సీక్వెల్‌.. మార్పుల్‌...  | Sequels are being made with changes in hero director and heroine | Sakshi
Sakshi News home page

సీక్వెల్‌.. మార్పుల్‌... 

Published Wed, Jun 21 2023 3:18 AM | Last Updated on Wed, Jun 21 2023 3:18 AM

Sequels are being made with changes in hero director and heroine - Sakshi

కథ పెద్దదైతే సినిమా రెండు భాగాలవుతుంది.. ఒక్కోసారి మూడు కూడా అవుతుంది.  ఇప్పుడలాంటి కథలతో రూపొం దుతున్న సీక్వెల్స్‌ కొన్ని ఉన్నాయి. అయితే ఒకటో భాగంలో నటించిన నటీనటులు, తెరకెక్కించిన దర్శకుడు రెండో భాగంలో కంటిన్యూ కావడంలేదు. ఒకటీ హీరో మారుతున్నారు..  లేదా డైరెక్టర్‌ మారుతున్నారు... లేదా హీరోయిన్‌ మారుతున్నారు... ఇక మార్పుల్‌తో రూపొందుతున్న సీక్వెల్స్‌ గురించి తెలుసుకుందాం. 


హిట్‌: ది థర్డ్‌ కేస్‌ 
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘హిట్‌’ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’, ‘హిట్‌: ది సెకండ్‌ కేస్‌’ చిత్రాలు సూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. ఈ రెండు చిత్రాలను నిర్మించింది హీరో నాని కావడం విశేషం. కాగా తొలి రెండు భాగాలు నిర్మించిన నాని థర్డ్‌పార్ట్‌ ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’లో హీరోగా నటించనుండటం విశేషం.

‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’ (2020) చిత్రంలో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొం దిన ఈ చిత్రంలో హోమిసైడ్‌ ఇంటర్వెన్షన్‌ టీమ్‌ను (హిట్‌) లీడ్‌ చేసే పోలీస్‌ ఆఫీసర్‌ రుద్రరాజుపాత్రలో నటుడిగా విశ్వక్‌ సేన్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ మంచి హిట్‌గా నిలిచింది. కాగా హిట్‌ ఫ్రాంచైజీలో రెండో భాగం ‘హిట్‌: ది సెకండ్‌ కేస్‌’లో హీరోగా అడివి శేష్‌ని తీసుకున్నారు శైలేష్‌.

ఎస్పీ కృష్ణదేవ్‌పాత్రలో అడివి శేష్‌ తనదైన శైలిలో నటించి, మెప్పించారు. ఈ సినిమా కూడా హిట్‌. ఇక మూడో భాగం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’లో హీరో నాని నటించనున్నట్లు ‘హిట్‌: ది సెకండ్‌ కేస్‌’ చివర్లో రివీల్‌ చేశారు. పోలీసాఫీసర్‌ అర్జున్‌ సర్కార్‌పాత్రలో నాని నటిస్తారు. కాగా హిట్‌ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలుంటాయని శైలేష్‌ కొలను గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

చంద్రముఖి–2  
‘చంద్రముఖి’ (2005)లో ‘లక లక లక..’ అంటూ హీరో రజనీకాంత్‌ రాజు గెటప్‌లో విలనిజమ్‌ పండించి, డాక్టర్‌ ఈశ్వర్‌గా మంచితనం కనబరిస్తే ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించారు. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, నయనతార జంటగా జ్యోతిక, ప్రభు కీలకపాత్రలు చేశారు. ‘చంద్రముఖి’ విడుదలైన 18 ఏళ్లకు సీక్వెల్‌కి శ్రీకారం చుట్టారు పి. వాసు. ‘చంద్రముఖి 2’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీ ప్లేస్‌లోకి లారెన్స్‌ వచ్చారు.

అలాగే కంగనా రనౌత్‌ ప్రధానపాత్రలో నటించారు. ఇంకా వడివేలు, లక్ష్మీ మీనన్, రాధిక తదితరులు నటించారు. ఇటీవల మైసూర్‌లో జరిగిన షెడ్యూల్‌తో ఈ మూవీ పూర్తయింది. తమిళ, తెలుగు భాషల్లో సెప్టెంబర్‌ 15న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరకర్త.

యుగానికి ఒక్కడు–2 
వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు దర్శకుడు సెల్వ రాఘవన్‌. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌’ (తెలుగులో యుగానికి ఒక్కడు –2010) ఎంత హిట్‌ అయిందో చెప్పక్కర్లేదు. కార్తీ హీరోగా, ఆండ్రియా, రీమా సేన్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌ 2’ (యుగానికి ఒక్కడు 2) తెరకెక్కించనున్నారు సెల్వ రాఘవన్‌.

అయితే ఈ సినిమాలో తన సోదరుడు, హీరో ధనుష్‌ని లీడ్‌ రోల్‌కి తీసుకున్నారాయన. కార్తీ స్థానంలో ధనుష్‌ కనిపిస్తారని కొందరు అంటుంటే.. అలాంటిదేం లేదు.. కార్తీ కూడా ఉంటారు.. సీక్వెల్‌లో ధనుష్‌పాత్ర యాడ్‌ అయిందని మరికొందరు అంటున్నారు. మరి ‘యుగానికి ఒక్కడు 2’లో కార్తీపాత్ర ఉంటుందా? లేదా? అనేది చూడాలి. 

జెంటిల్‌మన్‌–2
అర్జున్, మధుబాల జంటగా శంకర్‌ దర్శకత్వంలో కేటీ కుంజుమోన్‌ నిర్మించిన ‘జెంటిల్‌మేన్‌’ (1993) చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. దాదాపు ముప్పైఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ ‘జెంటిల్‌మన్‌ 2’ని నిర్మిస్తున్నారు కుంజుమోన్‌. అయితే రెండో భాగంలో దర్శకుడు, హీరో, సంగీత దర్శకుడు ముగ్గురూ మారడం విశేషం.

గోకుల్‌ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సీక్వెల్‌లో ‘మంత్ర–2, రాజుగారి గది, పెళ్లికి ముందు ప్రేమకథ’ వంటి చిత్రాల్లో నటించిన చేతన్‌ చీను హీరోగా నటించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొం దనున్న ఈ చిత్రం కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్‌ కానుంది. 

టిల్లు స్క్వేర్‌ 
‘డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు..’ అంటూ హీరో సిద్ధు జొన్నలగడ్డ స్పెప్పులేస్తే ప్రేక్షకులు కూడా ఫుల్‌గా ఎంజాయ్‌ చేశారు. విమల్‌ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘డీజే టిల్లు’. రొమాంటిక్‌ క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది.

ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్‌’ మూవీ తెరకెక్కుతోంది. అయితే సీక్వెల్‌కి అటు డైరెక్టర్, ఇటు హీరోయిన్‌ ఇద్దరూ మారడం విశేషం. ‘టిల్లు స్క్వేర్‌’కి మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తొలి భాగంలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించి గ్లామర్‌తో మెప్పించారు. అయితే సీక్వెల్‌లో మాత్రం అనుపమా పరమేశ్వరన్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్‌ 15న విడుదల చేయాలనుకుంటున్నారు.

జిగర్తండా–2
సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్‌ కీలకపాత్రల్లో కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిగర్తండా’ (2014) తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం  తెలుగులో వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘గద్దలకొండ గణేష్‌’గా రీమేక్‌ అయి, ఇక్కడా ఘనవిజయం సాధించింది.

కాగా ‘జిగర్తండా’ విడుదలైన దాదాపు తొమ్మిదేళ్లకు ‘జిగర్తండా డబుల్‌ ఎక్స్‌’ పేరుతో కార్తీక్‌ సుబ్బరాజ్‌ సీక్వెల్‌ తీశారు. ఇందులో రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య లీడ్‌ రోల్స్‌లో నటించారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో కార్తీక్‌ సుబ్బరాజ్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement