కోలీవుడ్‌లో సీక్వెల్ సందడి | upcoming Sequels movies in Kollywood | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌లో సీక్వెల్ సందడి

Published Fri, Jan 24 2025 2:50 AM | Last Updated on Fri, Jan 24 2025 2:51 AM

upcoming Sequels movies in Kollywood

పదికి పైగా సీక్వెల్స్‌

సీక్వెల్‌ మూవీస్‌ చేస్తున్న కమల్‌హాసన్, రజనీకాంత్‌

కోలీవుడ్‌లో సీక్వెల్‌ హవా బాగా వీస్తోంది. కోలీవుడ్‌ హీరోలందరూ సీక్వెల్‌ జపం చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో పదికి పైగా సీక్వెల్స్‌ సినిమాలు ఉండటమే ఇందుకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి... ఈ సీక్వెల్స్, ఫ్రాంచైజీ చిత్రాలతో బిజీగా ఉన్న తమిళ హీరోలు ఎవరో తెలుసుకుందాం...

జైలర్‌ తిరిగి వస్తున్నాడు
రజనీకాంత్‌ హీరోగా చేసిన ‘జైలర్‌’ (2023) మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ డైరెక్షన్‌లో కళానిధి మారన్‌ నిర్మించిన ఈ మూవీలో రజనీ కొత్త తరహా స్టైల్, స్వాగ్, మేనరిజమ్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. వీటికి అనిరు«ధ్‌ రవిచందర్‌ మ్యూజిక్, ఆర్‌ఆర్‌ ప్లస్‌ అయ్యాయి. దీంతో ‘జైలర్‌’ మూవీ రజనీ ఖాతాలో ఓ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా మూవీ రిలీజ్‌ తర్వాత ‘జైలర్‌ 2’ ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి. ఆ ఊహాలను నిజం చేస్తూ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఇటీవలే ‘జైలర్‌ 2’ సినిమాను ప్రకటించారు.

 రజనీకాంత్‌ హీరోగా చేయనున్న ‘జైలర్‌ 2’ చిత్రీకరణ ఈ ఏడాది మార్చిలో ప్రారంభం కానుందని తెలిసింది. కాగా ‘జైలర్‌’లో రమ్యకృష్ణ, మీర్నా మీనన్‌ కీ రోల్స్‌లో, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్‌ గెస్ట్‌ రోల్స్‌లో నటించారు. వీరందరి పాత్రలు ‘జైలర్‌ 2’లోనూ కొనసాగుతాయని కోలీవుడ్‌ టాక్‌. అంతే కాదు... బాలకృష్ణ, ‘కేజీఎఫ్‌’ బ్యూటీ శ్రీనిధి శెట్టి ‘జైలర్‌ 2’లో యాడ్‌ అవుతారట. ఈ సీక్వెల్‌ 2026 ప్రారంభంలో రిలీజ్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

వీర శేఖరన్‌ పోరాటం
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) మూవీ 1996లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. 28 సంవత్సరాల తర్వాత కమల్, శంకర్‌ కాంబినేషన్‌లోనే  2024లో విడుదలైన ‘ఇండియన్‌ 2’ సినిమా మాత్రం ఆడియన్స్‌ను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ‘ఇండియన్‌ 2’ సినిమా తీస్తున్న సమయంలోనే ‘ఇండియన్‌ 3’ చిత్రీకరణను కూడా దాదాపు పూర్తి చేశారు దర్శకుడు శంకర్‌.

ఈ ఏడాదే ‘ఇండియన్‌ 3’ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్‌ చేంజర్‌’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శంకర్‌ పేర్కొన్నారు. ‘ఇండియన్, ఇండియన్‌ 2’ చిత్రాల్లో సేనాపతిగా కనిపించారు కమల్‌హాసన్‌. కానీ ‘ఇండియన్‌ 3’ మాత్రం సేనాపతి తండ్రి వీరశేఖరన్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కథనం ఉంటుంది. స్వాతంత్య్రం కోసం బ్రిటీషర్లతో వీరశేఖరన్‌ ఏ విధంగా పోరాడారు? అన్నది ‘ఇండియన్‌ 3’ స్టోరీ అని కోలీవుడ్‌ సమాచారం. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో వీరశేఖరన్‌ భార్యగా కాజల్‌ అగర్వాల్‌ కనిపిస్తారు. రెడ్‌ జెయింట్‌ మూవీస్, లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన ‘ఇండియన్‌ 3’కి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు.

ఇటు సర్దార్‌... అటు ఖైదీ
తండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన స్పై యాక్షన్‌ మూవీ ‘సర్దార్‌’. పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ మూవీ 2022లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. అయితే ‘సర్దార్‌’ సినిమా క్లైమాక్స్‌లో ‘మిషన్‌ కంబోడియా’ అంటూ ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘సర్దార్‌ 2’ను కన్ఫార్మ్‌ చేశారు పీఎస్‌ మిత్రన్‌. అలాగే జూలైలో ‘సర్దార్‌’కు సీక్వెల్‌గా పీఎస్‌ మిత్రన్‌ డైరెక్షన్‌లోనే ‘సర్దార్‌ 2’ ప్రారంభమైంది.

కార్తీ హీరోగా ఎస్‌జే సూర్య, మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్‌ ప్రధాన తారాగణంగా నటిస్తారని ఆల్రెడీ మేకర్స్‌ వెల్లడించారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్స్‌లో చూడొచ్చు. అప్పుడు మిషన్‌ కంబోడియా వివరాలు కూడా తెరపైన కనిపిస్తాయి. ఇక ‘ఖైదీ’లో కార్తీ చేసిన దిల్లీ రోల్‌ను మర్చిపోరు ఆడియన్స్‌. లోకేశ్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ చిత్రం 2019లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 

దీంతో వెంటనే కార్తీతో ‘ఖైదీ 2’ చేయాలని లోకేశ్‌ ప్లాన్‌ చేశారు. కానీ లోకేశ్‌కు కమల్‌హాసన్‌తో ‘విక్రమ్‌’, రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమాల ఆఫర్స్‌ రావడంతో ‘ఖైదీ’ సీక్వెల్‌ షూటింగ్‌ను కాస్త ఆలస్యం చేశారు. రజనీకాంత్‌ ‘కూలీ’ సినిమా చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. దీంతో లోకేశ్‌ నెక్ట్స్‌ మూవీ కార్తీ ‘ఖైదీ 2’నే ఉండొచ్చు. ఇలా రెండు సీక్వెల్స్‌తో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు కార్తీ.

రెండు దశాబ్దాల తర్వాత..!
‘7/జీ రెయిన్‌బో కాలనీ’ అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ ‘7/జీ బృందావన కాలనీ’ అంటే మాత్రం చాలామంది తెలుగు ఆడియన్స్‌కు ఈ సినిమా గుర్తొస్తుంది. 2004లో సెల్వ రాఘవన్‌ డైరెక్షన్‌లో రూపొందిన ‘7/జీ రెయిన్‌బో కాలనీ’ తెలుగులో ‘7/జీ బృందావన కాలనీ’గా అనువాదమై, సూపర్‌హిట్‌గా నిలి చింది. ఈ మూవీలో హీరో హీరోయిన్లుగా రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ నటించారు. ఏఎమ్‌ రత్నం నిర్మించారు. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత ‘7/జీ బృందావన కాలనీ’ సినిమాకు సీక్వెల్‌గా ‘7/జీ బృందావన కాలనీ 2’ సినిమా తీస్తున్నారు దర్శకుడు సెల్వ రాఘవన్‌.

తొలి భాగంలో నటించిన రవికృష్ణనే మలి భాగంలోనూ హీరోగా చేస్తుండగా, అనశ్వర రాజన్‌ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఏఎమ్‌ రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. జయరామ్, సుమన్‌ శెట్టి, సుధ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ‘7/జీ బృందావన కాలనీ 2’ సినిమా రిలీజ్‌పై త్వరలోనే ఓ ప్రకటన రానుంది. ఇక సెల్వ రాఘవన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌’ (తెలుగులో ‘యుగానికి ఒక్కడు’) సినిమా గుర్తుండే ఉంటుంది.

కార్తీ, రీమా సేన్, పార్తీబన్, ఆండ్రియా లీడ్‌ రోల్స్‌లో నటించిన ఈ మూవీ 2010లో విడుదలై, బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌ 2’ సినిమాను 2021 జనవరి 1న ప్రకటించారు సెల్వ రాఘవన్‌. ఈ సీక్వెల్‌లో ధనుష్‌ను హీరోగా ప్రకటించారు. ఈ చిత్రం 2024లో రిలీజ్‌ అవుతుందని, అప్పట్లో ధనుష్‌ ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. కానీ ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. ఇక ‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌’ సీక్వెల్‌ గురించి మరో అప్‌డేట్‌ రావాల్సి ఉంది.

అమ్మోరు తల్లి
నయనతార నటించిన ‘ముకుత్తి అమ్మన్‌’ (తెలుగులో అమ్మోరు తల్లి) 2020 నవంబరులో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ముక్కుత్తి అమ్మన్‌ 2’ను ప్రకటించింది వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ. ‘ముక్కుత్తి అమ్మన్‌’లో నటించిన నయనతారనే సీక్వెల్‌లోనూ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. 

అయితే ‘ముక్కుత్తి అమ్మన్‌’కు నటుడు ఆర్జే బాలాజీ–ఎన్‌జే శరవణన్‌ దర్శకత్వం వహించగా, ‘ముకుత్తి అమ్మన్‌ 2’ను మాత్రం నటుడు–దర్శకుడు సుందర్‌ .సి తెరకెక్కించనున్నారు. సుందర్‌.సి నేతృత్వంలోని మరో ఫ్రాంచైజీ ‘కలగలప్పు’లోని ‘కలగలప్పు 3’ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కామెడీ డ్రామాగా ‘కలగలప్పు’కు తమిళ ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ ఉంది.

హారర్‌ ఎఫెక్ట్‌!
ఇవే కాదు... కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌ 2’, ధనుష్‌ ‘వడ చెన్నై 2’ వంటి చిత్రాలతో పాటు మరికొన్ని తమిళ చిత్రాల సీక్వెల్స్‌ వచ్చే అవకాశం ఉంది.

ఈసారి హారర్‌ జానర్‌ సీక్వెల్స్‌ కోలీవుడ్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవనున్నాయి. రాఘవా లారెన్స్‌ ఆధ్వర్యంలో ఆడియన్స్‌ను అలరిస్తున్న ‘కాంచన’ సిరీస్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ సిరీస్‌లో మరో చిత్రంగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు  ‘కాంచన 4’ రానుందని కోలీవుడ్‌ సమాచారం. రాఘవా లారెన్స్‌ నటించి, దర్శకత్వం వహించనున్న ‘కాంచన 4’లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. మరి... ‘కాంచన 4’లో ఎవరు నటిస్తారనే విషయంపై త్వరలోనే అధికారిక  ప్రకటన రానుంది. 

ఇక సుందర్‌ .సి సారథ్యంలో నడుస్తున్న హారర్‌ ఫ్రాంచైజీ ‘అరణ్మణై’ గురించి చెప్పుకోవాలి. తమన్నా, రాశీ ఖన్నా లీడ్‌ రోల్స్‌లో నటించిన ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘డాకు’) ఆడియన్స్‌ను మెప్పించింది. దీంతో ఈ ఏడాదిలోనే ‘అరణ్మణై 5’ను కూడా తీయాలని సుందర్‌ .సి ప్లాన్‌ చేస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌. అలాగే హారర్‌ జానర్‌లో సంతానం చేస్తున్న హారర్‌ కామెడీ ఫ్రాంచైజీ  ‘డీడీ’ నుంచి నాలుగో మూవీగా ‘డీడీ నెక్ట్స్‌ లెవల్‌’ చిత్రం రానుంది. ఎస్‌. ప్రేమ్‌ ఆనంద్‌ డైరెక్షన్‌లోని ఈ మూవీలో సెల్వ రాఘవన్, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ఇతర లీడ్‌ రోల్స్‌ చేశారు. ఈ మూవీ మేలో రిలీజ్‌ కానుంది. 

ఇక 2014లో మిస్కిన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘పిశాసు’ (తెలుగులో ‘పిశాచి’) చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకోగలిగింది. దాదాపు పదేళ్ల తర్వాత ‘పిశాసు’ సినిమాకు సీక్వెల్‌గా ‘పిశాసు 2’ తీస్తున్నారు మిస్కిన్‌. సీక్వెల్‌లో ఆండ్రియా మెయిన్‌ లీడ్‌ రోల్‌ చేశారు. మార్చిలో ఈ మూవీ రిలీజ్‌ కానుంది. ‘డీమాంటి కాలనీ’ ఫ్రాంచైజీ గురించి హారర్‌ చిత్రాలను ఇష్టపడేవారికి తెలిసే ఉంటుంది.

 గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘డీమాంటి కాలనీ 2’ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేసింది. కాగా ‘డీమాంటీ కాలనీ’ ఫ్రాంచైజీ దర్శకుడు అజయ్‌.ఆర్‌ జ్ఞానముత్తు ‘డీమాంటీ కాలనీ’కి సీక్వెల్‌గా ‘డీమాంటీ కాలనీ 3’ని ఆల్రెడీ ప్రకటించారు. ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలిసింది. రిలీజ్‌ మాత్రం 2026లో ఉండొచ్చు. – ముసిమి శివాంజనేయులు

ప్రకటించారు... కానీ..!
కోలీవుడ్‌లో కొన్ని హిట్‌ ఫిల్మ్స్‌కు సీక్వెల్స్‌ ప్రకటించారు మేకర్స్‌. కానీ ఈ సినిమాలు ఇంకా పూర్తి స్థాయిలో సెట్స్‌పైకి వెళ్లలేదు. ఆ సినిమాలేవో చదవండి.

విదేశాల్లో డిటెక్టివ్‌ 
విశాల్‌ కెరీర్‌లోని వన్నాఫ్‌ ది బెస్ట్‌ హిట్స్‌లో ‘తుప్పరివాలన్‌’ ఒకటి. మిస్కిన్‌ డైరెక్షన్‌లోని ఈ మూవీ తెలుగులో ‘డిటెక్టివ్‌’గా విడుదలై, ప్రేక్షకులను మెప్పించింది. అప్పట్నుంచే ఈ మూవీకి సీక్వెల్‌ తీయానులనుకున్నారు విశాల్‌. మిస్కిన్‌ డైరెక్షన్‌లోనే ‘డిటెక్టివ్‌ 2’ను ప్రకటించారు విశాల్‌. అయితే కథ విషయంలో మిస్కిన్‌కు, విశాల్‌కు మధ్య క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌ నుంచి మిస్కిన్‌ తప్పుకున్నారు. ఆ తర్వాత ‘డిటెక్టివ్‌ 2’కి తానే దర్శకత్వం వహించాలనుకున్నారు విశాల్‌.

తన స్టైల్‌ ఆఫ్‌ ‘డిటెక్టివ్‌ 2’తో తాను దర్శకుడిగా పరిచయం కాబోతున్నానని, ఇది తన పాతికేళ్ల కల అని, ఇందుకోసం లండన్, అజర్‌ బైజాన్, మాల్తా వంటి లొకేషన్స్‌ను పరిశీలిస్తున్నానని గత ఏడాది మార్చిలో విశాల్‌ పేర్కొన్నారు. కానీ ‘డిటెక్టివ్‌ 2’ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదని తెలుస్తోంది. ఇలా విశాల్‌ నుంచి ‘డిటెక్టివ్‌ 2’ అప్‌డేట్‌ రావాల్సి ఉంది. అలాగే విశాల్‌ హీరోగా పీఎస్‌ మిత్రన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇరంబుదురై’ మూవీ 2018లో రిలీజై, హిట్‌ సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌ రానుందనే టాక్‌ వినిపిస్తోంది. 

బాక్సింగ్‌ రౌండ్‌ 2 
నాలుగు సంవత్సరాల క్రితం కరోనా సమయంలో ‘సార్పట్టై పరంబర’ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. పా. రంజిత్‌ డైరెక్షన్‌లోని ఈ మూవీకి వీక్షకుల నుంచి మంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ లభించింది. దీంతో ‘సార్పట్టై పరంబర’ సినిమా సీక్వెల్‌ను థియేటర్స్‌లో రిలీజ్‌ చేయాలని పా. రంజిత్‌ భావించారు. 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర’ సినిమాకు సీక్వెల్‌గా ‘సార్పట్టై రౌండ్‌ 2’ ప్రకటించారు. అయితే ఈ మూవీపై మరో అప్‌డేట్‌ రావాల్సి ఉంది.

తని ఒరువన్‌ 2 
రవి మోహన్‌ (‘జయం’ రవి తన పేరును ఇటీవల రవి మోహన్‌గా మార్చుకున్నారు) హీరోగా మోహన్‌ రాజా డైరెక్షన్‌లో వచ్చిన ‘తని ఒరువన్‌’ మూవీ గుర్తుండే ఉంటుంది. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ మూవీ 2015లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘తని ఒరువన్‌ 2’ని ప్రకటించారు మోహన్‌ రాజా. అయితే మణిరత్నం పొన్నియిన్‌ సెల్వన్‌’తో రవి మోహన్‌ బిజీగా ఉండటం వల్ల ‘తని ఒరువన్‌ 2’ చేయడానికి వీలు పడలేదు. ఈ ఏడాది ఈ సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లే సాధ్యసాధ్యాలను రవి మోహన్‌ పరిశీలిస్తున్నారని కోలీవుడ్‌ సమాచారం. ఈ సినిమాని కూడా ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ నిర్మించనుంది. ఇక ‘తన్‌ ఒరువన్‌’ మూవీ  తెలుగులో ‘ధృవ’ (రామ్‌ చరణ్‌ హీరోగా నటించారు)గా రీమేక్‌ అయి, విజయం సాధించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement