sequels
-
Ajay Devgn: సీక్వెల్ స్టార్
యాక్షన్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిస్తున్నారు అజయ్ దేవగన్. ఇప్పుడు ఈ హీరోకి ‘సీక్వెల్ స్టార్’ అని ట్యాగ్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఒకటి కాదు... రెండు మూడు కూడా కాదు... ఏకంగా ఎనిమిది చిత్రాల సీక్వెల్స్ అజయ్ దేవగన్ డైరీలో ఉన్నాయి. సీక్వెల్ చిత్రాల్లో నటించడం పెద్ద విషయం కాదు కానీ వరుసగా ఎనిమిది చిత్రాలంటే మాత్రం పెద్ద విషయమే. ఇక అజయ్ సైన్ చేసిన సీక్వెల్ చిత్రాల్లో ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా కొన్ని ఆరంభం కావాలి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. అజయ్ దేవగన్ కెరీర్లో ‘సింగమ్’ చిత్రానిది ప్రత్యేక స్థానం. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పోలీసాఫీసర్ సింగమ్‌గా అజయ్ దేవగన్ విజృంభించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే ‘సింగమ్’కి సీక్వెల్‌గా ‘సింగమ్ రిటర్న్స్’ (2014) రూపొంది, సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘సింగమ్ రిటర్న్స్’ విడుదలైన దాదాపు పదేళ్లకు ఈ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగమ్ ఎగైన్’ పేరుతో ఓ మూవీ రూపొందుతోంది. అజయ్ దేవగన్ హీరోగా ఈ చిత్రానికి కూడా రోహిత్ శెట్టియే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుందని సమాచారం. అదే విధంగా అజయ్ దేవగన్ హీరోగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ‘రైడ్’ (2018) మూవీ ఘనవిజయం సాధించింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘రైడ్ 2’ తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్ హీరోగా డైరెక్టర్ రాజ్‌కుమార్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వాణీ కపూర్, రితేశ్ దేశ్‌ముఖ్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 15న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ‘సింగమ్’ వంటి హిట్ సీక్వెల్స్ ఇచ్చిన హీరో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ‘గోల్మాల్’ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే వచ్చిన ‘గోల్మాల్ రిటర్న్స్’ (2008) సూపర్ హిట్ అయింది. ‘గోల్మాల్’ ఫ్రాంచైజీలో ‘గోల్మాల్ 3’ (2010), ‘గోల్మాల్ 4’ (2017) కూడా వచ్చాయి. ‘గోల్మాల్ 5’ రానుంది. అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. ఇకపోతే అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్‌సింగ్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో రిలీజై సూపర్ హిట్ అయింది. దాదాపు ఐదేళ్లకి ‘దే దే ప్యార్ దే 2’ సినిమాని ప్రకటించారు మేకర్స్. ఇందులోనూ అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించనున్నారు. అయితే ‘దే దే ప్యార్ దే’కి అకివ్ అలీ దర్శకత్వం వహించగా.. ‘దే దే ప్యార్ దే 2’ మూవీని కొత్త దర్శకుడు అన్షుల్ శర్మ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని 2025 మే 1న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అలాగే అజయ్ దేవగన్ హీరోగా అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్’. 2012లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మర్యాద రామన్న’ (2010) చిత్రానికి ఇది రీమేక్. ఇక ‘సన్ ఆఫ్ సర్దార్’ వచ్చిన పుష్కరం తర్వాత సీక్వెల్‌గా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ తెరకెక్కనుంది. తొలి భాగానికి అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించగా, మలి భాగాన్ని డైరెక్టర్ విజయ్ కుమార్ అరోరా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే 2025లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా మలయాళ హిట్ మూవీ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ (2015) హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు ‘దృశ్యం 2’ రిలీజైంది. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీకి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. ఇదే ఫ్రాంచైజీలో మలయాళంలో ‘దృశ్యం 3’ రానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో కూడా అజయ్ దేవగన్ నటిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే వికాస్ బాల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సైతాన్’ చిత్రం గత నెల 8న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సైతాన్ 2’ రానుంది. ఇంకా ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ఓ హీరోగా నటించిన ‘ధమాల్’ (2007)తో పాటు ‘డబుల్ ధమాల్’ (2011), ‘టోటల్ ధమాల్’ (2019) మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘ధమాల్ 4’ కూడా రానుందని సమాచారం. ఇంద్రకుమార్ దర్శకత్వంలోనే అజయ్ దేవగన్ ఓ హీరోగా ఈ నాలుగో భాగం ఉంటుందని టాక్. ఇలా వరుసగా సీక్వెల్స్‌కి సైన్ చేసిన అజయ్ దేవగన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మైదాన్’ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆయన ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. -
టాలీవుడ్లో కొనసాగుతున్న సరికొత్త ట్రెండ్.. అదేంటో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో ఇటీవల ఓ ట్రెండ్ తెగ నడుస్తోంది. గతేడాది సూపర్ హిట్ సినిమాల రి రిలీజ్ ట్రెండ్ ఎక్కువగా నడిచింది. అయితే ఇప్పటికే హిట్ అయిన సినిమాలు పార్ట్-2కు రెడీ అవుతున్నాయి. పార్ట్-1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మేకర్స్ అదే ఊపులో సీక్వెల్స్ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్లో బిజీగా ఉన్నాయి. మరికొన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో తెరకెక్కుతోన్న స్టార్ హీరోల సీక్వెల్ సినిమాలపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన టాలీవుడ్ సినిమాల జాబితా నెట్టింట వైరల్‌గా మారింది. టాలీవుడ్లో సీక్వెల్స్ రూపొందిస్తున్న చిత్రాల్లో అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్, బాలకృష్ణ, రామ్ లాంటి సూపర్ స్టార్స్ చిత్రాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్లో అఫీషియల్‌గా ప్రకటించిన సీక్వెల్ సినిమాల జాబితాపై ఓ లుక్కేయండి. టాలీవుడ్ సీక్వెల్స్ సినిమాలు పుష్ప-2- ది రూల్ సలార్-2- శౌర్యాంగపర్వం దేవర-2 జై హనుమాన్ అఖండ-2 టిల్లు స్క్వేర్ డబుల్ ఇస్మార్ట్ గూఢచారి-2 హిట్-3 బింబిసార-2 ప్రాజెక్ట్-జెడ్ గీతాంజలి మళ్లీ వచ్చింది శతమానం భవతి కార్తికేయ-3 విరూపాక్ష-2 -
ఒకే కథతో రెండు సినిమాలు..!
-
సీక్వెల్స్ పై ఫోకస్ పెట్టిన కార్తీ
-
బాలీవుడ్లో కిక్ ఇస్తున్న ఫ్రాంచైజీ మూవీస్
బాలీవుడ్లో కొన్ని ఫ్రాంచైజీ మూవీస్ ఉన్నాయి. ప్రతి ఏడాది వీటిలో కొన్ని సెట్స్‌పైకి వెళితే.. మరికొన్ని రిలీజ్‌కు రెడీ అవుతుంటాయి. అయితే ఈ ఏడాది విశేషం ఏంటంటే... వివిధ ఫ్రాంచైజీస్లోని మూడో భాగాలు కొన్ని రిలీజ్‌కు రెడీ అవుతుండగా, మరికొన్ని సెట్స్‌పైకి వెళ్తున్నాయి. ఇలా ‘ఏక్ దో తీన్..’ అంటూ థర్డ్ పార్డ్తో బిజీగా ఉన్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం. మళ్లీ టైగర్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో పదేళ్ల క్రితం విడుదలైన ‘ఏక్తా టైగర్’ ఒకటి. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించారు. ఇదే చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ‘టైగర్ జిందా హై’ (2017)లోనూ సల్మాన్, కత్రినా జంటగా నటించారు. ఈ చిత్రం కూడా సూపర్ హిట్. ఇక సల్మాన్, కత్రినా ‘టైగర్ 3’కి కూడా జోడీ కట్టారు. ‘ఏక్తా టైగర్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాల మాదిరి ‘టైగర్ 3’ కూడా స్పై ఫిల్మే. ‘ఏక్తా టైగర్’కు కబీర్ ఖాన్, ‘టైగర్ జిందా హై’ను అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించగా, ‘టైగర్ 3’కు మనీష్ శర్మ దర్శకుడు. ‘టైగర్’ ఫ్రాంచైజీలోని మూడు సినిమాలకు ముగ్గురు దర్శకులు దర్శకత్వం వహించగా, హీరో హీరోయిన్లు మాత్రం సల్మాన్, కత్రినాలే కావడం ఓ విశేషం. ఓ వైపు దశ్యం.. మరోవైపు సింగమ్ హిందీ తెరపై ‘దృశ్యం’ ఫ్రాంచైజీ బ్లాక్ బస్టర్. హిందీ ‘దృశ్యం’ (2015), ‘దృశ్యం 2’ (2022) చిత్రాల్లో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. మలయాళంలో హీరో మోహన్‌లాల్– దర్శకుడు జీతూ జోసెఫ్ కలయికలో రూపొందిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలకు హిందీ రెండు భాగాల ‘దృశ్యం’ రీమేక్. అయితే ఈసారి మలయాళంలో మోహన్‌లాల్‌తో, హిందీలో అజయ్ దేవగన్‌తో ఒకేసారి ‘దృశ్యం 3’ను సెట్స్‌పైకి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నారట జీతూ జోసెఫ్. ఇక హిందీ ‘దృశ్యం’కు నిషికాంత్ కామత్, ‘దృశ్యం 2’కి అభిషేక్ పాతక్ దర్శకత్వం వహించారు. ఇక దర్శకుడు రోహిత్ శెట్టి–హీరో అజయ్ దేవగన్ కాంబినేషన్లో ‘సింగమ్’, ‘సింగమ్ రిటర్న్స్’ల తర్వాత ‘సింగమ్ వన్స్ ఎగైన్’ చిత్రం తెరకెక్కనుంది. ఇలా డైరీలో రెండు థర్డ్ పార్ట్ చిత్రాలకు డేట్స్ కేటాయించారు అజయ్ దేవగన్. బిజీ కిలాడి బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ వరుస చిత్రాలతో బిజీగా ఉంటారు. ఈ క్రమంలో ఈ బిజీ హీరో మూడు ఫ్రాంచైజీస్లోని మూడు థర్డ్ పార్ట్ సినిమాలకు అసోసియేట్ కావడం విశేషంగా చెప్పుకోవాలి. బాలీవుడ్ హిట్ కామెడీ ఫ్రాంచైజీలో ‘వెల్కమ్’ తప్పక ఉంటుంది. 2007లో వచ్చిన ‘వెల్కమ్’, 2015లో విడుదలైన ‘వెల్కమ్ బ్యాక్’ (వెల్కమ్ 2) చిత్రాల తర్వాత ‘వెల్కమ్ టు ది జంగిల్ (వెల్కమ్ 3)’ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సంజయ్ దత్, పరేష్ రావల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ‘వెల్కమ్, ‘వెల్కమ్ బ్యాక్’ చిత్రాలకు అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహించగా, ‘వెల్కమ్ టు ది జంగిల్’ను దర్శకుడు అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్నారు. అలాగే ‘హేరా ఫేరీ’ (2000), ‘ఫిర్ హేరా ఫేరీ’ (2006) చిత్రాల తర్వాత ఈ ఫ్రాంచైజీలో వస్తున్న ‘హేరా ఫేరీ’ థర్డ్ పార్ట్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని.. ఈ మూడో భాగంలో అక్షయ్ కుమార్, తాను కలిసి నటించనున్నామని ఇటీవల సునీల్ శెట్టి పేర్కొన్నారు. మరోవైపు ‘జాలీ ఎల్ఎల్బీ 3’ ఉంటుందని, ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, తాను కలిసి నటిస్తామన్నట్లుగా అర్షద్ వార్సీ ఇటీవల పేర్కొన్నారు. 2013లో ‘జాలీ ఎల్ఎల్బీ’, 2017లో ‘జాలీఎల్ఎల్బీ 2’ చిత్రాలు వచ్చాయి. కొత్త డాన్ బాలీవుడ్ బాక్సాఫీస్ మార్కెట్లోకి కొత్త డాన్ వచ్చాడు. ఈ డాన్ పేరు రణ్వీర్ సింగ్. హిందీలో ‘డాన్’ అనగానే తొలుత అమితాబ్ బచ్చన్, ఆ తర్వాత షారుక్ ఖాన్ గుర్తొస్తారు. రచయితలు సలీమ్–జావేద్‌లు సష్టించిన డాన్ క్యారెక్టర్‌తో అమితాబ్ బచ్చన్ టైటిల్ రోల్లో చంద్ర బరోత్ తెరకెక్కించిన ‘డాన్’ (1978) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్ తొలి డాన్‌గా అమితాబ్‌ని నిలిపింది. ఇక దాదాపు మూడు దశాబ్దాలకు ‘డాన్’ సినిమా ఆధారంగానే ఫర్హాన్ అక్తర్ 2006లో ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ తీశారు. ఇందులో షారుక్ ఖాన్ హీరోగా నటించారు. షారుక్ కూడా బెస్ట్ డాన్ అనిపించుకున్నారు. ఇక ఈ సినిమా హిట్ కావడంతో హీరో షారుక్ ఖాన్, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కాంబినేషన్లో ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ (2011) వచ్చి హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలోనే ‘డాన్ 3’ తెరకెక్కనుంది. అయితే ఇందులో షారుక్ నటించడంలేదు. డాన్‌గా రణ్వీర్ íసింగ్ నటిస్తారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించాలనుకుంటున్నారు. బాలీవుడ్ బ్రహ్మాస్త్రం ఒక సినిమా హిట్ సాధించిన తర్వాత, ఆ సినిమా సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ సెట్స్‌పైకి వచ్చిన సినిమాలు బాలీవుడ్లో చాలా ఉన్నాయి. అయితే ‘బ్రహ్మాస్త్ర’ మాత్రం ఇందుకు విభిన్నం. ఎందుకంటే ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం మూడు భాగాలుగా వస్తుందని ఈ సినిమాను ప్రకటించిన సమయంలోనే వెల్లడించారు మేకర్స్. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా, అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటించిన ‘బ్రహ్మాస్త్రం’ సినిమా తొలి భాగం ‘బ్రహ్మాస్త్రం: పార్ట్ట్ 1 శివ’ చిత్రం విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ‘బ్రహ్మాస్త్రం పార్ట్ 2: దేవ్’, ‘బ్రహ్మాస్త్రం పార్ట్ 3’ చిత్రాలకు సంబంధించిన ప్రీ ్ర΄÷డక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని ఈ చిత్రదర్శకుడు అయాన్ ముఖర్జీ వెల్లడించారు. అయితే సెకండ్, థర్డ్ పార్ట్ షూటింగ్ ఒకేసారి జరుగుతుందని వరు సగా 2026, 2027లో ఈ సినిమాలు విడుదల అవుతాయనే ప్రచారం జరుగుతోంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ తాజా ్రపాజెక్ట్ ‘వార్ 2’ కాబట్టి ఈ కారణంగా ‘బ్రహ్మాస్త్ర’ సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ రిలీజ్ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. ఇటు ప్రేమ.. అటు భయం ‘ప్రేమ.. జీవితాన్ని జీవించేలా చేస్తుంది’ అంటూ 1990లో వచ్చిన ‘ఆషికీ’కి బాలీవుడ్ ప్రేమకథా చిత్రాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మహేశ్ భట్ దర్శకత్వంలో రాహుల్ రాయ్, అనూ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. కాగా రెండు దశాబ్దాల తర్వాత ఆదిత్యా రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన ‘ఆషికీ 2’ (2013) సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు ‘ఆషికీ 3’కి శ్రీకారం జరిగింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ్రపారంభం కానుంది. ఇంకా హీరోయిన్ ఎంపిక పూర్తి కాలేదు. మరోవైపు హారర్ ఫిల్మ్ ‘భూల్ భూలెయ్య 3’లో కూడా హీరోగా నటిస్తున్నారు కార్తీక్ ఆర్యన్. ‘భూల్ భూలెయ్య 2’ను డైరెక్ట్ చేసిన అనీస్ బాజ్మీ, ఆ చిత్రంలో ఓ లీడ్ రోల్ చేసిన కార్తీక్ ఆర్యన్ కాంబినేషన్లోనే ‘భూల్ భూలెయ్య 3’ చిత్రం తెరకెక్కనుంది. ఈ దీపావళికి ఈ చిత్రం విడుదల కానుంది. అక్షయ్ కుమార్ హీరోగా ప్రియ దర్శన్ దర్శకత్వంలో 2007లో ‘భూల్ భూలెయ్య’ చిత్రం విడుదలైన విషయం గుర్తుండే ఉంటుంది. కామెడీ ఫుక్రే హీరో పుల్కిత్ సామ్రాట్, దర్శకుడు మగ్దీప్ సింగ్ లంబా కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘ఫుక్రే 3’ ఈ నెల 28న విడుదల కానుంది. 2013లో వచ్చిన ‘ఫుక్రే’, 2017లోని ‘ఫుక్రే రిటర్న్స్’ ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా ‘ఫుక్రే రిటర్న్స్’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ లభించింది. ఇలా బాలీవుడ్లో ముస్తాబు అవుతున్న మూడో భాగం చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
సీక్వెల్.. మార్పుల్...
కథ పెద్దదైతే సినిమా రెండు భాగాలవుతుంది.. ఒక్కోసారి మూడు కూడా అవుతుంది. ఇప్పుడలాంటి కథలతో రూపొం దుతున్న సీక్వెల్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఒకటో భాగంలో నటించిన నటీనటులు, తెరకెక్కించిన దర్శకుడు రెండో భాగంలో కంటిన్యూ కావడంలేదు. ఒకటీ హీరో మారుతున్నారు.. లేదా డైరెక్టర్ మారుతున్నారు... లేదా హీరోయిన్ మారుతున్నారు... ఇక మార్పుల్తో రూపొందుతున్న సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం. హిట్: ది థర్డ్ కేస్ తెలుగు చిత్ర పరిశ్రమలో ‘హిట్’ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ రెండు చిత్రాలను నిర్మించింది హీరో నాని కావడం విశేషం. కాగా తొలి రెండు భాగాలు నిర్మించిన నాని థర్డ్పార్ట్ ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరోగా నటించనుండటం విశేషం. ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020) చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొం దిన ఈ చిత్రంలో హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్‌ను (హిట్) లీడ్ చేసే పోలీస్ ఆఫీసర్ రుద్రరాజుపాత్రలో నటుడిగా విశ్వక్ సేన్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ మంచి హిట్‌గా నిలిచింది. కాగా హిట్ ఫ్రాంచైజీలో రెండో భాగం ‘హిట్: ది సెకండ్ కేస్’లో హీరోగా అడివి శేష్‌ని తీసుకున్నారు శైలేష్. ఎస్పీ కృష్ణదేవ్పాత్రలో అడివి శేష్ తనదైన శైలిలో నటించి, మెప్పించారు. ఈ సినిమా కూడా హిట్. ఇక మూడో భాగం ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరో నాని నటించనున్నట్లు ‘హిట్: ది సెకండ్ కేస్’ చివర్లో రివీల్ చేశారు. పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్పాత్రలో నాని నటిస్తారు. కాగా హిట్ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలుంటాయని శైలేష్ కొలను గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చంద్రముఖి–2 ‘చంద్రముఖి’ (2005)లో ‘లక లక లక..’ అంటూ హీరో రజనీకాంత్ రాజు గెటప్‌లో విలనిజమ్ పండించి, డాక్టర్ ఈశ్వర్‌గా మంచితనం కనబరిస్తే ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించారు. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, నయనతార జంటగా జ్యోతిక, ప్రభు కీలకపాత్రలు చేశారు. ‘చంద్రముఖి’ విడుదలైన 18 ఏళ్లకు సీక్వెల్‌కి శ్రీకారం చుట్టారు పి. వాసు. ‘చంద్రముఖి 2’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీ ప్లేస్‌లోకి లారెన్స్ వచ్చారు. అలాగే కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటించారు. ఇంకా వడివేలు, లక్ష్మీ మీనన్, రాధిక తదితరులు నటించారు. ఇటీవల మైసూర్లో జరిగిన షెడ్యూల్‌తో ఈ మూవీ పూర్తయింది. తమిళ, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరకర్త. యుగానికి ఒక్కడు–2 వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు దర్శకుడు సెల్వ రాఘవన్. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (తెలుగులో యుగానికి ఒక్కడు –2010) ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. కార్తీ హీరోగా, ఆండ్రియా, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ (యుగానికి ఒక్కడు 2) తెరకెక్కించనున్నారు సెల్వ రాఘవన్. అయితే ఈ సినిమాలో తన సోదరుడు, హీరో ధనుష్‌ని లీడ్ రోల్‌కి తీసుకున్నారాయన. కార్తీ స్థానంలో ధనుష్ కనిపిస్తారని కొందరు అంటుంటే.. అలాంటిదేం లేదు.. కార్తీ కూడా ఉంటారు.. సీక్వెల్లో ధనుష్పాత్ర యాడ్ అయిందని మరికొందరు అంటున్నారు. మరి ‘యుగానికి ఒక్కడు 2’లో కార్తీపాత్ర ఉంటుందా? లేదా? అనేది చూడాలి. జెంటిల్మన్–2 అర్జున్, మధుబాల జంటగా శంకర్ దర్శకత్వంలో కేటీ కుంజుమోన్ నిర్మించిన ‘జెంటిల్‌మేన్’ (1993) చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. దాదాపు ముప్పైఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ‘జెంటిల్మన్ 2’ని నిర్మిస్తున్నారు కుంజుమోన్. అయితే రెండో భాగంలో దర్శకుడు, హీరో, సంగీత దర్శకుడు ముగ్గురూ మారడం విశేషం. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సీక్వెల్లో ‘మంత్ర–2, రాజుగారి గది, పెళ్లికి ముందు ప్రేమకథ’ వంటి చిత్రాల్లో నటించిన చేతన్ చీను హీరోగా నటించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొం దనున్న ఈ చిత్రం కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ కానుంది. టిల్లు స్క్వేర్ ‘డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు..’ అంటూ హీరో సిద్ధు జొన్నలగడ్డ స్పెప్పులేస్తే ప్రేక్షకులు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘డీజే టిల్లు’. రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ మూవీ తెరకెక్కుతోంది. అయితే సీక్వెల్‌కి అటు డైరెక్టర్, ఇటు హీరోయిన్ ఇద్దరూ మారడం విశేషం. ‘టిల్లు స్క్వేర్’కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తొలి భాగంలో నేహా శెట్టి హీరోయిన్గా నటించి గ్లామర్‌తో మెప్పించారు. అయితే సీక్వెల్లో మాత్రం అనుపమా పరమేశ్వరన్‌ని హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 15న విడుదల చేయాలనుకుంటున్నారు. జిగర్తండా–2 సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ కీలకపాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిగర్తండా’ (2014) తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ అయి, ఇక్కడా ఘనవిజయం సాధించింది. కాగా ‘జిగర్తండా’ విడుదలైన దాదాపు తొమ్మిదేళ్లకు ‘జిగర్తండా డబుల్ ఎక్స్’ పేరుతో కార్తీక్ సుబ్బరాజ్ సీక్వెల్ తీశారు. ఇందులో రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య లీడ్ రోల్స్‌లో నటించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. -
టాలీవుడ్ పై సీక్వెల్ వర్షాలు
-
స్టార్ హీరోల ఇమేజ్ పెంచే అస్త్రంగా మారుతుందా..?
-
పాన్ వరల్డ్ మేనియాకి సీక్వెల్ ప్రాణం పోస్తుందా..?
-
సీక్వెల్స్ ఉన్నాయి!
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇప్పటికే ఇది ‘యాక్షన్ అడ్వంచరస్’ మూవీ అని ఆయన పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి సీక్వెల్స్ ఉంటాయన్నారు. ప్రధానపాత్రలు అలాగే ఉంటాయని, సీక్వెల్స్ కథ మారుతుంటుందని స్పష్టం చేశారాయన. ప్రస్తుతం తొలి భాగానికి సంబంధించిన కథను పూర్తి చేసే పని మీద ఉన్నారు విజయేంద్రప్రసాద్. ఇక మహేశ్ అద్భుత నటుడని, యాక్షన్ సీన్స్ బాగా చేస్తారని, ఏ రచయితకైనా ఆయనకు రాయడం బాగుంటుందని, ఈ చిత్రానికి హీరోగా తనే బెస్ట్ చాయిస్ అని చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్. ఈ ఏడాది ఈ చిత్రం షూటింగ్ ఆరంభమయ్యే అవకాశం ఉంది. -
ప్రస్తుతం బాలీవుడ్ కన్ను ఈ ట్రయాలజీపైనేనా?
ఫ్రాంచైజీ, రీమేక్స్, బయోపిక్స్ ట్రెండ్ల తర్వాత బాలీవుడ్ ప్రస్తుతం ట్రయాలజీ (ఒకే కథను మూడు భాగాలుగా) ట్రై చేస్తోంది. అరడజను ట్రయాలజీ ఫిలింస్ వెండితెరపైకి రానున్నాయి. ఆ ‘ట్రైయాలజీ’ చిత్రాల వివరాల్లోకి వెళితే... బ్రహ్మాస్త్రం ఐదేళ్లుగా సినీ లవర్స్ ‘బ్రహ్మాస్త్ర’ ట్రయాలజీ గురించి వింటూనే ఉన్నారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ కీలక పాత్రల్లో ‘బ్రహ్మాస్త్ర’ ట్రయాలజీలోని తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ రూపొందింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమా దక్షిణాది వెర్షన్‌కు రాజమౌళి సమర్పకులుగా ఉండటం విశేషం. ఈ ఏడాది సెప్టెంబరు 9న ఈ చిత్రం విడుదలైంది. ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ రెండు, మూడు భాగాలపై ఫోకస్ పెట్టారు మేకర్స్. రెండో భాగంలోని ప్రధాన పాత్రల కోసం హృతిక్‌రోషన్ , రణ్వీర్ సింగ్, దీపికా పదుకోనె పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇతిహాసాల ఆధారంగా...! ట్రయాలజీ ఫిలింస్ తీసేంత స్కోప్ రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలకు ఉంది. ఆల్రెడీ బాలీవుడ్ ప్రముఖ దర్శకులు నితీష్ తివారి, రవి ఉడయార్లు కలిసి రామాయణం ఆధారంగా ఓ ట్రయాలజీని ప్లాన్ చేశారు. అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా వంటి అగ్ర నిర్మాతలు ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్రధారులుగా మహేశ్‌బాబు, రామ్‌చరణ్, హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ వంటి స్టార్ల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర ఆధారంగా హిందీలో ఓ ట్రయాలజీ రూపుదిద్దుకోనుంది. ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే టైటిల్‌ను కూడా ప్రకటించారు. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ చేయనున్న ఈ చిత్రానికి అదిత్య థార్ దర్శకత్వం వహిస్తారు. అలాగే ‘మహాభారతం’ ఆధారంగా సింగపూర్‌కు చెందిన కృష్ణ ఉదయశంకర్ రాసిన ‘ది ఆర్యావతార క్రానికల్స్’ (గోవింద, కౌరవ, కురుక్షేత్ర) పుస్తకం హక్కులను సోనమ్ కపూర్ దక్కించు కున్నారు. ‘ది ఆర్యావతార క్రానికల్స్’ను ట్రయాలజీగా నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు సోనమ్ పేర్కొన్నారు. ఇంకా ‘మహాభారతం’ ఆధారంగా ఓ సినిమా చేయాలన్నది తన డ్రీమ్ అని దర్శకుడు రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కూడా ట్రయాలజీనే అనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త నాగిని వెండితెరపై నాగిని అనగానే హిందీలో శ్రీదేవి, రీనా రాయ్, రేఖ గుర్తుకు వస్తారు. ఈ జాబితాలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరు చేరనుంది. ‘నాగిని’ ట్రయాలజీలో నటించేందుకు శ్రద్ధా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాల్ ఫురియా దర్శకత్వంలో ఈ ట్రయాలజీని నిఖిల్ ద్వివేది నిర్మించనున్నారు. ఛత్రపతి మహావీరుడు ఛత్రపతి శివాజీ జీవితంతో ఓ ట్రయాలజీని నిర్మించనున్నట్లు నటుడు, నిర్మాత రితేష్ దేశ్‌ముఖ్ రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఈ ట్రయాలజీని తెరకెక్కించేందుకు మరాఠీ దర్శకులు ‘సైరట్’ ఫేమ్ నాగరాజ్ మంజులే, రవీంద్ర జాదవ్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. శక్తిమాన్ ఇక బుల్లితెర, వెండితెర సూపర్ హీరోస్‌లలో శక్తిమాన్‌కు ఆడియన్స్‌లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సూపర్ హీరో క్రేజ్‌ను క్యాష్ చేసుకునే దిశలో ఇప్పటికే పలువురు నిర్మాతలు సినిమాలు తీశారు. తాజాగా అగ్ర నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ‘శక్తిమాన్’ టైటిల్‌తో ఓ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. ట్రయాలజీగా రూపొందించేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, టైటిల్ రోల్లో రణ్వీర్ సింగ్ కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇవే కాదు.. మూడు భాగాల చిత్రాలు మరికొన్ని తెరపైకి వచ్చే చాన్స్ ఉంది. -
సీక్వెల్స్ ట్రెండ్.. పేరు అదే కానీ, కథ వేరు
‘క్రిష్’, ‘ధూమ్’, ‘దబాంగ్’, ‘టైగర్’, ‘హౌస్‌ఫుల్’, ‘గోల్మాల్’, ‘భాగీ’, ‘హేట్ స్టోరీ’, ‘మర్డర్’... ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్లో ఎన్నో ఫ్రాంచైజీ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ తెలుగులోనూ కనబడుతోంది. కథ ఎక్కడ ముగిసిందో అక్కడ్నుంచి కొనసాగడాన్ని సీక్వెల్ అంటుంటారు. కానీ కథ వేరు ఉంటుంది.. టైటిల్ అదే ఉంటుంది. కాకపోతే ఆ సినిమా పేరుకి 1, 2, 3 అని జోడించి ఏ భాగానికి ఆ భాగంలో కొత్త కథ చూపిస్తుంటారు. దీన్ని ఫ్రాంచైజీ అంటుంటారు. ఇక తెలుగులో రానున్న ఫ్రాంచైజీల గురించి తెలుసుకుందాం. చదవండి: ఆ యువ నటి శంకర్ కూతురిని టార్గెట్ చేసిందా? ఆ ట్వీట్ అర్థమేంటి! ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా నవ్వించిన చిత్రాల్లో ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ ఒకటి. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. 2019లో సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్లాక్బాస్టర్ హిట్ అందించారు. ‘ఎఫ్ 2’ ఇచ్చిన హిట్ జోష్‌తో ‘ఎఫ్ 3’ (2022)ని రెడీ చేసి ఆడియన్స్‌కు అందించారు అనిల్ రావిపూడి. ఇందులోనూ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. తొలి భాగంలో నటించిన రాజేంద్రప్రసాద్ మలి భాగంలోనూ ఉన్నారు. సోనాల్ చౌహాన్, సునీల్ ఈ ఫ్రాంచైజీలో యాడ్ అయ్యారు. ఈ ఏడాది మేలో విడుదలైన ‘ఎఫ్ 3’కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ‘ఎఫ్ 3’ ఎండింగ్లో ‘ఎఫ్ 4’ హింట్ ఇచ్చారు అనిల్ రావిపూడి. ఇక హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబి నేషన్‌లో వచ్చిన ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాలను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ప్రేమ ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమాలకు మంచి ఆదరణ లభించింది. కాగా ఇటీవల సోషల్ మీడియాలో చాట్ సెషన్లో పాల్గొన్న సుకుమార్‌ను ఓ నెటిజన్ ‘ఆర్య 3’ తీయాలని కోరగా, సుకుమార్ పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతూ ‘ఆర్య 3’ ఉంటుం దన్నట్లుగా చెప్పారు. ఇది ‘ఆర్య’ ఫ్యాన్స్‌ను హ్యాపీ ఫీలయ్యేలా చేసింది. మరోవైపు కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చదవండి: హీరోగా చేస్తానని చెప్పగానే నాన్న చివాట్లు పెట్టారు: దుల్కర్ సల్మాన్ సోషియో ఫ్యాంటసీ అండ్ టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘బింబిసార’ను ‘బింబిసార 2’ ‘బింబిసార 3’... ఇలా ఓ ఫ్రాంచైజీగా కొనసాగించే ఆలోచనలు ఉన్నట్లుగా వశిష్ఠ్ చెప్పుకొచ్చారు. ఆల్రెడీ ‘బింబిసార 2’ చేయడానికి కల్యాణ్ రామ్ కూడా ఫుల్ పాజిటివ్‌గా ఉన్నారు. ఇక చిన్న సినిమాగా వచ్చి బ్లాక్బాస్టర్ హిట్ అందుకున్న సినిమాల జాబితాలోకి ‘గూఢచారి’, ‘కార్తికేయ’, ‘హిట్’ చేరాయి. 2018లో అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన ‘గూఢచారి’ మంచి విజయాన్ని సాధించింది. దీంతో ‘గూఢచారి 2’కు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు అడివి శేష్. ‘గూఢచారి 2’కు రాహుల్ పాకాల దర్శకుడు. ‘గూఢచారి’ని ఓ ఫ్రాంచైజీలా కొనసాగించే ఆలోచన ఉందని, ‘గూఢచారి 2’కు తాను దర్శకత్వం వహించలేకపోయినప్పటికీ ‘గూడఛారి’ ఫ్రాంచైజీలో వచ్చే ఏదో ఒక భాగానికి తప్పక దర్శకత్వం వహిస్తానన్నట్లుగా దర్శకుడు శశి కిరణ్ తిక్క ఇటీవల కొన్ని ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. మరోవైపు విశ్వక్ సేన్ హీరోగా 2020లో వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ మంచి హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ‘హిట్: ది సెకండ్ కేస్’ సెట్స్‌పై ఉంది. అయితే ఇందులో అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు. కానీ టైటిల్స్‌ని బట్టి ‘హిట్’ సినిమా ఓ ఫ్రాంచైజీలా కొనసాగే అవకాశం ఉందని ఊహించవచ్చు. ఇంకోవైపు హీరో నిఖిల్ కెరీర్‌కు ‘కార్తికేయ’ (2014) మంచి ప్లస్‌గా నిలిచింది. దీంతో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి మళ్లీ ‘కార్తికేయ 2’ తీశారు. ఈ నెల 13న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే ‘కార్తికేయ 3, 4’లకు స్క్రిప్ట్ రెడీగా లేకపోయినప్పటికీ కోర్ ఐడియా ఉందని చందు మొండేటి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. సో.. ‘కార్తికేయ 3’ కూడా ఉండొచ్చు. అలాగే ‘చిత్రం’ (2000) సినిమా ‘చిత్రం 1.1’, ‘ఢీ: కొట్టి చూడు’ (2007) తర్వాత ‘ఢీ 2: డబుల్ డోస్’, ‘డీజే టిల్లు’ తర్వాత ‘డీజే టిల్లు 2’ వంటి సినిమాలు రానున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఫ్రాంచైజీలు వచ్చే అవకాశం ఉంది. -
భారీ హిట్ సినిమాలకు సీక్వెల్స్ రాబోతున్నాయి!
ప్రేక్షకులు మెచ్చిన కొన్ని సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కడం కామన్. అలా కోలీవుడ్‌లో అరడజనుకు పైగా సీక్వెల్స్ సిద్ధమవుతున్నాయి. భారీ హిట్స్ సాధించిన చిత్రాలకు ‘కథ కంటిన్యూ’ అవుతోంది. ఈ సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం. దాదాపు 26ఏళ్ల క్రితం వెండితెరపై శంకర్ చూపించిన ‘భారతీయుడు’ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. బాక్సాఫీస్ రికార్డులను సృష్టించాడు. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు’ (1996) చిత్రానికి అంతటి రెస్పాన్స్ లభించింది. అందుకే ఈ సినిమా సీక్వెల్ ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2)కి స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నారు శంకర్. సీక్వెల్లోనూ కమల్‌హాసనే హీరో. అయితే షూటింగ్ వేగంగా జరుగుతున్న సమయంలో లొకేషన్లో యాక్సిడెంట్ జరగడం, ఆ తర్వాత చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌కు, దర్శకుడు శంకర్‌కు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడం వంటి కారణాలతో ‘ఇండియన్ 2’ షూటింగ్ తాత్కాలికంగా ఆగింది. అయితే మళ్లీ పట్టాలెక్కించి, వీలైతే ఈ ఏడాదే పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ఇటీవల ఓ సందర్భంలో కమల్‌హాసన్ చెప్పారు.. సో.. సమయం కాస్త అటూ ఇటూ అయినా తెరపైకి మరోసారి భారతీయుడు రావడం ఖాయం. అలాగే శంకర్ దర్శకత్వంలోనే యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన ‘జెంటిల్‌మేన్’ (1993) చిత్రం ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి తెలిసిందే. దీంతో ఈ చిత్రనిర్మాత టి. కుంజుమోన్ ‘జెంటిల్‌మేన్ 2’ను ప్రకటించారు. కానీ ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించడంలేదు. నానీతో ‘ఆహా కళ్యాణం’ సినిమా తీసిన గోకుల్ కృష్ణ ‘జెంటిల్‌మేన్ 2’కు దర్శకుడు. ఈ చిత్రంలో ప్రియాలాల్, నయనతార చక్రవర్తి హీరోయిన్లుగా నటిస్తారు. అయితే హీరోగా ఎవరు నటిస్తారు? షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనే విషయాలపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న హిస్టారికల్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’. ‘జయం’ రవి, కార్తీ, విక్రమ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మీ, శోభితా ధూలిపాళ్ల ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. చోళ సామ్రాజ్య నేపథ్యంలో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తొలి భాగం ‘పొన్నియిన్ సెల్వన్: 1’ సెప్టెంబరు 30న రిలీజ్ కానుంది. సీక్వెల్ వచ్చే ఏడాది విడుదలవుతుంది. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇంకోవైపు సిల్వర్ స్క్రీన్‌పైకి వచ్చేందుకు ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (‘యుగానికి ఒక్కడు’ – 2010) మళ్లీ రెడీ అవుతున్నాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ, రీమాసేన్, ఆండ్రియా, ఆర్. పార్తీబన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే సీక్వెల్లో మెయిన్ హీరోగా కార్తీ కాదు...ధనుష్ నటిస్తారు. కార్తీ పాత్ర కూడా ఉందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇక ‘లక లక లక...’ అనగానే అందరికీ రజనీకాంత్ ‘చంద్రముఖి’ (2005) సినిమాయే గుర్తుకు వస్తుంది. పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార, వడివేలు, వినీత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ వస్తోంది. సీక్వెల్‌కు పి. వాసుయే దర్శకుడు కానీ హీరోగా నటించేది మాత్రం రజనీకాంత్ కాదు. రాఘవా లారెన్స్ నటిస్తారు. కాగా ‘జయం’ రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘తని ఒరువన్’ (ఈ సినిమా తెలుగు రీమేక్ ‘ధృవ’లో రామ్‌చరణ్ హీరోగా నటించారు) చిత్రం మంచి హిట్ సాధించింది. దీంతో ‘తని ఒరువన్’ సీక్వెల్‌ను ప్రకటించారు దర్శకుడు మోహన్‌రాజా. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. అలాగే కార్తీ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘ఖైదీ’కి సీక్వెల్ ఉందని ఈ చిత్రదర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ సందర్భంలో చెప్పారు. ఇక ఇటీవల కమల్‌హాసన్ నటించిన హిట్ ఫిల్మ్ ‘విక్రమ్’కు కూడా సీక్వెల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే కాదు.. సూర్య, శింబు, అజిత్ నటించిన హిట్ మూవీస్ సీక్వెల్స్‌కు సంబంధించిన వార్తలను అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం. ఇంకా హీరో సూర్య–దర్శకుడు హరి కాంబినేషన్లోని ‘సింగమ్’ సిరీస్, దర్శక–నిర్మాత, నటుడు రాఘవా లారెన్స్ ‘కాంచన’, దర్శకుడు సుందర్. సి ‘అరణ్మణై’ ఫ్రాంచైజీల నుంచి సీక్వెల్ చిత్రాలు రెడీ అవుతున్నాయన్నది కోలీవుడ్ ఖబర్. చదవండి: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ జూలై 1న ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్‌లు.. -
ఈ సంవత్సరం సీక్వెల్స్‌తో తగ్గేదే లే..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఇప్పుడు సీక్వెల్స్ జోరు కొనసాగుతోంది. దాదాపు అరడజను సినిమాల సీక్వెల్స్ నిర్మాణంలో ఉంటే, ప్రకటించిన సీక్వెల్స్ కూడా అరడజనుకు పైగా ఉన్నాయి. ‘సీక్వెల్ నామ సంవత్సరం’ అనేలా ఒకే ఏడాదిలో తెలుగులో ఇన్ని సీక్వెల్స్ రూపొందడం ఇదే మొదటిసారి. మొదటి భాగాన్ని ఆదరించిన ప్రేక్షకులు ‘తరువాయి భాగం’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సీక్వెల్ సినిమాల గురించి తెలుసుకుందాం. త్రిబుల్ సందడి... ‘ఎఫ్ 2’ సినిమాతో సంక్రాంతి అల్లుళ్లుగా కడుపుబ్బా నవ్వించారు వెంకటేశ్, వరుణ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించారు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించిన ‘ఎఫ్ 2’ 2019 జనవరి 12న విడుదలై ఘనవిజయం సాధించింది. ఫ్రస్ట్రేషన్లో ఉన్నవారికి ఈ సినిమా ద్వారా ‘వెంకీ ఆసనం’ నేర్పించారు వెంకటేశ్. తోడల్లుళ్లుగా వెంకీ–వరుణ్‌లు చేసిన డబుల్ సందడిని ప్రేక్షకులు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఆ ఆనందాన్ని త్రిబుల్ చేయడానికి ‘ఎఫ్ 3’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది చిత్రయూనిట్. ‘ఎఫ్ 2’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘ఎఫ్ 3’ మే 27న విడుదలవుతోంది. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే ఓ ప్రత్యేక పాట చేశారు. ‘ఎఫ్ 2’ మంచి విజయం సాధించడంతో ‘ఎఫ్ 3’ పై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. తగ్గేదే లే అంటూ... ‘తగ్గేదే లే’... ఈ మధ్య బాగా వినిపిస్తున్న మాట ఇది. ‘పుష్ప’ సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ ఒదిగిపోయిన తీరుకి మంచి మార్కులు పడ్డాయి. ‘ఆర్య, ఆర్య 2’ వంటి హిట్ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్– డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’: ది రైజ్. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబరు 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ‘తగ్గేదే లే’ అంటూ.. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించింది టీమ్. ప్రస్తుతం ‘పుష్ప 2’ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. గత ఏడాది ‘పుష్ప’ విడుదలైన తేదీ (డిసెంబరు 17)నే ఈ ఏడాది డిసెంబరులో ‘పుష్ప 2’ని రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఎనిమిదేళ్లకు సీక్వెల్... నిఖిల్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘కార్తికేయ’. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్వాతి హీరోయిన్గా నటించారు. వెంకట్ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా 2014 అక్టోబర్ 14న విడుదలై ఘనవిజయం సాధించింది. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రమిది. ‘కార్తికేయ’ విడుదలైన ఎనిమిదేళ్లకు సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ తెరకెక్కుతోంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలోనే తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ‘కార్తికేయ 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జూలై 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మళ్లీ హిట్ కోసం... వైవిధ్యమైన చిత్రాలతో హిట్స్ అందుకుంటున్న హీరో నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘హిట్’ 2020 ఫిబ్రవరి 28న విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. ఇందులో విశ్వక్ సేన్ తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ అధికారిగా చక్కని నటన కనబరిచారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘హిట్ 2’ని తీస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. అయితే ‘హిట్ 2’కి హీరో, హీరోయిన్ మారారు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇవి విడుదలకు సిద్ధంగా ఉన్న, నిర్మాణంలో ఉన్న చిత్రాలైతే మరికొన్ని సీక్వెల్స్ కూడా రూపొందనున్నాయి. ఆ చిత్రాలేంటంటే.. రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘విక్రమార్కుడు’కి సీక్వెల్, రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘క్రాక్’కి సీక్వెల్, గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వం వహించిన ‘లక్ష్యం’కి సీక్వెల్, మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఢీ’ సీక్వెల్ కూడా రానున్నాయి. ఇంకా ఉదయ్ కిరణ్‌ని హీరోగా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’ (2000) మూవీకి సీక్వెల్‌గా ‘చిత్రం 1.1’ తెరకెక్కనుంది. అలాగే అడివి శేష్ ‘గూఢచారి’, తేజా సజ్జ ‘జాంబి రెడ్డి’, నవీన్ పోలిశెట్టి ‘జాతిరత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, విశ్వక్ సేన్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ‘ఫలక్‌నుమా దాస్’, సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ వంటి చిత్రాల సీక్వెల్స్ షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. చదవండి: ఏంటి, పుష్ప 2 సినిమాకు బన్నీ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా? టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టాలీవుడ్ సీక్వెల్స్‌కు అడ్డాగా 2022.. కొత్త ఏడాదిలో వచ్చే చిత్రాలివే!
2022 టాలీవుడ్ సీక్వెల్స్ కు అడ్డాగా మారనుంది. అన్ని కుదిరితే సంక్రాంతి నుంచే సీక్వెల్ సినిమాల హంగామా మొదలు కానుంది. సంక్రాంతికి వచ్చేందుకు నాగార్జున సీరియస్ గా ట్రై చేస్తున్నాడు. 2016 సంక్రాంతి సూపర్ హిట్ సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి కొనసాగింపుగా వస్తోంది బంగార్రాజు. చాలా ఏళ్లుగా దర్శకుడు కళ్యాణ కృష్ణ సిద్దం చేసిన కథ ఇది. సీక్వెల్లో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్. 2019 సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎఫ్ 2కు, 2022 ఫిబ్రవరిలో సీక్వెల్ రానుంది. నిజానికి ఈ సీక్వెల్ ను సంక్రాంతి రిలీజ్ చేయాలనుకున్నారు. కాని ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి భారీ చిత్రాల మధ్య విడుదల అంత మంచిది కాదని, ఫిబ్రవరి 25న ఎఫ్ 3 సోలోగా రిలీజ్ చేస్తున్నారు. 2020 స్లీపర్ హిట్ హిట్ కు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న హిట్ 2లో హీరో మారిపోయాడు.ఫస్ట్ పార్ట్ లో విశ్వక్ సేన్ ఒక కేస్ ను సాల్వ్ చేసాడు. ఇప్పుడు సీక్వెల్లో ఆ డ్యూటీని అడివి శేష్ తీసుకున్నాడు. సెకండ్ పార్ట్ ను కూడా మొదటి భాగాన్ని తెరకెక్కించిన శైలేష్ కొలను డీల్ చేస్తున్నాడు. కేడీ అనే కూల్ కాప్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు శేష్. ఈ లిస్ట్ లో ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి. కార్తికేయ 2 ఆల్రెడీ సెట్స్ పై ఉంది. మంచు విష్ణు మరోసారి ఢీ సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీనువైట్ల మేకింగ్ లో డి అండ్ డి అనే సినిమా చేయనున్నాడు.ఇయర్ ఎండ్ కు మరోసారి పుష్ప తిరిగిరానున్నాడు. అలాగే గూఢచారి 2 కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలన్ని వచ్చే ఏడాది ప్రేత్రక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన హరర్ చిత్రం
సాక్షి,చెన్నై(తమిళనాడు): మరోసారి భయపెట్టడానికి సీవీ–2 చిత్రం సిద్ధమైంది. కొన్నేళ్ల క్రితం విడుదలైన సీవీ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. దెయ్యం ఒక వ్యక్తి మెడపై కూర్చొని ప్రతీకారం తీర్చుకునే ఇతివృత్తంతో రూపొందిన ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా సీవీ–2ను తులసి సినీ ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. కేఆర్ సెంథిల్నాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బీఎల్ సంజయ్ చాయాగ్రహణను, ఎస్పీ అహ్మద్ సంగీతాన్ని అందించారు. ఇందులో దివంగత నటుడు తేంగాయ్ శ్రీనివాసన్ మనవడు యోగి, చరణ్‌రాజ్ కొడుకు తేజ చరణ్ రాజ్ ప్రధాన పాత్రలో నటించారు. నటి స్వాతిషా, సంతోష్, క్రిస్టియన్, దాడి బాలాజీ, శ్యామ్స్, కోదండం, గాయత్రి కుమరన్ ముఖ్య పాత్రలు పోషించారు. జనవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
టాలివుడ్లో సీక్వెల్స్ జాతర..
టాలివుడ్లో ఇప్పటి వరకు సీక్వెల్ సినిమాగా విడుదలైన ఏ చిత్రం పెద్దహిట్ సాధించిన చరిత్ర లేదు! బాహుబలి-2 మూవీ కొంతమేరకు సక్సెస్ అయినా అది సీక్వెల్ మాత్రం కాదనే చెప్పాలి. మొదటి భాగానికి కొనసాగింపు అంతే. అయితే ఇప్పుడు ఆ అనుభవాలను పక్కనబెట్టి మరీ వరసగా సీక్వెల్స్ చేస్తున్నారు తెలుగు దర్శకులు. దాదాపు 10 సినిమాలకు పైగా సీక్వెల్స్ సిద్ధమవుతున్నాయిప్పుడు. ఆ సినిమాలేంటో ఓ సారి చూద్దాం.. అడవి శేష్ హీరోగా 2018లో వచ్చిన గూఢచారి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌గా గూఢచారి-2 చేస్తున్నాడు శేష్. హీరో నాని ప్రొడ్యూసర్‌గా విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'హిట్' సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు కూడా అడవి శేష్ హీరోగా సీక్వెల్ రూపొందిస్తున్నారు మేకర్స్. కింగ్ నాగార్జున ఆరేళ్ల క్రితం సోగ్గాడే చిన్నినాయనాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్ చేస్తానని నాగార్జున ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. మొత్తానికి బంగార్రాజు పేరుతో ఈ చిత్రం 2022 సంక్రాంతి బరిలో ఉన్నట్టు తెలుస్తోంది. 2021 ప్రథమార్ధంలో జాతి రత్నాలు సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టిన దర్శకుడు అనుదీప్ సీక్వెల్ మూవీ చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్ 2తో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. ఎఫ్-3 అంటూ సీక్వెల్ చేస్తున్నాడు. 2022 ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదల కానున్నట్టు సమాచారం. 2014లో నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ప్రస్తుతం ఆ చిత్రానికి నిఖిల్‌తోనే సీక్వెల్ చేస్తున్నాడు దర్శకుడు చందూ మొండేటి. క్రాక్‌తో బంపర్ హిట్ కొట్టిన మాస్ మాహరాజ్ రవితేజ క్రాక్-2 చేయాలనుందని కోరగా దానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఓకే చెప్పాడు. పైగా సినిమా చివర్లో క్రాక్-2 ఎండ్ కార్డ్ వేసి హింట్ కూడా ఇచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇక ఇవేకాక మంచు విష్ణు హీరోగా 14 ఏళ్ల క్రితం వచ్చి సూపర్ హీట్‌గా నిలిచిన ‘ఢీ’ సినిమాకు ప్రస్తుతం విష్ణు హీరోగా సీక్వెల్ ప్రకటించాడు దర్శకుడు శ్రీను వైట్ల. త్వరలోనే ఆ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం. -
దృశ్యం త్రీ కూడా ఉంది
మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. 2013లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్ భాషల్లోకి రీమేక్ అయింది. ఇటీవలే ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కించారు జీతు. ఈ సినిమా నేరుగా అమేజాన్ ప్రై మ్లో విడుదలయింది. ఈ సినిమా కూడా విశేష ప్రశంసలు అందుకుంటోంది. జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే మలయాళ ‘దృశ్యం 2’ రీమేక్‌లో వెంకటేశ్ నటించనున్నారు. తాజాగా ‘దృశ్యం 3’ కూడా ఉంటుందని ప్రకటించారు దర్శకుడు జీతు. ఆల్రెడీ మూడో భాగం కై్లమాక్స్ రాసుకున్నానని తెలిపారు. కానీ ‘దృశ్యం 3’ తెరకెక్కడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని స్పష్టం చేశారు. -
సూపర్ హిట్ చిత్రాలు.. సీక్వెల్‌కు రెడీ
కొన్ని కథలు భలే ఉంటాయి. ఇంకోసారి వినాలనిపించేలా. ఇంకా ఉంటే బావుండు అనిపించేలా. సినిమాకు సీక్వెల్ పుట్టడానికి ఇదో కారణం. బాక్సాఫీస్ విజయం, కాంబినేషన్లు చేసే మ్యాజిక్ కూడా కొన్నిసార్లు సినిమా సీక్వెల్‌కి కారణం అవుతాయి. కథను కొనసాగించే స్కోప్ ఉంటే.. సీక్వెల్ తీయొచ్చు. అలాంటి కథలు కొన్ని ఉన్నాయి. వాటితో సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు. కొన్ని చర్చల దశలో ఉన్నాయి. సీక్వెల్ కథేంటో చూద్దాం. బంగార్రాజు ఈజ్ బ్యాక్ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంతో 2016 సంక్రాంతికి బాక్సాఫీస్ హిట్ సాధించారు నాగార్జున. బంగార్రాజుగా ఆయన ఎనర్జీ స్క్రీన్ మీద బాగా పండింది. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కనుంది. ‘బంగార్రాజు’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. బంగార్రాజు నేపథ్యం ఏంటి? అనేది ఈ సినిమా ప్రధానాంశం. మార్చిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రంలో నాగచైతన్య కూడా నటిస్తారు. కేబుల్ ఆపరేషన్ స్టార్ట్ అనుకోకుండా ఎదురైన ఆపదను కేబుల్ ఆపరేటర్ రాంబాబు తెలివిగా తప్పించాను అనుకుంటాడు. కానీ పోలీసులు ఈ కుటుంబాన్ని అనుమానిస్తుంటారు. మరి ఇప్పటికైనా ఆ ఆరోపణల నుంచి బయటపడ్డారా? ‘దృశ్యం 2’ వచ్చేవరకూ ఆగాలి. వెంకటేశ్ హీరోగా 2014లో వచ్చిన థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. ఈ సినిమాకు తాజాగా సీక్వెల్ తెరకెక్కుతోంది. కేబుల్ ఆపరేటర్ రాంబాబు పాత్రలో మళ్లీ కనిపించనున్నారు వెంకటేశ్. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సీక్వెల్‌ను డైరెక్ట్ చేయనున్నారు. మార్చి నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. డోస్ డబుల్ మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘ఢీ’ పెద్ద హిట్ అయింది. చురుకైన బబ్లూగా స్క్రీన్ మీద కామెడీ బాగా పండించారు విష్ణు. ఇప్పుడు దాని డోస్ పెంచనున్నారు. ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ‘ఢీ 2 : డబుల్ డోస్’ టైటిల్‌తో ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ సినిమాలో నటిస్తూ, నిర్మించనున్నారు విష్ణు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. డబుల్ ఇస్మార్ట్ రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన హై ఎనర్జిటిక్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే సీక్వెల్ ఉంటుందని దర్శకుడు పూరి పేర్కొన్నారు. ఈ సీక్వెల్‌కి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేశారు. చిత్రం 1.1 ‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు తేజ. కేవలం నలభై లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ హిట్ అయింది. ఉదయ్ కిరణ్, రీమా సేన్ ను ఈ సినిమా ద్వారా పరిచయం చేశారు తేజ. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా ‘చిత్రం’ సినిమాకు సీక్వెల్‌గా ‘చిత్రం 1.1’ను ప్రకటించారు తేజ. ఈ సినిమా ద్వారా సుమారు 45 మంది కొత్తవాళ్లను పరిచయం చేయనున్నారని సమాచారం. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. గూఢచారి రిటర్న్స్ ఏజెంట్ గోపీగా అడివి శేష్ చేసిన సాహసాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాయి. ఈ యంగ్ గూఢచారిని సూపర్ హిట్ చేశారు. అడివి శేష్ కథను అందించి, హీరోగా నటించిన చిత్రం ‘గూఢచారి’. శశికిరణ్ తిక్కా దర్శకుడు. చిన్న సినిమాగా విడుదలై, పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుంది. రెండో భాగానికి కూడా కథను అందిస్తున్నారు అడివి శేష్. రాహుల్ పాకాల దర్శకుడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. సందడి రెండింతలు సంక్రాంతి అల్లుళ్లుగా ‘ఎఫ్ 2’ చిత్రంలో సందడి చేశారు వెంకటేశ్, వరుణ్ తేజ్. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ’ అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి థియేటర్స్‌లో నవ్వులు పూయించారు. ఇప్పుడు ఈ సందడిని రెండింతలు చేయనున్నారు. ‘ఎఫ్ 2’కి సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ సిద్ధమవుతోంది. మొదటి చిత్రంలో కనిపించిన వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ భార్యాభర్త గొడవ, కాబోయే భార్యాభర్త మధ్య అలకలతో సాగింది. రెండో భాగంలో వెంకీ, వరుణ్ డబ్బు చుట్టూ తిరిగే పాత్రలు చేస్తున్నారు. ‘దిల్’ రాజు నిర్మాత. ఆగస్ట్ 27న ‘ఎఫ్ 3’ రిలీజ్ కానుంది. రెండో కేసు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ విక్రమ్ గత ఏడాది ఓ కేసుని సక్సెస్‌ఫుల్‌గా ఛేదించారు. ఇప్పుడు రెండో కేస్ పని పట్టడానికి రెడీ అయ్యారు. హీరో నాని నిర్మాణంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘హిట్: ది ఫస్ట్ కేస్’. శైలేష్ కొలను దర్శకుడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘హిట్ : ది సెకండ్ కేస్’ రానుందని చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇంకొన్ని సీక్వెల్స్ కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘అ!, కల్కి, జాంబీ రెడ్డి’ చిత్రాలకు కూడా సీక్వెల్స్ ఉండొచ్చు. సీక్వెల్ చేసే ఉద్దేశం ఉన్నట్లు ఆయనే స్వయంగా పేర్కొన్నారు. చదవండి : దృశ్యం 2: అజయ్ కూడా తప్పించుకుంటాడు ‘అలా నటించడం ఆనందంగా ఉంది’ -
అదే తేదీకి అవతార్!
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ అయోమయంలో పడింది. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో కచ్చితంగా తెలియదు. విడుదల ఎప్పుడు వీలవుతుందో అర్థం కావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘‘అవతార్ అనుకున్న సమయానికే వస్తాడు’’ అంటున్నారు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్. 2009లో వచ్చిన ‘అవతార్’ సినిమాకు రెండు మూడు సీక్వెల్స్ సిద్ధం చేస్తున్నారు కామెరూన్. మొదటి సీక్వెల్ ను వచ్చే ఏడాది డిసెంబర్ 17న విడుదల చేయాలనుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల వల్ల ‘అవతార్’ ఆలస్యం అవుతుంది అనుకున్నారు. ‘‘కరోనా వల్ల మా షూటింగ్ షెడ్యూల్ మొత్తం మారిపోయింది. అయినా సరే అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేస్తాం అనే నమ్మకం ఉంది. చెప్పిన తేదీకే విడుదల చేయగలుగుతాం అనే అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు కామెరూన్. -
ఇన్నుమ్ ఇరుక్కు!
ఏ ఇండస్ట్రీలో అయినా ప్రతి ఏడాది కొన్ని సీక్వెల్స్ వెండితెరపైకి వస్తూనే ఉంటాయి. కోలీవుడ్‌లో గత ఏడాది రజనీకాంత్ ‘2.0’, కమల్‌హాసన్ ‘విశ్వరూపం 2’, ధనుష్ ‘మారి 2’, విశాల్ ‘పందెంకోడి 2’ చిత్రాలతో పాటు ‘కలకలప్పు 2’, ‘గోలీ సోడా 2’, ‘తమిళ్ పడమ్ 2’ చిత్రాలు సీక్వెల్స్‌గా వచ్చి ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేశాయి. ‘ఇన్నుమ్ ఇరుక్కు’ (ఇంకా ఉంది) అంటూ తమిళంలో ఈ ఏడాది కూడా కొన్ని సీక్వెల్స్ వెండితెరపై వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో వాంగ పాక్కలామ్.. అదేనండీ.. రండి చూద్దాం. లోకనాయకుడు కమల్‌హాసన్ సీక్వెల్స్‌పై స్పెషల్ కేర్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. గత ఏడాది ‘విశ్వరూపం 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ ‘ఇండియన్ 2’ షూటింగ్ పనుల్లో ఉన్నారిప్పుడు. 1996లో శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్. సేమ్ కాంబినేషన్లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ ‘ఇండియన్ 2’ సినిమాలో కాజల్ అగర్వాల్ కథా నాయికగా నటిస్తున్నారు. అలాగే 1992లో భరతన్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘దేవర్‌మగన్’ (తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’) చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కమల్‌హాసనే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా సీక్వెల్స్‌పై ఫుల్ కాన్సట్రేట్ చేశారు కమల్. యువహీరో ‘జయం’ రవి కూడా ఓ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. తెలుగులో రామ్‌చరణ్ చేసిన హిట్ మూవీ ‘ధృవ(2016)’ తమిళంలో ‘జయం’ రవి హీరోగా నటించిన ‘తని ఒరువన్’ (2015)కు రీమేక్ అని తెలిసిందే. దీనికి మోహన్‌రాజా దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘తని ఒరువన్’ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. సేమ్ మోహన్‌రాజా దర్శకత్వంలోనే ‘జయం’ రవి హీరోగా నటిస్తున్నారు. మొదటిపార్ట్ కన్నా మరింత మెరుగ్గా సినిమాను తెరకెక్కించేందుకు కష్టపడతామని మోహన్ రాజా పేర్కొన్నారు. ఇక తమన్నా, ప్రభుదేవా, సోనూ సూద్ ముఖ్య తారలుగా ఏఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ (తెలుగులో ‘అభినేత్రి’) చిత్రానికి సీక్వెల్‌గా ‘దేవి 2’ చిత్రం రూపొందుతోంది. ఏఎల్. విజయ్ దర్శకత్వంలోనే తమన్నా, ప్రభుదేవా ముఖ్యతారలుగా నటిస్తున్నారు. నందితా శ్వేత, కోవై సరళ ముఖ్యపాత్రలు చేస్తున్నారీ సీక్వెల్లో. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలిసింది. తెలుగులో ‘అభినేత్రి 2’ పేరుతో విడుదల కావొచ్చు. మరోవైపు ఓ మల్టీస్టారర్ సీక్వెల్ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇది ఇప్పటి చిత్రానికి సీక్వెల్ కాదు. దురై దర్శకత్వంలో కమల్‌హాసన్, శ్రీప్రియ నటించిన నీయా (1979) చిత్రానికి సీక్వెల్‌గా ‘నీయా 2’ వస్తోంది. మల్టీస్టారర్ మూవీగా జై, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాయ్‌లక్ష్మీ, క్యాథరీన్లతో ఈ చిత్రం రూపొందింది. ఆల్రెడీ ఫస్ట్‌లుక్స్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా ‘నాగకన్య’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. నాలుగేళ్ల క్రితం హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చతురంగ వేటై్ట’. ఈ సినిమా ‘బ్లఫ్ మాస్టర్’ పేరుతో తెలుగులో ఈ ఏడాది విడుదలైంది. సత్యదేవ్ హీరోగా నటించారు. ఇప్పుడు త్రిష, అరవింద్ స్వామి హీరోహీరోయిన్లుగా ‘చతురంగ వేటై్ట 2’ సినిమా సెట్స్‌పై ఉంది. ప్రముఖ కమెడియన్ వడివేలు నటించిన ‘ఇమ్సై అరసన్ 23 ఆమ్ పులికేశి’ (తెలుగులో ‘హింసించే రాజు 23వ పులకేశి’) చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇమ్సై అరసన్ 24 ఆమ్ పులికేశి’ చిత్రాన్ని మొదలుపెట్టారు. సీక్వెల్లో కూడా వడివేలునే తీసుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి ఆ స్థానంలో యోగిబాబు నటిస్తారని టాక్. మరి.. హింసించే రాజు ఎవరో త్వరలో తెలుస్తుంది. ఈ సినిమాలే కాకుండా కొన్ని చిన్న సినిమాల సీక్వెల్స్ కూడా సెట్స్‌పై ఉన్నాయి. ఇప్పటివరకు స్పష్టమైన అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కొన్ని హిట్ సినిమాలకు సీక్వెల్స్‌ను తెరకెక్కించాలని ఆలోచన చేస్తున్నారట కొంతమంది కోలీవుడ్ దర్శక–నిర్మాతలు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన ‘తుపాకీ’ (2012) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మురుగదాస్ ఈ మధ్య ఓ సందర్భంలో పేర్కొన్నారని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. అయితే ఫస్ట్ పార్ట్‌లో విజయ్ నటించగా, సీక్వెల్లో మాత్రం అజిత్ హీరోగా నటిస్తారట. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం ‘పుదుపేటై్ట’ (2006). ఈ సినిమా సీక్వెల్ ఆలోచన ఉన్నట్లు ఓ అభిమాని ప్రశ్నకు ధనుష్ సమాధానంగా చెప్పారు ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో. విశాల్,ధనుష్ అభివృద్ధి చెందిన నేటి సాంకేతిక పరిజ్ఞానంతో ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఇరంబు దురై’ (2018). (తెలుగులో ‘అభిమన్యుడు’). పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు హింట్స్ ఇస్తున్నారు విశాల్. 2017లో వచ్చిన హారర్ మూవీ ‘గృహం’ సిద్ధార్థ్‌కు మంచి హిట్ అందించింది. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారట. అలాగే నయనతార కలెక్టర్‌గా నటించిన ‘అరమ్’ (తెలుగులో ‘కర్తవ్యం’), సూర్య కెరీర్‌కు మంచి మైలేజ్‌ను తీసుకొచ్చిన ‘కాక్క కాక్క’ (తెలుగులో ‘ఘర్షణ’) సినిమాలకు సీక్వెల్స్ రానున్నాయని కోలీవుడ్‌లో కొత్తగా కథనాలు వస్తున్నాయి. ‘గోల్మాల్, రేస్, ధూమ్, క్రిష్’ చిత్రాల సీక్వెల్స్ ఫ్రాంచైజ్‌లుగా మారాయి బాలీవుడ్లో. ఈ ట్రెండ్ మెల్లిగా సౌత్‌కి వస్తున్నట్లు అర్థం అవుతోంది. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో ఇప్పటికే ‘సింగం’ (తెలుగులో ‘యముడు’) సిరీస్‌లో మూడు సినిమాలు వచ్చాయి. మరో రెండేళ్లలోపు ‘సింగం 4’ అనౌన్స్మెంట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన’ సిరీస్ ఇలాంటిదే. ‘ముని’ పేరుతో మొదలైన ఈ హారర్ సిరీస్‌లో ఫోర్త్ పార్ట్‌గా ‘కాంచన 3’ ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. రాఘవ లారెన్స్ రాఘవ లారెన్స్‌తో పాటు, వేదిక, ఓవియా నటించారు. విశాల్ కెరీర్‌కు మాస్ ఇమేజ్ను తీసుకువచ్చిన చిత్రం ‘పందెం కోడి (2005)’. ఈ సినిమా సీక్వెల్ ‘పందెంకోడి 2’ గతేడాది విడుదల అయ్యింది. ‘పందెంకోడి 3’ సినిమా 2020లో సెట్స్‌పైకి తీసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు విశాల్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘ధృవనక్షత్రం’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఓ సిరీస్‌లా కొనసాగించే ఆలోచనలో ఉన్నారట టీమ్. భవిష్యత్‌లో ఈ సిరీస్‌ల ట్రెండ్ మరింత ముందుకు వెళ్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. -
ప్రస్తుతం సీక్వెల్స్ హవా!
ఒక సినిమా హిట్ అయితే వెంటనే అభిమానులు, ప్రేక్షకులు మళ్లీ అలాంటి చిత్రం కావాలంటారు. సీక్వెల్స్ తీయడానికి హీరోలు, దర్శకులు సైతం మొగ్గుచూపుతూ ఉంటారు. ఇలా గతంలో సీక్వెల్ తీసిన సినిమాలెన్నో హిట్స్‌గా నిలిచాయి. అయితే అన్ని వేళలా సీక్వెల్స్ మంచి ఫలితాలనే ఇస్తుందని చెప్పలేం. ఒక్కోసారి మిశ్రమ ఫలితాన్ని చవిచూడాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం పలు సీక్వెల్స్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. సీక్వెల్ అనగానే ప్రస్తుతం అందరికీ గుర్తుకు వచ్చే సినిమా ‘2.ఓ’. శంకర్-రజనీ కాంబినేషన్లో 2010లో వచ్చిన రోబో సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్లకు వీరి కాంబినేషన్లో ‘2.ఓ’ విడుదలకు సిద్దమైంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానుండగా.. రికార్డులను క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక శంకర్ దీని తర్వాత ‘ఇండియన్2’ సినిమాను తెరకెక్కించే పనిలో బిజీకానున్నాడు. కమల్‌హాసన్-శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్( తెలుగులో భారతీయుడు) అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటిని బద్దలు కొట్టింది. ఈ చిత్రంలో కమల్‌హాసన్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ మూవీ సీక్వెల్‌కు ముహుర్తం కుదిరింది. కమల్‌హాసన్ సినీకెరీర్‌లో ‘క్షత్రియపుత్రుడు’ది ప్రత్యేకస్థానం. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కమల్ ఈమధ్యే తన మనసులో మాటను చెప్పుకొచ్చాడు. రీసెంట్గా దర్శకుడు సెల్వ రాఘవన్ ‘యుగానికొక్కడు’ సీక్వెల్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. కార్తీ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తే విజయం సాధిస్తుందని భావిస్తున్నారట. ఇక మాస్ ఫాలోయింగ్ భారీగా ఉన్న ధనుష్ సీక్వెల్స్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ధనుష్-కాజల్ జంటగా నటించిన ‘మారి’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘మారి-2’ని విడుదలచేసేందుకు రెడీ అయ్యారు. రీసెంట్గా రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలు పొందిన ‘వడచెన్నై’ చిత్రానికి కూడా సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించనుండగా.. ఈ చిత్రం రెండో భాగం కూడా రెడీ అవుతోంది. ఇంకా కొన్ని చిత్రాలు సీక్వెల్స్‌కు ప్లాన్ చేస్తున్నాయి. మరి వీటన్నంటిలో ఏవి నిలబడి విజయాన్ని సాధిస్తాయో చూడలి. -
మరో మూడు సీక్వెల్స్‌తో పుల్ స్టాప్!
రయ్‌మంటూ దూసుకెళ్లే కార్లు... ఒక విమానం గాల్లో ఎగురుతుండగా... కొన్ని కార్లు ప్యారాచూట్స్ సాయంతో రోడ్డు మీద ల్యాండ్ కావడం... ఖరీదైన ఫెరారీ కారు రెండు ఎత్తై బిల్డింగ్స్ మధ్య నుంచి దూసుకుంటూ వెళ్లడం...ఈ దృశ్యాలన్నీ తలుచుకుంటే ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7’ సినిమా గుర్తుకువస్తుంది. ఇప్పటివరకూ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లో వచ్చిన అన్ని చిత్రాలూ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాయి. ఇందులోని పోరాట సన్నివేశాలు ఈ చిత్రాలకు ప్లస్ పాయింట్. ‘ఎఫ్-7’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎనిమిదో భాగం మీద పడింది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో చిత్ర కథానాయకుల్లో ఒకరైన విన్ డీజిల్ తాజాగా ఓ ప్రకటన చేశారు. ఈ ఫ్రాంచైజ్కి మరో మూడు సీక్వెల్స్‌తో పుల్‌స్టాప్ పెట్టేస్తామని ఆయన తెలిపారు. ఈ ఎనిమిదో భాగాన్ని తెరకెక్కించి, 2017 ఏప్రిల్ 14న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, దర్శకుడు దొరక్క పోవడంతో ఈ చిత్రం షూటింగ్ సైతం ఇంకా ఆలస్యం కానుంది. -
వన్ టూ... కొట్టు హిట్టు
ఇప్పుడంతా సీక్వెల్స్, రీమిక్స్, రీమేక్‌ల హవా. బాలీవుడ్‌లోనూ అదే ట్రెండు. సౌత్‌లోనూ సేమ్ సీన్. ఒకప్పుడైతే సీక్వెల్స్ విషయంలో తటపటాయింపులుండేవేమో కానీ, ఇప్పుడు కొనసాగింపే ఇంపుగా మారిపోయింది. తెలుగు, తమిళం, కన్నడం - భాష ఏదైనా సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబరాఫ్ సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. వాటిలో కొన్నిటి డీటైల్స్ మీ కోసం... ‘సర్దార్’ సూపర్ ‘దబంగ్’కి రీమేక్‌గా పవన్ కల్యాణ్ చేసిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్‌బస్టర్ అయింది. ఈ చిత్రంలో పవన్ చేసిన సందడికి కొనసాగింపు ఉంటే బాగుంటుందని అభిమానులు అనుకున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఆ సందడిని ఇష్టపడ్డారు. అయితే, ఆ కథకు సీక్వెల్ అని పేరు పెట్టకపోయినా, ఆ షేడ్స్‌లో ఉండే కథ సిద్ధం చేసుకున్నారు. ‘గబ్బర్‌సింగ్2’గా ప్రచారమైన ఈ సినిమాకు తాజాగా ‘సర్దార్’ అనే టైటిల్ ఖరారు చేశారు. తొలి భాగంలో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించిన పవన్ కల్యాణ్, ఇందులోనూ పోలీసే. ‘పవర్’ ఫేమ్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ఆరంభమైంది. డబుల్ కిక్ రవితేజ, సురేందర్ రెడ్డి కాంబి నేషన్‌లో వచ్చిన ‘కిక్’ ఫుల్‌గా ఎంటర్టైన్ చేసింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా రవి తేజ - సురేందర్‌రెడ్డి కాంబినేషన్లో హీరో కల్యాణ్ రామ్ ‘కిక్ 2’ నిర్మించారు. ‘కిక్’లోని నాయకా నాయికల తనయుడి కథతో ఈ ‘కిక్ 2’ సాగుతుంది. ఈ నెలలోనే ఈ చిత్రం రిలీజ్. చిత్రాతిచిత్రంగా రెండో ఉపేంద్ర ‘ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ కూడా ఉంటాయా?’ అని ‘ఉపేంద్ర’ చిత్రంలో హీరో ఉపేంద్ర చేసిన పాత్ర చూసి, జనం అనుకున్నారు. ఈ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్. కన్నడ స్టార్ ఉపేంద్రను తెలుగులో పాపులర్ చేసిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ. తెలుగులో ‘ఉపేంద్ర 2’, కన్నడంలో ‘ఉప్పి 2’ పేరుతో రూపొందిన ఈ చిత్రం రిలీజ్ ఈ నెలలోనే. పధ్నాలుగేళ్ల క్రితం ఉపేంద్ర నటించిన ‘రా’ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయమైన నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ సీక్వెల్ నిర్మించారు. తొలిభాగంలానే ఈ సీక్వెల్లో కూడా ఉపేంద్ర విచిత్ర లుక్స్‌లో కనిపించనున్నారు. ఈ వారంలో పాటలనూ, ఈ నెలలోనే చిత్రాన్నీ విడుదల చేయాలనుకుంటున్నారు. ఈసారి కూడా రికార్డ్...? తొమ్మిదేళ్ల క్రితం కన్నడంలో రూపొందిన ఫీల్‌గుడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ముంగారు మళె’. గణేశ్, పూజాగాంధీ జంటగా యోగరాజ్ భట్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దాదాపు 500 వందల రోజులకు పైగా ఆడింది. ఏడాది పాటు నిర్విరామంగా మల్టీప్లెక్స్‌లో ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రంగా రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ముంగారు మళె 2’ రూపొందు తోంది. తొలి భాగంలో నటించిన గణేశ్ హీరోగా నేహాశెట్టి హీరోయిన్గా శశాంక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరి.. ఈ సీక్వెల్ ఎలాంటి రికార్డ్‌ను సొంతం చేసుకుం టుందో? పదింతలు వసూలు చేసిన ‘గోలీ సోడా’ చెన్నయ్‌లోని కోయంబేడు మార్కెట్లో కూలీలుగా పని చేసే నలుగురు కుర్రాళ్ల కథతో సాగే తమిళ చిత్రం ‘గోలీ సోడా’. ఛాయాగ్రాహకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో 2 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం 20 కోట్ల రూపాయలు రాబట్టింది. ‘గోలీ సోడా’కి సీక్వెల్‌ను తమిళంలో తెరకెక్కించడానికి విజయ్ మిల్టన్ సన్నాహాలు చేస్తున్నారు. తొలి భాగంలో నటించినవాళ్లతోనే ఈ సీక్వెల్‌ను రూపొందించనున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. విశ్వరూపం-2 ఎప్పుడు? కమల్‌హాసన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘విశ్వరూపం’. పలు వివాదాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మంచి ఆదరణే లభించింది. ఈ చిత్రం విడుదలై రెండేళ్ల య్యింది. తొలి భాగం అప్పుడే మలి భాగానికి సంబంధించిన కొంత శాతం చిత్రీకరణను కమల్ పూర్తి చేశారు. ‘విశ్వరూపం’ నిడివి 2 గంటల 20 నిమిషాలు ఉంటే.. సీక్వెల్ నిడివి రెండు గంటల లోపే ఉంటుందట. వాస్తవానికి ఈ ఏడాదే చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ, వచ్చే ఏడాదికి వాయిదా వేశారని సమాచారం. మరి.. ఈ సీక్వెల్ ఎప్పుడు తెరకొస్తుందో వేచి చూడాలి. ఈ చిత్రాలు కాకుండా తెలుగులో ‘బాహుబలి’కి పార్ట్2, ‘రుద్రమదేవి’, ‘లీడర్’కి సీక్వెల్స్ రానున్నాయి. అలాగే, తమిళంలో ‘ఎందిరన్’ (‘రోబో’)కి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు శంకర్. ఇంకా మరికొన్ని సీక్వెల్స్‌కి తెరవెనుక చర్చలు జరుగుతున్నాయి. -
వెయిట్ ఫర్ ‘అవతార్-2’
‘అవతార్’ చిత్రంలో పండోరా గ్రహాన్ని సృష్టించి, సరికొత్త ప్రకృతి అందాలను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆ చిత్రాన్ని ప్రపంచ సినీ అభిమానులు మర్చిపోలేరు. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్స్ రెడీ చేస్తున్నారాయన. 2016లో రెండో భాగాన్ని, 2017, 18 సంవత్సరాల్లో మూడు, నాలుగు భాగాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించేశారు కూడా. కానీ, వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదట. 2017 డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా మొదటి సీక్వెల్‌ను, 2018, 2019 సంవత్సరాల్లో తర్వాతి భాగాలను విడుదల చేస్తామని ఇప్పుడు తాజాగా చెప్పారు కామెరూన్. అంటే ‘అవతార్’ పార్ట్2 కోసం మరో రెండేళ్లు నిరీక్షించక తప్పదు.