generation
-
బాబోయ్.. ఈ తరం స్మార్ట్‌నెస్‌ను భరించడం కష్టమే!
మనిషి జీవన గమనంలో.. ప్రతీ పదిహేనేళ్లకొకసారి తరం మారుతుంటుంది. మారుతున్న పరిస్థితులను కూడా ఆ తరం ఆకలింపు చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఓ తరం కథ కంచికి చేరింది. కొత్త ఏడాది 2025.. మరో తరానికి ఆహ్వానం పలికేందుకు సిద్ధమైంది. అదే బీటా జనరేషన్(Generation Beta). అయితే ఇది మామూలు జనరేషన్గా మాత్రం మిగిలిపోదని నిపుణులు తేల్చేస్తున్నారు.2025, జనవరి 1 నుంచి కొత్త తరం ఆధారంగానే జనాభాను లెక్కిస్తారు. 2025 నుంచి 2039 మధ్యకాలంలో పుట్టినవాళ్లంతా ఈ తరం కిందకే వస్తారు. 2035 కల్లా ఈ తరం జనాభానే 16 శాతంగా ఉండొచ్చనే ఓ అంచనా నెలకొంది. అంతేకాదు.. 22వ శతాబ్దాన్ని ఎక్కువగా చూడబోయే తరం కూడా ఇదే కానుందని పాపులర్ సోషల్ రీసెర్చర్ మార్క్ మెక్‌క్రిండిల్ అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం టెక్ యుగంలో(Tech Era) మనిషి బతుకుతున్నాడు. అయితే ‘బీటా’ తరానికి మాత్రం రోజూవారీ జీవితంలో అత్యాధునిక సాంకేతికత భాగంకానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఏఐ, ఆటోమేషన్ హవా నడుస్తోంది కదా!. అలాంటి సాంకేతికత బీటా జనరేషన్ విషయంలో నెక్ట్స్ లెవల్లో ఉండబోతుందన్నమాట!.జనరేషన్ ఆల్ఫా.. మనిషి జీవితంలో స్మార్ట్ టెక్నాలజీ, ఏఐలాంటి సాంకేతికత ఎదుగుదలను మాత్రమే చూడగలిగింది. అయితే జనరేషన్ బీటా రోజువారీ జీవితంలో ఆ సాంకేతికతను అనుభవించబోతోంది. చదువు, ఆరోగ్యం, పని ప్రాంతం, ఆఖరికి వినోదం విషయంలోనూ అది తర్వాతి స్థాయిలో ఉండబోతోందని మెక్‌క్రిండిల్ చెబుతున్నారు. ఉదాహరణకు.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, హెల్త్ ట్రాకింగ్ డివైజ్‌లను ధరించడం, వర్చువల్ వాతావరణాన్ని ఆస్వాదించడం లాంటివన్నమాట.మిలెన్నియల్స్ (1981-1996)జనరేషన్ జెడ్(Z) 1996-2010జనరేషన్ ఆల్ఫా (2010-2024)జనరేషన్ బేటా (2025-2039)జనరేషన్ గామా (2040-2054)*గ్రీకు ఆల్ఫాబెట్ల ప్రకారమే జనరేషన్లకు పేర్లు పెడతూ వస్తున్నారు.టఫ్ జనరేషన్!ఈరోజుల్లో పిల్లల పెంపకంలో టెక్నాలజీ కూడా భాగమైంది. 1981-1996 పేరెంట్స్.. పిల్లల పెంపకం విషయంలో బ్యాలెన్సింగ్‌గా ఉండడానికి ప్రయత్నించారు. జనరేషన్ Z తల్లిదండ్రులు టెక్నాలజీతో జరిగే గుడ్-బ్యాడ్లను గుర్తించి.. పిల్లల విషయంలో ఆంక్షలతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేశారు. అయితే తర్వాతి తరం తల్లిదండ్రుల విషయంలో ఇది ముమ్మాటికీ ఛాలెంజింగానే ఉండనుందట!.బీటా జనరేషన్‌కు టెక్నాలజీ అనేది మునివేళ్ల మీద ఉండబోతోంది. అదే సమయంలో.. ఈ జనరేషన్‌ను అర్థం చేసుకోవడం అంతేకష్టతరంగా మారనుంది. సాంకేతికత అనేది వాళ్ల జీవన శైలి(Life Style)ని, కెరీర్‌ను, తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయనుంది. తద్వారా వాళ్ల ప్రవర్తన కూడా అందుకు తగ్గట్లే మారే అవకాశం ఉంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో.. ఈ జనరేషన్ కొన్ని సవాళ్లను ఎదుర్కొనుందట. ‘‘ఈ పిల్లలు పెరిగేకొద్దీ, వారు అనేక సామాజిక సవాళ్లతో పోరాడుతున్న ప్రపంచాన్ని చూడాల్సి వస్తుంది. వాతావరణ మార్పులు, ప్రపంచ జనాభా మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ(Urbanization) వారి జీవితాలను ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్యలయ్యే అవకాశం ఉంది. పర్యావరణ స్పృహ, స్థిరమైన జీవనశైలికి జనరేషన్ బీటా చిన్న వయస్సు నుంచే అలవాటు పడొచ్చు. 21వ శతాబ్దం తీవ్రమైన పర్యావరణ సమస్యలకు పరిష్కారాలను కనుగొనే పనిలో ఉంటారు. ఈ ఓవర్ స్మార్ట్‌నెస్‌కు ముందు తరాలు ఎంతవరకు భరించగలవనేది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ’’ అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘జెన్ జెడ్’.. ఎందుకంత భిన్నమో తెలుసా? -
Year Ender 2024: ‘జెన్ జెడ్’.. ఎందుకంత భిన్నం? ఏ తరం వారు ఏం చేస్తున్నారు?
ఈ ఆధునిక ఇంటర్నెట్ ప్రపంచంలో ఈ తరం యువత అన్నిరంగాల్లోనూ వేగంగా ముందుకు దూసుకుపోతోంది. ఇటీవలి కాలంలో ‘జెన్ జెడ్’ అనే పదం విరివిగా వాడుకలో ఉంది. జెన్ జెడ్ అంటే జనరేషన్ జెడ్. ఇదేమీ సాంకేతిక పదం కాదు. ఈ కాలం యువతకు ఈ పదం వర్తిస్తుంది. జనరేషన్ జెడ్‌పై 2024లో విపరీతంగా చర్చలు జరిగాయి.ఒక అమెరికన్ ఇన్స్టిట్యూట్ తెలిపిన వివరాల ప్రకారం, 1995 నుంచి 2012 మధ్య జన్మించిన పిల్లలను ‘జనరేషన్ జెడ్’ అని అంటారు. వీరు అధునాతన స్మార్ట్ఫోన్లు విరివిగా వినియోగించే ఇంటర్నెట్ యుగంలో జన్మించారు. ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధిని పరిశీలిస్తే, అది 1995 సంవత్సరం తర్వాత అత్యంత వేగంగా పెరిగింది. స్మార్ట్ఫోన్లు, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు విరివిగా అందుబాటులోకి వచ్చిన తరుణంలో పుట్టిన చిన్నారులు సాంకేతికంగా మరింత ముందడుగు వేస్తారని నిపుణులు అంటున్నారు. ఇంతేకాదు మునుపటి తరంతో పోలిస్తే, జెన్ జెడ్ కేటగిరీకి చెందినవారు మరింత స్నేహశీలురుగా మెలుగుతూ, ప్రపంచాన్ని భిన్నంగా చూస్తారని చెబుతున్నారు. మాట తీరు ఇంతకుముందు తరాలకు భిన్నంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.జనరేషన్ జెడ్.. సంక్షిప్తంగా జెన్ జెడ్.. వ్యవహారికంగా జూమర్స్ అని ప్రస్తుత తరం యువతను పిలుస్తున్నారు. ఈ తరంలో జన్మించినవారు అంతకుముందు తరాలవారి వ్యవహరశైలికి భిన్నంగా ఉంటున్నారు. వీరి విద్యాభ్యాసం విషయానికొస్తే తమ ముందు తరాల కంటే కొంత భిన్నమైన విద్యావిధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం జెన్ జెడ్ తరం వారు హైస్కూలు మొదలుకొని ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న వారిగా ఉన్నారు.వీరు ఆన్లైన్లో స్నేహితులను కలుసుకోవడానికి, భౌతికంగా స్నేహితులను కలుసుకోవడానికి మధ్య పెద్దగా తేడా చూపరు. ఈ కారణంగానే వారు అధికస్థాయిలో స్నేహితులను సంపాదించుకుంటున్నారు. ఇందుకు సాంకేతికను విరివిగా ఉపయోగిస్తున్నారు. జెన్ జెడ్ డిజిటల్ ప్రపంచాన్ని అభివృద్ధి చేయడంతోపాటు దానిని స్వీకరించిన మొదటి తరం. ఈ తరం డిజిటల్ ప్లాట్‌ఫారాలకు, సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంటుంది.కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన సమయంలో మిగిలిన తరాల వారు ఎంతో ఇబ్బంది పడినా జెన్ జెడ్ వర్గం వారు దానిని కష్టసమయంగా భావించలేదు. ఇంటర్నెట్ సహాయంతో వారు అనేక విషయాలు తెలుసుకున్నారు. మిగిలిన తరాలకు భిన్నంగా ఆలోచిస్తూ జెన్ జెడ్ వర్గంవారు ముందుకు దూసుకుపోతున్నారు. మిగిలిన తరాల కన్నా జెన్ జెడ్వర్గం తక్కువ ఒత్తిడికి గురవుతున్నదని పరిశోధనల్లో తేలింది. ఇంతకుముందు తరాలవారిని ఏ పేరుతో పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.ది గ్రేటెస్ట్ జనరేషన్ (1901 నుండి 1927 మధ్యకాలంలో జన్మించనవారు) వీరు తమ బాల్యంలో యుద్ధం, వ్యాధులు, ఆర్థిక కష్టనష్టాల వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు.సైలెంట్ జనరేషన్ (1928 నుండి 1945 మధ్యకాలంలో జన్మించినవారు)ఈ తరంలోనివారు ప్రపంచ యుద్ధాన్ని, బానిసత్వాన్ని చవిచూసారు. దేనికీ స్పందించకుండా, నిరసించకుండా అన్యాయాన్ని భరిస్తూ వచ్చినందున ఈ జనరేషన్ వారిని సైలెంట్ జనరేషన్ అని సంబోధిస్తున్నారు.బేబీ బూమర్ జనరేషన్(1946 నుండి 1964 మధ్యకాలంలో జన్మించినవారు) ఈ తరాన్ని ఆధునిక యుగానికి నాందిగా చెబుతారు. రాక్ అండ్ రోల్, హిప్పీ సంస్కృతి, సినిమా, కళ, సంగీతానికి కొత్త మెరుగులు దిద్దిన ఘనత ఈ తరానికి చెందుతుంది. ప్రస్తుతం, ఈ తరానికి చెందిన వారు పాత- కొత్త తరాలకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు.జనరేషన్ ఎక్స్ (1965 నుండి 1980 మధ్య కాలంలో పుట్టినవారు) బేబీ బూమర్ల మాదిరిగానే, ఈతరం వారు కూడా ఆధునిక యుగానికి నాందిగా నిలిచారు. ఈ తరం వారు పాత- కొత్త తరాలకు వారధులుగా ఉన్నారు.మిలీనియల్స్(1981 నుండి 1996 మధ్యకాలంలో జన్మించినవారు) ఈ తరం వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని జీవితంలో గణనీయమైన మార్పులను చూశారు. ఈ మార్పులకు అనుగుణంగా జీవితాలను మలచుకున్నారు. మునుపటి తరాలతో పోలిస్తే ప్రపంచంపై ప్రత్యేకమైన దృక్పథాన్ని ఏర్పరుచుకున్నారు.జనరేషన్ జెడ్ (1997 నుండి 2012 మధ్యకాలంలో పుట్టినవారు)1995 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జనరేషన్ జెడ్ అని అంటారు. ఆధునిక, సాంకేతిక సౌకర్యాలను అందిపుచ్చుకోవడంలో వీరు ముందున్నారు.జనరేషన్ ఆల్ఫా (2013 నుండి 2025 మధ్య కాలానికి చెందినవారు) జనరల్ ఆల్ఫా పిల్లలు అధునాతన సాంకేతికతకు చిన్నవయసులోనే అలవాటుపడతారు. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, సోషల్ మీడియాను అంటిపెట్టుకుని ఉంటారు. జెన్ ఆల్ఫాతరం వారు 21వ శతాబ్దపు అతి పిన్న వయస్కులైన వారిగా పరిగణిస్తున్నారు. ఇది కూడా చదవండి: బోరుబావి ప్రమాదాలకు అంతం లేదా? నాలుగేళ్లలో 281 మంది చిన్నారులు మృతి -
ఆరు తరాలు, 185 మంది సభ్యులు..ఇప్పటికి ఒకే ఇంటిలో..
ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఉమ్మడి కుటుంబాలన్న మాటే కరువయ్యిపోయింది. ఒకవేళ ఉన్నా..మహా అయితే ఓ మూడు తరాలు కలిసి ఉంటారు. వాళ్ల పిల్లల జనరేషన్ వద్దకు వచ్చేటప్పటికీ మళ్లీ వేర్వురుగా కాపురాలు పెంటడం మాములే. కానీ అలా గాక ఏళ్ల నుంచి..అదికూడా ఏకంగా ఆరు తరాలు ఇప్పటికీ కలిసి ఒకే ఇంటిలో నివశించి, ఉమ్మడి కుటుంబంలోనే ఉంది అసలైన ఆనందం అని ప్రూవ్ చేసి చూపిస్తోంది రాజస్తాన్‌లోని ఓ కుంటుంబం.రాజస్తాన్‌లో బాగ్దీ కుటుబంలో ఏకంగా 185 మంది ఉన్న సభ్యులు చక్కగా ఐక్యంగా ఉంటూ నేటి చిన్న కుటుంబాలకు ఆదర్శంగా నిలుస్తోంది. వాళ్లింట్లో జరిగే ప్రతి పండుగ, కార్యక్రమాన్ని అందరం కలిసి జరుపుకుంటామని చెబుతున్నారు. వీళ్లంతా రాజస్తాన్‌లోని అజ్మీర్ నుంచి సుమారు 36 కిలో మీటర్లు దూరంలో నసిరాబాద్ సమీపంలోని రామ్సర్ గ్రామంలో జీవిస్తున్నారు. కుటుంబానికి తగ్గట్టుగా వంటగది పెద్దదిగా ఉంటుంది. ఆ వంటగదిలో ఏకంగా 13 స్టౌవ్‌లు మండుతుంటాయని, ఇందులో చపాతీలు, 15 కిలోల కూరగాయలు, 50 కిలోల పిండిని ఉపయోగిస్తారట. ఇంటిలోని ఆడబిడ్డలంతా కుటుంబం మొత్తానికి వంట చేస్తారు. అంతేగాదు రేషన్ కోసం ఏకంగా రూ. 12 లక్షలు వరకు ఖర్చు చేస్తారట. ఈ ఉమ్మడి కుటుంబంలో 65 మంది పురుషులు, 60 మంది మహిళలు, 60 మంది చిన్నారులతో కలిపి ఆరు తరాలు కలిసి జీవిస్తున్నారు. ఈ బాగ్దీ కుటుంబానికి అధిపతి సుల్తాన్ మాలి, అతనికి ఆరుగురు కుమారులు. మోహన్ లాల్, రామచంద్ర భన్వర్ లాల్, ఛగన్ లాల్, చోటూ లాల్, బిర్డిచంద్. అయితే సుల్తాన్ మాలీ, అతని ఇద్దరు కుమారులు భన్వర్ లాల్, రామచంద్ర చనిపోయారు. తన తండ్రి ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండటం నేర్పించాడని, అందువల్ల తాము ఇప్పటికీ ఆ మార్గాన్ని అనుసరిస్తామని బర్హిచంద్ చెబుతున్నారు. ఎప్పుడైనా ఏదైనా వివాదం తలెత్తితే పెద్దలంతా కలిసి కూర్చొని పరిష్కరించుకుంటామని చెబుతోంది ఆ కుటుంబం. తమ కుటుంబసభ్యులకు ప్రేమగా, ఐక్యంగా ఎలా మసులుకోవాలో తెలుసని చెబుతున్నారు. ఇక ఆ కుటుంబంలో కొందరూ ప్రభుత్వ, ప్రైవేటే ఉద్యోగాల్లో పనిచేస్తుండగా, మరికొందరూ వ్యవసాయం, పశుపోషణ, భవన నిర్మాణ సామాగ్రి దుకాణం, ట్రాక్టర్లు నడపడం ద్వారా సంపాదిస్తారు. పిల్లలు, వృద్ధులు,చిన్నవాళ్లు కలిసి భోజనం చేస్తారు, ఆ తర్వాత మిగతావాళ్లు భోంచేస్తామని అంటున్నారు. ఇక తమలోని ఒక కోడలు 2016లో గ్రామానికి సర్పంచ్ అయ్యి రోడ్లు, డ్రైయిన్లు అభివృద్ధి చేయడం, విద్యుత్ సరఫరా కోసం కృషి చేసినట్లు తెలిపారు. అంతేగాదు గత నెలలో అజ్మీర్‌లో సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చిన బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, సారా అలీఖాన్ ఈ ఇంటికి రావడంతో ఈ కుటుంబం ఒక్కసారిగా వెలుగులోకివచ్చింది. ఈ ఉమ్మడి కుటుంబంలోని ప్రేమ, అప్యాయతకు వారు ఉబ్బితబ్బిబ్బైపోయారు. పైగా ఈ కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు సారా అలీఖాన్. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవ్వుతున్న టైంలో ఈ కుటుంబం ఇలా ఉమ్మడిగా, ఐక్యమత్యంగా ఉండటం నిజంగా చాలా గ్రేట్ కదూ.*सुपरजंबो जॉइंट फैमिली !!!!!*🤘🔥🔥1. 185 सदस्य2. 700 बीघा खेती3. 12 कार4. 80 टू व्हीलर5. 11 ट्रैक्टर6. 10 बच्चे हर साल जन्म7. हर रोज b'day8. अनलिमिटेड आनंद9. अनलिमिटेड सम्पन्नता pic.twitter.com/svuBp8HbgO— VISHAL SINGH (@Vishalk09340276) June 19, 2024 (చదవండి: ఐఐటీ హైదరాబాద్ ఘనత..త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో బ్రిడ్జ్ తయారీ..!) -
ఈ తరం తీరే వేరు! నేటి తరంలో ఆనందం తక్కువ.. ఎందుకంటే!
జీవితానికి అర్థం, పరమార్థం జీవించడమే, ఆనందంగా జీవించడమే. మనం ఉద్యోగం సాధించినా, ఇల్లు కట్టించినా, కారు కొన్నా, విదేశీ ప్రయాణం చేసినా, మరే పని చేసినా సరే.. లక్ష్యం ఆనందం. ఆనందాన్ని వెంబడించడమనేది శాశ్వతమైన మానవ ప్రయత్నం. అయితే కాలంతో పాటు దాన్ని సాధించే మార్గాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా ప్రతి 15 సంవత్సరాలను ఒక జనరేషన్గా పరిగణిస్తారు. జనరేషన్ జనరేషన్‌కూ ప్రాధాన్యాలు మారుతూ ఉంటాయి. 1965-80 మధ్య పుట్టిన జనరేషన్-ఎక్స్ వారికి ఆర్థిక భద్రత సాధించడం, పిల్లలు సాధించేలా చూడటం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధించడమే లక్ష్యంగా ఉండేది. అందులోనే వారు ఆనందాన్ని పొందేవారు. 1981-1996 మధ్య పుట్టిన జనరేషన్-వై వారికి వ్యక్తిగత ఎదుగుదల, మంచి కుటుంబ జీవితం ఆనందాన్నిచ్చేవి. వారితో పోల్చినప్పుడు 1997-2012 మధ్య పుట్టిన జనరేషన్-జీ వారిలో ఆనందం తగ్గిందని, కేవలం మూడింట రెండు వంతుల మంది మాత్రమే సంతోషంగా ఉన్నారని గాలప్ సర్వే కనుగొంది. యుక్త వయసులోకి ప్రవేశించినప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కారణం తెలుసా? ఈ తరం వారికి ఆర్థిక భద్రత, వ్యక్తిగత ఎదుగుదల కంటే కూడా పని చేయడంలో ప్రయోజనం (sense of purpose) ముఖ్యం. ఆ క్లారిటీ ఉన్నప్పుడు, ఉన్నవారు మాత్రమే సంతోషంగా జీవిస్తున్నారు. నా పనికి ప్రయోజనం ఉందా? ఈ తరం వారికి కార్పొరేట్ నిచ్చెనలు ఎక్కడంపైనే, మెటీరియలిస్టిక్ విజయాలు సాధించడంపైనే దృష్టి ఉంటుందని చాలామంది విమర్శిస్తుంటారు. కానీ అదంతా అబద్ధమని సర్వేలో తేలింది. పాత తరాలకు భిన్నంగా జనరేషన్-జీ వారు తమ పనికి, జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఈ తరం వారికి అందుబాటులో ఉన్న ఉద్యోగాలలో ఈ అంతర్గత ప్రేరణ లేదు. ఆఫీసుల్లో ఏ అంశంపైనైనా బహిరంగంగా మాట్లాడే స్వభావం, దాన్ని భరించలేని పాతకాలపు వర్క్ ప్లేస్ లు వారిలో అసంతృప్తిని పెంచుతున్నాయి. అంటే ఈ తరం వారికి భారీగా జీతాలు అందుకోవడం లేదా ప్రమోషన్లు పొందడం కంటే కూడా తాము చేస్తున్న పనివల్ల ఎవరికైనా, ఏదైనా ప్రయోజనం ఉందా? వారి జీవితాలను ప్రభావితం చేయగలుగుతున్నామా? అనేది చాలా ముఖ్యం. అలాంటి ప్రయోజనం ఉన్నప్పుడే పనిలో ఆనందాన్ని పొందుతున్నారు. ఈ మూడూ ఉంటేనే సంతోషం జనరేషన్-జీ ఆనందంలో ప్రయోజనంతోపాటు మరో మూడు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని గాలప్ అధ్యయనం గుర్తించింది. అవి.. రీఛార్జ్, రిలాక్సేషన్: హైపర్ కనెక్టివిటీ వల్ల ప్రపంచం నిరంతరం మేల్కొనే ఉంటుంది. అందువల్ల చాలామందికి నిద్ర కరువవుతోంది. తగినంత విశ్రాంతి, నిద్ర పొందడం ఆనందానికి మార్గమవుతోంది. బలమైన సామాజిక సంబంధాలు: సోషల్ మీడియా యుగంలో ఒక్కొక్కరికీ వేలల్లో, లక్షల్లో ఆన్లైన్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల ప్రేమ, మద్దతు పొందడం చాలా ముఖ్యం. వారితో సన్నిహిత సంబంధాలే సంతోషానికి మార్గాలవుతాయి. పోలికనుండి తప్పించుకోవడం: సోషల్ మీడియాలో లేదా మరెక్కడైనా నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. జనరేషన్-జీలో ఈ కంపేరిజన్ ట్రాప్ చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి అవగాహన పెంచుకోవడం, ప్రతీ వ్యక్తి ప్రత్యేకమని గుర్తించి ముందుకు సాగడం ఆనందం జీవనం కోసం అద్భుతమైన వ్యూహం. విద్యాసంస్థలు, కార్యాలయాలు ఈ అంశాలను గుర్తించి జనరేషన్-జీ దీర్ఘకాలిక ఆనందాన్ని సాధించడంలో మద్దతునివ్వాల్సిన అవసరం ఉంది. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
టైం మెచ్చిన ధృవ్తార!
యూట్యూబ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు... ధృవ్ రాఠీ. ఈ హరియాణా కుర్రాడు యూట్యూబర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. గాలివాటంగా విజయం సాధించలేదు. తనదైన సక్సెస్ ఫార్ములాను రూపొందించుకున్నాడు. ఆడియో స్పేస్‌లోకి అడుగు పెట్టి పాడ్‌కాస్టర్‌గా కూడా సత్తా చాటాడు. ‘డబ్బు కోసం కాదు ప్యాషన్‌తో పనిలోకి దిగండి. సామాజిక బాధ్యతను మరవకండి’ అంటున్న ధృవ్ రాఠీ తాజాగా టైమ్ మ్యాగజైన్ ‘నెక్స్ట్ జెనరేషన్ లీడర్స్ 2023’ జాబితాలో చోటు సంపాదించాడు... ధృవ్ రాఠీ సొంత రాష్ట్రం హరియాణా. జర్మనీలోని కాజ్రువ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్, అదే ఇన్స్టిట్యూట్లో రెన్యూవబుల్ ఎనర్జీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ట్రావెల్ వీడియోలతో ప్రయాణం ప్రారంభించిన ధృవ్ ఆ తరువాత రాజకీయా, సామాజిక అంశాలపై దృష్టి సారించాడు. ‘ఇన్సైడ్ ది వరల్డ్స్ స్మాలెస్ట్ కంట్రీ’ ‘గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ దిల్లీ స్కూల్స్’ ‘క్లీనింగ్ నైన్ మిలియన్ కేజీ వర్త్ ఆఫ్ ట్రాష్’.... మొదలైన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఏదో ఒక వీడియో చేయాలి, వదలాలి అని తొందర పడకుండా ఆచితూచి ఆలోచించి వీడియోలు చేసేవాడు ధృవ్. ‘చేయకపోయిన ఫరవాలేదు. చేసింది మాత్రం బాగుండాలి’ అని గట్టిగా నమ్ముతాడు. ఒక అంశంపై వీడియో చేయాలనుకున్నప్పుడు ‘కెమెరా ఉంది కదా. ఇది చాలు’ అనుకోకుండా ఆ అంశంపై లోతుగా రిసెర్చ్ చేస్తాడు. జర్నల్స్, రిపోర్ట్స్ చదవడంతో పాటు ఎంతోమంది నిపుణులతో మాట్లాడతాడు. ఆ తరువాతే పనిలోకి దిగుతాడు. ‘డబ్బులు బాగా గడించాలనే లక్ష్యంతో యూట్యూబర్‌గా మారవద్దు. యూట్యూబ్ అనేది జస్ట్ ఫర్ మనీ అనే భావనను మనసులో నుంచి తీసివేయాలి. ప్యాషన్ ఉన్నప్పుడే క్రియేటర్ కావాలి. ఒక క్రియేటర్ సక్సెస్ కావడానికి ఓపిక అనేది అతి ముఖ్యం. ఇక నేను తెలుసుకునేది ఏమీ లేదు అనుకోకుండా అనుభవాలు, పరిస్థితుల నుంచి ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నది ఏమిటో నా గత వీడియోలు, ఇప్పటి వీడియోలకు మధ్య ఉన్న తేడాను గమనిస్తే తెలుస్తుంది. ఖరీదైన టెక్నికల్ టూల్స్ వాడినంత మాత్రాన పేరు రాదు అనేది గ్రహిం చాలి. వృథాగా డబ్బులు ఖర్చు చేయవద్దు. సింపుల్ కెమెరా ఫోన్, ఫ్రీ వీడియో ఎడిటర్‌తో మన ప్రయాణం మొదలు పెట్టవచ్చు. సామాజిక బాధ్యతను ఎప్పుడూ మరవద్దు’ అంటాడు ధృవ్. ‘పాపులర్ యూట్యూబర్’గా పేరు వచ్చినప్పటికీ అక్కడే ఆగిపోకుండా ఆడియో స్పేస్‌లోకి అడుగు పెట్టాడు ధృవ్ రాఠీ. పాలిటిక్స్, ఎంటర్టైన్మెంట్, సోషల్, ఎకనామిక్స్ టాపిక్‌లను కవర్ చేస్తూ పాడ్‌కాస్టర్‌గా కూడా తానేమిటో నిరూపించుకున్నాడు. ‘పాడ్‌కాస్ట్‌లో అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. విజువల్‌గా ఆట్టుకునే అవకాశం లేదు. యానిమేషన్‌కు వీలులేదు. కేవలం మాట మాత్రమే ముఖ్యం అవుతుంది. శ్రోతలు తమ పనులు చేసుకుంటూ కూడా మన మాటలు ఆసక్తిగా వినేలా చేయాలి. పాడ్‌కాస్టింగ్‌లో నేను వీడియోలో ఎలా కనిపించాలి? అనేదాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆకట్టుకునేలా ఎలా మాట్లాడాలి? అనేదానిపైనే దృష్టి ఉంటుంది. నా ముఖాన్ని మాత్రమే కాదు గొంతు కూడా చాలామంది గుర్తుపట్టడం అనేది పాడ్‌కాస్టింగ్‌లో నాకు ప్లస్‌పాయింట్ అయింది. పాడ్‌కాస్టర్‌గా నాకు మంచి మార్కులు వేస్తూ శ్రోతలు నుంచి మెయిల్స్, మెసేజ్‌లు వస్తుంటాయి’ అంటున్న ధృవ్ అభిరుచుల విషయానికి వస్తే...ప్రయాణాలు, ఫొటోగ్రఫీ, స్కూబా–డైవింగ్, పుస్తక పఠనం అంటే ఇష్టం. ‘తక్కువలో ఎక్కువ’ అనేది నమ్మే సూత్రం. (చదవండి: సాధారణ ఉద్యోగిగా అడుగుపెట్టి..నేడు సంపన్న మహిళగా..!) -
16 ఏళ్ల నాటి ఐఫోన్ రూ. 1.3 కోట్లు.. దీని ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ధర ఎక్కువైనా కొనేందుకు యువత ఆసక్తి చూపిస్తుంటారు. యూజర్ల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్లను యాపిల్ సంస్థ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ప్రస్తుత తాజా మోడల్ ఐఫోన్ 15 హవా నడుస్తోంది. అయితే 2007లో విడులైన మొదటి తరం ఐఫోన్ తాజాగా జరిగిన వేలంలో రూ. 1.3 కోట్లకు (158,000 డాలర్లు) అమ్ముడుపోయింది.ఇప్పటివరకు వేలంలో అమ్ముడుపోయిన అత్యంత విలువైన ఐఫోన్‌గా ఇది కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఐఫోన్‌కు టెక్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ ఫోన్ రూపొందించడంలో పాలుపంచుకున్న ఇంజనీర్లలో ఒకరికి చెందినది. మొదటి తరం ఐఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్, టచ్‌స్క్రీన్ ఇంటర్ఫేస్, ఆసక్తికరమైన ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను విప్లవాత్మకంగా మార్చారు. కాగా వేలానికి ఉంచిన ఈ ఐఫోన్ 16 ఏళ్లయినా ఇప్పటికీ అంతే కొత్తగా ఉంది. అందుకే వేలంలో అత్యధిక విలువను దక్కించుకుంది. ఇదీ చదవండి ➤ మొబైల్ నంబర్.. మీకు నచ్చినట్టు.. ఈ ఐకానిక్ ఐఫోన్ 4జీబీ వెర్షన్‌ను ఎల్సీజీ సంస్థ వేలం వేసింది. 50,000 డాలర్ల నుంచి 100,000 డాలర్లు (రూ.41 లక్షలు నుంచి రూ.82 లక్షలు) మధ్య అమ్ముడుపోతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అయితే అనూహ్యంగా 158,644 డాలర్లకు అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ. 1.3 కోట్ల భారీ ధరను దక్కించుకుని కొత్త రికార్డు సృష్టించింది. వాస్తవానికి 2007లో విడుదలైన మొదటి తరం ఐఫోన్ 4జీబీ వర్షన్ ధర కేవలం 499 డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 40 వేల కంటే తక్కువే. ఈ ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిన 16 ఏళ్ల తర్వాత 318 రెట్లు అధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం. -
చిన్నపిల్లలే!.. వారికేం తెలియదు అనుకుంటే..పప్పులో కాలేసినట్లే..
మా అమ్మాయి పసికూన" .. "అబ్బాయి బుడ్డోడు" .. "ఇంకా ఏమీ తెలియదు" . ఇదే తల్లితండ్రుల ఆలోచనలు . మీ ప్రేమ చల్లగుండా. పిల్లలు దేవుడు చల్లని వారే .. కల్లాకపటం ఎరుగని కరుణామయులే. కానీ ..మధ్యలో స్మార్ట్ ఫోన్ .. స్మార్ట్ టీవీలు దురాయి స్వామి. అమాయకత్వం అర్హత కాదు. గురువు / తల్లితండ్రి సరైన రీతిలో ఎడ్యుకేట్ చెయ్యకపోతే పిల్లలు బయటి సమాజం నుంచి నేర్చుకొంటారు . చెడుదారిలో వెళ్లి పోతారు ." అయ్యో .. అప్పుడే ఇంత చిన్న వయసులో ఇలా చేస్తుందని అనుకోలేదు" అని అప్పుడు ఏడిస్తే లాభం ఏంటి ? దీని గురించి మానసిక శాస్త్ర పరిశోధకులు వాసిరెడ్డి అమర్నాథ్ గారు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే చూద్ధాం. ఒకసారి నేను హైస్కూల్ పిల్లలకు ఇచ్చిన హోం టాస్క్‌లో..ఐఐటీ విద్యార్థులు కూడా, ఆత్మ హత్యలు చేసుకొంటున్న ఘటనలు జరుగుతున్నాయి . దీనికి గల కారణాలను చర్చించి, పరిష్కార మార్గాలను సూచించండి. ఇటీవలి కాలంలో ఉన్నత విద్య చదివిన కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. కారణాలను, పరిష్కార మార్గాలను చర్చించండి, తదితరాల గురించి ఇచ్చాం. వారు ఇంట్లో తల్లిదండ్రులతో అవసరమయితే బంధువులతో చర్చించి సమాచారం సేకరించి చర్చకు సిద్ధం కావాలి. అటుపై క్లాస్ రూమ్ లో మెంటార్ పర్యవేక్షణలో డిబేట్ జరుగుతుంది. కొంతమంది తల్లితండ్రులు ఈ ప్రశ్నల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు. "మా పిల్లలు ఇంకా పసివారు. వారికి ఆత్మ హత్యలు, ప్రేమలు- పెళ్లిళ్లు వీటి గురించి తెలుసుకోవలసిన అవసరం, వయసు రాలేదు. అనవసరంగా పసి మనుసుల్లో నెగటివ్ విషయాలు చొప్పించకండి. వీటిని మేము పిల్లలతో చరించడానికి రెడీగా లేము ", "తలితండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రశ్నల్ని మార్చండి ."-- నేను మా ఎగ్జిక్యూటివ్స్‌కి ఇచ్చిన ఆదేశం. నిన్న నా క్లాస్. క్లాస్ తరువాత క్వశ్చన్- ఆన్సర్ సెషన్. ఆ సెషన్లో ఏడవ తరగతి అమ్మాయిలు అడిగిన ప్రశ్నలు కొన్ని . 1 . మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి స్నాప్ చాట్‌లో ఇంకో అమ్మాయితో చాట్ చేస్తోంది. నేను చూసి అది అమ్మాయి కాదు అని చెప్పాను. ముందుగా నా మాట నమ్మలేదు . తరువాత అది నిజమని తేలింది. ఇప్పుడు వాడు, మా ఫ్రెండ్‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు . తాను డిప్రెషన్ లో ఉంది. సూసైడ్ చేసుకుంటానంటోంది. ఇప్పుడు నేనేమి చెయ్యాలి ? 2 . మేము మా అపార్ట్మెంట్ బయట ఆడుకొంటాము. ఆ టైంలో ఎక్కడినుంచో ఒక గ్యాంగ్ అబ్బాయిలు వస్తారు. మమ్మల్ని టీజ్ చేస్తారు. వల్గర్ మాటలు మాట్లాడతారు . ఒక అంకుల్‌కి చెప్పాము . అయన అక్కడ ఉన్నప్పుడు వారు రారు. అయన వెళ్ళిపోగానే మళ్ళీ వస్తారు . ఏమి చెయ్యాలి ? ౩. మా క్లాసులో కొంతమంది అబ్బాయిలు మాకు నిక్ నేమ్ పెడుతున్నారు. మమల్ని వేరే అబ్బాయిలతో లింక్ చేసి మాట్లాడుతున్నారు. మన స్కూల్ ఇది తక్కువ. మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అయితే, వారి స్కూల్లోఇది ఇంకా ఎక్కువ తట్టుకోలేక పోతున్నామని చెబుతున్నారు. ఏమి చెయ్యాలి. 4 . అబ్బాయి తప్పు చేసినా, పెద్దలు అమ్మాయినే నిందిస్తారు . ఎందుకు ? 5 . పొట్టి బట్టలు వేసుకొంటే పెద్దలు అమ్మాయిని తప్పుపడుతారు . అబ్బాయికి సంస్కారం చెప్పారా ?. 6 . తన బెస్ట్ ఫ్రెండ్ కావాలని ఒక అబ్బాయి నన్ను ఒత్తిడి చేస్తున్నాడు . నేనేమి చెయ్యాలి ? 7 . ఏదో తరగతిలో ప్రేమ లో పడడం తప్పు . కానీ అబ్బాయిలను బెస్ట్ ఫ్రెండ్ చేసుకొంటే తప్పు అవుతుందా ? 8 . మా బంధువుల అమ్మాయి ... 25 ఏళ్ళు వుండొచ్చు. తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకొని హుస్బేండ్స్ చేతిలో నరకాన్ని అనుభవిస్తున్నారు. లేదా బ్రేక్ అప్ అయిపొయింది. కాబట్టి పెళ్లి చేసుకోనటోంది. ఏమి చెయ్యాలి ? సునామిలా ఇలా ప్రశ్నలు వరుసగా దూసుకొస్తూనే వున్నాయి. వారికి అర్థం అయ్యే రీతిలో అన్నింటికీ సమాధానాలు చెప్పాను. ఉదాహరణకు ఎనిమిదో ప్రశ్న కు .. ఔటర్ రింగ్ రోడ్డు పై... హైదరాబాద్ - విజయవాడ హై వే ప్రతి రోజు కొన్ని ప్రమాదాలు - మరణాలు జరుగుతున్నాయి . కాబట్టి నేను రోడ్డుపై ట్రావెల్ చెయ్యను . మలేసియా విమానం, నేపాల్ విమానం కూలిపోయాయి . కాబట్టి నేను విమానం ఎక్కను - హాల్లో నవ్వులు . గుండెపోట్లు ఎక్కువగా వ్యక్తి నిద్రపోతున్న సమయంలో జరుగుతున్నాయి. కాబట్టి నేను ఇక నిద్రే పోను ... ఇంకా పెద్ద పెట్టున నవ్వులు. అసలు గుండె ఉంటేనే గుండెపోటు. కాబట్టి నేను గుండెను తీసేస్తాను .. పగల బడి నవ్వులు. ప్రతి సంవత్సరం టీచర్లను ఇంకా ఎగ్జిక్యూటివ్స్‌ను ఎంపిక చేస్తుంటాను. నిజానికి ఒక తప్పు చేస్తే .. పిల్లల్ని చెరపట్టే ఫెడోఫిలిస్ట్ని ఎంపిక చేస్తే ? రిస్క్ ఉంది కదా ? అవతలివారి సైకాలజీని అర్థం చేసుకొనే సామర్థ్యము అంటే సామజిక తెలివి తేటలు పెంచుకొని ముందుకు సాగుతున్నాను . జీవితంలో తన పెర్సనాలిటీ ఏంటో తెలుసుకొని తనకు కావలసిన వ్యక్తి ఎలా ఉండాలో నిర్ణయించాలంటే మానసిక పరిణతి కావాలి . ఏదో ఎర్రగా బుర్రగా వున్నాడు. స్వీట్ మాటలు చెబుతున్నాడు. మహేష్ బాబులా వున్నాడు అని ట్రాప్ లో పడితే లైఫ్ నాశనం. పెద్ద చదువులు చదివినా.. మంచికి చెడుకి తేడా తెలియని బేలతనంతో ఈజీగా మోసపోతున్నారు. కాబట్టి మంచిగా చదువుపై దృష్టి పెట్టి .. మీరు స్లెటర్స్, కాబోయే లీడర్స్‌గా, అలాగే క్రిటికల్ థింకింగ్ , లాటరల్ థింకింగ్ , కాంప్లెక్స్ ప్రాబ్లెమ్ సొల్వింగ్ స్కిల్స్ ఎంపతీ, సోషల్ అండ్ ఎమోషనల్ ఇంటలిజెన్స్-- మీలో పెంపొందాలే చూసుకోండి. ఈ క్లాస్ అందుకే . దయచేసి తల్లిదండ్రుల్లారా ముందుగానే మేల్కోండి వారికి పెద్దయ్యాక మంచి చెడు చెబుదామని వెయిట్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడున్న ఫాస్ట్ టెక్నాలజీకి వారికి అన్ని తొందరగానే అర్థమైపోతున్నాయన్న విషయం ఈ సెషన్లో వారడగిన్న ప్రశ్నల తీరే నిదర్శనం. సో ముందుగానే పిల్లలని గమనించి మంచి చెడు చెప్పి పక్కదోవ పట్టకుండా కాపాడుకోండి. వాసిరెడ్డి అమర్ నాథ్ మానసిక శాస్త్ర పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్త -
నిజాయితీ నిల్! మగవాళ్లే ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారట!
అబద్ధాలు చెప్పేవాళ్ల సంఖ్య అత్యధికంగా పెరిగిపోతోందట. అందులో మగవాళ్లే, స్త్రీల కంటే ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నట్లు తేలింది. 1980 నుంచి 2021మధ్య జన్మించిన వ్యక్తుల వారిగా జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీనిలో పెద్ద, చిన్నా తేడా అనే తారతమ్యం లేకుండా అందరూ అబద్ధాలే చెబుతున్నారని, నిజాయితీగా ఉండే వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని పేర్కొంది. ఈ మేరకు ప్లేస్టార్ అనే ఆన్లైన్ క్యాసినో దాదాపు 1306 మంది చొప్పున యుఎస్‌లోని వివిధ రాష్ట్రాలపై జరిపినలో సర్వేలో తేలిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. వారంతా వివిధ పరిస్థితుల్లో ఎలా అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తున్నారో గమనించినట్లు పేర్కొంది. ఈ మేరకు యూస్‌లోని కొలరాడో,ఇల్లనాయిస్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా, టేనస్సీ, విస్కాన్సిన్లతో సహా అన్ని రాష్ట్రాలలో సుమారు వెయ్యి మంది చొప్పున చేసిన సర్వేలో ఈవిషయం వెల్లడించింది. వారిలో నిజాయితీ లేని వారి సంఖ్య చాలా అధికంగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. సుమారు 13 శాతం మంది కనీసం ఒక్కసారైన అబద్ధం చెబుతున్నామని అంగీకరించనట్టు పేర్కొంది. 1965-1980 మధ్య జన్మించిన వ్యక్తులను 'జెడ్‌గా' 1997-2021 మధ్య జన్మించిన వ్యక్తులను ఎక్స్‌గా విభజించి పోల్చి చూస్తే రెండు గ్రూప్‌లలో కేవలం 5 శాతం మంది రోజు అబద్ధాలు చెబుతున్నట్లు అంగీకరించారని తెలిపింది. అలాగే కార్యాలయాల్లో తమ బాస్‌కి రెజ్యుమ్‌లో తప్పుడు సమాచారమే ఇస్తున్నట్లు తేలింది. ప్రతి ఐదు మిలియన్ల మందిలో ఇద్దరూ ఇలా చేస్తున్నట్లు పేర్కొంది. సోష్ల్ మీడియాలో కూడా ఇదే తంతని, అక్కడ ఈ అబద్ధాల చెప్పే వారి సంఖ్య మరి ఎక్కువగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. వారంతా ప్రజలను ఆకట్టుకునే క్రమంలో ఈ అబద్ధాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. అందులో 58 శాతం మంది ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు, ఇక 42 శాతం మంది గోప్యత కోసం, మరో 42 శాతం మంది తాము చులకన అవ్వకుండా ఉండేందుకు, తమ వ్యక్తి గత రక్షణ కోసం చెప్పినట్లు తెలిపారు. చివరిగా సర్వేలో మహిళలతో పోలిస్తే పురుషులే రోజుకు ఒక్కసారైనా అబద్ధం చెప్పకుండా ఉండలేరని , వారు కూడా దీన్ని అంగీకరించారని సర్వే పేర్కొంది. (చదవండి: భార్యను చంపి, ఆమె పుర్రెని యాష్ ట్రేగా..) -
పెట్టుబడుల నిర్వహణకు సామ్కో సీఆర్పీ ప్లాట్‌ఫాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రోకరేజి సంస్థ సామ్కో కొత్త తరం క్యాపిటల్ రిసోర్స్ ప్లానింగ్ (సీఆర్పీ) ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. ప్రామాణిక సూచీల స్థాయిలో రాబడులను అందుకునేలా ఇన్వెస్టర్లు సులువుగా తమ పెట్టుబడులను నిర్వహించుకునేందుకు, ట్రేడింగ్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ వ్యవస్థాపకుడు జిమీత్ మోదీ తెలిపారు. ఇటు తమ పెట్టుబడులపై రాబడులను, అటు ప్రామాణిక సూచీలపై రాబడులను రియల్ టైమ్‌లో ట్రాక్ చేసుకునేలా స్వంతంగా ఒక వ్యక్తిగత సూచీని ఏర్పాటు చేసుకునేందుకు కూడా ఇందులో సౌలభ్యం ఉంటుందని ఆయన పేర్కొ న్నారు. మరోవైపు, 67 శాతం మంది ఇన్వెస్టర్లు .. ప్రామాణిక సూచీల స్థాయిలో రాబడులు అందుకోలేకపోతున్నారని తాము నిర్వహించిన సర్వేలో వెల్లడైందని మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ ఇన్వెస్టర్లు, ట్రేడర్లలో సూచీలను మించి రాబడులను అందుకునే ధోరణులను పెంపొందించేందుకు ’మిషన్ – ఏస్ ది ఇండెక్స్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఎనిమిదేళ్లలో కొత్తగా 20 అణు విద్యుత్కేంద్రాలు
న్యూఢిల్లీ: అదనంగా 15వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో 2031 ఏడాదికల్లా దేశంలో కొత్తగా 20 అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పనున్నట్లు కేంద్రప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయం చెప్పారు. కొత్త వాటిల్లో మొదటిదానిని వచ్చే ఏడాది గుజరాత్‌లోని కాక్రపార్‌లో 700 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పుతారు. 2024 ఏడాదిలో కల్పకంలో 50 మెగావాట్ల సామర్థ్యంతో ప్రోటోటైప్ ఫాస్ట్‌బ్రీడ్ రియాక్టర్‌ను, 2025లో చెరో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లను కుడంకుళంలో నిర్మిస్తారు. రాజస్తాన్‌లోని రావత్‌భటాలో చెరో 700 మెగావాట్ల సామర్థ్యంతో రెండు, 2027లో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో మరో రెండు అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. హరియాణాలోని గోరఖ్‌పూర్‌లో 2029 ఏడాదిలో 700 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లు సిద్ధంచేస్తారు. 700 సామర్థ్యంతో మరో పదింటిని వేర్వేరు రాష్ట్రాల్లో.. అంటే హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో నిర్మిస్తారు. -
ప్రపంచ జనాభాలో అత్యధికం ‘జూమర్స్’.. ఇంతకూ మీది ఏ తరం?
దొడ్డ శ్రీనివాసరెడ్డి సరదా కోసమైనా, సమాచారం కోసమైనా రేడియోనే దిక్కయిన తరం ఒకటి.. అరచేతిలో స్మార్ట్ ఫోన్‌తో ప్రపంచాన్నే చుట్టబెడుతున్న తరం మరొకటి..యుద్ధాలు, సంక్షోభాలు, మహమ్మారుల మధ్య భయంగా గడిపిన తరం ఇంకొకటి.. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాల్లో, పోరాటాల్లో పాల్గొన్నది వేరొకటి.. ..దాదాపు ప్రతి తరం ఒక ప్రత్యేకమైన కాలమాన పరిస్థితుల్లో ఎదిగింది. విభిన్నమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను అనుభవించింది. ఈ ప్రతి తరం కూడా నాటి ఆ పరిస్థితులకు ప్రత్యేక గుర్తులే. ఆ గుర్తులకు అనుగుణంగానే ఒక్కో తరానికి ఒక్కో పేరు పెట్టారు. అమెరికాలో మొదలై.. తరాల అంతరాలను గుర్తించి, వాటికి నామకరణం చేయడం అమెరికాలో మొదలైంది. ఒక్కో తరానికి ఉన్న ఒక విలక్షణమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని బూమర్స్, జూమర్స్, మిలీనియల్స్ అంటూ పేర్లను అమెరికా సామాజిక వేత్తలు, మేధావులు, రచయితలు ఖాయం చేశారు. అటుఇటుగా అలాంటి పరిస్థితులే ఉన్న పాశ్చాత్య దేశవాసులు కూడా అవే పేర్లు, వర్గీకరణను వాడకంలోకి తెచ్చారు. మరి ఇంతకీ ఈ తరాలు, వాటి ప్రత్యేకతలు, వాటి కాలమాన పరిస్థితులు ఏమిటి? సైలెంట్ జనరేషన్ (1928–1945): యవ్వనమంతా కష్టాల్లో గడిపి.. ఈ తరం వాళ్లు పసితనంలోనే 1930నాటి మçహా ఆర్థిక సంక్షోభాన్ని చవిచూశారు. యుక్త వయసు వచ్చే నాటికి రెండో ప్రపంచ యుద్ధం పాలినపడ్డారు. జీవితమంతా కష్టాలనోర్చుకొని సాగిన ఈ తరం వారు ఇప్పుడు 77 నుంచి 94 ఏళ్ల మధ్య వయస్కులై ఉంటారు. వయసు మీరిన తర్వాతే ఈ తరం ప్రపంచవ్యాప్తంగా సాగిన అభివృద్ధిని వీక్షించింది. యవ్వనమంతా అష్టకష్టాల్లో, భయంభయంగా గడిపిన ఈ తరానికి సైలెంట్ జనరేషన్ అని పేరు వచ్చింది. బేబీ బూమర్స్ (1946–1964): జనాభాను పెంచి.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదలైంది ఈ తరం. యుద్ధంలో చెల్లాచెదురైన వారంతా మళ్లీ ఏకమై స్థిర నివాసం ఏర్పరుచుకోవడంలో ఒక్కసారిగా ప్రపంచ జనాభా పెరగడం మొదలైంది. అందుకే ఈ తరానికి బేబీ బూమర్స్గా నామకరణం చేశారు. మిగతా తరాలకు రచయితలో, సామాజికవేత్తలో పేర్లు పెడితే.. ఒక్క ఈ తరానికి మాత్రం అధికారికంగా అమెరికా జనాభా వివరాల సేకరణ బ్యూరో ‘బేబీ బూమర్స్’గా నామకరణం చేసింది. ఈ తరం వాళ్లు ప్రస్తుతం 58 నుంచి 76 ఏళ్ల మధ్య వయస్కులై ఉంటారు. ఉద్యోగ విరమణ చేసి మనవళ్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఈ తరం రాజకీయంగా, సామాజికంగా అనేక మార్పుల్ని చవిచూసింది. చిన్నతనంలో కొరియా యుద్ధం, యవ్వనంలో వియత్నాం యుద్ధం, తర్వాత మొదలైన యుద్ధ వ్యతిరేక, పౌరహక్కుల ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షులు ఈ తరం వారు. అంతరిక్ష రంగంలో మానవుడి తొలి విజయాలకు సాక్షి ఈ తరం. అమెరికా, రష్యా విభేదాలతో రెండుగా చీలిన ప్రపంచంలో వీరు మనుగడ సాగించారు. బ్లాక్ అండ్ వైట్ టీవీతో మొదలై వైఫైదాకా సాగిన సాంకేతిక విప్లవాన్ని ఆస్వాదించిందీ తరం. జనరేషన్ ఎక్స్ (1965–1980): విభిన్నమైన మార్పులు చూసి.. కెనడాకు చెందిన జర్నలిస్టు, రచయిత కాప్లాండ్ రచించిన ‘జనరేషన్ ఎక్స్.. టేల్ ఫర్ యాన్ యాక్సిలరేటెడ్ కల్చర్’అనే నవల ఆధారంగా ఈ తరానికి జనరేషన్ ఎక్స్ అని పేరు పెట్టారు. ప్రపంచం అనూహ్య రీతిలో పరిణామం చెందుతున్న దశలో.. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో మొదలైన ఈ తరంవారు ఇప్పుడు 42 నుంచి 57 ఏళ్ల మధ్య వయసులో ఉన్నారు. కంప్యూటర్ శకానికి ఆద్యులైన ఈ తరంలో ఇంకా అటు వార్తా పత్రికలు, మ్యాగజైన్లు చదివేవారి నుంచి ఇటు స్మార్ట్ ఫోన్లకు అలవాటుపడుతున్న వారిదాకా ఉన్నారు. గత తరాల కంటే ఈ తరం విద్యా రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. అలాగే ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాప్ కల్చర్‌కు సాక్షులు ఈ తరంవారు. స్నేహ హస్తాన్ని చాచి బెర్లిన్ వాల్‌ను కూల్చివేసిన ఘటన నుంచి విద్వేషం వెర్రితలలు వేసి న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్లను కూల్చివేసిన 9/11 ఘటన దాకా ఎన్నో చూసింది ఈ తరం. మిలీనియల్స్ (1981– 1996): సాంకేతిక విప్లవంతో ఎదిగి.. సహస్రాబ్దికి చేరువలో పుట్టిన ఈ తరాన్ని మిలీనియల్స్ అని పిలుస్తున్నారు. మొదట ఈ తరాన్ని జనరేషన్ వై అని పిలిచారు. కానీ అమెరికన్ రచయితలు విలియం స్ట్రాస్, నీల్ హోవే 1980 తర్వాత జన్మించిన వారిని మిలీనియల్స్ అని నామకరణం చేయడంలో ఈ తరానికి ఆ పేరేస్థిరపడింది. ప్రస్తుతం ప్రపంచంలో గత తరాలతో పోలిస్తే అత్యధిక సంఖ్యాకులు మిలీనియల్సే. దాదాపు 180 కోట్ల మంది అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 23 శాతం మంది ఈతరం వారే. ఆసియాలో వీరి సంఖ్య 25 శాతంపైనే ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక శాతం విద్యావంతులు ఈ మిలీనియల్సే. 25 శాతం పైగా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నవారే. ఈ తరం వారి ప్రస్తుత వయసు 26 నుంచి 41 సంవత్సరాలు. సాంకేతిక విప్లవంతోపాటు ఎదిగిన ఈ తరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తోంది. రాజకీయాలు మొదలు అన్ని రంగాలను శాసించగల సత్తా ఉన్న తరం ఇది. జనరేషన్ జెడ్ (1997–2012): ఇంటర్నెట్తో ఆడుతూపాడుతూ.. ఇంటర్నెట్ను జూమ్ చేస్తూ ఎదిగిన ఈ తరం వారిని జూమర్స్ అని కూడా పిలుస్తారు. ఈ తరానికి చెందినవారు ప్రస్తుతం పదేళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య వయస్కులు. మిలీనియల్స్ కంటే వీరి సంఖ్య ఎక్కువ. ప్రపంచ జనాభాలో వీరే 26 శాతం ఉన్నారు. 2025 నాటికి ప్రపంచ ఉద్యోగ వర్గంలో 27 శాతం జూమర్సే ఉంటారు. ఇంటర్నెట్ పూర్తిస్థాయిలో వినియోగించిన తొలితరం ఇదే. గూగుల్‌తోపాటు ఎదుగుతున్న ఈ తరం సమస్త దైనందిన కార్యక్రమాలను స్మార్ట్‌ఫోన్‌తో చేసుకుపోతోంది. ప్రపంచాన్నీ స్మార్ట్‌ఫోన్ నుంచే వీక్షిస్తోందీ తరం. జనరేషన్ ఆల్ఫా (2013 నుంచి మొదలు): మారిన జీవన శైలితో... ఇరవై ఒకటో శతాబ్దంలో పుట్టిన తరం ఇది. గ్రీక్ అక్షరమాలలో తొలి అక్షరమైన ఆల్ఫాను ఈ తరానికి పేరుగా పెట్టారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్–19 ఈ తరంలోనే విశ్వవ్యాప్తమైంది. ఈ కోవిడ్‌తో మారిన జీవన శైలిని అనుసరించబోతోంది ఆల్ఫా జనరేషన్. ఏటా 25లక్షల మంది ఈ తరానికి తోడవుతున్నారు. 2025 నాటికి వీరి సంఖ్య 200 కోట్లకు చేరబోతోంది. జన జీవితంలో ప్రతి పదిహేను, ఇరవై సంవత్సరాలకోసారి స్పష్టమైన మార్పులు వస్తుంటాయి. ఆ కాలాన్నే తరంగా అభివర్ణిస్తున్నామని ప్రజల జీవన పోకడలను నిరంతరం పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ ఉండే ప్యూ రీసెర్చ్ సెంటర్ చెబుతోంది. తరాలను వర్గీకరించడం, వాటికి పేర్లు పెట్టడం సైన్స్ ఏమీ కాదు. కేవలం ఆ తరం ఆలోచనలు, అభిరుచులను, పోకడలను అంచనా వేయడం కోసం ఒక సాధనం మాత్రమేనని ప్యూ సెంటర్ అభిప్రాయం. అసలు తరాల వర్గీకరణను గత శతాబ్ది మొదట్లోనే జర్మన్ సామాజిక శాస్త్రవేత్త కార్ట్ మన్హెమ్, స్పానిష్ తత్వవేత్త జోస్ ఒర్తెగా మొదలుపెట్టారు. ఇది ఒకే కాలమాన పరిస్థితుల్లో జీవించే వారి మధ్య ఉండే సామీప్యతలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని వారి వాదన. మన దగ్గర తరాల పరిస్థితి ఏమిటి? పాశ్చాత్య దేశాల్లో జరిగిన తరాల వర్గీకరణ వంటిది మన దగ్గర జరగలేదు. గ్లోబలైజేషన్‌తో ప్రపంచమంతా ఒకేలాంటి పరిస్థితులు ఆవిర్భవించిన నేపథ్యంలో మిలీనియల్స్ నుంచి మనం కూడా పాశ్చాత్య వర్గీకరణను పాటిస్తున్నాం. అయితే విభిన్న పరిస్థితులున్న పాతతరాన్ని అంచనా వేసే ప్రయత్నం భారత్‌లో పెద్దగా జరగలేదు. కొందరు ఔత్సాహికులు భారతీయుల్ని దేశ విభజన తరం (1944–1963), పరివర్తన తరం (1964–1983) సంస్కరణల తరం (1984 నుంచి మొదలు)గా విభజించి విశ్లేషించే ప్రయత్నం చేశారు. మిలీనియల్స్‌ను మన దగ్గర సంస్కరణల తరంగా పరిగణించాలని, ఈ కాలంలోనే భారత సమాజం సమూల మార్పులను చవిచూసిందని అంటున్నారు భారతీయ సామాజిక వేత్తలు. రాజీవ్‌గాంధీ హయాంలో మొదలైన కంప్యూటరీకరణ నుంచి పీవీ నరసింహారావు హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులు విపరీతమైన మార్పులకు లోనయ్యాయన్నది వీరి పరిశీలన. -
సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే కీలకంగా ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం అంతకంతకూ పెరిగిపోతోంది. 2015లో రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం కేవలం 279 మెగావాట్లు కాగా, ఇప్పుడది 4,390.48 మెగావాట్లకు చేరింది. 2020లో రాష్ట్రంలో స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యం 3,744 మెగా వాట్లుగా ఉంది. 2021లో దేశంలో 10 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని స్థాపిస్తే.. అందులో 50 శాతం ఏపీ, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లోనే నెలకొల్పినట్టు అధ్యయనంలో వెల్లడైంది. చదవండి: బల్క్ డ్రగ్స్ పార్క్‌పై టీడీపీ విషం.. ఏపీకి పెట్టుబడులు అడ్డుకునేందుకు కుట్ర సోలార్ రూఫ్‌టాప్ ఇన్స్టలేషన్లు 2021లో 138 శాతం పెరగడంతో 2021–22 చివరి నాటికి 4,148.91 మెగావాట్లుగా నమోదైంది. ప్రస్తుత 2022–23 ఆరి్థక సంవత్సరంలో ఇప్పటికే సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 241.57 మెగా వాట్లు అదనంగా పెరిగింది. ఒక్కో మెగావాట్ నుంచి ఏటా సగటున దాదాపు 15 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో (జనవరి–జూన్) 47.64 బిలియన్ యూనిట్ల సౌర విద్యుదుత్పత్తి జరిగింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 34 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో (మొదటి త్రైమాసికం) 22.22 బిలియన్ యూనిట్లుండగా, రెండో త్రైమాసికం(ఏప్రిల్, మే, జూన్)లో 25.41 బిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. అంటే తొలి త్రైమాసికం కంటే 14 శాతం పెరుగుదల రెండో త్రైమాసికంలో వచ్చింది. అదే 2021లో ఇదే సమయానికి జరిగిన ఉత్పత్తితో పోల్చితే 40 శాతం పెరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 2030 నాటికి థర్మల్ విద్యుత్‌ను 32 శాతానికి తగ్గించాలని, కర్బన ఉద్గారాలను 2070 నాటికి సున్నాకు తేవాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి అనుగుణంగా పునరుత్పాదక విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్న ఏపీని కేంద్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా చూపుతోంది. 2024 నాటికి అందరూ ఏపీనే అనుసరించాలని, వ్యవసాయానికి సౌర విద్యుత్‌నే వాడాలని అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం తాజాగా సూచించింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. పర్యావరణ హితంగా విద్యుదుత్పత్తి సాధించగల సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 రివర్స్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టులను స్థాపిస్తోంది. రానున్న 30 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను రైతన్నకు హక్కుగా అందించాలని నిర్ణయించింది. దాని కోసం ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)తో 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కోసం ఒప్పందం చేసుకుంది. – విజయానంద్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
లాభాల కోసం క్రిప్టోల రిస్క్‌లో పడొద్దు
క్రిప్టో మార్కెట్ పట్ల మిలీనియల్స్ (26–41), జనరేషన్ జెడ్ (25 ఏళ్ల వరకు) వారిలో ఆసక్తి పెరిగిపోయింది. యువ ఇన్వెస్టర్లు క్రిప్టో పెట్టుబడుల పట్ల తమకు తెలియకుండానే ఆకర్షితులవుతున్నారు. స్వల్పకాలంలోనే ఊహించలేనంత లాభాలే ఇన్వెస్టర్ల ఆకర్షణకు కారణంగా చెప్పుకోవాలి. పెట్టుబడి కోణంలో క్రిప్టో కరెన్సీలు/ఎన్ఎఫ్టీలకు చోటు ఇస్తున్న వారు కూడా ఉంటున్నారు. కానీ, క్రిప్టోలకు మనదేశంలో చట్టబద్ధతకు అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లాభాలపై 30 శాతం పన్ను విధించింది. ప్రతీ లావాదేవీ రూపంలో వచ్చే లాభంపై 1 శాతం టీడీఎస్ నిబంధన తీసుకొచ్చింది. మూలధన నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం ఇవ్వలేదు. క్రిప్టో లాభాల కోసం పరుగులు తీసే ఇన్వెస్టర్లు.. ఈక్విటీ పెట్టుబడులతో పోల్చి చూస్తే క్రిప్టో పెట్టుబడులు ఏ మేరకు అనుకూలం? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వివరాలను అందించే కథనమే ఇది. ఈక్విటీ మార్కెట్లతో పాటు క్రిప్టో మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య 2021లో గణనీయంగా పెరిగింది. 2020 నాటికి 4.2 కోట్లుగా ఉన్న ఈక్విటీ ఇన్వెస్టర్ల సంఖ్య 2021 డిసెంబర్ చివరికి 8 కోట్లను దాటింది. ఒక నివేదిక ప్రకారం క్రిప్టో సాధనాల అనుసరణ విషయంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. దేశీయంగా సుమారు 1.5 కోట్ల వరకు క్రిప్టో ఇన్వెస్టర్లు ఉంటారని అంచనా. వీరిలో ఎక్కువ శాతం యువ ఇన్వెస్టర్లే. 32 శాతం 18–24 వయసులోని వారు. మరో 33 శాతం మంది 25–34 వయసు గ్రూపునకు చెందిన వారు. క్రిప్టోలనే కాదు ఎన్ఎఫ్టీలు, ఇతర ఏ రూపాల్లో ఉన్న డిజిటల్ ఆస్తులు (వర్చువల్ అసెట్స్) కూడా 30 శాతం మూలధన లాభాల పన్ను రేటు కిందకు వస్తాయి. ‘‘వర్చువల్ డిజిటల్ ఆస్తులపై 30 శాతం పన్ను రేటు పడుతుంది. కొనుగోలు వ్యయాన్నే లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. మరే ఇతర వ్యయాలను మినహాయింపు కింద క్లెయిమ్ చేసుకోలేరు. పైగా క్రిప్టోలపై వచ్చే లాభాల నుంచి మరే ఇతర నష్టాలను సర్దుబాటు చేసుకునేందుకు అనుమతి లేదు’’ అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సుధాకర్ సేతురామన్ తెలిపారు. అనుకూలతలు/రిస్క్ క్రిప్టోలతో పోలిస్తే ఈక్విటీల్లో వ్యయాలు తక్కువ. క్రిప్టోల్లో రిస్క్ చాలా అధికం. త్వరితగతిన లాభాలను చూసే ఇన్వెస్టర్లు ఈ రిస్క్ అంశాన్ని ఆలోచించడం లేదు. ఈక్విటీలు మెరుగైన నియంత్రణ వాతావరణంలో పనిచేస్తుంటాయి. కానీ, క్రిప్టోలన్నవి నియంత్రణ పరిధిల్లో లేని సాధనాలు. రిస్క్, వ్యయాల పరంగా చూస్తే ఈక్విటీలు మెరుగైన సాధనం అని విశ్లేషకులు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు.. క్రిప్టో కరెన్సీల్లో అతిపెద్దది అయిన బిట్‌కాయిన్ విలువ 2021 సంవత్సరంలో గరిష్ట స్థాయి 68,789 డాలర్ల నుంచి, కనిష్ట స్థాయి 28,130 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. కానీ, అదే కాలంలో నిఫ్టీ 50 సూచీ 14,018 పాయింట్ల నుంచి 17,345 మధ్య ట్రేడ్ అయింది. మరో నిదర్శనం బిట్ కాయిన్ ధర 2021 సెప్టెంబర్ 29న 41,041 డాలర్ల స్థాయి నుంచి నవంబర్ 9న 67,553 డాలర్లకు పెరిగింది. అంటే కేవలం నెలన్నర వ్యవధిలోనే 70 శాతం పెరిగింది. అక్కడి నుంచి మరో నెలన్నర రోజుల్లో డిసెంబర్ 31 నాటికి 47,128 డాలర్లకు పడిపోయింది. 30 శాతానికి పైగా నష్టపోయింది. భారీ అస్థిరతలకు బల మైన నిదర్శనాలు ఇవి. పన్ను ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాల పన్ను 10 శాతంగా ఉంది. ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష వరకు దీర్ఘకాల మూలధన లాభం (ఏడాదికి మించి కొనసాగిన పెట్టుబడులపై/ఎల్టీసీజీ) గడించినప్పుడు పన్ను ఉండదు. రూ.లక్షకు మించి పొందే లాభంపైనే 10 శాతం పన్ను, 4 శాతం సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. అదే కొనుగోలు చేసి ఏడాది నిండకముందు విక్రయించే ఈక్విటీ పెట్టుబడులపై లాభాన్ని స్వల్పకాలిక మూలధన లాభంగా (ఎస్టీసీజీ) చట్టం పరిగణిస్తోంది. ఈ మొత్తంపై పన్ను 15 శాతంగా అమల్లో ఉంది. కనుక క్రిప్టోలతో పోల్చి చూసినప్పుడు ఈక్విటీలే ఆకర్షణీయమని ఐడీఎఫ్సీ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈక్విటీ హెడ్ అనూప్ భాస్కర్ తెలిపారు. ప్రభుత్వం క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను విధించింది. అంతేకాదు ఈ లాభంపై వెంటనే ఒక శాతాన్ని తగ్గించుకునే టీడీఎస్ నిబంధన కూడా తీసుకొచ్చింది. అంటే ఇన్వెస్టర్ లాభం నుంచి ఒక శాతాన్ని క్రిప్టో ఎక్సేంజ్‌లు మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమచేయాల్సి ఉంటుంది. క్రిప్టోల్లో మూలధన లాభం రూ.50లక్షలు మించితే 30 శాతం పన్నుపై సర్‌చార్జ్ కూడా అమలవుతుంది. వర్చువల్ అసెట్స్‌ను బంధువు కాని వారికి బహుమానంగా ఇస్తే, ఇలా ఇచ్చే వాటి విలువ రూ.50,000కు మించి ఉంటే ఆ లావాదేవీని విక్రయంగానే చట్టం పరిగణిస్తుంది. కనుక ఈ మొత్తంపైనా మూలధన లాభాల పన్ను చెల్లించాలి. కనుక క్రిప్టోలకు సంబంధించి ప్రతిపాదిత పన్ను పెద్ద ప్రతికూలమని అనూప్ భాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘‘చిన్న ఇన్వెస్టర్లు, సాధారణంగా పన్ను చెల్లించేంత ఆదాయం పరిధిలో లేని వారు సైతం ఇప్పుడు క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది వారిని నిరుత్సాహానికి గురి చేస్తుంది’’ అని క్రిప్టో సలహాదారు అజీత్ ఖురానా పేర్కొన్నారు. కానీ, నష్టాలు వస్తే పరిస్థితి ఏంటి? ఇన్వెస్టర్ల నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇది. ఈక్విటీ పెట్టుబడులు ఏడాదిలోపు విక్రయించినప్పుడు నష్టం వస్తే స్వల్పకాల మూలధన నష్టం కింద, ఏడాదికి మించిన పెట్టుబడులను విక్రయించగా వచ్చిన నష్టాన్ని దీర్ఘకాల మూలధన నష్టంగా పరిగణిస్తారు. వీటిని ఏడు సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టాలన్నింటినీ లాభాలతో సర్దుబాటు చేసుకోలేకపోతే.. తర్వాతి ఏడు ఆర్థిక సంవత్సరాల్లో (లావాదేవీ జరిగిన సంవత్సరం సహా మొత్తం ఎనిమిది అసెస్మెంట్ సంవత్సరాలు) వచ్చే లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. దాంతో పన్ను పరంగా క్రిప్టో ఇన్వెస్టర్లతో పోలిస్తే ఈక్విటీ ఇన్వెస్టర్లకు ఎంతో ప్రయోజనం ఉందని చెప్పుకోవాలి. క్రిప్టో నష్టాలకు ఈ క్యారీ ఫార్వార్డ్ సదుపాయం లేదు. నష్టాలు ఏవైనా అదే ఏడాది క్రిప్టో లాభాలతోనే సర్దుబాటుకు పరిమితం కావాలి. మరే ఇతర మూలధన లాభాల నుంచి మినహాయించి చూపించుకునే వెసులుబాటు కల్పించలేదు. అలాగే, మరే ఇతర మూలధన నష్టాన్ని క్రిప్టో లాభాల నుంచి మినహాయించుకునే అవకాశం కూడా కల్పించలేదు. నియంత్రణలు నియంత్రణపరంగా చూస్తే ఈక్విటీలు మెరుగైన సాధనం. స్టాక్‌బ్రోకర్, మ్యూచుల్ ఫండ్, మార్కెట్ పార్టిసిపెంట్, ఇంటర్ మీడియరీ ఇలా మార్కెట్ వ్యవస్థలో భాగమైన ప్రతీ సంస్థ కూడా సెబీ నియంత్రణల పరిధిలోనే పనిచేయాలి. అన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది. దీనివల్ల రిస్క్ చేయిదాటి పోకుండా సెబీ చర్యలు తీసుకుంటుంది. కానీ, క్రిప్టో కరెన్సీలపై ఈ నియంత్రణ లేదు. ఈక్విటీల విషయంలో లావాదేవీల గురించి, సేవలు, చార్జీల గురించి సెబీకి ఫిర్యాదు చేసుకోవచ్చు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ క్లయింట్ల సెక్యూరిటీలను తన పూల్ ఖాతాల్లోకి బదిలీ చేసుకుని వాటిని తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం తెలిసిందే. ఈ అంశంలో సెబీ వెంటనే జోక్యం చేసుకుని తనఖాలో ఉన్న షేర్లను ఇన్వెస్టర్లకు దక్కేలా వేగంగా చర్యలు తీసకుంది. కానీ, క్రిప్టో లావాదేవీల విషయంలో ఎవరికి ఫిర్యాదు చేయాలి? ప్రభుత్వం లాభాలపై 30 % పన్ను విధించింది కానీ, నియంత్రణ అంశం జోలికి పోలేదు. ఎందుకంటే క్రిప్టో ఆస్తులన్నవి అంతర్జాతీయంగా ట్రేడ్ అవుతున్నవి. కొనుగోలు చేసిన వర్చువల్ అసెట్స్‌ను ఎక్కడ హోల్డ్ చేస్తున్నారు? సైబర్ మోసాల నుంచి వాటికి రక్షణ ఉంటుందా? పెట్టుబడి పెట్టిన వారికి జరగరానిది జరిగితే, వారి వారసులు ఆ వర్చువల్ ఆస్తులను పొందగలరా? ఇలాంటి అంశాలన్నింటినీ ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఈక్విటీలకు సంబంధించి ఈ రిస్క్ ఉండదు. లావాదేవీల ట్రాకింగ్ క్రిప్టో లాభాలపై ఒక శాతం టీడీఎస్ అమలు చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రతీ లావాదేవీ సమాచారం ఆదాయపన్ను శాఖకు వెళుతుంది. కనుక పన్ను ఎగవేతకు అవకాశం ఉండదనే భావించాలి. ఇప్పటి వరకు క్రిప్టో ఎక్సేంజ్‌లు ఇచ్చిన సమాచారంపైనే ప్రభుత్వం ఆధారపడాల్సిన పరిస్థితి. కానీ, ఇక మీదట టీడీఎస్ నిబంధనతో వివరాలు పక్కాగా తెలుస్తాయి. ‘‘టీడీఎస్ రూపంలో ప్రభుత్వం క్రిప్టో లావాదేవీలను గుర్తించగలదు. డేటాను తీసుకోగలదు. ఇది భవిష్యత్తులో క్రిప్టోల నియంత్రణ విషయంలో సాయపడొచ్చు’’అని క్రిప్టో ఎక్సేంజ్ ‘జెబ్‌పే’ సీఈవో అవినాష్ శేఖర్ తెలిపారు. టీడీఎస్ నిబంధనతో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ అసెట్స్ బదిలీలను నియంత్రించగలదని, ఆదాయం రాబట్టుకోగలదని ఫెలిక్స్ అడ్వైజరీ పార్ట్నర్ అమిత్ జిందాల్ పేర్కొన్నారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఎక్స్ అనే వ్యక్తికి 2022–23 ఆర్థిక సంవత్సరంలో బిట్ కాయిన్లో ట్రేడింగ్‌పై రూ.6 లక్షలు లాభం వచ్చిందనుకుందాం. అలాగే, ఎథీరియం ట్రేడింగ్‌లో రూ.2 లక్షలు నష్టం వచ్చిందనుకుంటే, అప్పుడు నికర లాభం రూ.4లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై 30 శాతం పన్ను రేటు అమలవుతుంది. లాభం రూ.50లక్షల్లోపు ఉంది కనుక సర్‌చార్జీ లేదు. 30 శాతంపై 4 శాతం సెస్సు అమలవుతుంది. అంటే 1.2 శాతం సెస్సు కూడా కలుపుకుంటే వచ్చిన లాభంపై చెల్లించాల్సిన నికర పన్ను 31.2 శాతం అవుతుంది. -
బడుల మూసివేతతో ఒక తరం మొత్తానికి నష్టం!
న్యూఢిల్లీ: కరోనా కారణంగా బడులు మూసివేతతో ఒక తరం మొత్తం దుర్బలమయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక హెచ్చరించింది. ప్రస్తుత విలువ ప్రకారం లెక్కిస్తే ఒక తరం విద్యార్ధులు బడుల మూసివేతతో 17 లక్షల కోట్ల డాలర్ల జీవితకాల ఆర్జనను నష్టపోతారని అంచనా వేసింది. ఈ మొత్తం ప్రస్తుత ప్రపంచ జీడీపీలో 14 శాతానికి సమానమని తెలిపింది. కరోనా కారణంగా పలు దేశాల్లో విద్యా సంస్థలను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిన సంగతి తెలిసిందే. యునెస్కో, యూనిసెఫ్‌తో కలిసి ప్రపంచబ్యాంకు ‘‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ క్రైసిస్’’ పేరిట ఈ నివేదికను రూపొందించింది. గతంలో అనుకున్నదానికన్నా విద్యాసంస్థల మూసివేతతో వచ్చే నష్టం అధికమని తెలిపింది. బడుల మూసివేతతో 10 లక్షల కోట్ల డాలర్లు నష్టమని 2020లో ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. గతంలో అల్పాదాయ దేశాల్లోని పిల్లల్లో 53 శాతం మంది పేదరికంతో జీవించడాన్ని నేర్చుకునేవారని, స్కూల్స్ మూసివేతతో వీరి సంఖ్య 70 శాతానికి చేరనుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో ప్రపంచ విద్యావ్యవస్థలు స్తంభించాయని, కరోనా బయటపడిన 21 నెలల తర్వాత కూడా కోట్లాదిమంది పిల్లల బడులు మూసివేసే ఉన్నాయని వ్యాఖ్యానించింది. వీరిలో చాలామందికి ఇకపై బడికి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చని అంచనా వేసింది. జ్ఞానార్జనకు పిల్లలు దూరం కావడం నైతికంగా సహించరానిదని, ఒకతరం పిల్లలు పేదరికంలోకి జారడం భవిష్యత్ ఉత్పాదకతపై, ఆదాయాలపై పెను ప్రభావం చూపుతుందని ప్రపంచ బ్యాంకు ఎడ్యుకేషన్ గ్లోబల్ డైరెక్టర్ జైమె సావెద్రా వివరించారు. నిజాలను చూపుతున్న గణాంకాలు బడుల మూసివేతతో గతంలో చేసిన అంచనాల కన్నా తీవ్ర ఫలితాలున్నాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నట్లు నివేదిక తెలిపింది. గ్రామీణ భారతం, పాకిస్తాన్, బ్రెజిల్, మెక్సికో తదితర ప్రాంతాల్లో పిల్లలు లెక్కలు, చదవడంలో నష్టపోయారని గణాంకాలు వివరిస్తున్నట్లు తెలిపింది. బడుల మూసివేత ఎంతకాలం కొనసాగింది, విద్యార్థుల సామాజికార్థిక పరిస్థితి, గ్రేడ్ లెవల్‌ను బట్టి నష్టాలుంటాయని వివరించింది. ప్రభుత్వాలు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల్లో కేవలం 3 శాతం కన్నా తక్కువ మొత్తమే విద్యారంగానికి అందాయని విమర్శించింది. చాలా దేశాల విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసుల్లాంటివి చేపట్టినా, వీటి విస్తృతి, నాణ్యత వేర్వేరుగా ఉన్నాయని తెలిపింది. అల్పాదాయ దేశాల్లో సుమారు 20 కోట్ల మంది విద్యార్ధులు నూతన విద్యాబోధనా పద్ధతులకు దూరంగా ఉన్నారని పేర్కొంది. -
ఉపాధిలో నెం.1
-
అవ్వ... ఏంటీ చోద్యం?
పెద్దవాళ్లు చిన్నవాళ్లను అర్థంచేసుకోవడానికి చాట్, స్కైప్, వాట్సప్‌లతో షేక్ హ్యాండ్ చేస్తున్నారు..కాని చాదస్తాన్ని మాత్రం షేక్ చేయలేకపోతున్నారు..మనవడికి, మనవరాలికి మధ్య వివక్షను బ్రేక్చేయలేకపోతున్నారు...అవ్వ... హవ్వ... ఏంటీ చోద్యం? కాలానికనుగుణంగా పెద్ద తరం మారుతోంది. పట్టణాల్లో ఉన్న పిల్లల కోసం, విదేశాల్లో స్థిరపడ్డ మూడో తరం కోసం చాటింగ్, స్కైప్, వాట్సాప్‌లను జీవితాల్లో భాగం చేసుకుంది. ఆ సౌకర్యాలతో రెండో తరం, మూడో తరంతో ఉన్న తమ అనుబంధాలను పటిష్టం చేసుకుంటోంది. మారిన కాలం తెచ్చిన వేగంలో పడికొట్టుకుపోతున్న పిల్లలు రక్తసంబంధాన్ని మరిచిపోకుండా ఉండడానికి పెద్దతరమే ప్రయత్నిస్తోంది. సాంకేతికతను టూల్‌గా మలచుకొని ఈ బంధాలను భద్రం చేసుకుంటోంది. ఈ విషయంలో వర్తమానానికి అప్డేట్ అవడమే కాదు భవిష్యత్‌లో పరుగులు పెట్టడానికీ మానసికంగా సిద్ధమై ఉన్నారు పెద్దలు. అవసరంగా భావిస్తున్నారు కూడా. మంచి పరిణామమే! అయితే ఈ చైతన్యం జెండర్ ఈక్వాలిటీ విషయంలో కనపడ్డం లేదనడానికి.. అనకాపల్లి నుంచి అమెరికా దాకా, అహ్మదాబాద్ నుంచి ఆస్ట్రేలియా దాకా, పంజాబ్ నుంచి పశ్చిమాసియా దాకా, యూపీ నుంచి యూరప్ దాకా ఉన్న భారతీయ కుటుంబాలెన్నో ఉదాహరణలు. పర్మినెంట్‌గా పడ్తుంది విదేశాల్లో ఉన్న పిల్లలు, మనవలు, మనవరాళ్లను చూడ్డానికి వెళ్లిన పెద్దలు రోమ్‌లో రోమన్‌లా కనిపించడానికి జీన్స్, షర్ట్ వేసుకుంటున్నారు..కోలేని వాళ్లు జీన్స్ కుర్తీతో సర్దుకుంటున్నారు. దానికీ ఇబ్బంది పడ్డవాళ్లు సల్వార్, కమీజ్ చాలనుకుంటున్నారు. ఊహించని ఇన్ని మార్పులకు స్వాగతం పలికిన అమ్మలు, అత్తలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇంటి పనులనూ అబ్బాయిలకు సమానంగా పంచేవిషయంలో మాత్రం చాదస్తం వీడట్లేదు. ‘‘అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ జంటలు జనరల్గాఇంట్లో వర్క్ షేర్ చేసుకుంటారు. ఈవెన్ టాయ్‌లెట్స్ కూడా క్లీన్ చేస్తారు. వండర్ ఏంటంటే వాళ్ల పేరెంట్స్ రాగానే మారిపోతారు. పేరెంట్స్ ఫీలవుతారని వాళ్లు వెళ్లిపోయేదాకా ఇంటి పనుల్లో హెల్ప్ చేయరు.‘‘ఎందుకా డ్రామా? కలిసి పనిచేసుకుంటాం.. చేసుకోవాలి కూడా అని సింపుల్‌గా పేరెంట్స్‌తో చెప్పొచ్చుగా’’ అంటే ‘‘ఆ .. ఎందుకులే.. నాలుగు నెలల కోసం వచ్చిన వాళ్లతో ఆర్గ్యూమెంట్స్’’ అంటూ లైట్ తీసుకుంటారు. టెక్నాలజీలోనే కాదు థాట్ ప్రాసెస్ కూడా అప్డేట్ చేసుకోవాలని.. అవసరమనీ పేరెంట్స్‌కు చెప్పాలి కదా’’ అంటుంది న్యూయార్క్‌లో ఎకనమిక్ ఎనలిస్ట్‌గా పనిచేస్తున్న అనుపమా మహీధర్. రక్షణ సంప్రదాయం హయ్యర్‌ఎడ్యుకేషన్ కోసం ఆడపిల్లలను అబ్రాడ్ పంపిన పేరెంట్స్ ఇండియాలో ఇంటి మూల మీదున్న షాప్‌కు తమ్ముడిని తోడిచ్చి పంపే రక్షణ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ‘‘ప్రాజెక్ట్ వర్క్ మీద నేను ఎవ్రీ త్రీమంత్స్ ఆర్ ఫైవ్ మంత్స్కు ఒకసారి యూఎస్, యూరప్‌కు పోతుంటా. ప్రతీసారి ఎయిర్‌పోర్ట్‌కు మా తమ్ముడ్ని తోడు పంపిస్తరు. నవ్వొస్తుంటది. ఆ దేశంలో ల్యాండ్ అయినంక నేనొక్కదాన్నే కదా అన్నీ చూసుకోవాల్సింది. ఈ మాట మా అమ్మకు, నానమ్మకు చెప్తే ఏమంటారో తెల్సా.. ‘‘ఏదోనే నిన్నో అయ్య చేతుల్లో పెట్టేదాకా మమ్మల్నిట్ల ఉండనీ’’ అని. ఏం మాట్లాడ్తం జెప్పండి? అట్లా అనీ మా నానమ్మ, అమ్మ ఏం తెల్వనోళ్లు కారు. ఆ కాలంలనే ఎస్ఎస్ఎల్సీ, ఎస్ఎస్సీ చదివినోళ్లే. మా నానమ్మను మీరేదన్నా అడగండి.. ఉండు గూగుల్ల కొట్టి చూద్దాం అంటది. అట్లాంటి ముసలమ్మ నా విషయం వచ్చేసరికి ఇంత కన్సర్వేటివ్‌గా ఎందుకు ఉంటదో?’’ అంటుంది హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ప్రియాంక యాదవ్ బొట్టు ఓకే.. వంటెందుకు నాట్ ఓకే? లాజిక్‌లేని కొన్ని ఆచారాలను వదిలేసుకున్న ఆ తరం.. పనులకు సంబంధించి ఆడ,మగ వివక్షను మాత్రం వీడట్లేదు. ‘‘ఇందుకు మా అమ్మే మంచి ఉదాహరణ’’ అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు ఈశ్వరి అనే ఒక ప్రభుత్వోద్యోగిని. ‘‘మా అమ్మ కొన్నాళ్లు నా దగ్గర, కొన్నాళ్లు మా అన్నయ్య దగ్గర ఉంటుంది. మా నాన్నపోయినప్పుడు మా అమ్మకు పసుపుకుంకుమలు తుడిచేసేలాంటి తంతును చేయనివ్వలేదు. మా నాన్న పోయినా బొట్టుపెట్టుకోవడాన్ని మా అమ్మ యాక్సెప్ట్ చేసింది. అంత ప్రొగ్రెసివ్‌గా ఉన్న ఆమె మా ఆయన వంట చేయడాన్ని యాక్సెప్ట్ చేయదు. నేను నీ దగ్గరున్నప్పుడు మీ ఆయనకు ఇంటి పనులు చెప్పొద్దు’’ అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది ఒకసారి. నేనూ వర్క్చేస్తాను కదమ్మా.. ఆయన హెల్ప్ చేయకపోతే ఎట్లా? నాన్న పోయినా నువ్వు బొట్టు పెట్టుకోవడం ఎంత న్యాయమో.. ఇదీ అంతే అని చెప్పబోతుంటే దానికీ దీనికీ లంకె ఏంటీ? ఇలాంటి వితండ వాదం చేయొద్దంటుంది’’ అని చెప్తుంది ఈశ్వరి. ఆకలి అందరికీ సమానమైనప్పుడు ఆకలి తీర్చే ఆహారాన్ని తయారు చేయడమూ అందరికి రావాలి కదా! అది కేవలం ఆడవాళ్ల పనే ఎలా అవుతుంది? అప్పుడు అలా..ఇప్పుడు ఇలా.. నా చిన్నప్పుడు ఇంట్లో జెండర్ డిస్క్రిమినేషన్ చూశా. అబ్బాయిలకు కోడిగుడ్లు ఇచ్చి అమ్మాయిలకు ఇవ్వని పరిస్థితి. నిజానికి రెండు కోడిగుడ్లను నలుగురు పిల్లలకు సగం సగం ఇవ్వచ్చు. కానీ అబ్బాయిలు మోర్ ఎనర్జిటిక్‌గా ఉండాలని మాకే ఇచ్చేవాళ్లు. తర్వాత తర్వాత ఇది తప్పని తెలుసుకుంది మా అమ్మ. అప్పటి నుంచి ఇంట్లో వర్క్‌ను అంటే ఎవరు తిన్న ప్లేట్ వాళ్లే తీసి కడగాలి అని నేర్పింది. మా ఇంట్లో ఇప్పటికీ అదే పాటిస్తాం. యూనివర్సిటీ వీసీగా నాకు ప్రివిలేజెస్ ఉంటాయి. అయినా సర్వెంట్స్‌కు ఇవ్వకుండా నేనే నా ప్లేట్‌ను కడిగేస్తా. నా వైఫ్ ఉస్మానియా యూనివర్సిటీలో టీచ్ చేస్తారు. అయితే ఇప్పుడు మా అమ్మ ‘‘అదేంటి నువ్వెందుకు కడుగుతావ్? నీ వైఫ్‌కు చెప్పు.. లేదంటే సర్వెంట్స్ ఉన్నారు కదా?’’ అంటుంది. మా అమ్మేం చదుకోని ఆవిడ కాదు. ఆ కాలంలోనే ఎస్ఎస్ఎల్సీ చేసి ప్రైవేట్ స్కూల్‌కూడా రన్ చేసింది. తరతరాల నుంచి వస్తున్న ఈ ప్రాసెస్ పోవడానికి టైమ్ పడ్తుంది’’– ప్రొఫెసర్ ఇ. సురేష్ కుమార్,వైస్‌చాన్స్‌లర్, ఇఫ్లూ, హైదరాబాద్ చెప్తూ ఉంటాం.. మాకు నాన్న లేరు. నాకు, మా చెల్లెలికి మా అమ్మ, నానమ్మే అన్నీ! నిజానికి మా మీద మా నానమ్మ ఇంపాక్ట్ ఎక్కువ.మాతో సమానంగా కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్చుకుంది. నెట్ బ్రౌజ్ చేస్తుంది. ఎఫ్బీలో ఫొటోస్ పెడితే మార్ఫింగ్ చేస్తారట కదా.. పెట్టుకోకండి అని చెప్తుంది. మమ్మల్ని మగపిల్లలతో సమానంగానే చూస్తుంది. కానీ మా నానమ్మ ఫ్రెండ్స్, చుట్టాల నుంచే మేం డిస్క్రిమినేష్ ఫేస్ చేస్తుంటాం. వాళ్లంతా కూడా మా నానమ్మలా అప్డేట్ అయినవాళ్లే. ఎబ్రాడ్లో ఉన్న వాళ్ల మనవళ్లతో చాటింగ్ చేస్తున్నవాళ్లే. మా విషయంలో నానమ్మ ఒపీనియన్స్‌ను మార్చాలని ట్రై చేస్తుంటారు.– మాదరి మౌనిక, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉద్యోగిని,హైదరాబాద్ ప్రాక్టికల్గాఅవసరం కాబట్టి.. టెక్నాలజీ యూజ్ చేయడంలో మా అమ్మ పర్ఫెక్ట్. అఫ్కోర్స్.. ఇంటి పనుల విషయంలో యాజ్ యూజువల్‌గా ఆ డిస్క్రిమినేషన్ ఉంటుంది. బేసిగ్గా నాకు వంట చేయడం ఇష్టం కాబట్టి కుకింగ్‌లో అమ్మకు హెల్ప్ చేస్తుంటా. కానీ చిన్నప్పటినుంచి ఇంటి పనుల విషయంలో మా అక్క, చెల్లె మీదే ఫోర్స్. టెక్నాలజీ పరంగా అప్డేట్ అవడం ప్రాక్టికల్‌గా అవసరం కాబట్టి అవుతున్నారు. ఆడ, మగ ఈక్వల్ అనే విషయాన్ని అంతే ప్రాక్టికల్‌గా తీసుకోవట్లేదు. అందుకే ఛేంజ్ రాలేదు. మా జనరేషన్ కొంచెం బెటర్. కొంత మంది అబ్బాయిలు వంట చేస్తున్నారు. వైఫ్‌కు హెల్ప్ చేస్తున్నారు. అయితే అనుకున్నంతగా మార్పు రాలేదు అన్నది ట్రూ.– కెప్టెన్ బి. ప్రణీత్ కుమార్,జెట్ ఎయిర్వేస్, హైదరాబాద్. అది వేరు.. ఇది వేరు.. ‘‘ టెక్నాలజీ నేర్చుకోవడం, మగవాళ్లు గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం ఒకటేనా? అది వేరు, ఇది వేరు. ఆడపిల్లలు ఇష్టంగా ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఇంట్లో పని కామన్. అమ్మాయిలు జాబ్ చేయడం అమ్మాయికి గౌరవం, కానీ మగపిల్లాడు చీపురు పట్టుకుంటే ఎంత సిగ్గు? నలుగురికి తెలిస్తే వాడి పరువుంటుందా?’’ అనేది ఒక అమ్మ అభిప్రాయం. ఆమె గృహిణి కాదు. బ్యాంక్ ఎంప్లాయ్.‘‘ఆడవాళ్లే ఇలా ఆలోచిస్తుంటే ఇక మగవాళ్లు ఇంటి పనులు ఎందుకు చేస్తారు? పుట్టుకతో చీపురు, అంట్లుతోమే పీచు, బట్టలు ఉతికే బ్రష్‌ను నడుముకి కట్టుకొని వచ్చారా ఆడవాళ్లు? అని ప్రశ్నిస్తున్నారు చాలా మంది అమ్మాయిలు. దేశమంతా ఇలాగే ఉంది అని కచ్చితంగా నిర్దేశించే కథనం కాదిది. అలాగని జెండర్ ఈక్వాలిటీ పట్ల చైతన్యం లేదు అని తెలిపిన ఈ అభిప్రాయాలనూ తప్పనలేం. దేశంలోని డెబ్బై అయిదు శాతం ఇళ్లల్లోని పరిస్థితికివి అద్దం పడ్తున్నాయన్నదీ అబద్ధం కాదు. ఇంటి పనులతోపాటు పిల్లల పెంపకాన్నీ తల్లిమీదే పెట్టింది సమాజం. ఇంట్లో మనుషులకు తగ్గట్టు, సమాజంలో పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోగల మనస్తత్వం గల స్త్రీ.. పిల్లల పెంపకంలో చూపిస్తున్న వివక్షనూ సరిచేయాలి. ఈ బాధ్యతనూ మోస్తే భవిష్యత్‌లోనైనా జెండర్ ఈక్వాలిటీని ఆశించొచ్చు.– సరస్వతి రమ -
పాత(ర) ధాన్యం... పోషకం
‘పాతర’ అనే మాట నేటి తరానికి కొత్తగా అనిపించినా, తరతరాల నుండి వినిపిస్తున్న పాత మాటే. భూమిని తవ్వి అందులో ధాన్యాన్ని లేదా ఏదైనా వస్తువును పెట్టి మళ్లీ మట్టిని కప్పేదాన్ని ‘పాతర’ అని అంటారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పంటను కళ్లాల్లోకి తెచ్చి నూర్పులు చేస్తారు. ఏడాది పొడుగునా కుటుంబం తినేందుకు సరిపడే ధాన్యం దాచుకునేందుకు, పెళ్లీ, పేరంటాలు, గ్రామదేవతా ఉత్సవాలు వంటి శుభ కార్యాలలో బియ్యం కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తగా పాతర వేసి ధాన్యం నిల్వ ఉంచుకుంటారు. సంక్రాంతి అనంతరం కళ్లాల్లోని ధాన్యలక్ష్మిని పూజించి ఇంటికి తెచ్చి వాటిని పాతర వేస్తారు. అలా మే నెలాఖరు వరకు పాతర్లలో ధాన్యం నిల్వ చేస్తారు. అనంతరం బయటకు తీసిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టి మిల్లు చేస్తారు. ఇలా పాతర వేసిన బియ్యం నాణ్యంగా, ఆరోగ్యకరమైన పోషక విలువలుండేలా, రుచికరంగా ఉంటాయని పాత తరం వారు చెబుతున్నారు. సంక్రాంతి నుండి నెల రోజుల పాటు నిత్యం పాతరను ఆవుపేడతో ఆవుపేడతో అలుకుతారు. ఉదయం, సంధ్యవేళల్లో రంగురంగుల ముగ్గులతో అలకంరించి, వాటిపై గొబ్బెమ్మలు పెట్టి ధాన్యలక్ష్మీ అవతారంగా భావించి దీపారాధన చేస్తారు. పాతర వేయడంలో ఆంతర్యం ఇదే... పాతర ధాన్యం తిన్న పాపలు పుష్టిగా ఉంటారని గ్రామీణ ప్రాంతాల్లో నానుడి ప్రచారంలో ఉంది. ఈ ధాన్యం ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా భూస్వాముల ప్రతిష్టకు గౌరవం తెచ్చేవిగా చెబుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు అధికంగా పూరింట్లో నివాసం ఉండేవారు. జనవరి నెల నుంచి మే, జూన్ నెల వరకు అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇళ్లల్లో దాచిన సమయాల్లో అగ్నికి ఆహుతి కాకుండా ముందస్తు జాగ్రత్తగా ఇళ్ల ముందు గొయ్యి తీసి అందులో ధాన్యం ఉంచడం వల్ల అవి సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. మే నెలలో అధికంగా వివాహాలు, గ్రామదేవత ఉత్సవాలు రోజుల తరబడి నిర్వహించే నేపథ్యంలో ఇంటికి వచ్చిన అతిథులకు, స్నేహితులకు, బంధువులకు మూడు పూటలా భోజనాలు అవసరమైనపక్షంలో వెంటవెంటనే పాతర్ల నుండి అవసరం మేర ధాన్యం తీసి వినియోగించేవారు. అంతేకాకుండా కరువు కాటకాలు ఏర్పడిన సమయంలో పాతర్లలో ధాన్యం వినియోగించేవారు. – మద్దిలి కేశవరావు, సాక్షి, ఇచ్ఛాపురం రూరల్ పాతర ఎత్తును బట్టి... గ్రామాల్లో రైతుల ఇళ్ల ముందు వేసిన పాతర ఎంత ఎత్తులో ఉంటే ఆతను ఎన్ని ఎకరాల భూస్వామిగా అప్పట్లో నిర్ధారించేవారు. అంతేకాదు, సదరు రైతు హుందాకు చిహ్నంగా పాతరను చెప్పవచ్చు. ఆ ఏడాది పొడవునా అన్నదాతగా ఆ రైతుకు గౌర మర్యాదలు దక్కేవి. -
తెలుగు మాధుర్యాన్ని భావితరాలకు పంచుదాం
కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): సమాజంపై నవీన నాగిగరికత ప్రభావం పెరిగిపోతున్న నేపథ్యంలో తెలుగు భాష మాధుర్యాన్ని భావితరాలకు పంచేందుకు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా తెలుగు పండితులు కృషి చేయాలని కర్నూలు జిల్లా తెలుగురచయితల సంఘం అధ్యక్షులు గన్నమరాజు సాయిబాబా పిలుపునిచ్చారు. స్థానిక మద్దూర్ నగర్‌లోని తెలుగుతోటలో ఆదివారం ‘తెలుగు పద్యము-వ్యక్తిత్వ వికాసము’ అన్న అంశంపై ఏర్పాటు చే సిన సాహిత్య సదస్సులో సాయిబాబా మాట్లాడారు. సాహిత్య సౌరభాల గుభాళింపులే సమాజ చైతన్యానికి ప్రామాణికమన్నారు. విశాలము, విస్తార భావాలను సంక్షిప్తంగా రసవత్తరంగా పదకూర్పుతో పద్యాలల్లి సమాజానికి దిశానిర్దేశము చేయగల సత్తా ఒక కవికి మాత్రమే ఉందన్నారు. వేమనశతకం, కృష్ణశతకాల్లో అలతి అలతి పదాలతో మహోన్నత వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే నీతి బోధనలెన్నో ఉన్నాయన్నారు. బాల్యం నుంచి ఇలాంటి పద్యకవితలపై అవగాహన కల్పిస్తే భావితరాలు కూడా తెలుగుభాషలోని తీయదనాన్ని రుచి చూస్తారనీ, తద్వారా మాతృభాష ఔన్నత్యాన్ని చాటిచెప్పిన వారమవుతామన్నారు. అనంతరం డోన్‌కు చెందిన తెలుగు పండితుడు సురేష్ దంపతులను ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, జేఎస్ఆర్కే శర్మ, వీపూరి వెంకటేశ్వర్లు, పురోహితులు శ్రీనివాసులు, రఘుబాబు, కెంగేరి మోహన్, సూర్యచంద్రారెడ్డి, రఘునాథ్, హరినాథ్, శ్రీధర్‌మూర్తి, దేవేంద్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
పేరెంట్స్‌కన్నా పేదోళ్లు ఈ తరం పిల్లలు
న్యూయార్క్: రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక అభివృద్ధి చెందిన దేశాల్లో తాత ముత్తాతలు, తల్లిదండ్రలు కన్నా పిల్లలు ఎక్కువగా సంపాదిస్తూ వచ్చారు. 1993 నుంచి 2005 వరకు ఆ తరం ఆదాయాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి చెందిన దేశాల్లో 98 శాతం మంది ఆదాయం ఏటా పెరుగుతూ వచ్చింది. ఈ ట్రెండ్ కనీసం 25 అభివృద్ధి చెందిన దేశాల్లో స్పష్టంగా కనిపించింది. 2005 నుంచి 2014 సంవత్సరాల మధ్య నవతరం ఆదాయాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 70 శాతం ఈ తరం ఇళ్లలో తాతముత్తాతలు, తల్లిదండ్రులకన్నా ఆదాయం ఉన్న చోట ఆగిపోవడంగానీ, తగ్గిపోవడంగానీ జరుగుతోంది. ఈ ప్రతికూల పరిణామాన్ని కొంతమేరకైనా తగ్గిద్దామనే ఆలోచనతో కొన్ని దేశాల ప్రభుత్వాలు పన్నులను తగ్గించడమే రాయితీలను కూడా పెంచాయి. అయినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. ఇటలీ లాంటి దేశాల్లో పరిస్థితి మరింత దిగజారింది. 2005 నుంచి 2014 మధ్య ఇటలీలో 97 శాతం మంది ఆదాయం నిలకడగా ఉండడంగానీ, పడిపోవడంగానీ జరగ్గా, ఆదాయం పన్ను రాయితీల అనంతరం వారి శాతం నూటికి నూరు శాతం చేరుకుంది. అమెరికాలో ఈ ట్రెండ్ వైవిధ్యంగా ఉంది. ఇదే కాలానికి 80 శాతం ఈ తరం అమెరికన్ల ఆదాయం నిలకడగా, లేదా పడిపోగా పన్ను రాయితీల వల్ల వారందరి ఆదాయం పెరిగింది. దీనికి కారణం 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యం ఒక కారణంకాగా, అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వ్యత్యాసం బాగా పెరగడం, అంటే కొంత మంది వద్దనే ఆదాయం ఎక్కువగా పోగవడం మరో కారణమని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. లేబర్ మార్కెట్లో వయసుమీరిన వారు కూడా ఎక్కువవడం కూడా కారణమని వారంటున్నారు. ఏదేమైనా ‘మ్యాక్‌కిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్’ విడుదల చేసిన ఈ ఆర్థిక విశ్లేషణలు ఆసక్తిదాయకంగా ఉన్నాయని, ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై చర్చించే అవకాశం వచ్చిందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. -
రూ.100 కోట్ల క్లబ్ లో సింగమ్ రిటర్న్స్!
ముంబై: అజయ్ దేవగన్, కరీనా కపూర్ లు జంటగా నటించిన 'సింగమ్ రిటర్న్స్' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం వసూళ్లలో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. తొలి రోజే రూ.30 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సింగమ్ రిటర్న్స్ రూ.100 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం రూ. 92 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 2014లో విడుదలై అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన జాబితాలో చోటు సంపాదించింది. తమిళ నటుడు సూర్య చేసిన సింగం 2 కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే భారీ వసూళ్లతో డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంటపండిస్తోంది. ఒక స్టార్ హీరో, ఒక స్టార్ హీరోయిన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంపై ఆది నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. -
కన్నీళ్లు పెట్టుకున్నహీరో!
ముంబై:ప్రతీ ఒక్కరి జీవితంలో కన్నీళ్లు పెట్టుకునే సందర్భాలు రావంటే అది అతిశయోక్తే అవుతుంది. కన్నీళ్లు పెట్టుకోవడానికి రియల్ హీరో-రీల్ హీరో అనే తారతమ్యం కూడా ఏమీ ఉండదు. అటువంటి సందర్భమే ఒకటి బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ జీవితంలో కూడా తాజాగా చోటు చేసుకుంది. సింగమ్ రిటర్న్స్ విజయాన్ని ఆకాంక్షిస్తూ తన స్నేహితుడు, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాసిన లెటర్ చూసి అజయ్ కన్నీళ్లు పెట్టుకున్నాడట. ప్రస్తుతం పుణేలోని యర్రవాడ సెంట్రల్ జైల్లో ఉంటున్న సంజయ్ దత్ రాసిన ఉత్తరం అజయ్ ను మనసును కదిలించిందట. ఒక తెల్లటి రూల్ పేపర్ మీద బ్లూ -ఇంక్ తో సంజయ్ రాసిన లెటర్ లో సింగమ్ రిటర్న్స్ సందర్భంగా అజయ్ దేవగన్ కు అభినందనలు తెలియజేస్తూ తన పాత జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నాడు. ఇదే సందర్భంలో 2008లో వీరిద్దరూ కలిసి నటించిన 'మెహ్ బూబా' సినిమా సందర్భంలో వారు కలిసి డ్యాన్స్ చేసిన సన్నివేశాలను నెమరవేసుకున్నాడు. 'రాజు(అజయ్ ను సంజయ్ పిలుచుకునే పేరు) మనం తిరిగి కలిసినప్పుడు మన చేతి రాతతో రాసుకున్న పుస్తకాలను మార్చుకుందాం. ముందుగా ఈ లెటర్ రాస్తున్నాను. నువ్వు హీరోగా చేసిన సింగమ్ రిటర్న్స్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని లెటర్ లో తెలిపాడు. ఇక్కడ నువ్వు సంతోషించాల్సిన విషయం ఒకటి ఉంది. నేను 11 కిలోల బరువు తగ్గాను. జైల్లో క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తున్నాను.నేను చొక్కా వేసుకోకుండా ఉన్నప్పుడు 8 ప్యాక్స్ కనిపిస్తుందని' సంజయ్ తెలిపాడు. ఈ లెటర్ చూసిన అనంతరం తనకు కన్నీళ్లు ఆగలేదని స్వయంగా అజయ్ దేవగన్ పేర్కొన్నాడు. అంతకుముందు ఆ హీరోల తండ్రులు సునీల్ దత్, వీరూ దేవగన్ లు మధ్య ఉండే సాన్నిహిత్యాన్నే ఈ ఇద్దరూ కంటిన్యూ చేస్తుండటం నిజంగా గర్వించదగ్గ విషయమే. తమిళ హీరో సూర్య నటించిన సింగం-2 రీమేక్ గా వస్తున్న సింగమ్ రిటర్న్స్ లో అజయ్ దేవగన్, కరీనా కపూర్ లు జంటగా నటిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్ టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
రోహిత్ శెట్టి మన్మోహన్ అంతటివాడు..
ముంబై: రోహిత్ శెట్టి తాజా సినిమా సింగమ్ రిటర్న్స్‌లో నటిస్తున్న కరీనా కపూర్ అతడిపై ప్రశంసలు జల్లు కురిపించింది. ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసిన నిన్నటితరం దర్శకుడు మన్మోహన్ దేశాయ్‌తో రోహిత్ పోటీపడగలడని కితాబిచ్చింది. ‘రోహిత్.. నేటితరం మన్మోహన్ దేశాయ్ వంటివాడు. అతణ్ని నేను ఇదే పేరుతో పిలుస్తాను. ప్రతి ఒక్క హీరోయిన్ ఇతని దగ్గర పనిచేయాలని కోరుకుంటుంది. నాకు గతంలోనూ మంచి అవకాశాలు ఇచ్చాడు’ అని వివరించింది. సింగమ్‌లో కాజల్ హీరోయిన్గా నటించినా, దీని సీక్వెల్లో మాత్రం బెబోకు అవకాశం వచ్చింది. రోహిత్‌కు తాను పెద్ద అభిమానిని కాబట్టే ఈ రెండో భాగంలో నటించేందుకు సంతోషంగా ఒప్పుకున్నానని వివరించింది. ‘ఇంతకుముందు కూడా అజయ్ దేవ్‌గణ్‌తోపాటు నటించాను కాబట్టి షూటింగ్ సెట్లు మా ఇల్లులాగే అనిపించాయి. ఇందులో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది’ అని కరీనా వివరించింది. సింగమ్ రిటర్న్స్ వచ్చే నెల 15న విడుదలవుతోంది. -
రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులు దేశభద్రతకు ముప్పు
కార్మికుల హక్కులు కాలరాస్తున్న ఎన్డీఏ సర్కార్ సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి వరలక్ష్మి కోలారు : దేశ రక్షణ రంగంలోకి వందశాతం విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడం వల్ల దేశభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి వరలక్ష్మి హెచ్చరించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక హక్కుల జాగృతి జాతాను నగరంలోని కోర్టు సర్కల్ వద్ద ఆదివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. గతంలో రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులు అనుమతించిన యూపీఏ చర్యలను ఖండించిన ఎన్డీఏ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలు ప్రస్తుతం వందశాతం పెట్టుబడులకు తెరలేపడం దారుణమన్నారు. బహుళ జాతి కంపెనీలకు అందలమెక్కించే ప్రయత్రంలో భాగంగానే ఎన్డీఏ ప్రభుత్వం ఇంధన ధరలు పెంచిందని ఆరోపించారు. రైల్వే మంత్రి సదానంద గౌడ రైల్వేలను ప్రైవేటు పరం చేయాలని యోచిస్తుండగా, ప్రధాని కార్మికుల హక్కులను కాలరాస్తూ వ్యవస్థ పునాదులనే పెకలించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ సర్కార్‌లో కనీసం పత్రికా ప్రకటనలు కూడా చేయలేని స్థితిలో మంత్రులు, ఎంపీలు ఉండడం శోచనీయమన్నారు. 84 కోట్ల మందిలో బీజేపీకి ఓటు వేసింది 37 శాతం మాత్రమేనన్నారు. కార్మికులు తమ హక్కులను కాపాడుకోవడానికి సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఈ నెల 11 నుంచి 14 వరకు బళ్లారిలో జరిగే అఖిల భారత కౌన్సిల్ సభలో పోరాట రూపురేఖలను రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ తాలూకా అధ్యక్షుడు యల్లప్ప, రాష్ట్ర సమితి సభ్యుడు అర్జునన్, జిల్లాధ్యక్షుడు గాంధీనగర్ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీపీసీపై నీలి నీడలు