- కార్మికుల హక్కులు కాలరాస్తున్న ఎన్‌డీఏ సర్కార్
- సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి వరలక్ష్మి
కోలారు : దేశ రక్షణ రంగంలోకి వందశాతం విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడం వల్ల దేశభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి వరలక్ష్మి హెచ్చరించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక హక్కుల జాగృతి జాతాను నగరంలోని కోర్టు సర్కల్ వద్ద ఆదివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు.
గతంలో రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులు అనుమతించిన యూపీఏ చర్యలను ఖండించిన ఎన్‌డీఏ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలు ప్రస్తుతం వందశాతం పెట్టుబడులకు తెరలేపడం దారుణమన్నారు. బహుళ జాతి కంపెనీలకు అందలమెక్కించే ప్రయత్రంలో భాగంగానే ఎన్‌డీఏ ప్రభుత్వం ఇంధన ధరలు పెంచిందని ఆరోపించారు.
రైల్వే మంత్రి సదానంద గౌడ రైల్వేలను ప్రైవేటు పరం చేయాలని యోచిస్తుండగా, ప్రధాని కార్మికుల హక్కులను కాలరాస్తూ వ్యవస్థ పునాదులనే పెకలించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ సర్కార్‌లో కనీసం పత్రికా ప్రకటనలు కూడా చేయలేని స్థితిలో మంత్రులు, ఎంపీలు ఉండడం శోచనీయమన్నారు. 84 కోట్ల మందిలో బీజేపీకి ఓటు వేసింది 37 శాతం మాత్రమేనన్నారు. కార్మికులు తమ హక్కులను కాపాడుకోవడానికి సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.
ఈ నెల 11 నుంచి 14 వరకు బళ్లారిలో జరిగే అఖిల భారత కౌన్సిల్ సభలో పోరాట రూపురేఖలను రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ తాలూకా అధ్యక్షుడు యల్లప్ప, రాష్ట్ర సమితి సభ్యుడు అర్జునన్, జిల్లాధ్యక్షుడు గాంధీనగర్ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.