సినీ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ చూసి.. జీవితం అంటే అలా ఉండాలి అనుకుంటారు సాధారణ వ్యక్తులు. కానీ, అనుకున్నంత సులభంగా, సౌకర్యవంతంగా సినీ తారల జీవితం ఉండదు. అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. 'దఢక్' సినిమాతో డెబ్యూ ఇచ్చిన ఈ భామ తనదైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల 'గుడ్ లక్ జెర్రీ' సినిమాతో ఓటీటీ ద్వారా పలకరించి నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది. అలాగే వాళ్ల అమ్మ చెప్పిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
''నిజానికి ప్రతి క్షణం అమ్మను ఎంతో మిస్ అవుతున్నా. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేపేది. అమ్మ ముఖం చూడకుండా నా రోజువారీ పనులు ప్రారంభించేదాన్ని కాదు. అలాటంది ఇప్పుడు అమ్మ లేకుండా జీవితాన్ని కొనసాగించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అని తెలిపింది. 'ఇండస్ట్రీలోకి వస్తానని చెప్పినప్పుడు మీ అమ్మ ఏం అన్నారు?' అని అడిగిన ప్రశ్నకు.. ''మొదట్లో అమ్మ ఒప్పుకోలేదు. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టొద్దనే చెప్పింది. 'నా జీవితం మొత్తం చిత్రపరిశ్రమతోనే గడిచిపోయింది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు మీకు ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాను.
మీరు అనుకుంటున్నట్లుగా స్టార్ జీవితం అంత సౌకర్యవంతంగా ఉండదు. అలాంటి రంగంలోకి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏంటీ?' అని అమ్మ ప్రశ్నించింది. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. ఏది ఏమైనా నేను హీరోయిన్‌గా చేయడం నాకిష్టమని చెప్పడంతో ఆమె ఓకే చెప్పింది. నా ఇష్టానికి కాదనలేక ఆమె ఒప్పుకున్నా.. 'నువ్వు సున్నిత మనస్కురాలివి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక కొంతమంది చేసే వ్యాఖ్యలకు నొచ్చుకోక తప్పదు. ఇక్కడ నెగ్గుకు రావాలంటే మరింత కఠినంగా మారాల్సి ఉంటుంది' అని అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది'' అని జాన్వీ కపూర్ అప్పటి రోజులను గుర్తు చేసుకుంది.
అనంతరం తన సినిమాలు, నటనపై వస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ 'నేను శ్రీదేవి కూతురు కావడం వల్లే నాకు ఎక్కు విమర్శలు వస్తున్నాయి. నా మొదటి నాలుగు సినిమాలను ఆమె 300 చిత్రాలతో పోల్చి చూస్తున్నారు. నేను ఆమెలా నటించలేకపోవచ్చు. కానీ ఈ వృత్తిని ఆమెకోసం చేయాలనుకుంటున్నాను. నేను ఆమెను గర్వపడేలా చేయకుండా అలా వదిలేయలేను' అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.
Comments
Please login to add a commentAdd a comment