లాభాల కోసం క్రిప్టోల రిస్క్‌లో పడొద్దు | Investing in Cryptocurrency: Risks, Safety Legal Status | Sakshi
Sakshi News home page

ఎప్పటికీ షం‘షేర్‌’!

Published Mon, Feb 21 2022 4:32 AM | Last Updated on Mon, Feb 21 2022 7:45 AM

Investing in Cryptocurrency: Risks, Safety Legal Status - Sakshi

క్రిప్టో మార్కెట్‌ పట్ల మిలీనియల్స్‌ (26–41), జనరేషన్‌ జెడ్‌ (25 ఏళ్ల వరకు) వారిలో ఆసక్తి పెరిగిపోయింది. యువ ఇన్వెస్టర్లు క్రిప్టో పెట్టుబడుల పట్ల తమకు తెలియకుండానే ఆకర్షితులవుతున్నారు. స్వల్పకాలంలోనే ఊహించలేనంత లాభాలే ఇన్వెస్టర్ల ఆకర్షణకు కారణంగా చెప్పుకోవాలి. పెట్టుబడి కోణంలో క్రిప్టో కరెన్సీలు/ఎన్‌ఎఫ్‌టీలకు చోటు ఇస్తున్న వారు కూడా ఉంటున్నారు.

కానీ, క్రిప్టోలకు మనదేశంలో చట్టబద్ధతకు అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లాభాలపై 30 శాతం పన్ను విధించింది. ప్రతీ లావాదేవీ రూపంలో వచ్చే లాభంపై 1 శాతం టీడీఎస్‌ నిబంధన తీసుకొచ్చింది. మూలధన నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం ఇవ్వలేదు. క్రిప్టో లాభాల కోసం పరుగులు తీసే ఇన్వెస్టర్లు.. ఈక్విటీ పెట్టుబడులతో పోల్చి చూస్తే క్రిప్టో పెట్టుబడులు ఏ మేరకు అనుకూలం? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వివరాలను అందించే కథనమే ఇది.  

ఈక్విటీ మార్కెట్లతో పాటు క్రిప్టో మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య 2021లో గణనీయంగా పెరిగింది. 2020 నాటికి 4.2 కోట్లుగా ఉన్న ఈక్విటీ ఇన్వెస్టర్ల సంఖ్య 2021 డిసెంబర్‌ చివరికి 8 కోట్లను దాటింది. ఒక నివేదిక ప్రకారం క్రిప్టో సాధనాల అనుసరణ విషయంలో భారత్‌ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. దేశీయంగా సుమారు 1.5 కోట్ల వరకు క్రిప్టో ఇన్వెస్టర్లు ఉంటారని అంచనా. వీరిలో ఎక్కువ శాతం యువ ఇన్వెస్టర్లే. 32 శాతం 18–24 వయసులోని వారు. మరో 33 శాతం మంది 25–34 వయసు గ్రూపునకు చెందిన వారు.

క్రిప్టోలనే కాదు ఎన్‌ఎఫ్‌టీలు, ఇతర ఏ రూపాల్లో ఉన్న డిజిటల్‌ ఆస్తులు (వర్చువల్‌ అసెట్స్‌) కూడా 30 శాతం మూలధన లాభాల పన్ను రేటు కిందకు వస్తాయి. ‘‘వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులపై 30 శాతం పన్ను రేటు పడుతుంది.  కొనుగోలు వ్యయాన్నే లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. మరే ఇతర వ్యయాలను మినహాయింపు కింద క్లెయిమ్‌ చేసుకోలేరు. పైగా క్రిప్టోలపై వచ్చే లాభాల నుంచి మరే ఇతర నష్టాలను సర్దుబాటు చేసుకునేందుకు అనుమతి లేదు’’ అని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ సుధాకర్‌ సేతురామన్‌ తెలిపారు.  

అనుకూలతలు/రిస్క్‌
క్రిప్టోలతో పోలిస్తే ఈక్విటీల్లో వ్యయాలు తక్కువ. క్రిప్టోల్లో రిస్క్‌ చాలా అధికం. త్వరితగతిన లాభాలను చూసే ఇన్వెస్టర్లు ఈ రిస్క్‌ అంశాన్ని ఆలోచించడం లేదు. ఈక్విటీలు మెరుగైన నియంత్రణ వాతావరణంలో పనిచేస్తుంటాయి. కానీ, క్రిప్టోలన్నవి నియంత్రణ పరిధిల్లో లేని సాధనాలు. రిస్క్, వ్యయాల పరంగా చూస్తే ఈక్విటీలు మెరుగైన సాధనం అని విశ్లేషకులు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఉదాహరణకు.. క్రిప్టో కరెన్సీల్లో అతిపెద్దది అయిన బిట్‌కాయిన్‌ విలువ 2021 సంవత్సరంలో గరిష్ట స్థాయి 68,789 డాలర్ల నుంచి, కనిష్ట స్థాయి 28,130 డాలర్ల మధ్య ట్రేడ్‌ అయింది. కానీ, అదే కాలంలో నిఫ్టీ 50 సూచీ 14,018 పాయింట్ల నుంచి 17,345 మధ్య ట్రేడ్‌ అయింది. మరో నిదర్శనం బిట్‌ కాయిన్‌ ధర 2021 సెప్టెంబర్‌ 29న 41,041 డాలర్ల స్థాయి నుంచి నవంబర్‌ 9న 67,553 డాలర్లకు పెరిగింది. అంటే కేవలం నెలన్నర వ్యవధిలోనే 70 శాతం పెరిగింది.

అక్కడి నుంచి మరో నెలన్నర రోజుల్లో డిసెంబర్‌ 31 నాటికి 47,128 డాలర్లకు పడిపోయింది. 30 శాతానికి పైగా నష్టపోయింది. భారీ అస్థిరతలకు బల మైన నిదర్శనాలు  ఇవి.  పన్ను ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాల పన్ను 10 శాతంగా ఉంది. ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష వరకు దీర్ఘకాల మూలధన లాభం (ఏడాదికి మించి కొనసాగిన పెట్టుబడులపై/ఎల్‌టీసీజీ) గడించినప్పుడు పన్ను ఉండదు. రూ.లక్షకు మించి పొందే లాభంపైనే 10 శాతం పన్ను, 4 శాతం సెస్సు చెల్లించాల్సి ఉంటుంది.

అదే కొనుగోలు చేసి ఏడాది నిండకముందు విక్రయించే ఈక్విటీ పెట్టుబడులపై లాభాన్ని స్వల్పకాలిక మూలధన లాభంగా (ఎస్‌టీసీజీ) చట్టం పరిగణిస్తోంది. ఈ మొత్తంపై పన్ను 15 శాతంగా అమల్లో ఉంది. కనుక క్రిప్టోలతో పోల్చి చూసినప్పుడు ఈక్విటీలే ఆకర్షణీయమని ఐడీఎఫ్‌సీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఈక్విటీ హెడ్‌ అనూప్‌ భాస్కర్‌ తెలిపారు.  ప్రభుత్వం క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను విధించింది. అంతేకాదు ఈ లాభంపై వెంటనే ఒక శాతాన్ని తగ్గించుకునే టీడీఎస్‌ నిబంధన కూడా తీసుకొచ్చింది.

అంటే ఇన్వెస్టర్‌ లాభం నుంచి ఒక శాతాన్ని క్రిప్టో ఎక్సేంజ్‌లు మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమచేయాల్సి ఉంటుంది. క్రిప్టోల్లో మూలధన లాభం రూ.50లక్షలు మించితే 30 శాతం పన్నుపై సర్‌చార్జ్‌ కూడా అమలవుతుంది. వర్చువల్‌ అసెట్స్‌ను బంధువు కాని వారికి బహుమానంగా ఇస్తే, ఇలా ఇచ్చే వాటి విలువ రూ.50,000కు మించి ఉంటే ఆ లావాదేవీని విక్రయంగానే చట్టం పరిగణిస్తుంది. కనుక ఈ మొత్తంపైనా మూలధన లాభాల పన్ను చెల్లించాలి.

కనుక క్రిప్టోలకు సంబంధించి ప్రతిపాదిత పన్ను పెద్ద ప్రతికూలమని అనూప్‌ భాస్కర్‌ అభిప్రాయపడ్డారు. ‘‘చిన్న ఇన్వెస్టర్లు, సాధారణంగా పన్ను చెల్లించేంత ఆదాయం పరిధిలో లేని వారు సైతం ఇప్పుడు క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది వారిని నిరుత్సాహానికి గురి చేస్తుంది’’ అని క్రిప్టో సలహాదారు అజీత్‌ ఖురానా పేర్కొన్నారు.  కానీ, నష్టాలు వస్తే పరిస్థితి ఏంటి? ఇన్వెస్టర్ల నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇది.

ఈక్విటీ పెట్టుబడులు ఏడాదిలోపు విక్రయించినప్పుడు నష్టం వస్తే స్వల్పకాల మూలధన నష్టం కింద, ఏడాదికి మించిన పెట్టుబడులను విక్రయించగా వచ్చిన నష్టాన్ని దీర్ఘకాల మూలధన నష్టంగా పరిగణిస్తారు. వీటిని ఏడు సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్‌ చేసుకోవచ్చు. అంటే ఒక  ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టాలన్నింటినీ లాభాలతో సర్దుబాటు చేసుకోలేకపోతే.. తర్వాతి ఏడు ఆర్థిక సంవత్సరాల్లో (లావాదేవీ జరిగిన సంవత్సరం సహా మొత్తం ఎనిమిది అసెస్‌మెంట్‌ సంవత్సరాలు) వచ్చే లాభాల నుంచి మినహాయించుకోవచ్చు.

దాంతో పన్ను పరంగా క్రిప్టో ఇన్వెస్టర్లతో పోలిస్తే ఈక్విటీ ఇన్వెస్టర్లకు ఎంతో ప్రయోజనం ఉందని చెప్పుకోవాలి. క్రిప్టో నష్టాలకు ఈ క్యారీ ఫార్వార్డ్‌ సదుపాయం లేదు. నష్టాలు ఏవైనా అదే ఏడాది క్రిప్టో లాభాలతోనే సర్దుబాటుకు పరిమితం కావాలి. మరే ఇతర మూలధన లాభాల నుంచి మినహాయించి చూపించుకునే వెసులుబాటు కల్పించలేదు. అలాగే, మరే ఇతర మూలధన నష్టాన్ని క్రిప్టో లాభాల నుంచి మినహాయించుకునే అవకాశం కూడా కల్పించలేదు.

నియంత్రణలు
నియంత్రణపరంగా చూస్తే ఈక్విటీలు మెరుగైన సాధనం. స్టాక్‌బ్రోకర్, మ్యూచుల్‌ ఫండ్, మార్కెట్‌ పార్టిసిపెంట్, ఇంటర్‌ మీడియరీ ఇలా మార్కెట్‌ వ్యవస్థలో భాగమైన ప్రతీ సంస్థ కూడా సెబీ నియంత్రణల పరిధిలోనే పనిచేయాలి. అన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది. దీనివల్ల రిస్క్‌ చేయిదాటి పోకుండా సెబీ చర్యలు తీసుకుంటుంది. కానీ, క్రిప్టో కరెన్సీలపై ఈ నియంత్రణ లేదు. ఈక్విటీల విషయంలో లావాదేవీల గురించి, సేవలు, చార్జీల గురించి సెబీకి ఫిర్యాదు చేసుకోవచ్చు. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ క్లయింట్ల సెక్యూరిటీలను తన పూల్‌ ఖాతాల్లోకి బదిలీ చేసుకుని వాటిని తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం తెలిసిందే.

ఈ అంశంలో సెబీ వెంటనే జోక్యం చేసుకుని తనఖాలో ఉన్న షేర్లను ఇన్వెస్టర్లకు దక్కేలా వేగంగా చర్యలు తీసకుంది. కానీ, క్రిప్టో లావాదేవీల విషయంలో ఎవరికి ఫిర్యాదు చేయాలి? ప్రభుత్వం లాభాలపై 30 % పన్ను విధించింది కానీ, నియంత్రణ అంశం జోలికి పోలేదు. ఎందుకంటే క్రిప్టో ఆస్తులన్నవి అంతర్జాతీయంగా ట్రేడ్‌ అవుతున్నవి. కొనుగోలు చేసిన వర్చువల్‌ అసెట్స్‌ను ఎక్కడ హోల్డ్‌ చేస్తున్నారు? సైబర్‌ మోసాల నుంచి వాటికి రక్షణ ఉంటుందా? పెట్టుబడి పెట్టిన వారికి జరగరానిది జరిగితే, వారి వారసులు ఆ వర్చువల్‌ ఆస్తులను పొందగలరా? ఇలాంటి అంశాలన్నింటినీ ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఈక్విటీలకు సంబంధించి ఈ రిస్క్‌ ఉండదు.

లావాదేవీల ట్రాకింగ్‌
క్రిప్టో లాభాలపై ఒక శాతం టీడీఎస్‌ అమలు చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రతీ లావాదేవీ సమాచారం ఆదాయపన్ను శాఖకు వెళుతుంది. కనుక పన్ను ఎగవేతకు అవకాశం ఉండదనే భావించాలి. ఇప్పటి వరకు క్రిప్టో ఎక్సేంజ్‌లు ఇచ్చిన సమాచారంపైనే ప్రభుత్వం ఆధారపడాల్సిన పరిస్థితి. కానీ, ఇక మీదట టీడీఎస్‌ నిబంధనతో వివరాలు పక్కాగా తెలుస్తాయి. ‘‘టీడీఎస్‌ రూపంలో ప్రభుత్వం క్రిప్టో లావాదేవీలను గుర్తించగలదు. డేటాను తీసుకోగలదు. ఇది భవిష్యత్తులో క్రిప్టోల నియంత్రణ విషయంలో సాయపడొచ్చు’’అని క్రిప్టో ఎక్సేంజ్‌ ‘జెబ్‌పే’ సీఈవో అవినాష్‌ శేఖర్‌ తెలిపారు. టీడీఎస్‌ నిబంధనతో ప్రభుత్వం వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ బదిలీలను నియంత్రించగలదని, ఆదాయం రాబట్టుకోగలదని ఫెలిక్స్‌ అడ్వైజరీ పార్ట్‌నర్‌ అమిత్‌ జిందాల్‌ పేర్కొన్నారు.

ఒక ఉదాహరణ చూద్దాం. ఎక్స్‌ అనే వ్యక్తికి 2022–23 ఆర్థిక సంవత్సరంలో బిట్‌ కాయిన్‌లో ట్రేడింగ్‌పై రూ.6 లక్షలు లాభం వచ్చిందనుకుందాం. అలాగే, ఎథీరియం ట్రేడింగ్‌లో రూ.2 లక్షలు నష్టం వచ్చిందనుకుంటే, అప్పుడు నికర లాభం రూ.4లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై 30 శాతం పన్ను రేటు అమలవుతుంది. లాభం రూ.50లక్షల్లోపు ఉంది కనుక సర్‌చార్జీ లేదు. 30 శాతంపై 4 శాతం సెస్సు అమలవుతుంది. అంటే 1.2 శాతం సెస్సు కూడా కలుపుకుంటే వచ్చిన లాభంపై చెల్లించాల్సిన నికర పన్ను 31.2 శాతం అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement