బాబోయ్‌.. ఈ తరం స్మార్ట్‌నెస్‌ను భరించడం కష్టమే! | What Is Beta Generation? How It Big Trouble For Human Future | Sakshi
Sakshi News home page

బాబోయ్‌.. ఈ తరం స్మార్ట్‌నెస్‌ను భరించడం కష్టమే!

Published Mon, Dec 30 2024 12:55 PM | Last Updated on Mon, Dec 30 2024 1:13 PM

What Is Beta Generation? How It Big Trouble For Human Future

మనిషి జీవన గమనంలో.. ప్రతీ పదిహేనేళ్లకొకసారి తరం మారుతుంటుంది. మారుతున్న పరిస్థితులను కూడా ఆ తరం ఆకలింపు చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఓ తరం కథ కంచికి చేరింది. కొత్త ఏడాది 2025.. మరో తరానికి ఆహ్వానం పలికేందుకు సిద్ధమైంది. అదే బీటా జనరేషన్‌(Generation Beta). అయితే ఇది మామూలు జనరేషన్‌గా మాత్రం మిగిలిపోదని నిపుణులు తేల్చేస్తున్నారు.

2025, జనవరి 1 నుంచి కొత్త తరం ఆధారంగానే జనాభాను లెక్కిస్తారు. 2025 నుంచి 2039 మధ్యకాలంలో పుట్టినవాళ్లంతా ఈ తరం కిందకే వస్తారు. 2035 కల్లా ఈ తరం జనాభానే 16 శాతంగా ఉండొచ్చనే ఓ అంచనా నెలకొంది.  అంతేకాదు.. 22వ శతాబ్దాన్ని ఎక్కువగా చూడబోయే తరం కూడా ఇదే కానుందని పాపులర్‌ సోషల్‌ రీసెర్చర్‌ మార్క్‌ మెక్‌క్రిండిల్‌ అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం టెక్‌ యుగంలో(Tech Era) మనిషి బతుకుతున్నాడు. అయితే ‘బీటా’ తరానికి మాత్రం రోజూవారీ జీవితంలో అత్యాధునిక సాంకేతికత భాగంకానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఏఐ, ఆటోమేషన్‌ హవా నడుస్తోంది కదా!. అలాంటి సాంకేతికత బీటా జనరేషన్‌ విషయంలో నెక్ట్స్‌ లెవల్‌లో ఉండబోతుందన్నమాట!.

జనరేషన్‌ ఆల్ఫా.. మనిషి జీవితంలో స్మార్ట్‌ టెక్నాలజీ, ఏఐలాంటి సాంకేతికత ఎదుగుదలను మాత్రమే చూడగలిగింది. అయితే జనరేషన్‌ బీటా రోజువారీ జీవితంలో ఆ సాంకేతికతను అనుభవించబోతోంది. చదువు, ఆరోగ్యం, పని ప్రాంతం, ఆఖరికి వినోదం విషయంలోనూ  అది తర్వాతి స్థాయిలో ఉండబోతోందని మెక్‌క్రిండిల్‌ చెబుతున్నారు. ఉదాహరణకు.. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు, హెల్త్‌ ట్రాకింగ్‌ డివైజ్‌లను ధరించడం, వర్చువల్‌ వాతావరణాన్ని ఆస్వాదించడం లాంటివన్నమాట.

  • మిలెన్నియల్స్‌ (1981-1996)

  • జనరేషన్‌ జెడ్‌(Z) 1996-2010

  • జనరేషన్‌ ఆల్ఫా (2010-2024)

  • జనరేషన్‌ బేటా (2025-2039)

  • జనరేషన్‌ గామా (2040-2054)

*గ్రీకు ఆల్ఫాబెట్‌ల ప్రకారమే జనరేషన్‌లకు పేర్లు పెడతూ వస్తున్నారు.

టఫ్‌ జనరేషన్‌!
ఈరోజుల్లో పిల్లల పెంపకంలో టెక్నాలజీ కూడా భాగమైంది. 1981-1996‌ పేరెంట్స్‌.. పిల్లల పెంపకం విషయంలో బ్యాలెన్సింగ్‌గా  ఉండడానికి ప్రయత్నించారు. జనరేషన్‌ Z తల్లిదండ్రులు టెక్నాలజీతో జరిగే గుడ్‌-బ్యాడ్‌లను గుర్తించి.. పిల్లల విషయంలో ఆంక్షలతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేశారు. అయితే తర్వాతి తరం తల్లిదండ్రుల విషయంలో ఇది ముమ్మాటికీ ఛాలెంజిం‌గానే ఉండనుందట!.

బీటా జనరేషన్‌కు టెక్నాలజీ అనేది మునివేళ్ల మీద ఉండబోతోంది. అదే సమయంలో.. ఈ జనరేషన్‌ను అర్థం చేసుకోవడం అంతేకష్టతరంగా మారనుంది. సాంకేతికత అనేది వాళ్ల జీవన శైలి(Life Style)ని, కెరీర్‌ను, తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయనుంది. తద్వారా వాళ్ల ప్రవర్తన కూడా అందుకు తగ్గట్లే మారే అవకాశం ఉంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు.   అదే సమయంలో.. ఈ జనరేషన్‌ కొన్ని సవాళ్లను ఎదుర్కొనుందట. 

‘‘ఈ పిల్లలు పెరిగేకొద్దీ, వారు అనేక సామాజిక సవాళ్లతో పోరాడుతున్న ప్రపంచాన్ని చూడాల్సి వస్తుంది. వాతావరణ మార్పులు, ప్రపంచ జనాభా మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ(Urbanization) వారి జీవితాలను ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్యలయ్యే అవకాశం ఉంది. పర్యావరణ స్పృహ, స్థిరమైన జీవనశైలికి జనరేషన్ బీటా చిన్న వయస్సు నుంచే అలవాటు పడొచ్చు.  21వ శతాబ్దం తీవ్రమైన పర్యావరణ సమస్యలకు పరిష్కారాలను కనుగొనే పనిలో ఉంటారు. ఈ ఓవర్‌ స్మార్ట్‌నెస్‌కు ముందు తరాలు ఎంతవరకు భరించగలవనేది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ’’ అని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ‘జెన్‌ జెడ్‌’.. ఎందుకంత భిన్నమో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement