ఆకాంక్షా సింగ్
‘‘ఫలానా పాత్రను చేసే సామర్థ్యం నటిగా ఉన్నప్పటికీ కొన్ని సార్లు బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల కుడా అవకాశాలు చేజారుతుంటాయి. కేవలం ‘అవుట్ సైడర్స్’ అనే కారణం వల్ల’’ అన్నారు ఆకాంక్షా సింగ్. ‘మళ్ళీ రావా’, ‘దేవదాస్’ వంటి తెలుగు సినిమాల్లో నటించారామె. ఇటీవలే కన్నడంలో సుదీప్‌తో ‘పెహల్వాన్’లోనూ కనిపించారు. ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న నెపోటిజం, అవుట్ సైడర్స్ వాదనలో భాగంగా ఆకాంక్షా సింగ్ కూడా తన అభిప్రాయాన్ని ట్వీటర్ ద్వారా తెలిపారు.
‘‘కొన్నిసార్లు బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా లీడ్ రోల్ లో కనిపించాలని ఉంటుంది, ఆ పాత్రకు మనం న్యాయం చేయగలం అనే నమ్మకం కూడా ఉంటుంది. కానీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల మనల్ని మనం నిరూపించుకోవడానికి వీలున్న అవకాశాలు రావు. అతిథి పాత్రకో, సహాయ నటి పాత్రలకో మాత్రమే మేం గుర్తొస్తాం. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా, పెద్ద పెద్ద వాళ్ల తో పరిచయాలు లేకపోయినప్పటికీ అద్భుతమైన ప్రతిభ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు.
మీ సర్కిల్ (వారసులను ప్రోత్సహించేవారిని ఉద్దేశించి అయ్యుండొచ్చు) దాటి వస్తేనే వాళ్లు మీకు కనిపిస్తారు. ప్రస్తుతం చాలా మంది నటీనటులు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఇదే. ఇక నటిగా నా గురించి చెప్పాలంటే.. మొదటి నుంచి కూడా నా టాలెంట్ మీద, నా మీద నాకు నమ్మకం ఎక్కువ. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. ఈ సందర్భంగా దర్శకులకు, నిర్మాత (హిందీ)లకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు ఒక్క అవకాశం (ప్రతిభను నిరూపించుకునే అవకాశం) ఇచ్చి చూడండి. నన్ను నేను నిరూపించుకుంటాను’’ అని అన్నారు. ప్రస్తుతం ఆది పినిశెట్టితో ‘క్లాప్’ చిత్రంలో నటిస్తున్నారు ఆకాంక్షా సింగ్.
Comments
Please login to add a commentAdd a comment