మరో మూడు సీక్వెల్స్‌తో పుల్ స్టాప్!
రయ్‌మంటూ దూసుకెళ్లే కార్లు... ఒక విమానం గాల్లో ఎగురుతుండగా... కొన్ని కార్లు ప్యారాచూట్స్ సాయంతో రోడ్డు మీద ల్యాండ్ కావడం... ఖరీదైన ఫెరారీ కారు రెండు ఎత్తై బిల్డింగ్స్ మధ్య నుంచి దూసుకుంటూ వెళ్లడం...ఈ దృశ్యాలన్నీ తలుచుకుంటే ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7’ సినిమా గుర్తుకువస్తుంది. ఇప్పటివరకూ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లో వచ్చిన అన్ని చిత్రాలూ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాయి. ఇందులోని పోరాట సన్నివేశాలు ఈ చిత్రాలకు ప్లస్ పాయింట్.
‘ఎఫ్-7’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎనిమిదో భాగం మీద పడింది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో చిత్ర కథానాయకుల్లో ఒకరైన విన్ డీజిల్ తాజాగా ఓ ప్రకటన చేశారు. ఈ ఫ్రాంచైజ్‌కి మరో మూడు సీక్వెల్స్‌తో పుల్‌స్టాప్ పెట్టేస్తామని ఆయన తెలిపారు. ఈ ఎనిమిదో భాగాన్ని తెరకెక్కించి, 2017 ఏప్రిల్ 14న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, దర్శకుడు దొరక్క పోవడంతో ఈ చిత్రం షూటింగ్ సైతం ఇంకా ఆలస్యం కానుంది.