
సోషల్ మీడియాలో ‘ఫాఫో పేరెంటింగ్’ వైరల్ ట్రెండ్‌గా మారింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘అనుభవమైతేగానీ తత్వం బోధపడదు’ అనే మాటకు అద్దం పట్టే పేరెంటింగ్ ట్రెండ్ ఇది.
ఉదాహరణకు: ‘బయట బాగా చలిగా ఉంది... కోటు వేసుకొని వెళ్లు’ అన్నది తల్లి. తల్లి మాటను పట్టించుకోకుండా ఆ పిల్లాడు బయటకు పరుగెత్తాడు. అయితే కొద్దిసేపట్లోనే ఇంట్లోకి వచ్చి...‘మమ్మీ... కోటు కావాలి... బాగా చలిగా ఉంది’ అన్నాడు. ‘కోటు వేసుకుంటేగానీ నువ్వు బయటకు వెళ్లడానికి వీలు లేదు’ అనలేదు తల్లి.
‘వాడే తెలుసుకుంటాడు లే’ అనుకుంది... ఇదే ‘ఫాఫో’ పేరెంటింగ్ సారాంశం. ఈ పేరెంటింగ్ అనేది పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించేలా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. అయితే అన్ని విషయాలకూ ‘ఫాఫో’ పేరెంటింగ్ సరిపోదు.
ఉదాహరణకు భద్రతకు సంబంధించిన విషయాలు. నిర్లక్ష్యంగా రోడ్డు దాటడం, వేడి పొయ్యిని తాకడం... మొదలైనవి. మాంటిస్సోరీ ఫిలాసఫీ ప్రకారం కఠినమైన ఆదేశాల కంటే నిజజీవిత అనుభవాల నుండి నేర్చుకోవడానికి పిల్లలను తల్లిదండ్రులు అనుమతించినప్పుడు అభివృద్ధి చెందుతారు. ‘ఫాఫో’లో మాంటిస్సోరీ ఫిలాసఫీ ప్రతిఫలిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment