నసీరుద్దిన్ షా
ప్రస్తుతం బాలీవుడ్‌లో నెపోటిజం (బంధుప్రీతి), అవుట్‌సైడర్స్ (సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లు) అండ్ ఇన్‌సైడర్స్ (సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు) అనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దిన్ షా మాట్లాడుతూ– ‘‘అవుట్‌సైడర్స్, ఇన్‌సైడర్స్ గురించి ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతోందో అర్థం కావడంలేదు. దీనికి ఎక్కడో ఓ చోట ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందే.
నేనెందుకు ఫుల్‌స్టాప్ పెట్టకూడదు అనిపించింది. అందుకే మాట్లాడుతున్నాను. 40–45 ఏళ్లుగా నేను నటుడిగా ఎంతో సంతృప్తిగా ఉన్నాను. నా నట వారసుడిగా నా కొడుకును నేను ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? ఒక బిజినెస్‌మేన్, లాయర్, డాక్టర్ ఎవరైనా తమ వారసులను తమ రంగంలో ఎంకరేజ్ చేయొచ్చు. దీనికి మాఫియా అని, బంధుప్రీతి అని పేర్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి నా కొడుక్కి అవకాశం రావడం సహజం.
అయితే తనకు టాలెంట్ ఉంటేనే అవకాశం ఇస్తారు. కాకపోతే మొదట అవకాశం ఈజీ అవుతుంది. బయటినుండి వచ్చేవారికి ఆ ఛాన్స్ ఉండదు. అయితే అవకాశం తెచ్చుకుని, ప్రతిభ నిరూపించుకుంటే వారసులకన్నా కూడా దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరి రికమండేషన్‌తో ఓంపురి ముంబైలో అడుగుపెట్టారు. ఎవరు రికమండ్ చేశారని నాకు అవకాశాలు వచ్చాయి. మేమంతా ఒంటరిగా పైకొచ్చినవాళ్లమే. ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మాఫియా అని కొందరు కథలు అల్లుతున్నారు. అందులో వాస్తవం లేదు. 45 ఏళ్లుగా నేనిక్కడే ఉన్నాను. నాకు ఎటువంటి ఇబ్బందిలేదు. ఇక్కడ మాఫియా లేదు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment