1995 నుంచి 2012 మధ్య జన్మించిన పిల్లలే ‘జనరేషన్ జెడ్’
అధునాతన స్మార్ట్‌ఫోన్‌లు విరివిగా వినియోగించే ఇంటర్నెట్ యుగంలో జన్మించినవారు
జెన్ జెడ్ కేటగిరీకి చెందినవారు ప్రపంచాన్ని భిన్నంగా చూస్తారు
ఆన్‌లైన్‌లో స్నేహితులను కలుసుకోవడానికి, భౌతికంగా స్నేహితులను కలుసుకోవడానికి తేడా లేదట
తక్కువ ఒత్తిడికి గురవుతున్న జెన్ జెడ్
ఈ ఆధునిక ఇంటర్నెట్ ప్రపంచంలో ఈ తరం యువత అన్నిరంగాల్లోనూ వేగంగా ముందుకు దూసుకుపోతోంది. ఇటీవలి కాలంలో ‘జెన్ జెడ్’ అనే పదం విరివిగా వాడుకలో ఉంది. జెన్ జెడ్ అంటే జనరేషన్ జెడ్. ఇదేమీ సాంకేతిక పదం కాదు. ఈ కాలం యువతకు ఈ పదం వర్తిస్తుంది. జనరేషన్ జెడ్‌పై 2024లో విపరీతంగా చర్చలు జరిగాయి.
ఒక అమెరికన్ ఇన్స్టిట్యూట్ తెలిపిన వివరాల ప్రకారం, 1995 నుంచి 2012 మధ్య జన్మించిన పిల్లలను ‘జనరేషన్ జెడ్’ అని అంటారు. వీరు అధునాతన స్మార్ట్‌ఫోన్‌లు విరివిగా వినియోగించే ఇంటర్నెట్ యుగంలో జన్మించారు. ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధిని పరిశీలిస్తే, అది 1995 సంవత్సరం తర్వాత అత్యంత వేగంగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌లు, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌లు విరివిగా అందుబాటులోకి వచ్చిన తరుణంలో పుట్టిన చిన్నారులు సాంకేతికంగా మరింత ముందడుగు వేస్తారని నిపుణులు అంటున్నారు. ఇంతేకాదు మునుపటి తరంతో పోలిస్తే, జెన్ జెడ్ కేటగిరీకి చెందినవారు మరింత స్నేహశీలురుగా మెలుగుతూ, ప్రపంచాన్ని భిన్నంగా చూస్తారని చెబుతున్నారు. మాట తీరు ఇంతకుముందు తరాలకు భిన్నంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జనరేషన్ జెడ్.. సంక్షిప్తంగా జెన్ జెడ్.. వ్యవహారికంగా జూమర్స్ అని ప్రస్తుత తరం యువతను పిలుస్తున్నారు. ఈ తరంలో జన్మించినవారు అంతకుముందు తరాలవారి వ్యవహరశైలికి భిన్నంగా ఉంటున్నారు. వీరి విద్యాభ్యాసం విషయానికొస్తే తమ ముందు తరాల కంటే కొంత భిన్నమైన విద్యావిధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం జెన్ జెడ్ తరం వారు హైస్కూలు మొదలుకొని ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న వారిగా ఉన్నారు.
వీరు ఆన్‌లైన్‌లో స్నేహితులను కలుసుకోవడానికి, భౌతికంగా స్నేహితులను కలుసుకోవడానికి మధ్య పెద్దగా తేడా చూపరు. ఈ కారణంగానే వారు అధికస్థాయిలో స్నేహితులను సంపాదించుకుంటున్నారు. ఇందుకు సాంకేతికను విరివిగా ఉపయోగిస్తున్నారు. జెన్ జెడ్ డిజిటల్ ప్రపంచాన్ని అభివృద్ధి చేయడంతోపాటు దానిని స్వీకరించిన మొదటి తరం. ఈ తరం డిజిటల్ ప్లాట్‌ఫారాలకు, సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంటుంది.
కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో మిగిలిన తరాల వారు ఎంతో ఇబ్బంది పడినా జెన్ జెడ్ వర్గం వారు దానిని కష్టసమయంగా భావించలేదు. ఇంటర్నెట్ సహాయంతో వారు అనేక విషయాలు తెలుసుకున్నారు. మిగిలిన తరాలకు భిన్నంగా ఆలోచిస్తూ జెన్ జెడ్ వర్గంవారు ముందుకు దూసుకుపోతున్నారు. మిగిలిన తరాల కన్నా జెన్ జెడ్
వర్గం తక్కువ ఒత్తిడికి గురవుతున్నదని పరిశోధనల్లో తేలింది. ఇంతకుముందు తరాలవారిని ఏ పేరుతో పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ది గ్రేటెస్ట్ జనరేషన్ (1901 నుండి 1927 మధ్యకాలంలో జన్మించనవారు) వీరు తమ బాల్యంలో యుద్ధం, వ్యాధులు, ఆర్థిక కష్టనష్టాల వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు.
సైలెంట్ జనరేషన్ (1928 నుండి 1945 మధ్యకాలంలో జన్మించినవారు)ఈ తరంలోనివారు ప్రపంచ యుద్ధాన్ని, బానిసత్వాన్ని చవిచూసారు. దేనికీ స్పందించకుండా, నిరసించకుండా అన్యాయాన్ని భరిస్తూ వచ్చినందున ఈ జనరేషన్ వారిని సైలెంట్ జనరేషన్ అని సంబోధిస్తున్నారు.
బేబీ బూమర్ జనరేషన్(1946 నుండి 1964 మధ్యకాలంలో జన్మించినవారు) ఈ తరాన్ని ఆధునిక యుగానికి నాందిగా చెబుతారు. రాక్ అండ్ రోల్, హిప్పీ సంస్కృతి, సినిమా, కళ, సంగీతానికి కొత్త మెరుగులు దిద్దిన ఘనత ఈ తరానికి చెందుతుంది. ప్రస్తుతం, ఈ తరానికి చెందిన వారు పాత- కొత్త తరాలకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
జనరేషన్ ఎక్స్ (1965 నుండి 1980 మధ్య కాలంలో పుట్టినవారు) బేబీ బూమర్‌ల మాదిరిగానే, ఈతరం వారు కూడా ఆధునిక యుగానికి నాందిగా నిలిచారు. ఈ తరం వారు పాత- కొత్త తరాలకు వారధులుగా ఉన్నారు.
మిలీనియల్స్(1981 నుండి 1996 మధ్యకాలంలో జన్మించినవారు) ఈ తరం వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని జీవితంలో గణనీయమైన మార్పులను చూశారు. ఈ మార్పులకు అనుగుణంగా జీవితాలను మలచుకున్నారు. మునుపటి తరాలతో పోలిస్తే ప్రపంచంపై ప్రత్యేకమైన దృక్పథాన్ని ఏర్పరుచుకున్నారు.
జనరేషన్ జెడ్ (1997 నుండి 2012 మధ్యకాలంలో పుట్టినవారు)1995 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జనరేషన్ జెడ్ అని అంటారు. ఆధునిక, సాంకేతిక సౌకర్యాలను అందిపుచ్చుకోవడంలో వీరు ముందున్నారు.
జనరేషన్ ఆల్ఫా (2013 నుండి 2025 మధ్య కాలానికి చెందినవారు) జనరల్ ఆల్ఫా పిల్లలు అధునాతన సాంకేతికతకు చిన్నవయసులోనే అలవాటుపడతారు. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, సోషల్ మీడియాను అంటిపెట్టుకుని ఉంటారు. జెన్ ఆల్ఫాతరం వారు 21వ శతాబ్దపు అతి పిన్న వయస్కులైన వారిగా పరిగణిస్తున్నారు.
ఇది కూడా చదవండి: బోరుబావి ప్రమాదాలకు అంతం లేదా? నాలుగేళ్లలో 281 మంది చిన్నారులు మృతి
Comments
Please login to add a commentAdd a comment