ప్రతీకాత్మక చిత్రం
పెద్దవాళ్లు చిన్నవాళ్లను అర్థంచేసుకోవడానికి చాట్, స్కైప్, వాట్సప్‌లతో షేక్ హ్యాండ్ చేస్తున్నారు..కాని చాదస్తాన్ని మాత్రం షేక్ చేయలేకపోతున్నారు..మనవడికి, మనవరాలికి మధ్య వివక్షను బ్రేక్‌చేయలేకపోతున్నారు...అవ్వ... హవ్వ... ఏంటీ చోద్యం?
కాలానికనుగుణంగా పెద్ద తరం మారుతోంది. పట్టణాల్లో ఉన్న పిల్లల కోసం, విదేశాల్లో స్థిరపడ్డ మూడో తరం కోసం చాటింగ్, స్కైప్, వాట్సాప్‌లను జీవితాల్లో భాగం చేసుకుంది. ఆ సౌకర్యాలతో రెండో తరం, మూడో తరంతో ఉన్న తమ అనుబంధాలను పటిష్టం చేసుకుంటోంది. మారిన కాలం తెచ్చిన వేగంలో పడికొట్టుకుపోతున్న పిల్లలు రక్తసంబంధాన్ని మరిచిపోకుండా ఉండడానికి పెద్దతరమే ప్రయత్నిస్తోంది. సాంకేతికతను టూల్‌గా మలచుకొని ఈ బంధాలను భద్రం చేసుకుంటోంది. ఈ విషయంలో వర్తమానానికి అప్‌డేట్ అవడమే కాదు భవిష్యత్‌లో పరుగులు పెట్టడానికీ మానసికంగా సిద్ధమై ఉన్నారు పెద్దలు. అవసరంగా భావిస్తున్నారు కూడా. మంచి పరిణామమే! అయితే ఈ చైతన్యం జెండర్ ఈక్వాలిటీ విషయంలో కనపడ్డం లేదనడానికి.. అనకాపల్లి నుంచి అమెరికా దాకా, అహ్మదాబాద్ నుంచి ఆస్ట్రేలియా దాకా, పంజాబ్ నుంచి పశ్చిమాసియా దాకా, యూపీ నుంచి యూరప్ దాకా ఉన్న భారతీయ కుటుంబాలెన్నో ఉదాహరణలు.
పర్మినెంట్‌గా పడ్తుంది
విదేశాల్లో ఉన్న పిల్లలు, మనవలు, మనవరాళ్లను చూడ్డానికి వెళ్లిన పెద్దలు రోమ్‌లో రోమన్‌లా కనిపించడానికి జీన్స్, షర్ట్ వేసుకుంటున్నారు..కోలేని వాళ్లు జీన్స్ కుర్తీతో సర్దుకుంటున్నారు. దానికీ ఇబ్బంది పడ్డవాళ్లు సల్వార్, కమీజ్ చాలనుకుంటున్నారు. ఊహించని ఇన్ని మార్పులకు స్వాగతం పలికిన అమ్మలు, అత్తలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇంటి పనులనూ అబ్బాయిలకు సమానంగా పంచేవిషయంలో మాత్రం చాదస్తం వీడట్లేదు. ‘‘అమెరికాలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ జంటలు జనరల్‌గాఇంట్లో వర్క్ షేర్ చేసుకుంటారు. ఈవెన్ టాయ్‌లెట్స్ కూడా క్లీన్ చేస్తారు. వండర్ ఏంటంటే వాళ్ల పేరెంట్స్ రాగానే మారిపోతారు. పేరెంట్స్ ఫీలవుతారని వాళ్లు వెళ్లిపోయేదాకా ఇంటి పనుల్లో హెల్ప్ చేయరు.‘‘ఎందుకా డ్రామా? కలిసి పనిచేసుకుంటాం.. చేసుకోవాలి కూడా అని సింపుల్‌గా పేరెంట్స్‌తో చెప్పొచ్చుగా’’ అంటే ‘‘ఆ .. ఎందుకులే.. నాలుగు నెలల కోసం వచ్చిన వాళ్లతో ఆర్గ్యూమెంట్స్’’ అంటూ లైట్ తీసుకుంటారు. టెక్నాలజీలోనే కాదు థాట్ ప్రాసెస్ కూడా అప్‌డేట్ చేసుకోవాలని.. అవసరమనీ పేరెంట్స్‌కు చెప్పాలి కదా’’ అంటుంది న్యూయార్క్‌లో ఎకనమిక్ ఎనలిస్ట్‌గా పనిచేస్తున్న అనుపమా మహీధర్.
రక్షణ సంప్రదాయం
హయ్యర్‌ఎడ్యుకేషన్ కోసం ఆడపిల్లలను అబ్రాడ్ పంపిన పేరెంట్స్ ఇండియాలో ఇంటి మూల మీదున్న షాప్‌కు తమ్ముడిని తోడిచ్చి పంపే రక్షణ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ‘‘ప్రాజెక్ట్ వర్క్ మీద నేను ఎవ్రీ త్రీమంత్స్ ఆర్ ఫైవ్ మంత్స్‌కు ఒకసారి యూఎస్, యూరప్‌కు పోతుంటా. ప్రతీసారి ఎయిర్‌పోర్ట్‌కు మా తమ్ముడ్ని తోడు పంపిస్తరు. నవ్వొస్తుంటది. ఆ దేశంలో ల్యాండ్ అయినంక నేనొక్కదాన్నే కదా అన్నీ చూసుకోవాల్సింది. ఈ మాట మా అమ్మకు, నానమ్మకు చెప్తే ఏమంటారో తెల్సా.. ‘‘ఏదోనే నిన్నో అయ్య చేతుల్లో పెట్టేదాకా మమ్మల్నిట్ల ఉండనీ’’ అని. ఏం మాట్లాడ్తం జెప్పండి? అట్లా అనీ మా నానమ్మ, అమ్మ ఏం తెల్వనోళ్లు కారు. ఆ కాలంలనే ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఎస్‌ఎస్‌సీ చదివినోళ్లే. మా నానమ్మను మీరేదన్నా అడగండి.. ఉండు గూగుల్ల కొట్టి చూద్దాం అంటది. అట్లాంటి ముసలమ్మ నా విషయం వచ్చేసరికి ఇంత కన్సర్వేటివ్‌గా ఎందుకు ఉంటదో?’’ అంటుంది హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రియాంక యాదవ్
బొట్టు ఓకే.. వంటెందుకు నాట్ ఓకే?
లాజిక్‌లేని కొన్ని ఆచారాలను వదిలేసుకున్న ఆ తరం.. పనులకు సంబంధించి ఆడ,మగ వివక్షను మాత్రం వీడట్లేదు. ‘‘ఇందుకు మా అమ్మే మంచి ఉదాహరణ’’ అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు ఈశ్వరి అనే ఒక ప్రభుత్వోద్యోగిని. ‘‘మా అమ్మ కొన్నాళ్లు నా దగ్గర, కొన్నాళ్లు మా అన్నయ్య దగ్గర ఉంటుంది. మా నాన్నపోయినప్పుడు మా అమ్మకు పసుపుకుంకుమలు తుడిచేసేలాంటి తంతును చేయనివ్వలేదు. మా నాన్న పోయినా బొట్టుపెట్టుకోవడాన్ని మా అమ్మ యాక్సెప్ట్ చేసింది. అంత ప్రొగ్రెసివ్‌గా ఉన్న ఆమె మా ఆయన వంట చేయడాన్ని యాక్సెప్ట్ చేయదు. నేను నీ దగ్గరున్నప్పుడు మీ ఆయనకు ఇంటి పనులు చెప్పొద్దు’’ అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది ఒకసారి. నేనూ వర్క్‌చేస్తాను కదమ్మా.. ఆయన హెల్ప్ చేయకపోతే ఎట్లా? నాన్న పోయినా నువ్వు బొట్టు పెట్టుకోవడం ఎంత న్యాయమో.. ఇదీ అంతే అని చెప్పబోతుంటే దానికీ దీనికీ లంకె ఏంటీ? ఇలాంటి వితండ వాదం చేయొద్దంటుంది’’ అని చెప్తుంది ఈశ్వరి. ఆకలి అందరికీ సమానమైనప్పుడు ఆకలి తీర్చే ఆహారాన్ని తయారు చేయడమూ అందరికి రావాలి కదా! అది కేవలం ఆడవాళ్ల పనే ఎలా అవుతుంది?
అప్పుడు అలా..ఇప్పుడు ఇలా..
నా చిన్నప్పుడు ఇంట్లో జెండర్ డిస్క్రిమినేషన్ చూశా. అబ్బాయిలకు కోడిగుడ్లు ఇచ్చి అమ్మాయిలకు ఇవ్వని పరిస్థితి. నిజానికి రెండు కోడిగుడ్లను నలుగురు పిల్లలకు సగం సగం ఇవ్వచ్చు. కానీ అబ్బాయిలు మోర్ ఎనర్జిటిక్‌గా ఉండాలని మాకే ఇచ్చేవాళ్లు. తర్వాత తర్వాత ఇది తప్పని తెలుసుకుంది మా అమ్మ. అప్పటి నుంచి ఇంట్లో వర్క్‌ను అంటే ఎవరు తిన్న ప్లేట్ వాళ్లే తీసి కడగాలి అని నేర్పింది. మా ఇంట్లో ఇప్పటికీ అదే పాటిస్తాం. యూనివర్సిటీ వీసీగా నాకు ప్రివిలేజెస్ ఉంటాయి. అయినా సర్వెంట్స్‌కు ఇవ్వకుండా నేనే నా ప్లేట్‌ను కడిగేస్తా. నా వైఫ్ ఉస్మానియా యూనివర్సిటీలో టీచ్ చేస్తారు. అయితే ఇప్పుడు మా అమ్మ ‘‘అదేంటి నువ్వెందుకు కడుగుతావ్? నీ వైఫ్‌కు చెప్పు.. లేదంటే సర్వెంట్స్ ఉన్నారు కదా?’’ అంటుంది. మా అమ్మేం చదుకోని ఆవిడ కాదు. ఆ కాలంలోనే ఎస్‌ఎస్‌ఎల్‌సీ చేసి ప్రైవేట్ స్కూల్‌కూడా రన్ చేసింది. తరతరాల నుంచి వస్తున్న ఈ ప్రాసెస్ పోవడానికి టైమ్ పడ్తుంది’’– ప్రొఫెసర్ ఇ. సురేష్ కుమార్,వైస్‌చాన్స్‌లర్, ఇఫ్లూ, హైదరాబాద్
చెప్తూ ఉంటాం..
మాకు నాన్న లేరు. నాకు, మా చెల్లెలికి మా అమ్మ, నానమ్మే అన్నీ! నిజానికి మా మీద మా నానమ్మ ఇంపాక్ట్ ఎక్కువ.మాతో సమానంగా కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్చుకుంది. నెట్ బ్రౌజ్ చేస్తుంది. ఎఫ్‌బీలో ఫొటోస్ పెడితే మార్ఫింగ్ చేస్తారట కదా.. పెట్టుకోకండి అని చెప్తుంది. మమ్మల్ని మగపిల్లలతో సమానంగానే చూస్తుంది. కానీ మా నానమ్మ ఫ్రెండ్స్, చుట్టాల నుంచే మేం డిస్క్రిమినేష్ ఫేస్ చేస్తుంటాం. వాళ్లంతా కూడా మా నానమ్మలా అప్‌డేట్ అయినవాళ్లే. ఎబ్రాడ్‌లో ఉన్న వాళ్ల మనవళ్లతో చాటింగ్ చేస్తున్నవాళ్లే. మా విషయంలో నానమ్మ ఒపీనియన్స్‌ను మార్చాలని ట్రై చేస్తుంటారు.– మాదరి మౌనిక, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉద్యోగిని,హైదరాబాద్
ప్రాక్టికల్‌గాఅవసరం కాబట్టి..
టెక్నాలజీ యూజ్ చేయడంలో మా అమ్మ పర్‌ఫెక్ట్. అఫ్‌కోర్స్.. ఇంటి పనుల విషయంలో యాజ్ యూజువల్‌గా ఆ డిస్క్రిమినేషన్ ఉంటుంది. బేసిగ్గా నాకు వంట చేయడం ఇష్టం కాబట్టి కుకింగ్‌లో అమ్మకు హెల్ప్ చేస్తుంటా. కానీ చిన్నప్పటినుంచి ఇంటి పనుల విషయంలో మా అక్క, చెల్లె మీదే ఫోర్స్. టెక్నాలజీ పరంగా అప్‌డేట్ అవడం ప్రాక్టికల్‌గా అవసరం కాబట్టి అవుతున్నారు. ఆడ, మగ ఈక్వల్ అనే విషయాన్ని అంతే ప్రాక్టికల్‌గా తీసుకోవట్లేదు. అందుకే ఛేంజ్ రాలేదు. మా జనరేషన్ కొంచెం బెటర్. కొంత మంది అబ్బాయిలు వంట చేస్తున్నారు. వైఫ్‌కు హెల్ప్ చేస్తున్నారు. అయితే అనుకున్నంతగా మార్పు రాలేదు అన్నది ట్రూ.– కెప్టెన్ బి. ప్రణీత్ కుమార్,జెట్ ఎయిర్‌వేస్, హైదరాబాద్.
అది వేరు.. ఇది వేరు..
‘‘ టెక్నాలజీ నేర్చుకోవడం, మగవాళ్లు గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం ఒకటేనా? అది వేరు, ఇది వేరు. ఆడపిల్లలు ఇష్టంగా ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఇంట్లో పని కామన్. అమ్మాయిలు జాబ్ చేయడం అమ్మాయికి గౌరవం, కానీ మగపిల్లాడు చీపురు పట్టుకుంటే ఎంత సిగ్గు? నలుగురికి తెలిస్తే వాడి పరువుంటుందా?’’ అనేది ఒక అమ్మ అభిప్రాయం. ఆమె గృహిణి కాదు. బ్యాంక్ ఎంప్లాయ్.‘‘ఆడవాళ్లే ఇలా ఆలోచిస్తుంటే ఇక మగవాళ్లు ఇంటి పనులు ఎందుకు చేస్తారు? పుట్టుకతో చీపురు, అంట్లుతోమే పీచు, బట్టలు ఉతికే బ్రష్‌ను నడుముకి కట్టుకొని వచ్చారా ఆడవాళ్లు? అని ప్రశ్నిస్తున్నారు చాలా మంది అమ్మాయిలు. దేశమంతా ఇలాగే ఉంది అని కచ్చితంగా నిర్దేశించే కథనం కాదిది. అలాగని జెండర్ ఈక్వాలిటీ పట్ల చైతన్యం లేదు అని తెలిపిన ఈ అభిప్రాయాలనూ తప్పనలేం. దేశంలోని డెబ్బై అయిదు శాతం ఇళ్లల్లోని పరిస్థితికివి అద్దం పడ్తున్నాయన్నదీ అబద్ధం కాదు. ఇంటి పనులతోపాటు పిల్లల పెంపకాన్నీ తల్లిమీదే పెట్టింది సమాజం. ఇంట్లో మనుషులకు తగ్గట్టు, సమాజంలో పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోగల మనస్తత్వం గల స్త్రీ.. పిల్లల పెంపకంలో చూపిస్తున్న వివక్షనూ సరిచేయాలి. ఈ బాధ్యతనూ మోస్తే భవిష్యత్‌లోనైనా జెండర్ ఈక్వాలిటీని ఆశించొచ్చు.– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment