కన్నీళ్లు పెట్టుకున్నహీరో!
ముంబై:ప్రతీ ఒక్కరి జీవితంలో కన్నీళ్లు పెట్టుకునే సందర్భాలు రావంటే అది అతిశయోక్తే అవుతుంది. కన్నీళ్లు పెట్టుకోవడానికి రియల్ హీరో-రీల్ హీరో అనే తారతమ్యం కూడా ఏమీ ఉండదు. అటువంటి సందర్భమే ఒకటి బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ జీవితంలో కూడా తాజాగా చోటు చేసుకుంది. సింగమ్ రిటర్న్స్ విజయాన్ని ఆకాంక్షిస్తూ తన స్నేహితుడు, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాసిన లెటర్ చూసి అజయ్ కన్నీళ్లు పెట్టుకున్నాడట.
ప్రస్తుతం పుణేలోని యర్రవాడ సెంట్రల్ జైల్లో ఉంటున్న సంజయ్ దత్ రాసిన ఉత్తరం అజయ్ ను మనసును కదిలించిందట. ఒక తెల్లటి రూల్ పేపర్ మీద బ్లూ -ఇంక్ తో సంజయ్ రాసిన లెటర్ లో సింగమ్ రిటర్న్స్ సందర్భంగా అజయ్ దేవగన్ కు అభినందనలు తెలియజేస్తూ తన పాత జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నాడు. ఇదే సందర్భంలో 2008లో వీరిద్దరూ కలిసి నటించిన 'మెహ్ బూబా' సినిమా సందర్భంలో వారు కలిసి డ్యాన్స్ చేసిన సన్నివేశాలను నెమరవేసుకున్నాడు. 'రాజు(అజయ్ ను సంజయ్ పిలుచుకునే పేరు) మనం తిరిగి కలిసినప్పుడు మన చేతి రాతతో రాసుకున్న పుస్తకాలను మార్చుకుందాం. ముందుగా ఈ లెటర్ రాస్తున్నాను. నువ్వు హీరోగా చేసిన సింగమ్ రిటర్న్స్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని లెటర్ లో తెలిపాడు.
ఇక్కడ నువ్వు సంతోషించాల్సిన విషయం ఒకటి ఉంది. నేను 11 కిలోల బరువు తగ్గాను. జైల్లో క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తున్నాను.నేను చొక్కా వేసుకోకుండా ఉన్నప్పుడు 8 ప్యాక్స్ కనిపిస్తుందని' సంజయ్ తెలిపాడు. ఈ లెటర్ చూసిన అనంతరం తనకు కన్నీళ్లు ఆగలేదని స్వయంగా అజయ్ దేవగన్ పేర్కొన్నాడు. అంతకుముందు ఆ హీరోల తండ్రులు సునీల్ దత్, వీరూ దేవగన్ లు మధ్య ఉండే సాన్నిహిత్యాన్నే ఈ ఇద్దరూ కంటిన్యూ చేస్తుండటం నిజంగా గర్వించదగ్గ విషయమే.
తమిళ హీరో సూర్య నటించిన సింగం-2 రీమేక్ గా వస్తున్న సింగమ్ రిటర్న్స్ లో అజయ్ దేవగన్, కరీనా కపూర్ లు జంటగా నటిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్ టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.