వన్ టూ... కొట్టు హిట్టు | Sequels To Blockbusters in Telugu Film Industry | Sakshi
Sakshi News home page

వన్ టూ... కొట్టు హిట్టు

Published Thu, Aug 6 2015 12:27 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

వన్ టూ... కొట్టు హిట్టు - Sakshi

వన్ టూ... కొట్టు హిట్టు

ఇప్పుడంతా సీక్వెల్స్, రీమిక్స్, రీమేక్‌ల హవా. బాలీవుడ్‌లోనూ అదే ట్రెండు. సౌత్‌లోనూ సేమ్ సీన్. ఒకప్పుడైతే సీక్వెల్స్ విషయంలో తటపటాయింపులుండేవేమో కానీ, ఇప్పుడు కొనసాగింపే ఇంపుగా మారిపోయింది. తెలుగు, తమిళం, కన్నడం - భాష ఏదైనా సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబరాఫ్ సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. వాటిలో కొన్నిటి డీటైల్స్ మీ కోసం...
 
 ‘సర్దార్’ సూపర్
 ‘దబంగ్’కి రీమేక్‌గా పవన్ కల్యాణ్ చేసిన  ‘గబ్బర్ సింగ్’ బ్లాక్‌బస్టర్ అయింది. ఈ చిత్రంలో పవన్ చేసిన సందడికి కొనసాగింపు ఉంటే బాగుంటుందని అభిమానులు అనుకున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఆ సందడిని ఇష్టపడ్డారు. అయితే, ఆ కథకు సీక్వెల్ అని పేరు పెట్టకపోయినా, ఆ షేడ్స్‌లో ఉండే కథ సిద్ధం చేసుకున్నారు. ‘గబ్బర్‌సింగ్2’గా ప్రచారమైన ఈ సినిమాకు తాజాగా ‘సర్దార్’ అనే టైటిల్ ఖరారు చేశారు. తొలి భాగంలో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించిన పవన్ కల్యాణ్, ఇందులోనూ పోలీసే. ‘పవర్’ ఫేమ్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ఆరంభమైంది.
 
 డబుల్ కిక్
 రవితేజ, సురేందర్ రెడ్డి కాంబి నేషన్‌లో వచ్చిన ‘కిక్’ ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా రవి తేజ - సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో హీరో కల్యాణ్ రామ్ ‘కిక్ 2’ నిర్మించారు. ‘కిక్’లోని నాయకా నాయికల తనయుడి కథతో ఈ ‘కిక్ 2’ సాగుతుంది. ఈ నెలలోనే ఈ చిత్రం రిలీజ్.
 
 చిత్రాతిచిత్రంగా రెండో ఉపేంద్ర
 ‘ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ కూడా ఉంటాయా?’ అని ‘ఉపేంద్ర’ చిత్రంలో హీరో ఉపేంద్ర చేసిన పాత్ర చూసి, జనం అనుకున్నారు. ఈ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్. కన్నడ స్టార్ ఉపేంద్రను తెలుగులో పాపులర్ చేసిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ. తెలుగులో ‘ఉపేంద్ర 2’, కన్నడంలో ‘ఉప్పి 2’ పేరుతో రూపొందిన ఈ చిత్రం రిలీజ్ ఈ నెలలోనే. పధ్నాలుగేళ్ల క్రితం ఉపేంద్ర నటించిన ‘రా’ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయమైన నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ సీక్వెల్ నిర్మించారు. తొలిభాగంలానే ఈ సీక్వెల్‌లో కూడా ఉపేంద్ర విచిత్ర లుక్స్‌లో కనిపించనున్నారు. ఈ వారంలో పాటలనూ, ఈ నెలలోనే చిత్రాన్నీ విడుదల చేయాలనుకుంటున్నారు.
 
 ఈసారి కూడా రికార్డ్...?
 తొమ్మిదేళ్ల క్రితం కన్నడంలో రూపొందిన ఫీల్‌గుడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ముంగారు మళె’. గణేశ్, పూజాగాంధీ జంటగా యోగరాజ్ భట్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దాదాపు 500 వందల రోజులకు పైగా ఆడింది. ఏడాది పాటు నిర్విరామంగా మల్టీప్లెక్స్‌లో ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రంగా రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ముంగారు మళె 2’ రూపొందు తోంది. తొలి భాగంలో నటించిన గణేశ్ హీరోగా నేహాశెట్టి హీరోయిన్‌గా శశాంక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరి.. ఈ సీక్వెల్ ఎలాంటి రికార్డ్‌ను సొంతం చేసుకుం టుందో?
 
 పదింతలు వసూలు చేసిన ‘గోలీ సోడా’
 చెన్నయ్‌లోని కోయంబేడు మార్కెట్లో కూలీలుగా పని చేసే నలుగురు కుర్రాళ్ల కథతో సాగే తమిళ చిత్రం ‘గోలీ సోడా’. ఛాయాగ్రాహకుడు  విజయ్ మిల్టన్ దర్శకత్వంలో 2 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం 20 కోట్ల రూపాయలు రాబట్టింది. ‘గోలీ సోడా’కి సీక్వెల్‌ను తమిళంలో తెరకెక్కించడానికి విజయ్ మిల్టన్ సన్నాహాలు చేస్తున్నారు. తొలి భాగంలో నటించినవాళ్లతోనే ఈ సీక్వెల్‌ను రూపొందించనున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.
 
 విశ్వరూపం-2 ఎప్పుడు?
 కమల్‌హాసన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘విశ్వరూపం’. పలు వివాదాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మంచి ఆదరణే లభించింది. ఈ చిత్రం విడుదలై రెండేళ్ల య్యింది. తొలి భాగం అప్పుడే మలి భాగానికి సంబంధించిన కొంత శాతం చిత్రీకరణను కమల్ పూర్తి చేశారు. ‘విశ్వరూపం’ నిడివి 2 గంటల 20 నిమిషాలు ఉంటే.. సీక్వెల్ నిడివి రెండు గంటల లోపే ఉంటుందట. వాస్తవానికి ఈ ఏడాదే చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ, వచ్చే ఏడాదికి వాయిదా వేశారని సమాచారం. మరి.. ఈ సీక్వెల్ ఎప్పుడు తెరకొస్తుందో వేచి చూడాలి.
 
 ఈ చిత్రాలు కాకుండా తెలుగులో ‘బాహుబలి’కి పార్ట్2, ‘రుద్రమదేవి’, ‘లీడర్’కి సీక్వెల్స్ రానున్నాయి. అలాగే, తమిళంలో ‘ఎందిరన్’ (‘రోబో’)కి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు శంకర్. ఇంకా మరికొన్ని సీక్వెల్స్‌కి తెరవెనుక చర్చలు జరుగుతున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement