెల్‌గా ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌ 2’ తెరకెక్కనుంది. తొలి భాగానికి అశ్వినీ ధీర్‌ దర్శకత్వం వహించగా, మలి భాగాన్ని డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌ అరోరా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే 2025లో ఈ సినిమాని రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

అదే విధంగా మలయాళ హిట్‌ మూవీ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించారు. నిషికాంత్‌ కామత్‌ దర్శకత్వం వహించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం’ (2015) హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు ‘దృశ్యం 2’ రిలీజైంది. అజయ్‌ దేవగన్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ఈ మూవీకి అభిషేక్‌ పాఠక్‌ దర్శకత్వం వహించారు. ఇదే ఫ్రాంచైజీలో మలయాళంలో ‘దృశ్యం 3’ రానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో కూడా అజయ్‌ దేవగన్‌ నటిస్తారని సమాచారం.

ఇదిలా ఉంటే వికాస్‌ బాల్‌ దర్శకత్వంలో అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించిన ‘సైతాన్‌’ చిత్రం గత నెల 8న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సైతాన్‌ 2’ రానుంది. ఇంకా ఇంద్రకుమార్‌ దర్శకత్వంలో అజయ్‌ దేవగన్‌ ఓ హీరోగా నటించిన ‘ధమాల్‌’ (2007)తో పాటు ‘డబుల్‌ ధమాల్‌’ (2011), ‘టోటల్‌ ధమాల్‌’ (2019) మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘ధమాల్‌ 4’ కూడా రానుందని సమాచారం. ఇంద్రకుమార్‌ దర్శకత్వంలోనే అజయ్‌ దేవగన్‌ ఓ హీరోగా ఈ నాలుగో భాగం ఉంటుందని టాక్‌. ఇలా వరుసగా సీక్వెల్స్‌కి సైన్‌ చేసిన అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మైదాన్‌’ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆయన ఫుట్‌బాల్‌ కోచ్‌గా కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement