సంవత్సరం మారింది... లుక్ మార్చి బాక్సాఫీస్ లెక్కలు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు కొందరు హీరోలు. ఇందు కోసం కథానుగుణంగా గెటప్ మార్చేశారు. ఇలా సరికొత్త లుక్‌లో తమ అభిమాన హీరోలు కనిపించడానికి అభిమానులకు ఓ కిక్కు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ఈ ఏడాది స్క్రీన్‌పై ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.
సరికొత్త మహేశ్
మహేశ్‌బాబు కెరీర్‌లో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. అయితే స్క్రీన్‌పై ఎప్పుడూ కనిపించనంత కొత్తగా మేకోవర్ అయ్యే పనిలో పడ్డారు మహేశ్‌బాబు. రాజమౌళి డైరెక్షన్‌లోని కొత్త సినిమా కోసమే మహేశ్‌బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలోని లుక్, మేకోవర్ కోసం ఆయన జర్మనీలో కొంత సమయం గడిపారు. గురువారం ఈ సినిమా లాంచ్ జరిగింది. కానీ మహేశ్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి అండ్ టీమ్. ఈ సినిమాలో మహేశ్ లాంగ్ హెయిర్‌తో, కాస్త గెడ్డంతో కనిపిస్తారని ఇటీవల బయటికొచ్చిన ఆయన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
రాజా సాబ్
ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న హారర్ మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ రెండు గెటప్స్‌లో ఉన్న లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే ప్రభాస్ కుర్చీలో కూర్చున్న ఓ గెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఇటీవల ఎక్కువగా రగ్డ్ లుక్‌తో, గెడ్డంతోనే కనిపించారు. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం క్లీన్ షేవ్‌తో ఓ గెటప్, కాస్త రగ్డ్ లుక్‌తో మరో గెటప్‌లో కనిపిస్తారు.
మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం కమిటయ్యారు ప్రభాస్. ఈ చిత్రంలోనూ ప్రభాస్ ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారని టాక్. ఆ మేకోవర్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి వంగా.
రగ్డ్ పెద్ది
‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్‌చరణ్ క్లీన్ షేవ్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం గుబురు గడ్డం, కాస్త లాంగ్ హెయిర్‌తో రగ్డ్‌గా కనిపిస్తున్నారు. చరణ్ ఇలా కొత్తగా మేకోవర్ అయ్యింది తన లేటెస్ట్ మూవీ కోసం అని ఊహించవచ్చు. రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.
ఈ సినిమా కోసమే రామ్‌చరణ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇందుకోసం రామ్ చరణ్ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఫిజిక్ విషయంలోనే కాదు... హెయిర్ స్టైల్‌తోనూ చరణ్ కొత్తగా కనిపిస్తారు. ‘పెద్ది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్‌లో జరిగింది. ఈ షెడ్యూల్‌లో సెలిబ్రిటీ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పాల్గొని, రామ్‌చరణ్ హెయిర్ స్టైల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఆఫీసర్ అర్జున్ సర్కార్
రోల్‌కు తగ్గట్లుగా నాని మౌల్డ్ అవుతుంటారు. తాజాగా అర్జున్ సర్కార్ పాత్ర కోసం నాని కొంత మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 3’. ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఈ చిత్రంలో నాని కొన్ని సీన్స్‌లో ఫుల్ వైట్ హెయిర్‌తో కనిపిస్తారని తెలిసింది. అంటే... ఓ సీనియర్ పోలీసాఫీసర్ లెక్క అన్నమాట. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ మే 1న రిలీజ్ కానుంది.
అలాగే ‘దసరా’ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫుల్ వయొలెన్స్‌తో సాగే ఈ చిత్రంలో ఓ ఫిరోషియస్ లుక్‌లో నాని కనిపించనున్నారు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంది. ‘హిట్ 3’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాని కొత్త మేకోవర్ స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు.
రొమాంటిక్ లవ్‌స్టోరీ
గతేడాది వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కాస్త మాసీ లుక్‌లో కనిపించారు హీరో రామ్. తన తాజా చిత్రం కోసం రామ్ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ కోసం లాంగ్ హెయిర్ పెంచారు రామ్. అలాగే బరువు కూడా తగ్గారు. యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లోకి వచ్చే చాన్స్ ఉంది.
స్పై డ్రామా
‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఫ్యామిలీ మేన్‌లా కనిపించారు విజయ్ దేవరకొండ. అయితే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. దీంతో పోలీస్ రోల్‌కు తగ్గట్లుగా షార్ట్ హెయిర్‌తో, కరెక్ట్ ఫిజిక్‌తో కనిపించనున్నారట విజయ్. కాగా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విజయ్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఈ సీన్స్‌లో విజయ్ లుక్ రగ్డ్‌గా... చాలా మాస్‌గా ఉంటుందని సమాచారం. ఇలా ఈ చిత్రంలో విజయ్ రెండు గెటప్స్‌లో కనిపించనున్నారట. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.
మాస్ సంబరాలు
‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో సాయి దుర్గా తేజ్ మేకోవర్ చూశారుగా... మాసీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మాస్ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా హార్డ్‌వర్క్ చేశారు సాయి దుర్గాతేజ్. సిక్స్‌ఫ్యాక్ చేశారు. కేపీ రోహిత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, దాదాపు రూ. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.
లేడీ గెటప్‌లో..
మాసీ లుక్స్‌తో కనిపించే విశ్వక్ సేన్ తొలిసారిగా లైలాగా అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఓ అబ్బాయి లేడీ గెటప్‌లో నటించాలంటే స్పెషల్‌గా మేకోవర్ అవ్వాల్సిందే. అలా లైలాగా కనిపించడానికి విశ్వక్ మౌల్డ్ అయ్యారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోను, లైలా అనే అమ్మాయి... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు విశ్వక్ సేన్.
లెనిన్‌గా...
‘ఏజెంట్’ తర్వాత అఖిల్ హీరోగా చేయాల్సిన నెక్ట్స్ మూవీపై మరో అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరితో అఖిల్ ఓ మూవీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని, ఆల్రెడీ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే ఈ సినిమా కథ అనంతపురం నేపథ్యంలో సాగుతుందని, లెనిన్ పాత్ర కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని తెలిసింది.
పీరియాడికల్ వార్
హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘స్వయంభూ’. పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. చెప్పాలంటే గత ఏడాదిగా ఈ లుక్‌నే మెయిన్‌టైన్ చేస్తున్నారు నిఖిల్. లాంగ్ హెయిర్‌తో, స్ట్రాంగ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు నిఖిల్. అంతే కాదు... ఈ సినిమా కోసం నిఖిల్ కొన్ని యాక్షన్ సీన్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
ఈ కోవలో మరికొందరు హీరోలు కూడా తమ కొత్త సినిమాల కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment