
తెలుగు సినిమాల గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, సలార్, కల్కి 2898 ఏడీ, దేవర, పుష్ప’ వంటి చిత్రాల విజయాలు అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలన్నింటిలోని కామన్ పాయింట్ ఏంటంటే... ఈ సినిమా కథలన్నీ భారీ స్థాయిలో ఉన్నాయి.
అందుకే ఒకటి కాదు... రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ సినిమాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఒకటికి రెండు ట్రెండ్ టాలీవుడ్‌లో ఊపందుకుంది. భారీ కథలు ఎంపిక చేసుకుని, ఆ కథను పలు భాగాలుగా ఆడియన్స్‌కు చూపిస్తున్నారు మేకర్స్. ఈ కోవలో పెద్ద కథలతో రానున్న కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.
ఉగాదికి రిలీజ్
హీరో మహేశ్‌బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ చిత్రీకరణ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను ఇటీవలే ఒడిశాలోని కోరాపుట్‌లో పూర్తి చేశారు. నెక్ట్స్ షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేశారు.
కాగా దక్షిణాఫ్రికా, కెన్యా దేశాల్లో ఈ మూవీ చిత్రీకరణ జరగనుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని, తొలి భాగం 2026 చివర్లో లేదా 2027 ఉగాది సమయంలో ప్రేక్షకుల ముందుకు రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన ‘బాహుబలి’ సినిమా ‘బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్’ అంటూ రెండు భాగాలుగా వచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు కెరీర్‌లోని ఈ 29వ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైతే, మహేశ్‌బాబు కెరీర్‌లో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి చిత్రం ఇదే అవుతుంది.
ఈ ఏడాదిలోనే రాజా సాబ్
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా చేసే సినిమాలు భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. రెండు భాగాలుగా వచ్చిన ‘బాహుబలి’ సినిమా బ్లాక్‌బస్టర్ సాధించడంతో ప్రభాస్ నెక్ట్స్ సినిమాలు కూడా భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ, సలార్’ చిత్రాలు ఫ్రాంచైజీలుగా రానున్నాయి. ఈ రెండు సినిమాల తొలి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి, సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
మలి భాగాల చిత్రీకరణకు ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ప్రభాస్ హీరోగా చేస్తున్న మరో సినిమా ‘రాజా సాబ్’ కథ కూడా పెద్దదే. ఈ హారర్ కామెడీ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మూడేళ్లుగా కొనసాగుతోంది. మూడు తరాలు, ఆ తరాలకు చెందిన ఆత్మలు, హారర్ ఎలిమెంట్స్ వంటి అంశాలతో ‘రాజా సాబ్’ మూవీ రెండు భాగాలుగా రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు.
ఇప్పటికే ‘రాజా సాబ్’ సినిమా నుంచి ప్రభాస్‌కు చెందిన రెండు డిఫరెంట్ లుక్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సింది. కానీ కొంత టాకీ పార్టు, సాంగ్స్ షూట్, వీఎఫ్‌ఎక్స్... వంటివి పెండింగ్ ఉండటంతో ‘రాజా సాబ్’ సినిమా రిలీజ్ వాయిదా పడనుంది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ కానుందని సమాచారం.
వీరమల్లు
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగంగా ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మే 9న విడుదల కానుంది. 17వ శతాబ్దంలో జరిగే ఈ కథలో పవన్ కల్యాణ్ కథ రీత్యా ఓ దొంగ తరహా పాత్రలో కనిపిస్తారని తెలిసింది. ఈ మూవీలో నిధీ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్యరాజ్, బాబీ డియోల్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. డబ్బింగ్ పనులూ మొదలయ్యాయి. ఏఎమ్ రత్నం, అద్దంకి దయాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి స్వరకర్త.
కింగ్‌డమ్
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారట విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలో విజయ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నామని ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తొలి భాగం మే 30న రిలీజ్ కానుంది. ఈ పీరియాడికల్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్‌లో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారని సమాచారం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరకర్త.
కోహినూర్ వజ్రం కోసం...
‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందనున్న హిస్టారికల్ ఫిల్మ్ ‘కోహినూర్’. ‘ది కింగ్ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్’ అనేది క్యాప్షన్. గత ఏడాది దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించనున్నారని, 2026 జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నామని కూడా అప్పట్లో మేకర్స్ వెల్లడించారు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం అనే అంశం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుంది.
‘భద్రకాళి దేవత మహిమగల వజ్రం సామ్రాజ్యవాదుల చేతుల్లోకి వెళ్లింది. కోహినూర్ వజ్రాన్ని తిరిగి మూలాలకు తీసుకు రావడానికి ఓ యువకుడు సాగించే, చారిత్రాత్మక ప్రయాణం నేపథ్యంలో ఈ మూవీ కథ ఉంటుంది’’ అని ఈ మూవీ గురించి మేకర్స్ పేర్కొన్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక హీరో సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్ కాంబినేషన్‌లో ‘క్షణం, కృష్ణ అండ్ హీజ్ లీల’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మూడో చిత్రంగా ‘కోహినూర్’ తెరకెక్కనుంది.
ఏటిగట్టు కథలు
హీరో సాయిదుర్గా తేజ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న పీరియాడికల్ మాస్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీని దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ యాక్షన్ ఫిల్మ్ కోసం విదేశాల్లో ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్నారు సాయిదుర్గా తేజ్.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ మూవీలో సంజయ్ దత్ మరో లీడ్ రోల్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. కాగా ఈ మూవీ కూడా రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
స్వయంభూ
నిఖిల్ నటిస్తున్న హిస్టారికల్ అండ్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త, నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, భారీ స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సునీల్ ఓ సర్‌ప్రైజింగ్ క్యారెక్టర్లో కనిపించనున్నారని తెలిసింది. కాగా ఈ మూవీ చిత్రీకరణ 95 శాతం పూర్తయినట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు నిఖిల్.
‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది. తొలి భాగాన్ని ఈ ఏడాదిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఇక ఈ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ వంటి విద్యల్లో నిఖిల్ ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే.
మిరాయ్ సాహసాలు
‘హను–మాన్’తో భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించారు హీరో తేజ సజ్జా. ఆ మూవీ తర్వాత తేజ సజ్జా చేస్తున్న మరో మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తున్నారు.
ఈ సినిమాలో తేజ సజ్జా సాహసాలు, యాక్షన్ సీక్వెన్స్ సూపర్‌గా ఉంటాయట. కాగా ‘మిరాయ్’ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాను ఈ ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. సో... ఆ రోజున ‘మిరాయ్’ సినిమా తొలి భాగం విడుదల కావొచ్చని ఊహించవచ్చు. ఇలా రెండు భాగాలుగా విడుదల కానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment