ప్రేక్షకులు మెచ్చిన కొన్ని సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కడం కామన్. అలా కోలీవుడ్‌లో అరడజనుకు పైగా సీక్వెల్స్ సిద్ధమవుతున్నాయి. భారీ హిట్స్ సాధించిన చిత్రాలకు ‘కథ కంటిన్యూ’ అవుతోంది. ఈ సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం.
దాదాపు 26ఏళ్ల క్రితం వెండితెరపై శంకర్ చూపించిన ‘భారతీయుడు’ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. బాక్సాఫీస్ రికార్డులను సృష్టించాడు. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు’ (1996) చిత్రానికి అంతటి రెస్పాన్స్ లభించింది. అందుకే ఈ సినిమా సీక్వెల్ ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2)కి స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నారు శంకర్. సీక్వెల్‌లోనూ కమల్‌హాసనే హీరో. అయితే షూటింగ్ వేగంగా జరుగుతున్న సమయంలో లొకేషన్‌లో యాక్సిడెంట్ జరగడం, ఆ తర్వాత చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌కు, దర్శకుడు శంకర్‌కు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడం వంటి కారణాలతో ‘ఇండియన్ 2’ షూటింగ్ తాత్కాలికంగా ఆగింది. అయితే మళ్లీ పట్టాలెక్కించి, వీలైతే ఈ ఏడాదే పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ఇటీవల ఓ సందర్భంలో కమల్‌హాసన్ చెప్పారు.. సో.. సమయం కాస్త అటూ ఇటూ అయినా తెరపైకి మరోసారి భారతీయుడు రావడం ఖాయం.
అలాగే శంకర్ దర్శకత్వంలోనే యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన ‘జెంటిల్‌మేన్’ (1993) చిత్రం ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి తెలిసిందే. దీంతో ఈ చిత్రనిర్మాత టి. కుంజుమోన్ ‘జెంటిల్‌మేన్ 2’ను ప్రకటించారు. కానీ ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించడంలేదు. నానీతో ‘ఆహా కళ్యాణం’ సినిమా తీసిన గోకుల్ కృష్ణ ‘జెంటిల్‌మేన్ 2’కు దర్శకుడు. ఈ చిత్రంలో ప్రియాలాల్, నయనతార చక్రవర్తి హీరోయిన్లుగా నటిస్తారు. అయితే హీరోగా ఎవరు నటిస్తారు? షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనే విషయాలపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.
మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న హిస్టారికల్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’. ‘జయం’ రవి, కార్తీ, విక్రమ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మీ, శోభితా ధూలిపాళ్ల ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. చోళ సామ్రాజ్య నేపథ్యంలో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తొలి భాగం ‘పొన్నియిన్ సెల్వన్: 1’ సెప్టెంబరు 30న రిలీజ్ కానుంది. సీక్వెల్ వచ్చే ఏడాది విడుదలవుతుంది. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇంకోవైపు సిల్వర్ స్క్రీన్‌పైకి వచ్చేందుకు ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (‘యుగానికి ఒక్కడు’ – 2010) మళ్లీ రెడీ అవుతున్నాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ, రీమాసేన్, ఆండ్రియా, ఆర్. పార్తీబన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే సీక్వెల్‌లో మెయిన్ హీరోగా కార్తీ కాదు...ధనుష్ నటిస్తారు. కార్తీ పాత్ర కూడా ఉందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.
ఇక ‘లక లక లక...’ అనగానే అందరికీ రజనీకాంత్ ‘చంద్రముఖి’ (2005) సినిమాయే గుర్తుకు వస్తుంది. పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార, వడివేలు, వినీత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ వస్తోంది. సీక్వెల్‌కు పి. వాసుయే దర్శకుడు కానీ హీరోగా నటించేది మాత్రం రజనీకాంత్ కాదు. రాఘవా లారెన్స్ నటిస్తారు. కాగా ‘జయం’ రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘తని ఒరువన్’ (ఈ సినిమా తెలుగు రీమేక్ ‘ధృవ’లో రామ్‌చరణ్ హీరోగా నటించారు) చిత్రం మంచి హిట్ సాధించింది. దీంతో ‘తని ఒరువన్’ సీక్వెల్‌ను ప్రకటించారు దర్శకుడు మోహన్‌రాజా. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు.
అలాగే కార్తీ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘ఖైదీ’కి సీక్వెల్ ఉందని ఈ చిత్రదర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ సందర్భంలో చెప్పారు. ఇక ఇటీవల కమల్‌హాసన్ నటించిన హిట్ ఫిల్మ్ ‘విక్రమ్’కు కూడా సీక్వెల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే కాదు.. సూర్య, శింబు, అజిత్ నటించిన హిట్ మూవీస్ సీక్వెల్స్‌కు సంబంధించిన వార్తలను అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం. ఇంకా హీరో సూర్య–దర్శకుడు హరి కాంబినేషన్‌లోని ‘సింగమ్’ సిరీస్, దర్శక–నిర్మాత, నటుడు రాఘవా లారెన్స్ ‘కాంచన’, దర్శకుడు సుందర్. సి ‘అరణ్మణై’ ఫ్రాంచైజీల నుంచి సీక్వెల్ చిత్రాలు రెడీ అవుతున్నాయన్నది కోలీవుడ్ ఖబర్.
చదవండి: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ
జూలై 1న ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్‌లు..
Comments
Please login to add a commentAdd a comment