స్వరా భాస్కర్
‘‘నెపోటిజమ్ కేవలం సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు.. ప్రతి పరిశ్రమలోనూ ఉంది. అలానే బాలీవుడ్‌లో నెపోటిజమ్ ఉంది. బాలీవుడ్ ఒక ఫ్యూడల్ వ్యవస్థలా పని చేస్తోంది’’ అన్నారు హిందీ నటి స్వరా భాస్కర్. ‘తను వెడ్స్ మను, ప్రేమ్ రతన్ ధన్ పాయో, వీరే ది వెడ్డింగ్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేశారు స్వర. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘ఇన్‌సైడర్స్ వర్సెస్ అవుట్ సైడర్స్’ అనే చర్చ సాగుతోంది. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు స్వరా భాస్కర్.
‘‘నెపోటిజమ్ గురించి అందరూ ఎలా అనుకుంటారంటే... ఒక్క సినిమాలో స్టార్ కిడ్‌ని పరిచయం చేస్తే చాలు వాళ్ల కెరీర్ సెట్ అయిపోయినట్టే అనుకుంటారు. కానీ అలా జరగదు. ప్రతీ సినిమాకి కష్టపడాలి. నిరంతర కృషే మనల్ని స్టార్‌గా నిలబెడుతుంది. అవుట్‌సైడర్‌గా ఉంటూ స్టార్ కిడ్స్ పరిస్థితి చూస్తే జాలిగా అనిపిస్తుంటుంది. వాళ్ల ఒత్తిడి, వాళ్ల మీద ఉండే అంచనాలు అలాంటివి. కానీ వాళ్లకు ఉండే అవకాశాలు తక్కువేం కాదు.
అవుట్‌సైడర్‌గా మాకు కష్టంగా అనిపించే విషయాలు వాళ్లకు చాలా సులువుగా జరిగిపోతాయి. అయితే మనల్ని మనం నిరూపించుకోవడానికి ప్రస్తుతం చాలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ‘వీళ్లు టాలెంట్‌తోనే ఎదిగారు’ అనే పేరు స్టార్ కిడ్స్‌తో పోల్చుకుంటే.. అవుట్‌సైడర్స్‌కి త్వరగా ఏర్పడుతుంది. అదే అవుట్‌సైడర్స్‌కి ప్లస్’’ అన్నారు. బాలీవుడ్‌లో ఉండే పోటీ గురించి చెబుతూ– ‘‘సినిమా అనేది పెద్ద పోటీ ప్రపంచం. నిరంతరం ఎవరో ఒకరితో మనం మనకు తెలిసోతెలియకో పోటీ పడుతూనే ఉంటాం.
బయట చాలా మంది స్టార్ కిడ్స్‌కి చాలా పొగరు, వాళ్ల పవర్‌ను ఇతరుల మీద రుద్దాలనుకుంటారు అని అభిప్రాయపడుతుంటారు. కానీ ఇండస్ట్రీలో నేను రెండు రకాల వాళ్లతో (ఇన్‌సైడర్స్, అవుట్‌సైడర్స్) పని చేశా. ఎదుటివారితో చాలా చక్కగా ప్రవర్తించి, కష్టపడే మనస్థత్వం ఉన్నవాళ్లు, టైమ్ విషయంలో కచ్చితంగా ఉండేవాళ్లు ఎక్కువగా ఇన్‌సైడర్సే. కొందరు అవుట్‌సైడర్స్ స్టార్‌డమ్‌ను తలకెక్కించుకొని వాళ్ల స్టార్ స్టేటస్‌ను దుర్వినియోగం చేయడం గమనించాను. ఇది నేను ఎవ్వర్నీ ఉద్దేశించి చెప్పడం లేదు. నా అనుభవం ద్వారా చెబుతున్నాను. స్టార్‌డమ్‌ను దుర్వినియోగం చేయడానికి బ్యాక్‌గ్రౌండ్‌తో పని లేదు’’ అని వివరించారు స్వరా భాస్కర్.
Comments
Please login to add a commentAdd a comment