తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఇప్పుడు సీక్వెల్స్ జోరు కొనసాగుతోంది. దాదాపు అరడజను సినిమాల సీక్వెల్స్ నిర్మాణంలో ఉంటే, ప్రకటించిన సీక్వెల్స్ కూడా అరడజనుకు పైగా ఉన్నాయి. ‘సీక్వెల్ నామ సంవత్సరం’ అనేలా ఒకే ఏడాదిలో తెలుగులో ఇన్ని సీక్వెల్స్ రూపొందడం ఇదే మొదటిసారి. మొదటి భాగాన్ని ఆదరించిన ప్రేక్షకులు ‘తరువాయి భాగం’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సీక్వెల్ సినిమాల గురించి తెలుసుకుందాం.
త్రిబుల్ సందడి...
‘ఎఫ్ 2’ సినిమాతో సంక్రాంతి అల్లుళ్లుగా కడుపుబ్బా నవ్వించారు వెంకటేశ్, వరుణ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించారు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించిన ‘ఎఫ్ 2’ 2019 జనవరి 12న విడుదలై ఘనవిజయం సాధించింది. ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నవారికి ఈ సినిమా ద్వారా ‘వెంకీ ఆసనం’ నేర్పించారు వెంకటేశ్. తోడల్లుళ్లుగా వెంకీ–వరుణ్‌లు చేసిన డబుల్ సందడిని ప్రేక్షకులు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఆ ఆనందాన్ని త్రిబుల్ చేయడానికి ‘ఎఫ్ 3’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది చిత్రయూనిట్. ‘ఎఫ్ 2’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘ఎఫ్ 3’ మే 27న విడుదలవుతోంది. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే ఓ ప్రత్యేక పాట చేశారు. ‘ఎఫ్ 2’ మంచి విజయం సాధించడంతో ‘ఎఫ్ 3’ పై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.
తగ్గేదే లే అంటూ...
‘తగ్గేదే లే’... ఈ మధ్య బాగా వినిపిస్తున్న మాట ఇది. ‘పుష్ప’ సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ ఒదిగిపోయిన తీరుకి మంచి మార్కులు పడ్డాయి. ‘ఆర్య, ఆర్య 2’ వంటి హిట్ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్– డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’: ది రైజ్. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబరు 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ‘తగ్గేదే లే’ అంటూ.. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించింది టీమ్. ప్రస్తుతం ‘పుష్ప 2’ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. గత ఏడాది ‘పుష్ప’ విడుదలైన తేదీ (డిసెంబరు 17)నే ఈ ఏడాది డిసెంబరులో ‘పుష్ప 2’ని రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఎనిమిదేళ్లకు సీక్వెల్...
నిఖిల్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘కార్తికేయ’. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్వాతి హీరోయిన్‌గా నటించారు. వెంకట్ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా 2014 అక్టోబర్ 14న విడుదలై ఘనవిజయం సాధించింది. నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రమిది. ‘కార్తికేయ’ విడుదలైన ఎనిమిదేళ్లకు సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ తెరకెక్కుతోంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలోనే తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ‘కార్తికేయ 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జూలై 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
మళ్లీ హిట్ కోసం...
వైవిధ్యమైన చిత్రాలతో హిట్స్ అందుకుంటున్న హీరో నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘హిట్’ 2020 ఫిబ్రవరి 28న విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. ఇందులో విశ్వక్ సేన్ తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్‌మెంట్ అధికారిగా చక్కని నటన కనబరిచారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘హిట్ 2’ని తీస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. అయితే ‘హిట్ 2’కి హీరో, హీరోయిన్ మారారు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇవి విడుదలకు సిద్ధంగా ఉన్న, నిర్మాణంలో ఉన్న చిత్రాలైతే మరికొన్ని సీక్వెల్స్ కూడా రూపొందనున్నాయి. ఆ చిత్రాలేంటంటే..
రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘విక్రమార్కుడు’కి సీక్వెల్, రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘క్రాక్’కి సీక్వెల్, గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వం వహించిన ‘లక్ష్యం’కి సీక్వెల్, మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఢీ’ సీక్వెల్ కూడా రానున్నాయి. ఇంకా ఉదయ్ కిరణ్‌ని హీరోగా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’ (2000) మూవీకి సీక్వెల్‌గా ‘చిత్రం 1.1’ తెరకెక్కనుంది. అలాగే అడివి శేష్ ‘గూఢచారి’, తేజా సజ్జ ‘జాంబి రెడ్డి’, నవీన్ పోలిశెట్టి ‘జాతిరత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, విశ్వక్ సేన్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ‘ఫలక్‌నుమా దాస్’, సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ వంటి చిత్రాల సీక్వెల్స్ షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది.
చదవండి: ఏంటి, పుష్ప 2 సినిమాకు బన్నీ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?
టాలీవుడ్‌లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి
Comments
Please login to add a commentAdd a comment