Parenting
-
బాబోయ్.. ఈ తరం స్మార్ట్‌నెస్‌ను భరించడం కష్టమే!
మనిషి జీవన గమనంలో.. ప్రతీ పదిహేనేళ్లకొకసారి తరం మారుతుంటుంది. మారుతున్న పరిస్థితులను కూడా ఆ తరం ఆకలింపు చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఓ తరం కథ కంచికి చేరింది. కొత్త ఏడాది 2025.. మరో తరానికి ఆహ్వానం పలికేందుకు సిద్ధమైంది. అదే బీటా జనరేషన్(Generation Beta). అయితే ఇది మామూలు జనరేషన్గా మాత్రం మిగిలిపోదని నిపుణులు తేల్చేస్తున్నారు.2025, జనవరి 1 నుంచి కొత్త తరం ఆధారంగానే జనాభాను లెక్కిస్తారు. 2025 నుంచి 2039 మధ్యకాలంలో పుట్టినవాళ్లంతా ఈ తరం కిందకే వస్తారు. 2035 కల్లా ఈ తరం జనాభానే 16 శాతంగా ఉండొచ్చనే ఓ అంచనా నెలకొంది. అంతేకాదు.. 22వ శతాబ్దాన్ని ఎక్కువగా చూడబోయే తరం కూడా ఇదే కానుందని పాపులర్ సోషల్ రీసెర్చర్ మార్క్ మెక్‌క్రిండిల్ అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం టెక్ యుగంలో(Tech Era) మనిషి బతుకుతున్నాడు. అయితే ‘బీటా’ తరానికి మాత్రం రోజూవారీ జీవితంలో అత్యాధునిక సాంకేతికత భాగంకానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఏఐ, ఆటోమేషన్ హవా నడుస్తోంది కదా!. అలాంటి సాంకేతికత బీటా జనరేషన్ విషయంలో నెక్ట్స్ లెవల్లో ఉండబోతుందన్నమాట!.జనరేషన్ ఆల్ఫా.. మనిషి జీవితంలో స్మార్ట్ టెక్నాలజీ, ఏఐలాంటి సాంకేతికత ఎదుగుదలను మాత్రమే చూడగలిగింది. అయితే జనరేషన్ బీటా రోజువారీ జీవితంలో ఆ సాంకేతికతను అనుభవించబోతోంది. చదువు, ఆరోగ్యం, పని ప్రాంతం, ఆఖరికి వినోదం విషయంలోనూ అది తర్వాతి స్థాయిలో ఉండబోతోందని మెక్‌క్రిండిల్ చెబుతున్నారు. ఉదాహరణకు.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, హెల్త్ ట్రాకింగ్ డివైజ్‌లను ధరించడం, వర్చువల్ వాతావరణాన్ని ఆస్వాదించడం లాంటివన్నమాట.మిలెన్నియల్స్ (1981-1996)జనరేషన్ జెడ్(Z) 1996-2010జనరేషన్ ఆల్ఫా (2010-2024)జనరేషన్ బేటా (2025-2039)జనరేషన్ గామా (2040-2054)*గ్రీకు ఆల్ఫాబెట్ల ప్రకారమే జనరేషన్లకు పేర్లు పెడతూ వస్తున్నారు.టఫ్ జనరేషన్!ఈరోజుల్లో పిల్లల పెంపకంలో టెక్నాలజీ కూడా భాగమైంది. 1981-1996 పేరెంట్స్.. పిల్లల పెంపకం విషయంలో బ్యాలెన్సింగ్‌గా ఉండడానికి ప్రయత్నించారు. జనరేషన్ Z తల్లిదండ్రులు టెక్నాలజీతో జరిగే గుడ్-బ్యాడ్లను గుర్తించి.. పిల్లల విషయంలో ఆంక్షలతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేశారు. అయితే తర్వాతి తరం తల్లిదండ్రుల విషయంలో ఇది ముమ్మాటికీ ఛాలెంజింగానే ఉండనుందట!.బీటా జనరేషన్‌కు టెక్నాలజీ అనేది మునివేళ్ల మీద ఉండబోతోంది. అదే సమయంలో.. ఈ జనరేషన్‌ను అర్థం చేసుకోవడం అంతేకష్టతరంగా మారనుంది. సాంకేతికత అనేది వాళ్ల జీవన శైలి(Life Style)ని, కెరీర్‌ను, తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయనుంది. తద్వారా వాళ్ల ప్రవర్తన కూడా అందుకు తగ్గట్లే మారే అవకాశం ఉంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో.. ఈ జనరేషన్ కొన్ని సవాళ్లను ఎదుర్కొనుందట. ‘‘ఈ పిల్లలు పెరిగేకొద్దీ, వారు అనేక సామాజిక సవాళ్లతో పోరాడుతున్న ప్రపంచాన్ని చూడాల్సి వస్తుంది. వాతావరణ మార్పులు, ప్రపంచ జనాభా మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ(Urbanization) వారి జీవితాలను ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్యలయ్యే అవకాశం ఉంది. పర్యావరణ స్పృహ, స్థిరమైన జీవనశైలికి జనరేషన్ బీటా చిన్న వయస్సు నుంచే అలవాటు పడొచ్చు. 21వ శతాబ్దం తీవ్రమైన పర్యావరణ సమస్యలకు పరిష్కారాలను కనుగొనే పనిలో ఉంటారు. ఈ ఓవర్ స్మార్ట్‌నెస్‌కు ముందు తరాలు ఎంతవరకు భరించగలవనేది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ’’ అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘జెన్ జెడ్’.. ఎందుకంత భిన్నమో తెలుసా? -
చాలామంది తండ్రులు చేసే తప్పే ఇది..! అమీర్ ఖాన్ సైతం..
బాలీవుడ్ దర్శకురాలు, నిర్మాత కిరణ్ రావు సింగిల్ మదర్‌గా పిల్లల పెంపకం విషయంలో ఎదురయ్యే సాధకభాదల్ని గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఇటీవల కరీనా కపూర్‌తో జరిగిన విమెన్స్ వాంట్ వాంట్ అనే చాట్ షోలో కిరణ్ రావు తల్లిదండ్రులిద్దరూ పిల్లల బాధ్యతల్లో పాలుపంచుకోవడంపై చాలా ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. అంతేగాదు సింగిల్ పేరెంట్‌గా తన అనుభవాన్ని గురించి కూడా చెప్పారు. పిల్లల విషయంలో చాలామంది తండ్రులు చేసే అతి పెద్ద తప్పు గురించి చెప్పడమే గాక అమీర్ ఖాన్ కూడా అంతే అంటూ ఆ షోలో నిజాయితీగా మాట్లాడారు. ఇంతకీ పిల్లల విషయంలో తండ్రులు చేసే తప్పు ఏంటంటే..కిరణ్ రావ్ అమీర్ ఖాన్ దంపతులకు అజాద్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. అమీర్ బిజీ షెడ్యూల వల్ల పిల్లలకు తగిన సమయం కేటాయించలేకపోయాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు కూడా. కిరణ్ రావు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ..మేము వివాహం చేసుకుని ఒక్కటైనప్పటికీ అమీర్ చాలా బిజీగా ఉండేవారని అన్నారు. తాము తల్లిదండ్రులుగా మారిన తర్వాత కూడా అతడి తీరులో మార్పులేదు. ఇక తాను ఒక తల్లిగా తల్లిదండ్రులిద్దరూ అందించాల్సిన ప్రేమని కొడుకు ఆజాద్‌కి తానే అందించానని అన్నారు. ఆ సమయంలో అమీర్‌కి ఆజాద్‌కి సమయం కేటాయించడం అనేది ఓ పెద్ద సమస్యాత్మకమైన నిర్ణయంగా ఉండేది. తామిద్దరం కలిసి ఉండటం వల్ల అదంతా నేనే చూసుకున్నాను. ఎప్పుడైతే 2021లో విడాకులు తీసుకున్నామో అప్పుడు ఆజాద్ విషయం సున్నితమైన అంశంగా మారిపోయింది. ఇక అమీర్ కూడా అజాద్ విషయంలో తానేం చేసింది గ్రహించాడు. నిజానికి చాలామంది తండ్రులు ఇలానే ఉంటున్నారు. పిల్లల స్కూల్‌కి సంబంధించిన విషయాలకు దూరంగా ఉంటారు. అదంతా తల్లి బాధ్యత అన్నట్లుగా వదిలేస్తారు. అని భావోద్వేగంగా మాట్లాడారు కిరణ్ రావ్.సింగిల్ పేరెంట్‌గా..తనకు తన కొడుకుతో గడిపే క్షణాలన్నీ మంచిరోజులే అన్నారు. అతడు తనని నవ్వించే యత్నం చేస్తుంటాడని అన్నారు. తనను ఒక్క క్షణం కూడా నిశబ్దంగా ఉండనివ్వడని కొడుకు ఆజాద్ గురించి సంతోషంగా చెప్పుకొచ్చారు. అలాగే ఈ సమయంలో తన తల్లిదండ్రులు తనకు పూర్తి మద్దుతగా నిలిచారని అన్నారు. వారి సహాయంతోనే మరింత సమర్థవంతంగా తన పిల్లవాడిని పెంచగులుగుతన్నాని అన్నారు. అయితే తల్లులు ఎప్పుడూ తండ్రుల్లా వారి బాధ్యతల విషయంలో తప్పించుకోరు. ఒకరకంగా ఇలా.. తల్లి పిల్లల మధ్య స్ట్రాంగ్ అనుబంధం ఏర్పడుతుందన్నారు. అంతేగాదు భవిష్యత్తులో సింగిల్ మదర్లకు వారి పిల్లలే పూర్తి ఆసరాగా ఉండి వారి బాగోగులను చూసుకుంటారని చాలా నమ్మకంగా అన్నారు. అయితే సింగిల్ మదర్ రోల్‌ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నారు. ముఖ్యంగా పిల్లలకు తండ్రి లేని లోటుని కనిపించనీయకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం అని కిరణ్ రావ్ చెప్పుకొచ్చారు. కాగా, గతంలో అమీర్ రియా చక్రవర్తితో జరిగిన పోడ్కాస్ట్లో "నా బిజీ షెడ్యూల్ కారణంగా పిల్లల కోసం సమయం కేటాయించలేకపోయాను. అందువల్లే ఇరా, ఇరా డిప్రెషన్‌తో బాధపడిందని అన్నారు. అయితే ఆమె ఇప్పుడు మెరుగ్గా ఉంది. ఇక జునైద్ తన కెరీర్‌ని ప్రారంభించాడు. అతడు కూడా నేను లేకుండానే గడిపాడు. కనీసం ఆజాద్ అయినా అలాకాకుడదని భావించి సమయం కేటాయించే ప్రయత్నం చేస్తున్నా. అయితే నాకు కుటుంబం పట్ల బలమైన అనుభూతి ఉంది, కానీ ప్రేక్షకుల మనసుని గెలుచుకునే హీరో అవ్వాలనే తాపత్రయంలో ఫ్యామిలీకి దూరం అయ్యాను." అని అమీర్ చెప్పారు.(చదవండి: 'తల్లులు' డోంట్ వర్రీ!..ప్రసవానంతరం జస్ట్ 34 రోజుల్లోనే..!) -
అమితాబ్ బచ్చన్ 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్'!
బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితా బచ్చన్ ఎన్నో వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకుల మన్నలను అందుకున్న గొప్ప నటుడు. ఇప్పటికీ పలు టీవి షోల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అందరి ప్రశంసలందుకుంటున్నారు. ఆయన్ను ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసిన టీవీ షో "కౌన్ బనేగా కరోడ్‌పతి"గా చెప్పొచ్చు. ఆ కార్యక్రమం ఆయనకు ఎంతో పేరునే గాక లక్షలాది మంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఇటీవల ఆయన కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 16లో, క్రికెటర్ వరుణ్ ధావన్‌తో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారిద్దరి మధ్య సాగిన ఆసక్తికర సంభాషణ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఆ కార్యక్రమంలో అమితాబ్ కాబోయే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అమూల్యమైన విషయాలను గురించి కూడా చెప్పారు. ఈ గోల్డెన్ రూల్స్‌ని పాటిస్తే మంచి తల్లిదండ్రులుగా పిల్లల మనుసును గెలుచుకోగలరని అన్నారు. ఇంతకీ అవేంటి?. 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్' అంటే..ఇటీవల జరిగిన కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 16లో అమితాబ్ క్రికెటర్ వరణ్ ధావన్ తండ్రిగా నీ కొత్త జర్నీ ఎలా ఉందని ప్రశ్నించారు. ఇటీవలే వరుణ ధావన్ నటాషా దంపతులకు కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ధావన్ తన కుమార్తెతో కనెక్ట్ అవుతున్నానని, ఆమె వచ్చాక తన జీవితం మొత్తం మారిపోయిందని నవ్వుతూ బదులిచ్చాడు. అప్పుడు అమితాబ్ ఈ దీపావళి నీకెంతో ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ పండుగకి నీ ఇంట్లోకి లక్ష్మీ దేవి వచ్చేసిందని అన్నారు. దానికి ప్రతిస్పందనగా ధావన్ "ఆమె రాకతో ప్రతిదీ మారిపోవడం మొదలైంది. ఇప్పటికీ తనకు ఎలా దగ్గర అవ్వాలా అనే విషయం గురించి నేర్చకుంటూనే ఉంటున్నా అని భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు." ధావన్. ఆ తర్వాత అమితాబ్‌తో నాన్న విధులు గురించి మాట్లాడుతూ..ఆ రోజుల్లో రాత్రిపూట మీ నిద్రకు ఇబ్బంది ఏర్పడేదా అని ధావన్ ప్రశ్నించగా..అందుకు అమితాబ్ బదులిస్తూ.. "తాను రాత్రిపూట హాయిగా నిద్రపోయేవాడినని, కాకపోతే కాస్త ఆందోళనగా ఉండేదని అన్నారు. అంతేగాదు అప్పటికి ఒక కొత్త గాడ్జెట్ వచ్చిందని దాన్ని శిశువు బెడ్ పక్కన పెడితే వారి చిన్న శబ్దం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుందంటూ.. నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు." అమితాబ్. ఇక వరుణ్ తన పాప పడుకునే సమయం గురించి మాట్లాడుతూ..తన కూతురు కోసం లాలి పాట కూడా పాడుతున్నట్లు తెలిపారు. అంతేగాదు ఆ పాటను కూడా ఆ షోలో పాడి వినిపించారు ధావన్. ఆ కార్యక్రమంలో చివరగా ధావన్ అమితాబ్‌ని నటుడిగా కుటుంబ బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు అని అడిగారు. అందుకు ఆయన ఒక సలహ సూచించారు. అది అత్యంత అమూల్యమైన రూల్ అని కూడా చెప్పారు. "ఎప్పుడూ మీ భార్యను సంతోషంగా ఉండేలా చూసుకోండి. ఆమె సంతృప్తిగా ఉంటే అన్ని బాధ్యతలు సునాయాసంగా నెరవేరిపోతాయి. ఆమె సంతోషంగా ఉంటే కుమార్తె కూడా హ్యాపీగా ఉంటుంది. దీన్ని సదా గుర్తించుకోండి. కుటుంబానికి మూల స్థంభం భార్యే. ఆమె సంతోషంగా ఉంటే అన్ని పనులు వాటంతట అవే సులభంగా అయిపోతాయి. దీన్ని పాటిస్తే ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే గాక పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉండగలుగుతారని అన్నారు." అమితాబ్.(చదవండి: విద్యాబాలన్ వెయిట్ లాస్ సీక్రెట్..కానీ వర్కౌట్లు మాత్రం..!) -
'లైట్‌హౌస్ పేరెంటింగ్': పిల్లలు ప్రయోజకులయ్యేందుకు ది బెస్ట్!
'లైట్‌హౌస్ పేరెంటింగ్'..పదంలోనే ఉంది మార్గదర్శకం అని. అంటే..లైట్‌హౌస్ అనేది సముద్రంలో ఉంటుంది. ఇది పెద్ద పెద్ద ఓడలకు, పడవలకు ఓ దిక్సూచిలా ఉంటుంది. అలానే ఈ పేరెంటింగ్ విధానంతో పిల్లలు ప్రయోజకులుగా మారతారాని చెబుతున్నారు నిపుణులు.. అయితే ఈ విధానంలో పిల్లలు చాలా స్వతంత్రంగా ఉంటారు. మరీ ఇంత స్వతత్రంగా ఉంటే చేజారిపోయే అవకాశం ఉంటుదనే సందేహానికి తావివ్వకండి. ఎందుకంటే ఈ పేరెంటింగ్ విధానం వల్ల బాధ్యతయుతమైన పిల్లలుగా ఎదుగుతారని దీమాగా చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఏంటి లైట్‌హౌస్ పేరెంటింగ్? బాధ్యతయుతంగా పెరిగేందుకు ఎలా ఉపయోగపడుతుంది..?అంటే..ఈ విధానంలో తల్లిదండ్రులు తమ పిల్లలను స్వతంత్రంగా ఎదిగేలా చేస్తారు. ఎక్కడ వారిని నియంత్రించారు. స్నేహంగా మెలుగుతారు. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలకు వచ్చిన ప్రతి సమస్యను తమకు తామే పరిష్కరించుకునేలా దిశా నిర్దేశాం చేస్తారేగానీ జోక్యం చేసుకోరు. సవాళ్లను అధిగమించడం ఎలా అనేది అనుభవపూర్వకంగా తెలుసుకునేలా చేస్తారు. ఈ టైపు తల్లిదండ్రులు తమ పిల్లలకు స్పష్టమైన పరిమితులు, సరిహద్దులను ఏర్పాటు చేస్తారు. ప్రపంచం నుంచి తనంతట తానుగా ఎలా అభివృద్ధి చెందాలో గైడెన్స్ ఇస్తారు.అంతేగాదు ఈ విధానంలో పిల్లలు తమ ఆత్మగౌరవానికి ప్రాముఖ్యత ఇవ్వడం తెలుసుకుంటారు. అలాగే తల్లిదండ్రులతో ఓపెన్ కమ్యునికేషన్ చేయగలరు. ప్రతి విషయం తమ తల్లిదండ్రులకు తెలియజేయడం మంచిదనే ఆటిట్యూడ్ వస్తుంది పిల్లలకి. తాము పరిష్కరించలేని సమస్యను తల్లిదండ్రుల వద్ద చర్చించి సరిచేసుకుంటారు. వాళ్లకంటూ ఓ అభిప్రాయలు, ఉన్నతభావాలతో ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందకు సాగుతారు. అలాగే అనుకున్న వెంటనే కొన్ని పనులు అవ్వవనే విషయం అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. ఓపిక, సహనంతో వ్యవహరించడం అలవాటవ్వుతుంది. ఈ పేరెంటింగ్ విధానం వల్ల పిల్లలు ప్రమాదాల బారినపడటం అనేది అరుదని కూడా చెప్పొచ్చు. అయితే ఈ పేరెంటింగ్ విధానంలో పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి అంటే..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలంటే..పిల్లలతో స్నేహభావంతో మాట్లాడటం వంటివి చేయాలి. విసిగిస్తున్నా ఓ చిరునవ్వుతో మందలిస్తన్నట్లుగా చెప్పాలి. ఇలా చేస్తే తన అమ్మకి తనంటే ఇష్టం అనే బలమైన నమ్మకం ఉంటుంది. ఇలా ఉంటే ఏ విషయమైన మీతో ధైర్యగా చెబుతారు. భయం అనే పదం దూరం అవుతుంది. తల్లిదండ్రులంటే నా శ్రేయోభిలాషులనే గట్టి ఫీలింగ్, మంచి బాండ్ ఉంటుంది. సమస్యలను, సవాళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో సూచించాలే తప్ప తల్లిందడ్రులే తలకెత్తుకునే పని చేయకూడదు. అలాగే వాళ్లు సాధించిన ప్రతి విజయాన్ని సెలబ్రేట్ చేయడం, అభినందించడం వంటివి చేయాలి. అలాగే ఓడిపోయినా, వెనుకబడినా..భుజం తట్టి భరోశా ఇస్తూ ముందడుగు వేసేలా చేయాలి. ముఖ్యంగా నలుగురితో కలిసి ఉండటం ఏంటనేది తెలియజేయాలి. తమ నిర్ణయాలను తాము తీసుకునేలా స్వేచ్ఛగా బతకడం నేర్పిస్తే..ప్రతి అంశాన్ని సమాజం నుంచే సహజంగా నేర్చకుంటారు, వంటబట్టించుకుంటారు. ఇలా వ్యవహరిస్తే తల్లిందడ్రులు పిల్లల మధ్య మంచి బలమైన బాండింగ్ ఏర్పడుతుంది. అలాగే బాధ్యతయుతమైన పిల్లలుగా పెరగడమే కాకుండా గొప్ప ప్రయోజకులవుతారని చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం తల్లిదండ్రులు మీ పిల్లలతో ఇలానే ప్రవర్తిస్తున్నారో లేదో చెక్ చేసుకోండి.(చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్! అన్ని కోట్లా..!) -
ఐశ్వర్యనే ఆదర్శం అంటున్న మామ్ దీపికా!
బాలీవుడ్ స్వీట్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ పండంటి పాపాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆడబిడ్డకు తండ్రి కావాలనే రణవీర్ కోరిక నెరవేరింది. అయితే దీపికా తన ముద్దుల తనయ పెంపకం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను ఫాలో కానుందని సమాచారం. విషయం ఏమిటంటే...సాధారణంగా చంటిపాపాయి పుట్టినపుడు ఇంట్లో అమ్మమ్మలు, నాన్నమ్మలు, ఇతర పెద్దవాళ్లు తల్లీ బిడ్డల రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంటారు. చంటిబిడ్డకు నలుగు పెట్టి నీళ్లు పోయడం, పాపాయికి పాలు పట్టించడం, బాలింతకు ఎలాంటి ఆహారం పెట్టాలి లాంటి జాగ్రత్తలు, బాధ్యతలు వాళ్లవే. మకొంతమంది తమ పాపాయిని జాగ్రత్తగా చూసేందుకు ఒక ఆయమ్మను, నానీనో పెట్టుకుంటారు. చాలామంది సెలబ్రిటీలు లక్షలు ఖర్చుపెట్టి మరీ నానీలను నియమించకుంటారు. కానీ దీపికా మాత్రం ఐశ్వర్య, అలియా భట్, అనుష్క శర్మ పేరెంటింగ్ స్టైల్‌ను ఫాలో అవుతోందట. బాలీవుడ్ లైఫ్ కథనం ప్రకారం దీపిక నానీని ఏర్పాటు చేసుకోకూడదని నిర్ణయించింది. స్వయంగా తానే చిన్ని దీపిక బాధ్యతలను చూసుకోనుందిట.ఆలియానే ఆదర్శంమరో విషయం ఏమిటంటే పాప ఫోటోను మరికొన్ని పాటు రివీల్ చేయకుండా గోప్యంగా ఉంచాలని భావిస్తోందట. కొంచెం పెద్దయ్యాక మాత్రమే తన బేబీని ప్రపంచానికి పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో ఆలియాను ఫాలో కానుందట. ఐశ్వర్య తన కుమార్తె పుట్టినపుడు నానీనీ పెట్టుకోలేదట. ఇందుకు ఆమె అత్తగారు జయా బచ్చన్ కూడా 'హ్యాండ్-ఆన్-మామ్' అంటూ పొగిడింది కూడా. ఆ తరువాత అనుష్క శర్మ , అలియా భట్ ఇదే బాటలో నడిచిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ‘బాస్! నేనూ వస్తా..’! ఆంబులెన్స్ వెనక దౌడుతీసిన కుక్క, వైరల్ వీడియో -
తల్లిగా ఉండటమే గొప్ప- సుస్మితా సేన్
ఈ రోజుల్లో పిల్లల పెంపకం పెద్దలకు ఓ సమస్యగా ఉంటే తమ కెరియర్ను వృద్ధి చేసుకుంటూనే పిల్లలను పెంచడం ఒంటరి తల్లులకు అతిపెద్ద సవాల్‌తో కూడుకున్నదని దాదాపు 70 శాతం ఒంటరి తల్లిదండ్రులు తమ ఉద్యోగావకాశాలను వదులుకోవడానికి కారణం ఇదే అని స్పష్టం చేసింది న్యూయార్క్ కెరీర్ మైండ్స్ అధ్యయనం. గ్లోబల్వైజ్గా టెక్ కంపెనీలలో ఉద్యోగావకాశాలను కల్పించే ఈ సంస్థ తమ ఇంటర్వ్యూలలో పాల్గొనే సింగిల్ పేరెంట్స్ పిల్లల కోసం ఉద్యోగాలను వదులుకుంటున్నారనే విషయాన్ని స్పష్టం చేసింది. ఒంటరి తల్లిదండ్రులు తమ కెరియర్ను కాపాడుకుంటూనే పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు సూచనలు ఇస్తున్నారు.ఒంటరిగా పిల్లలను పెంచడం చాలా కష్టమైన టాస్క్. ముఖ్యంగా ఒంటరి తల్లుల్లో భావోద్వేగ సమతుల్యత తప్పనిసరి. క్రమశిక్షణలో ఉంచాలా? లేక ప్రేమ, ఆప్యాయతలను చూపాలా.. అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఒంటరి తల్లులు అప్పటికే జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఉంటారు కాబట్టి క్రమశిక్షణతో పెంచాలనుకుంటారు.కఠినమైన శిక్షణ కూడదునేను కరెక్ట్‌గా ఉంటేనే నా పిల్లలను బాగా పెంచగలను అనుకునే దోరణిలో పేరెంటింగ్ కూడా సవాల్‌గా తీసుకుంటున్నారు. అయితే, ఈ విధానం వల్ల తరచూ భయాందోళనకు లోనవుతుంటారు. ఫలితంగా ప్రతి చిన్న విషయంలోనూ ఉద్వేగానికి లోనవుతుంటారు. వీళ్లు తమని తాము ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఎవరి సపోర్ట్ లేకుండా ‘సూపర్ ఉమన్’లాగా ఉండాలనుకోవడం అన్ని సందర్భాలలో కుదరదు. శారీరకంగానూ, మానసికపరమైన సమస్యలతోనూ ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకని, తమ పెద్దవారి మద్దతు తీసుకోవడం అవసరం. కఠినమైన క్రమశిక్షణ వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉంది.సమతుల్యత తప్పనిసరిఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్‌ని పిల్లల ముందుకు తీసుకురాకూడదు. సింగిల్‌గా ఉండటం వల్ల పెద్దలు ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. దీనివల్ల పిల్లలు ‘తామేదో కోల్పోతున్నాం’ అనే భావనలో ఉంటారు. పిల్లలు పెద్దలను గమనిస్తుంటారు అని గుర్తుంచుకోవాలి. ‘అమ్మకు నాకన్నా ఫోన్ లేదా వర్క్ అంటేనే ఎక్కువ ఇష్టం’ అనే ఆలోచన పిల్లల్లో రానీయకూడదు.అభిప్రాయాలను తీసుకోవాలిపిల్లలు చిన్నవాళ్లు కదా అనుకోకుండా వాళ్ల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఇంటి నిర్ణయాల్లో వారిని పాలుపంచుకోనివ్వాలి. దీనివల్ల తమను నిర్లక్ష్యం చేయడం లేదు అనే ఆలోచన పిల్లల్లో కలుగుతుంది. ఇంట్లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనిపించినా బయట వెతుక్కుంటారు.తమ మాటే వినాలనుకోవద్దుఒంటరి తల్లుల పెంపకంలో పిల్లలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఎక్కువ. పిల్లలు నా మాట వినాలనే ఆలోచనతో పూర్తిగా పిల్లలు చెప్పినట్టు వినడం...లేదంటే తాము ఒక రూలర్‌గా ఉండాలను కుంటారు. టీనేజ్ దశలో ఈ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ విధానం వల్ల పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో పెద్దవాళ్లకు తెలియడం లేదు. కానీ, పెద్దలను ఎలా హ్యాండిల్ చేయాలో పిల్లలకు బాగా తెలుసు. పిల్లలు ఇద్దరుంటే వారిద్దరినీ సమానంగా చూడాలి. వీలున్నప్పుడల్లా వారిద్దరికీ టైమ్ కేటాయించి వారి ప్రతి అవసరాన్నీ తీర్చాలి. నమ్మకం ముఖ్యంపిల్లల అవసరాలు తెలుసుకొని సాధ్యమైనంతవరకు వాటిని పూర్తి చేయాలి. పిల్లల ఆలోచనా విధానాన్ని పంచుకునే విధానం ఇంట్లో ఉండాలి. స్నేహపూర్వకమైన వాతావరనంలో రోజులో కనీసం పది నిమిషాలైనా పిల్లల కోసం సమయం కేటాయించాలి. తమ పని గురించి చెబుతూనే పిల్లల విషయాలనూ పట్టించుకోవాలి. అప్పుడే ఏదో కోల్పోతున్నామనే భావన పిల్లల్లో కలగకుండా పెరుగుతారు. -ప్రొఫెసర్ జ్యోతిరాజ,సైకాలజిస్ట్, లైఫ్‌స్కిల్ ట్రెయినర్ తల్లిగా ఉండటమే గొప్పఇద్దరు అమ్మాయిలను ఒంటరితల్లిగా పిల్లలను పెంచుతూనే, తన కెరియర్‌నూ బిల్డ్ చేసుకుంటున్న బాలీవుడ్ నటి సుస్మితాసేన్ స్ఫూర్తిదాయకమైన విషయాలనూ సోషల్‌మీడియా ద్వారా తెలియజేసింది. ‘ప్రతిరోజూ ఒక తల్లిగా నన్ను నేను భుజం తట్టుకునే పని ఏం చే యాలనేది ముందే నిర్ణయించుకుని, అది పూర్తి చేస్తాను. నా పిల్లలకన్నా నాకు ఎక్కువ తెలుసు అనుకోను. వారి ద్వారా కూడా ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. ఇలా ఉండటం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేనొక కళాకారిణిగా కన్నా తల్లిగా ఉండటమే గొప్పగా భావిస్తాను. ఆ రోజంతా ఎన్ని పనులు చేసినా పిల్లల వద్దకు వస్తూనే అన్నీ దులిపేసుకొని వారి ముందు ప్రేమగా ఉంటాను.’– సుస్మితాసేన్ -
అక్షయ్ కుమార్ పేరెంటింగ్ స్టైల్!..తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సినవి..!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్క్రీన్‌పై యాక్షన్ హీరో అయినా ఆఫ్ స్క్రీన్‌పై మాత్రం ఓ మంచి తండ్రిగా కుటుంబంతో గడిపేందుకే ప్రాధాన్యత ఇస్తాడు. తన తల్లిదండ్రులు ఎలాంటి విలువలు నేర్పారో అవే తన పిల్లలకు నేర్పించానని సగర్వంగా చెబుతుంటాడు. ఇక్కడ అక్షయ్ దంపతుల నుంచి ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన కీలక విషయాలేంటో సవివరంగా చూద్దాం..!.చెఫ్‌గా మొదలైన అక్షయ్ కుమార్ ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ స్టార్‌లో ఒకడిగా చెలామణి అవుతున్నాడు. ఆయన ఎన్నో వెవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే బుల్లితెరపై యాంకర్‌గా ఫియర్ ఫ్యాక్టర్ సిరీస్‌తో అలరించాడు కూడా. అలాంటి ఆయన ఓ ఫ్యామిలీ మ్యాన్‌గా ఎంతలా ఉంటాడో చాలామందికి తెలియదు. ఆఫ్ స్క్రీన్‌పై తన భార్య ట్వింకిల్ ఖన్నా, ఇద్దరు పిల్లలతో టైం స్పెండ్ చేసేందుకే ఇష్టపడతాడు. ఆయనకు మొదటి సంతానంగా 21 ఏళ్ల ఆరవ్, రెండో సంతానంగా 11 ఏళ్ల నితారా అనే కుమార్తె ఉంది. ఆయన ఓ తండ్రిగా, భర్తగా ఏం చేయాలో అవన్నీ పుల్‌ఫిల్ చేస్తుంటాడు. అతడి పేరెంటింగ్ నుంచి నేర్చుకోవాల్సినవి ఇవే..సమాయన్ని కేటాయించడం..నటుడిగా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా పిల్లల కోసం సమయం కేటాయిస్తాడు. వాళ్లతో కలిసి వాకింగ్ లేదా పార్కులో గడుపుతాడు. పిల్లలు కూడా ఫిట్నెస్తో ఉండేలా కేర్ తీసుకుంటాడు. కాస్త విరామం దొరికిన పిల్లలతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తాడు.కలిసి చదవడం..తన కూతురు నితారా చిన్నప్పటి నుంచి ఆమె చదువు బాధ్యత అంతా అక్షయ్‌నే చూసుకున్నాడు. తనతో కలిసి కొత్త పదాలు నేర్చుకోవడం, చదవడం, వినడం వంటివి చేస్తానని పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పారు అక్షయ్. అలాగే ఆమెకు కథ చెప్పే నైపుణ్యం నేర్పించడమే గాక, కొన్ని విలువలను కథల రూపంలో అర్థమయ్యేలా వివరించేవాడినని అంటారు అక్షయ్. కూతురికి తండ్రిగా ఉండటాన్ని గర్వంగా ఫీలవుతాడు..కూతురికి తండ్రి అవ్వటం సిగ్గుపడే విషయం కాదని అంటాడు. తన కూతురు నితారాతో కలిసి డాల్ హౌస్‌లను నిర్మించడం, ఆమె క్రియేటివిటీని తన కాలి గోళ్లపై నెయిల్ పాలిష్ రూపంలో ఆమె చేత వేయించుకుంటాడు. పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో అలానే ఫ్రీగా ఉండనిస్తా..ఎట్టిపరిస్థితుల్లోనూ బలవంతం చెయ్యను. కొన్ని విషయాల్లో మాత్రం హద్దులు పెడతాను, స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన వాటిల్లో ఉంటానని నొక్కి చెబుతున్నారు అక్షయ్. పిల్లలకు సరైన విలువలను నేర్పడం అత్యంత ముఖ్యం. అవే తన తల్లిదండ్రులు తనకు నేర్పించారని తాను కూడా వారి బాటనే అనుసరిస్తున్నానని సగర్వంగా చెప్పారు. జీవిత పాఠాలు..అక్షయ్ తన పిల్లలు కష్టపడి సంపాదించటం గురించి, దాని ప్రాముఖ్యతను తెలుసుకునేలా చూసుకుంటానని అన్నారు. కొడుకు ఆరవ్‌కి కష్టం విలువ నేర్పించాడు. అలాగే నైతికత అంటే చెబుతానని, కష్టపడి పనిచేస్తేనే ప్రత్యేక హక్కు వస్తుందని వివరిస్తానని చెప్పారు. ఇటీవల తాము సెలవుల్లో విహార యాత్రకు వెళ్లాలనుకున్నాం. అయితే తన కొడుకు ఆరవ్ బిజినెస్ క్లాస్‌లో వెళ్లాలనుకున్నాడు. అందుకోసం కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంటేనే తల్లిదండ్రులను ఖరీదైన కోరికలు కోరుకునే హక్కు ఉంటుందని చెప్పాను. ఆరవ్ కూడా దాన్నే నిజం చేస్తూ..ఫస్ట్-డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించి తన కోరిక నెరవేర్చుకున్నాడని వివరించారు. ఇలాంటివే పిల్లలకు నేర్పించాలే తప్ప ఏది అడిగితే అదే తెచ్చే తండ్రిలా పెంచి పిల్లలను భారంగా మార్చుకోవద్దని సూచిస్తున్నారు అక్షయ్. అలాగే కృజ్ఞతతో కలిగి ఉండటం, బాధ్యతయుతంగా వ్యవహరించడం వంటివి తెలియజేయాలని చెబుతున్నారు. పనులు పంచుకోవడం..ప్రతి ఒక్కరికీ కుటుంబ సమయం ముఖ్యం. పిల్లలు తమ తల్లితో సమయం గడపేలా తండ్రే బాధ్యత తీసుకోవాలి. అందుకే తాను కొన్ని ఇంటి పనుల్లో బాధ్యత తీసుకుంటానని అన్నారు. తద్వారా ఇంటి భారమంతా మహిళలపైనే పడదు. అలాగే ఇంట్లో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను తన భార్య ట్వింకిల్ ఖన్నా చాలా బాగా పెంచిందన్నారు. నిజానికి వివాహం తర్వాత ఆమె నన్ను కూడా తల్లిలా బాగా చూసుకుందని ఆనందంగా చెప్పారు. ఇక్కడ తల్లిదండ్రులుగా పిల్లలకు కలిసి నేర్పించాల్సిన విషయాలు, విలువలను ఇరువురు సఖ్యతతో నేర్పిస్తేనే..పిల్లలు మంచిగా పెరుగుతారని చెప్పకనే చెప్పారు.(చదవండి: నోట్లో వేసుకుంటే కరిగిపోయే 'పైన్ నట్స్'..ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
పుణే ఘటన! ఎవరిది ఈ పాపం? ఇది పేరెంటింగ్ వైఫల్యమేనా..?
పుణెలో మైనర్ బాలుడి డ్రైవింగ్ కారణంగా ఇద్దరు యువ ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు. కారుని గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అంతేగాదు ఈ ప్రమాదానికి ముందు పంబ్లో సంబరాలు చేసుకోవడమే గాక ఏకంగా రూ. రూ. 48 వేలు ఖర్చు పెట్టి మరీ మందు తాగినట్లు తేలింది. నిజానికి మహారాష్ట్రలో 25 ఏళ్లు దాటిన వారికే మద్యం సేవించేందుకు అనుమతి ఉంది. ఇక్కడ నిందితుడికి కొద్ది గంట్లలోనే షరతులతో కూడిన బెయిల్ రావడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు నిందుతుడి తండ్రిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ దిగ్బ్రాంతికర ఘటన యావత్తు దేశాన్ని ఒక్కసారిగా ఉలక్కిపడేలా చేసింది. ఇక్కడ సరిగాలేని చట్టాలది తప్పా? లేక నిందితుడిని అలా పెంచిన తల్లిదండ్రులది తప్పా? దీనికి ఎవరు బాధ్యులు? ఎవరదీ ఈ పాపం..?యావత్తు దృష్టిని ఆకర్షించిన ఈ ప్రమాదం అతిపెద్ద ప్రజాస్వామ్యంలో జరిగిన భయానక దిగ్బ్రాంతికర ఘటనగా చెప్పొచ్చు. 17 ఏళ్లు మైనర్ రూపంలో మృత్యువు ఎన్నోకలలతో ఉన్న ఇద్దరు యువతీయుకుల జీవితాలను బలితీసుకుంది. రెండు కుంటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంత ఘోరానికి పాల్పడ్డ నిందితుడు కొద్ది గంటల్లోనే బెయిల్‌పై రావడమే గాక మేజర్ కాదు కాబట్టి శిక్షార్హడు అని కోర్టు పేర్కోనడమే అత్యంత కలిచివేసే విషయం. ఇక్కడ మైనర్ ఎంత పెద్ద నేరం చేసిన శిక్ష పడకుండా తప్పించుకోగలుగుతున్నందుకు బాధపడాలో లేక తల్లిదండ్రుల పెంపకానికి రెండు నిండు జీవితాలు బలైనందుకు కలత చెందాలో తెలియని స్థితి. ఈ ఘటన ఒక్క విషయం చెప్పకనే చెప్పింది. తల్లిదండ్రుల పెంపక వైఫల్యతకు నిదర్శనమే ఈ ఘటన అని చెంపదెబ్బ కొట్టినట్లు చెప్పకనే చెబుతోంది. మేజర్ కానివాడికి విలావంతమైన కారు ఇవ్వడం ఒక తప్పు అయితే..ఖర్చుపెట్టుకోమని అంతంత డబ్బు ఇస్తున్నారంటే..తల్లిదండ్రులుగా వాళ్లకు ఏం చెబుతున్నారో అర్థమవుతోంది. ఇక్కడ తల్లిదండ్రులు మేము ఒళ్లు గుల్ల చేసుకుని డబ్బులు సంపాదించేస్తాం..మీరు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి తాగితందనాలు ఆడి బీభత్సం సృష్టించమని చెబుతున్నారా? అని అనలా. ఏదైనా మొక్కగా ఉన్నప్పుడే సరిచేయాలి. విలాసవంతమైన వస్తువులు కొనివ్వగలిగే స్తోమత ఉన్న తల్లిదండ్రులు రెండు విషయాలు తప్పక గుర్తించుకోవాలి. కొన్నింటికి నో చెప్పడం ముఖ్యం..ఒకటి దీనివల్ల వాడికి ప్రయోజనం ఉంటుందా లేదా గ్రహించాలి. రెండు ఎంత వరకు ఆ లగ్జరియస్ వస్తువు పిల్లలకు అవసరం అనేది కూడా గమనించాలి. స్నేహితుల ప్రభావంతో స్టేటస్ ఆఫ్ సింబల్‌గా విలాస వస్తువులు కావాలనుకుంటున్నారా? అన్నది కూడా తల్లిదండ్రులుగా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. ప్రతి తల్లిదండ్రులు స్తోమత ఉన్నా లేకపోయినా విలావంతమైన వస్తువులకు 'నో' చెప్పాలి. అంతేగాదు తల్లిదండ్రులుగా ప్రతిదానికి 'ఎస్' అని చెప్పడం కాదు నో అని చెప్పి కట్టడి చేయడం వంటివి కూడా చేయాలి. ఒక వస్తువు కొనేందుకు ఖర్చు అవుతున్న డబ్బులు అందుకోసం మీరు పడుతున్న కష్టం గురించి విడమరిచి చెప్పాలి. చాలామంది చేసే ప్రధానమైన తప్పు ఏంటంటే..ప్రతీది కాదంటే వారు నొచ్చుకుంటారు,స్నేహితుల ముందు చిన్నబోతారని భావిస్తుంటారు. పైగా పిల్లలు కదా..!పోనీలే అనే భావన కూడా అస్సలు వద్దు. మీ ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఎంత ఖరీదైనదేనా కొనిచ్చేస్తారు..ఆ తర్వాత ఏంటీ..? అనేది అతిపెద్ద ప్రశ్న..?. అనేది గుర్తుపెట్టుకోండి.. పిల్లల భవిష్యత్తు భద్రమైన వస్తువులు కొనివ్వండి. గారాభంగా పెంచడం తప్పుకాదు. ముద్దుగా, గారాభంగా పెంచుతూనే బాధ్యతలను, విలువలను నేర్పించాలి. ముఖ్యంగా ప్రయోజకులుగా మారకపోయిన పర్లేదు గానీ ఇతరులకు హాని తలపెట్టే వారిగా, అందరూ అసహ్యించుకునేవారిలా మాత్రం తయారవ్వనివ్వకండి. (చదవండి: ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు!) -
Rest Mom Face: పేరెంటింగ్ ప్రపంచంలో కొత్త మంత్రం
అమ్మానాన్నా మాట్లాడుతున్నా సరే, వినకుండా విసురుగా వెళ్లిపోవడం వ్యంగ్యంగా మాటలు అనేయడం నాటకీయంగా కళ్లు తిప్పడం ఉన్నట్టుండి తమ గదిలోకి వెళ్లి ‘ధఢేల్’న తలుపులు వేసుకోవడం ఇలాంటివెన్నో సంఘటనలు... టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులకు తెలియని విషయమేమీ కాదు. ఒంటరి తల్లులకు పిల్లల పెంపకం మరింత కష్టంగా ఉంటుంది. పిల్లల చంచలమైన భావాలను నియంత్రించలేక తల్లులు చాలాసార్లు మౌనంగా మారిపోతుంటారు. ఇంట్లో టీనేజర్లు సృష్టించే యుద్ధ వాతావరణంలో ఎవరు గెలుస్తారో ప్రతి పేరెంట్కు తెలుసు కాబట్టి ఆర్‌ఎమ్‌ఎఫ్ మంత్రాన్ని మననం చేసుకోండి అంటున్నారు నిపుణులు. రెస్ట్ మామ్ ఫేస్ (ఆర్‌ఎమ్‌ఎఫ్) అనే ఈ మంత్రం అమ్మ ముఖకవళికలను పిల్లల ముందు ఎలా ప్రదర్శించాలి, అందుకు తగిన సాధన ఏ విధంగా చేయాలో నిపుణులు చెబుతున్నారు. ‘టీనేజ్‌లో ఉన్న మా అమ్మాయి విషయంలో చాలాసార్లు నా ప్రవర్తన ఒత్తిడితో కూడుకున్నదై ఉంటుంది. చికాకు పరిచే సంఘటనలు ఎదురైనప్పుడు నా ఎమోషన్స్‌ని సమర్థంగా నియంత్రించలేక పోతుంటాను’ అంటుంది కార్పొరేట్ ఆఫీసులో హెడ్‌గా పనిచేసే కౌముది. ‘మా అబ్బాయితో గొడవపడటం, పదే పదే చెప్పడం, గతంలో చేసిన ్రపామిస్లను గుర్తుచేయడం అదేపనిగా జరుగుతుంటుంది. కానీ, ఆ వెంటనే తప్పనిసరై నాకు నేనే తగ్గడం, మౌనంగా ఉండటం, లేదంటే సర్దిచెప్పడం.. ఎప్పుడూ జరిగే పనే’ అంటుంది బొటిక్‌ను నడిపే వింధ్య. ‘కుటుంబ ఆకాంక్షలను పిల్లలు తీర్చాలనే లక్ష్యంగానే నేటి తల్లిదండ్రుల ప్రవర్తన ఉంటోంది. తల్లులు టీనేజ్ పిల్లల విషయంలో తమను తాము నియంత్రించు కోవడానికి ఇది కూడా ఒక కారణంగా ఉంటుంది’ అని తెలియజేస్తుంది హోలీ గ్రెయిల్ ఆఫ్ పేరెంటింగ్ మ్యాగజైన్. ఎలాంటి భావోద్వేగాలను ముఖంలో చూపని తటస్థ స్థితిని రెస్టింగ్ మామ్ ఫేస్ సాధన చేస్తే సరైన ప్రయోజనాలను ΄÷ందవచ్చు అని చెబుతోంది. అదెలాగో చూద్దాం. తటస్థంగా.. సాధారణంగా ఎలాంటి వ్యక్తీకరణ లేని స్త్రీ ముఖాన్ని చూసిన వాళ్లు అహంకారమనో లేదా నిరాడంబరత అనో నిర్ధారించుకుంటుంటారు. సంతోషించే సమయంలోనూ వీరు ‘తటస్థ’ ముఖాలతో ఉండటం చూస్తుంటాం. చూసేవారికి వీరి ముఖాల్లో ప్రశాంతత కూడా కనిపిస్తుంటుందని పరిశోధకులు గ్రహించారు. అందరూ ఇలా ఉండలేరు. కానీ, పిల్లల ముందు తమ భావోద్వేగాలను బయటకు చూపకుండా తమని తాము నిభాయించుకుంటూ ఉండాలంటే ్రపాక్టీస్ అవసరం. విశ్రాంతికి 30 సెకన్లు అమ్మల ముఖం పిల్లల ముందు సరైన విధంగా ఉండాలంటే...ఫేస్ యోగాను సాధన చేయాలి. కోపంగా ఉన్న పిల్లలతో మాట్లాడేముందు ముఖ కండరాలకు కూడా విశ్రాంతి అవసరం అని తమకు తాముగా చెప్పుకోవాలి. రెండు పిడికిళ్లతో ముఖాన్ని రుద్దుకుంటున్నట్టు, కోపాన్ని కూల్ చేసుకుంటున్నట్టు ఊహించుకోవాలి. గాఢంగా ఊపిరి పీల్చుకోవడం, వదలడం చేయాలి. అయితే, అది ఎదుటివారికి నిట్టూర్పులా ఉండకూడదు. మీ ముఖ కండరాలలో చికాకు, ఆశ్చర్యం, విమర్శిం చడం ... వంటివన్నీ తీసేసి, స్పష్టంగా అనుకున్న విషయాన్ని చెప్పేయాలి. చిన్నపిల్లలు యుక్తవయసులో ఉన్నా, పెద్దవారైనప్పుడైనా ఈ ఆర్‌ఎమ్‌ఎఫ్ ఉపయోగకరంగా ఉంటుంది. నిజాయితీగా ఈ వ్యూహాన్ని అమలుపరిస్తే ప్రయోజనకరమైన మార్పులు కనిపిస్తాయి. గొడవ పడే సమయాల్లో ఎలాంటి బోధలు చేయద్దు. అలాగే శిక్షించవద్దు. పిల్లలు వారి భావోద్వేగాలను స్వీయ – నియంత్రణ చేయగలిగేలా చేయడమే లక్ష్యంగా ఉండాలి. మీ బిడ్డ తన ఆందోళనను, అసంతృప్తిని మరింత ఆమోదయోగ్యమైన మార్గాల్లో వ్యక్తపరచలేకపోతే అకస్మాత్తుగా దాడికి దిగవచ్చు. లేదంటే తనని తాను బాధించుకోవచ్చు. అందుకని సమస్యను కూల్‌గా పరిష్కరించాలి. బంధాలు పదిలం.. ‘తల్లి మెరుగైన ఆలోచనతో ఉంటే పిల్లలతో స్నేహాలను, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంచుకోగలదు. కానీ, నియంత్రణతో సరైన ప్రయోజనాలను రాబట్టలేరు’ అంటారు సైకాలజిస్ట్ అండ్ పేరెంటింగ్ రైటర్ అలిజా. పిల్లల ఆకలి తీరినప్పుడు వారి కోపం చల్లబడుతుంది. అందుకని వారికి ఆరోగ్యకరమైన చిరుతిండిని అందిస్తుండాలి. దీంతో పిల్లల దృష్టి మారిపోతుంది. కానీ, అన్ని విషయాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకని సాధ్యమైనంత వరకు ఆర్ఎమ్ఎఫ్ని సాధన చేయడమే మేలు అనేది నిపుణుల మాట. -
మగపిల్లల పెంపకం
సాధారణంగా పెంపకం విషయంలో ఆడపిల్లలకి ఎన్నో జాగ్రత్తలు చెప్పటం చూస్తాం. మగపిల్లలకి చెప్పవలసినది ఏమీ లేదని చాలా మంది అభిప్రాయం. ఈ కారణంగానే సమాజంలో ఎన్నో అయోమయ పరిస్థితులు, అలజడులు, అరాచకాలు. ముఖ్యంగా ఆడపిల్లలకి సమాజం మీద ఏవగింపు, కోపం, పురుషద్వేషం పెరిగి అవాంఛనీయ సంఘటనలకి దారి తీయటం జరుగుతోంది. అమ్మాయిలు విప్లవభావాల పట్ల ఆకర్షించబడటం, పెళ్లి చేసుకోవద్దు అనుకోటం, చేసుకున్నా విడాకులు తీసుకోవటం, కుటుంబాలు విచ్ఛిన్నం కావటం, లేదా అమ్మాయిలనే పెళ్లి చేసుకోవటమో, సహజీవనం చేయటమో జరుగుతోంది. ఇవన్నీ కొంతవరకైనా అదుపులో ఉండి సమాజంలో సమరసత ఉండటానికి మగపిల్లలని సరిగా పెంచటం ప్రధానం. మన తరువాతి తరం వారికి మనం ఏం నేర్పిస్తున్నాం? అని కాస్త వివేచన చేస్తే ... అమ్మో! ఎంత భయం వేస్తుందో! మన ప్రవర్తన ద్వారా నేర్పే విషయాలే కాదు, మన మాటలు, ఆదేశాలు, ఉపదేశాలు, బోధలు మొదలైనవి కూడా తలుచుకుంటే బాధ కలుగుతుంది. ఆడ, మగ వివక్ష ఇంట్లోనే మొదలవుతుంది. ఆడపిల్ల పుట్టిందనగానే ముందుగా ‘‘అయ్యో!’’ అనేది తల్లే. పెంపకంలోనూ తేడా చూపిస్తారు. ఉదాహరణకి ఇంట్లో అమ్మాయిని తల్లే అంటుంది ‘‘ఆడపిల్లవి నీకెందుకు?’’ అని. అంటే ఆడపిల్ల కొన్ని విషయాలు పట్టించుకోకూడదు. అవసరం లేదు. కొడుకు కూడా కొన్ని పట్టించుకోకూడదు. కానీ అవి వేరు. అవి ఇంటి విషయాలు, వంటవిషయాలు మొదలైనవి. ఇంక కొన్ని కుటుంబాలలో ఆస్తిపాస్తులు పంచి ఇవ్వటం మాట అటుంచి కూతురిని ఇంటిపని చెయ్యమని, కొడుకుని చదువుకోమని చెప్పేవారు కనపడుతూనే ఉన్నారు. ఇద్దరినీ సమానంగా చూడటం ఎట్లా కుదురుతుంది? ఆడపిల్లలు కొంచెం నాజూకుగా ఉంటారు, మగపిల్లలు కాస్త మొరటుగా ఉంటారు కదా! అనిపించటం సహజం. సమానత్వం అంటే వారి పట్ల ప్రవర్తించే తీరు సమానంగా ఉండటం. వారికి ఇష్టమయినవి, వారి అభిరుచులకు తగినవి అందించటం. నిజానికి మగపిల్లలైనా ఏ ఇద్దరికీ ఒకే రకమైన అభిరుచులు, లక్ష్యాలు ఉండవు కదా! ఒకరికి ఇంజనీరింగ్ ఇష్టమైతే మరొకరికి వైద్యవృత్తి ఇష్టం, వేరొకరికి వ్యవసాయం మీద మక్కువ ఉండవచ్చు. వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వటం తల్లితండ్రుల కర్తవ్యం. అదే ఆడపిల్లల విషయంలో కూడా పాటించాలి. ఇదిప్రోత్సాహం మాత్రమే. అసలు చేయవలసినది మగపిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఆడపిల్లలని గౌరవించటం నేర్పాలి. ఇది తండ్రి ప్రవర్తన వల్ల కలుగుతుంది. తండ్రి తల్లిని గౌరవిస్తూ ఉంటే కొడుకు కూడా తల్లిని, స్త్రీలని గౌరవిస్తాడు. చీటికి మాటికి భార్యని భర్త చులకన చేస్తూ ఉంటే కొడుకుకి ఆడవారిని తక్కువగా చూడటం అలవాటు అవుతుంది. తరువాతి కాలంలో ఈ భావం సరి అవటం కష్టం. ఇటువంటి పెంపకంలో పెరిగిన వారే ఆడపిల్లలని ఏడిపించటం నుండి యాసిడ్ దాడులు, అత్యాచారాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. ఏ ఇంట్లో తండ్రి తల్లిని అగౌరవపరచడో, ఆడపిల్లలని బరువుగా భావించ కుండా ఉంటారో ఆ ఇంట్లో పెరిగిన మగపిల్లలు తోటి ఆడపిల్లలతో మర్యాదగా ప్రవర్తిస్తారు. అటువంటి వాళ్ళు ఉన్న సమాజంలో మన ఆడపిల్లలు కూడా భద్రంగా ఉంటారు. ప్రతి క్షణం ఆడపిల్ల, మగపిల్లవాడు అనే మాటని అని వారికి ఆ సంగతి గుర్తు చేస్తూ ఉండకూడదు. ఇంటి పనులన్నీ ఇద్దరి చేత సమానంగా చేయిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ రోజులలో ఆడ, మగ అందరు ఉద్యోగం చేస్తున్నారు. మగవారి బాధ్యత అయిన సంపాదించటంలో ఆడవారు భాగస్వామ్యం వహిస్తున్నప్పుడు, ఇంటి పనిలో మగవారు కూడా భాగస్వామ్యం వహించాలి అని చిన్నప్పుడే బుర్రకి ఎక్కించాలి. ముందు తిన్నకంచం తీయటం, వంటపనిలో సహాయం చేయటం అలవాటు చేయాలి. లేక΄ోతే కోడలు అత్తగారి పెంపకాన్ని తప్పు పడుతుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
Empty nest syndrome: పిల్లలు ఎగిరెళ్లాక ఒకరికి ఒకరై
చదువుల కోసమో.. ఉద్యోగాల కోసమో పెళ్లయ్యాక వేరొక చోట ఉండేందుకో పిల్లలు తల్లిదండ్రులను విడిచి వెళతారు. ఆ సమయంలో ఇల్లు ఖాళీ అవుతుంది.. బోసి పోతుంది. తల్లిదండ్రుల జీవితంలో నైరాశ్యం వచ్చే అవకాశం ఉంటుంది. దీనినే ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటారు. ఈ సమయంలో భార్యను భర్త, భర్తను భార్య పట్టించుకోకపోతే, కొత్త జీవితం మొదలుపెట్టకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు ఏం చేయాలి? కేస్ స్టడీ 1: దీపావళి పండగ వచ్చింది. అపార్ట్మెంట్లో అందరూ టపాకాయలు కాలుస్తున్నారు. కాని మూర్తి గారు, ఆయన భార్య సరళ గారు మాత్రం కిందకు రాలేదు. సరదాకైనా నిలబడలేదు. మామూలుగా ప్రతి సంవత్సరం వాళ్లు బోలెడన్ని టపాకాయలు కాలుస్తారు. సందడి చేస్తారు. ఈసారి అస్సలు తలుపులే తీయలేదు. కారణం? ఆరు నెలల క్రితమే వాళ్ల ఒక్కగానొక్క కొడుకు ఎం.ఎస్. చేయడానికి యు.ఎస్. వెళ్లాడు. అప్పటి నుంచి వారిలో ఒక రకమైన నిర్లిప్తతను అపార్ట్మెంట్ వాసులు గమనిస్తున్నారు. చివరకు ఆ నిర్లిప్తత పండగల మీద కూడా ఆసక్తిని కోల్పోయేలా చేసింది. కేస్ స్టడీ 2: యాభై ఏళ్ల సీతాదేవికి విపరీతంగా కాలు నొప్పి వస్తోంది. భర్త జానకిరామ్ ఆమెను అన్ని హాస్పిటళ్లకు తిప్పాడు. కాల్లో ఏ సమస్యా లేదు. ఏదైనా ఆందోళన వల్ల వస్తున్న సైకలాజికల్ నొప్పేమోనని డాక్టర్లు అంటున్నారు. సీతాదేవి, జానకిరామ్‌లకు కూతురు, కొడుకు. మొదట కూతురు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లింది. కొడుకు చదువుకుంటానని స్వీడన్ వెళ్లాడు. అప్పటి నుంచి ఆమెకు తెలియని ఆందోళన. ఒంటరితనం. దిగులు. భర్త ఏదైనా కాలక్షేపం కోసం బయటకు వెళ్లినా ఆమెకు దిగులు ముంచుకొస్తోంది. పిల్లలు లేని ఇల్లు ఆమెకు ఎంతకాలానికీ అలవాటు కావడం లేదు. ‘నెస్ట్’ అంటే గూడు. పిల్లలు లేని గూడు ఎంత లేదన్నా బోసి పోతుంది. తల్లిదండ్రులు... వారు లేని వెలితితో ఇంట్లో మిగులుతారు. ఆ సమయంలో వారిలో అనేక రకాలైన మానసిక సంచలనాలు వస్తాయి. అటువంటి సందర్భాన్ని మానసిక నిపుణులు ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటున్నారు. పాశ్చాత్య దేశాలలో పిల్లలను విడి గదుల్లో ఉంచి పెంచడం అలవాటు. 18 ఏళ్లు రాగానే వారు దూరమవుతారనే మానసిక సంసిద్ధతతో ఉంటారు. భారతీయులు మాత్రం పిల్లలను తమ వద్దే పడుకోబెట్టుకుంటారు. వారికి ఎంత వయసొచ్చినా వారు తమతో లేదా వారి వెంట తాము ఉండాలనుకుంటారు. అలాంటిది చదువు, ఉద్యోగాలు, పెళ్లి చేసుకొని విడి కాపురం పెట్టడాలు లేదా వేరే చోట స్థిరపడటాలు జరిగినప్పుడు ఒక ఖాళీతనం వారిని ఇబ్బంది పెడుతుంది. దానికి అడ్జస్ట్ కావడానికి టైమ్ పడుతుంది. అలాంటి సందర్భంలో తల్లిదండ్రులు కాస్తా భార్యాభర్తలుగా మారి ఒకరికి ఒకరై కనిపెట్టుకోవాలని నిపుణులు అంటున్నారు. ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ ప్రతికూలతలు: ⇒ పిల్లల గురించి ఆందోళన... వారితో మానసిక ఎడబాటు వస్తుందేమోనన్న భయం ⇒ ఒంటరితనం ఫీల్ కావడం ⇒ సంతోషంగా ఉండలేకపోవడం ⇒ కలత నిద్ర ⇒ జీవితానికి అర్థమేమిటి అనే సందేహం ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అనుకూలతలు: ⇒ బోలెడంత ఖాళీ టైమ్ రావడం ⇒ బాధ్యతలు లేని స్వేచ్ఛ ⇒ స్వీయ ఇష్టాలు నెరవేర్చుకునే వీలు ⇒ కొత్తగా ఏదైనా చేద్దాం అనే ఉత్సాహం అయితే తమ మానసిక సామర్థ్యాన్ని బట్టి అనుకూలతలను తీసుకోవాలా ప్రతికూలతలతో కుంగిపోవాలా అనేది తేల్చుకుని ప్రతికూలతలను జయించి ముందుకు సాగాలి. కొత్త జీవితం: అన్నింటి కంటే మించి అంతవరకూ తల్లిదండ్రులుగా ఎక్కువ మసలినవారు పిల్లలు స్థిరపడ్డాక మళ్లీ భార్యాభర్తలుగా మారతారు. ఆ సమయంలో ఇద్దరూ ఇంట్లో ఎక్కువ సేపు గడిపే వీలు చిక్కుతుంది. దాంతో ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకోవచ్చు. కాని సాధారణంగా ఒకరిని మరొకరు భూతద్ధంలో చూస్తూ పాత నష్టాలనూ, తొక్కిపెట్టిన పాత ఫిర్యాదులనూ బయటకు తీస్తే జీవితం దారుణంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ సమయంలోనే భార్యను భర్త, భర్తను భార్య ఎక్కువగా అర్థం చేసుకోవాలి... స్నేహంగా ఉండాలి... పరస్పరం కలిసి యాత్రలు, విహారాలు, బంధుమిత్రులను కలవడం, ఏదైనా హాబీని అలవర్చుకోవడం, వాకింగ్ గ్రూపుల్లో చేరడం, ఇష్టమైన సినిమాలు చూడటం, జీవితంలో గడిచిన మంచి విషయాలు గుర్తుకు చేసుకోవడం, ఒకప్పుడు ఇవ్వలేని సమయాన్ని ఇప్పుడు ఇవ్వడం చేయాలి. ఈ సమయంలో పరస్పర భద్రత కూడా ముఖ్యమే కాబట్టి దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్థికపరమైన సౌలభ్యం ఉంటే అందాక తీరని ముచ్చట్లను తీర్చుకోవడం కూడా మంచి వ్యాపకమే. జీవితంలో పిల్ల లకు ఇవ్వదగ్గ ప్రేమంతా ఇచ్చాం... ఇప్పుడు పరస్పరం ప్రేమను పంచుకుందాం అనే భావన అత్యంత ముఖ్యమైనది ఈ ‘ఎంప్టీ నెస్ట్’ కాలంలో. ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెంగ ఉండదు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు అలాంటి తల్లిదండ్రుల గొంతులో తప్పక సంతోషాన్ని వింటారు. ఆ సంతోషమే పిల్లలకు గొప్ప కానుక. -
పిల్లలను మంచిగా పెంచడం ఎలా?
‘మా పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంది సర్. ఉదయం లేచిన దగ్గర్నుంచీ మొబైల్ పట్టుకునే ఉంటారు. వాళ్లతో ఎలా డీల్ చేయాలో అర్థం కావడంలేదు.’ ‘మా పాపతో వేగలేకపోతున్నాం సర్. మొబైల్లో రైమ్స్ పెట్టకపోతే అన్నం కూడా తినదు’. ’‘మావాడు టాబ్‌తోనే ఉంటాడు. మనుషులతో అస్సలు మాట్లాడటం లేదు.’ కౌన్సెలింగ్ కోసం వచ్చిన చాలామంది తల్లిదండ్రులు ఇలా.. టెక్నాలజీ వల్ల తమ పిల్లలు ఎలా పక్కదారి పడుతున్నారో చెప్పుకుని బాధపడుతుంటారు. మనం డిజిటల్ ప్రపంచంలో ఉన్నామనేది కొట్టిపారేయలేని నిజం. వాటి నుంచి పిల్లల దృష్టిని మళ్లించడానికి పేరెంట్స్ పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఏమైనా చిట్కాలు దొరుకుతాయేమోనని యూట్యూబ్ ఓపెన్ చేస్తే.. అలవికాని చిట్కాలు కనిపిస్తాయి. కొందరు వాటిని నమ్మి, ఆచరించి, ఫలితాలు కనిపించక బాధపడుతుంటారు. ఈ సమస్యను తప్పించేందుకే ‘మంచి’ పిల్లలను పెంచడం ఎలా? అని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టులు ఏళ్లుగా అధ్యయనం సాగిస్తున్నారు. ఎంత డిజిటల్ యుగంలో ఉన్నా, ఎంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నా పిల్లలను పెంచే ప్రాథమిక అంశాలేమీ మారలేదు. పిల్లలు తమ లక్ష్యాలను సాధించాలని, ఆనందంగా జీవించాలనే తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అలాంటి పిల్లలను పెంచాలంటే కఠిన శిక్షలు అవసరంలేదనీ, ఖరీదైన కార్పొరేట్ స్కూళ్ల అవసరం అంతకన్నా లేదని, జస్ట్ ఆరు సూత్రాలను ఆచరిస్తే చాలని చెప్తున్నారు హార్వర్డ్ సైకాలజిస్టులు. ఆ ఆరు సూత్రాలేమిటో ఇప్పుడు, ఇక్కడ తెలుసుకుందాం. 1) మీ పిల్లలతో సమయం గడపండి ఇది అన్నింటికీ పునాది వంటిది. మీ పిల్లలతో క్రమం తప్పకుండా సమయాన్ని వెచ్చించండి. వారి గురించి, ప్రపంచం గురించి, వారు దానిని ఎలా చూస్తారు అనే విషయాల గురించి ఓపెన్–ఎండ్ ప్రశ్నలు అడగండి. వారి ప్రతిస్పందనలను చురుకుగా వినండి. దీనిద్వారా మరొక వ్యక్తి పట్ల ఎలా శ్రద్ధ కనబరచాలో వారికి చూపిస్తున్నారు. ఇంకా తనో ప్రత్యేక వ్యక్తి అని, తనదో ప్రత్యేక వ్యక్తిత్వమని గుర్తుచేస్తుంటారు. 2) ముఖ్యమైన విషయాలను గట్టిగా చెప్పండి గట్టిగా మాట్లాడితే పిల్లలు నొచ్చుకుంటారని చాలామంది పేరెంట్స్ ముఖ్యమైన విషయాలను కూడా నెమ్మదిగా, సున్నితంగా చెప్తుంటారు. దీంతో పిల్లలు వాటిని ఏమాత్రం పట్టించుకోరు. కాబట్టి ముఖ్యమైన విషయాలను గట్టిగా చెప్పాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో, టీమ్ వర్క్‌లో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారో టీచర్లు, కోచ్‌లను అడిగి తెలుసుకోమంటున్నారు. 3) ఎలా పరిష్కరించుకోవాలో నేర్పించండి ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎవరెవరు ప్రభావితమవుతారో, వారిని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలో మీ పిల్లలకు అర్థమయ్యేలా వివరించండి. ఉదాహరణకు మీ పిల్లలు ఏదైనా గేమ్ లేదా టీమ్ యాక్టివిటీ నుంచి తప్పుకోవాలను కుంటే.. వారిపై అరిచి భయపెట్టకుండా, దానివల్ల ఏర్పడే పరిణామాలు వివరించండి. అసలు సమస్య మూలం ఎక్కడుందో గుర్తించి, టీమ్ పట్ల కమిట్మెంట్తో ఉండమని ప్రోత్సహించండి. 4) సహాయం చేయడం, కృతజ్ఞతతో ఉండటం నేర్పించండి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచే వ్యక్తులు ఉదారంగా, కరుణతో, సహాయకారులుగా, క్షమించే వారుగా ఉంటారని అధ్యయనాలు చూపిస్తున్నాయి. అలాంటి వారు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తోబుట్టువులకు సహాయం చేయమని పిల్లలను అడగండి. సహాయం చేసినప్పుడు థాంక్స్ చెప్పండి. తద్వారా వాళ్లు కూడా కృతజ్ఞతలు తెలపడం నేర్చుకుంటారు. అలాగే అసాధారణమైన దయను ప్రదర్శించినప్పుడు వారిని మెచ్చుకోండి. 5) విధ్వంసక భావోద్వేగాలను చెక్ చేయండి పిల్లల్లో కూడా కోపం, అవమానం, అసూయలాంటి నెగెటివ్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్‌ను గుర్తించడం, వాటికి పేరు పెట్టడం, ప్రాసెస్ చేయడంలో సహాయం చేయడం, సురక్షితమైన కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ వైపు మార్గనిర్దేశం చేయడం చాలా అవసరమని తల్లిదండ్రులు గుర్తించాలి. అలాగే పిల్లల భద్రత దృష్ట్యా వారికి స్పష్టమైన, సహేతుకమైన సరిహద్దులను నిర్దేశించడమే కాకుండా, అవి వారికి అర్థమయ్యేలా చెప్పడం ముఖ్యం. 6) బిగ్ పిక్చర్ చూపించండి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఇలా పిల్లల సర్కిల్ చాలా చిన్నది. ఆ సర్కిల్లోని వ్యక్తుల పట్లే వారు ప్రేమ, శ్రద్ధ, సానుభూతి చూపిస్తారు. అయితే ఆ సర్కిల్ వెలుపల ఉన్న వ్యక్తుల గురించి కూడా వారు శ్రద్ధ వహించేలా చేయడం అవసరం. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలని, వారి సమస్యను వారి కోణంలో అర్థం చేసుకోవాలని ప్రోత్సహించడం ద్వారా, టీవీలో వచ్చే అలాంటి సంఘటనలను వివరించడం ద్వారా పిల్లల్లో సహానుభూతిని పెంచాలి. ఈ ఆరు సూత్రాలు పాటిస్తే ఒక శ్రద్ధగల, గౌరవప్రదమైన, నైతికత గల పిల్లలను పెంచడం సాధ్యమేనని, దీనికంటే ముఖ్యమైన పని మరేదీ లేదని హార్వర్డ్ సైకాలజిస్టులు చెప్తున్నారు. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: రైస్ వల్ల షుగర్ లెవల్స్ పెరగవు!.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
స్కూల్‌కి వెళ్లనని పిల్లలు మారాం చేస్తున్నారా? ఇలా చేసి చూడండి
ఉదయాన్నే పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపించడం పేరెంట్స్‌కు పెద్దపని. ఇంతకంటే వాళ్లను నిద్రలేపడం అతిపెద్ద టాస్క్. ఎంత లేపినా నిద్ర లేవరు. కింద స్కూల్ ఆటోనో, బస్సో వచ్చి హారన్ కొడుతుంటుంది. కానీ వీళ్లు లేవరు. వీళ్లను తొందరగా నిద్ర లేపాలంటే ఇలా ప్రయత్నించి చూడండి.... సమస్యను అర్థం చేసుకోవాలి.. ముందుగా నిద్ర లేవడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో గమనించాలి. రాత్రి సరిగా పడుకున్నారా లేదా... అసలు నిద్రపట్టలేదా... ఇంకేదైనా సమస్య ఉంటే అనునయంగా అడిగి తెలుసుకోవాలి. సరిపోయిందా లేదా? స్కూలుకు వెళ్లే పిల్లలు కనీసం పది గంటలు నిద్రపోవాలి. గేమ్స్, ఫోన్లు చూస్తూ సరిగా పడుకోరు. రోజూ ఒక నిర్దేశిత సమయాన్ని కేటాయించి వాళ్లు కచ్చితంగా పడుకునేలా చేయాలి. ప్రేమతో లేపాలి ఉదయం ఎంత ఉత్సాహంగా లేస్తే రోజంతా అలానే గడుస్తుంది. అందుకే పిల్లలు త్వరగా లేవకపోయినా ప్రేమగా నిద్రలేపాలి. పిల్లలకు అర్థమయ్యే ప్రేమ భాషలోనే నిద్రలేపాలి. ఇందుకోసం వాళ్లకు నచ్చే మంచి విషయాలు, స్కూలుకు వెళ్లడం ఎంతముఖ్యమో ప్రేమతో చెప్పాలి. ఇష్టమైన ఫుడ్ పిల్లలు ఇష్టంగా తినే ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవ్వాలి. అది తినడం కోసం అయినా త్వరగా నిద్ర లేస్తారు. ఈ నాలుగు చిట్కాలు ప్రయత్నిస్తే మీ సమస్య తీరినట్టే. -
పిల్లలు స్కూల్‌కి వెళ్లమని మారాం చేస్తున్నారా? ఇలా చేయండి
స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. పొద్దున లేచి స్కూలుకు వెళ్లాలంటే భయం, బాధతో బడికెళ్లమని మారాం చేస్తుంటారు చిన్నారులు. మరికొంతమంది అయితే మొండికేసి ఏడుపు అస్సలు ఆపరు. ఇలాంటి పిల్లలను నవ్వుకుంటూ స్కూలుకు పంపాలంటే ఈ నాలుగు పాటిస్తే సరి... మానసికంగా సిద్ధం చేయాలి: ముందుగా పిల్లలతో పాటు తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లి తరగతి టీచర్, తోటి విద్యార్థులు, ఇతర స్కూలు సిబ్బందితో మాట్లాడి, వారితో స్నేహంగా మెలగాలి. అప్పుడు అది దగ్గర నుంచి చూసిన పిల్లలు స్కూలు వాతావరణాన్ని కొత్తగా భావించరు. దీంతో పాటు వీలు చిక్కినప్పుడల్లా నవ్వు తెప్పించే కథలు చెబుతూ ఉండాలి. గట్టిగా అరవకూడదు : పిల్లలు స్కూలుకు వెళ్లను అని మారాం చేసినప్పుడు గట్టిగా తిట్టడం, ఆరవడం, కోప్పడటం చేయకూడదు. ఇలా చేస్తే వాళ్లు మరింత భయపడతారు. ఎందుకు స్కూలుకు వెళ్లనంటున్నారో బుజ్జగిస్తూ కారణాలు తెలుసుకోవాలి. కారణాన్ని బట్టి వాళ్లను స్కూలుకు వెళ్లడానికి అనుకూలంగా ఆలోచించేలా వివరిస్తూ, వాళ్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. అనుకూలంగా మాట్లాడాలి : స్కూలు ప్రారంభంలో పిల్లలను స్కూలో దింపడం, స్కూలు అయిపోయాక తీసుకురావడం చేయాలి. వాళ్లకిష్టమైన టిఫిన్ పెట్టాలి. స్కూలు నుంచి వచ్చాక ‘‘స్కూల్లో ఎలా గడిచింది? ఈ రోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు? ’’ అని అడగాలి. స్కూల్లో తమ పిల్లలు ఎలా ఉంటున్నారో పిల్లలకు తెలియకుండా టీచర్‌ను అడిగి తెలుసుకుంటూ ఉండాలి. టీచర్ చెప్పిన సలహాలు సూచనలు పాటించాలి. ప్రోత్సహించాలి: స్కూలుకు వెళ్లేందుకు ఆసక్తి కలిగేలా పిల్లలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుండాలి. స్కూల్లో స్నేహితులను ఏర్పర్చుకోమని చెబుతుండాలి. ఇవన్నీ చేయడానికి తల్లిదండ్రులు కాస్త సహనం పాటిస్తే.. పిల్లలు సంతోషంగా స్కూలుకు వెళ్లి చదువుకుంటారు. -
ఏమిటీ వింత..గద్ద పొదగని గుడ్డు .. అనాథ పిల్లకు తండ్రి కూడా!
మనుషులే కాదు.. ఒక్కోసారి మూగజీవాల ప్రవర్తన కూడా విపరీతమైన చర్చకు దారి తీస్తుంటుంది. మనిషికి మించిన మానవత్వం, ప్రేమను కనబర్చినప్పుడు అది తప్పకుండా ఆకట్టుకుంటుంది కూడా. అలా అమెరికా దృష్టిని ఆకట్టుకున్న ఓ గద్ద.. నెల తిరగకుండానే మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. మొదటిసారి పొదగని ఓ గుడ్డుతో.. ఇప్పుడు ఓ అనాథ పిల్లతో.. మర్ఫీ.. మిస్సోరి వ్యాలీ పార్క్‌లో ఉంటున్న ఓ బాల్డ్ ఈగల్. వయసు సుమారుగా 31 ఏళ్లు ఉంటుంది. రెక్కకు గాయం కావడంతో ఎగరలేని స్థితి దానిది పాపం. మార్చి చివర్లో.. ఈ పక్షి ప్రవర్తన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం.. ఈ మగ పక్షి ఓ రాయిని పొదగడానికి ప్రయత్నించడం. గుడ్డు ఆకారంలోని ఆ రాయిని తనకింద ఉంచుకోవడం మాత్రమే కాదు.. దాని దగ్గరికి వచ్చిన తోటి గద్దలను తరిమి తరిమి కొట్టాడు మర్ఫీ. అలా మొదటిసారి వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో దాని ప్రవర్తన పక్షులపై అధ్యయనం చేసే వాళ్లను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక ఇప్పుడు రెండోసారి.. మళ్లీ అది మీడియా సెన్సేషన్ అయ్యింది. ఈసారి ఓ నిజం పక్షికి తండ్రిగా మారింది మర్ఫీ. అక్కడికి అరవై మైళ్ల దూరం నుంచి కొట్టుకొచ్చిన ఓ పక్షి గూడులోని పిల్లను జాగ్రత్తగా చూసుకుంటోంది ఈ మగ గద్ద. ఆహారం అందించడం మాత్రమే కాదు.. ఎప్పుడూ వెంట ఉంటూ తోటి గద్దల నుంచి దానిని సంరక్షిస్తోంది. అయితే ఈ క్రమంలో తన ‘రాకీబేబీ’ని మాత్రం నిర్లక్ష్యం చేయట్లేదండోయ్. ఒకవైపు ఆ రాయిని.. మరోవైపు అనాథ పక్షిని ఇద్దరి సంరక్షణను చూసుకుంటూ తన మంచి గుణం చాటుకుంటోంది మర్ఫీ. ఇదేం విచిత్రమో మరి.. ! -
Unpaid Care Work: వేతనం లేని పనికి.. గుర్తింపు ఉండదా?!
స్త్రీల ఇంటిపనికి ఎలాంటి గుర్తింపు, వేతనం ఉండదు. ఇదే విషయమై సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఒక అధ్యయనం చేసింది. పేద, ధనిక దేశాలలోనూ ఈ విషయంలో అంతరాలనూ చూపించింది. గుర్తింపు లేని పని కారణంగా స్త్రీలలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు, ఇంటి పనితో పాటు ఉపాధి పొందుతున్న మహిళలపై పడుతున్న అధిక భారం గురించి కూడా చేసిన ఈ అధ్యయనం అన్నివర్గాల వారినీ ఆలోచింపజేస్తోంది. ఇంటి పనులు, బాధ్యతలను సమతుల్యం చేయడం మహిళల నైతిక బాధ్యతగా అంతటా వాడుకలో ఉన్నదే. దీని వల్ల కలుగుతున్న నష్టాలనూ, భాగస్వామ్యంతో ఎలా సమన్వయం చేసుకోవాలో కూడా ఈ సంస్థ తెలిపింది. తేలిక భావన మహిళకు ఉదయం లేస్తూనే ఒక సాధారణ రోజుగా ప్రారంభమవుతుంది. ఊడవడం, తుడవడం, కడగడం, కుటుంబ సభ్యులకు భోజనం సిద్ధం చేయడం... ఈ రొటీన్ పనులన్నీ వీటిలో ఉండవచ్చు. వీటన్నింటి మధ్య వారు తమ భర్త లేదా పిల్లలు లేదా పెద్దలైన కుటుంబ సభ్యుల అవసరాలను చూస్తుంటారు. ఇక బయట ఉద్యోగం చేసే మహిళలైతే, ఇంటి పనులు పూర్తిచేయడంతో పాటు తమను తాము సిద్ధంగా ఉండటానికి సమయం కేటాయించాలి. ఆఫీస్ లోకి వచ్చాక ఆఫీస్ వర్క్ తో ముడిపడి ఉండాలి. పిల్లలు స్కూల్‌కి వెళ్లాక, భర్త ఆఫీసుకు వెళ్లినప్పుడు గృహిణులు ఊపిరి పీల్చుకోవడం లేదు. చేయాల్సింది చాలా ఉంటుంది. ఇంటి పనులను చూసుకోవడం, చేయడం మహిళలు మాత్రమే చేయదగినపనిగా పరిగణించబడుతోంది. దీనిని దాదాపు అందరూ స్త్రీలను తేలికగానే తీసుకుంటారు. ‘కాలక్రమేణా, వేతనంలేని శ్రమ కారణంగా పురుషుల కంటే స్త్రీలు మానసిక ఆందోళనకు గురవుతున్నార’ని హెల్త్ షాట్స్ సైకాలజిస్ట్ డాక్టర్ మాలినీ సబా తెలియజేస్తున్నారు. డబుల్ బైండ్ ఇంటి యజమానులుగా గుర్తించే మగవారు కార్యాలయంలో పెద్దగా పనులు చేయనప్పటికీ వారు చాలా బిజీగా ఉంటారు. కానీ ఇంటిపని, పిల్లల సంరక్షణతో సహా వేతనంలేని పనికి ఉపాధి పొందుతున్న మహిళలు బాధ్యత వహిస్తారు. డాక్టర్ సబా ప్రకారం, ‘గుర్తించబడని మహిళల శ్రమ రెండు రూపాలుగా ఆమెను సవాల్ చేస్తోంది. ఒకటి ఆమె శారీరక ఆరోగ్య సంరక్షణ తగ్గుతోంది. దీంతో పాటు మానసిక భారం అధికమవుతోంది.’ అసమానతకు నిదర్శనం ప్రపంచవ్యాప్తంగా ఉపాధి, నిరుద్యోగ మహిళలు జీతం లేని పనికి ఎక్కువ గంటలు వెచ్చిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ఈ ధోరణి మరీ ఎక్కువగా కనిపించింది. సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 2021లో పురుషుల 59 అదనపు గంటలతో పోలిస్తే మహిళలు 173 అదనపు గంటలు చెల్లింపు లేని ఇంటిపని, పిల్లల సంరక్షణ బాధ్యతలను తీసుకున్నారు. దిగువ, మధ్య ఆదాయ దేశాలలో ఈ అంతరం మరింత పెరిగింది. ఈ దేశాలలో మహిళలు పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువ గంటలు ఇల్లు, పిల్లలను చూసుకున్నారు. భారాన్ని పెంచిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుండి ఆఫీసు పని చేయడం చాలా మంది మహిళల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. మహిళలు వంట చేయడం, శుభ్రపరచడం, పిల్లలు, పెద్దవారిని చూసుకోవడం.. వంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. ఇంటి నుండి ఆఫీసు పని చేయడం అనేది చాలా మందికి కష్టతరమైనది. దాంతో ఎంతో సమయాన్ని కోల్పోతున్నారు. దీనివల్ల స్త్రీలకు ఏ విధమైన వినోదం, విశ్రాంతి లేదా కోలుకోవడానికి సమయం దొరకడం లేదు. శారీరక, మానసిక వేధింపుల కథనాలలో ఒకటైన వైద్యం అందుబాటులో లేకపోవడం కూడా సమతుల్యత దెబ్బతింటుంది. మహమ్మారి సమయంలో పరిమిత ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సంరక్షణ సవాళ్లు, పిల్లల సంరక్షణ లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు తమ కుటుంబాలను చూసుకోవడం కోసం తమ వృత్తిని విడిచిపెట్టారని నిపుణులు గుర్తించారు. ఇది ముఖ్యంగా నెలవారీ తక్కువ ఆదాయం కలిగిన తల్లులలో ఎక్కువగా ఉంది. (క్లిక్ చేయండి: తక్కువ బడ్జెట్లో ఇంటి అలంకరణ.. వావ్ అనాల్సిందే!) న్యాయమైన వాటా పురుషులు ఇల్లు, పిల్లల పనుల్లోనూ వారి న్యాయమైన వాటాను తీసుకుంటే మహిళలపై చెల్లింపు లేని పని భారం తగ్గుతుంది. కలిసి పనులు చేసుకోవడంలోని అన్యోన్యత స్త్రీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది వారి ఆదాయ వనరుల అవకాశాలను కూడా పెంచుతుంది. భావోద్వేగ ఒత్తిడి కూడా తగ్గుతుంది. పురుషులకు అనువైన ఏర్పాట్లను సాధారణం చేస్తే, పితృస్వామ్య, పెట్టుబడిదారీ డిమాండ్లను చర్చించడంలో స్త్రీలకు సమయం కలిసివస్తుంది. -
అయినాసరే ఆడబిడ్డల్ని గమనిస్తూ ఉండాలి: కిరణ్ బేడీ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది శ్రద్ధా వాకర్ హత్యోదంతం. దేశ రాజధానిలో ప్రియుడి చేతిలో కిరాతకంగా హత్యకు గురైంది ఆమె. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో దాచి.. ఆపై నగరంలో అక్కడక్కడ పడేశాడు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా. ఆలస్యంగా వెలుగు చూసి వార్తల్లో ప్రముఖంగా నిలిచిన ఈ కేసుపై మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతో ఎలాంటి సంబంధం లేదని వాళ్లు చెప్పినా సరే ఆ మాటల్ని పట్టించుకోకూడదు. వాళ్లను నిరంతరం గమనిస్తూ ఉండాలి అని తల్లిదండ్రులకు సూచించారామె. ఢిల్లీ ఉదంతంపై స్పందిస్తూ.. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ, ఆమె ఆచూకీ గురించి ఆలస్యంగా పట్టించుకున్నారు ఆమె కుటుంబ సభ్యులు. కాబట్టి, జరిగిన దారుణానికి బాధ్యత ఆ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులపై కూడా ఉంటుంది అని కిరణ్‌బేడీ తెలిపారు. శ్రద్ధ తల్లిదండ్రులు ఆమె బాగోగుల గురించి మరింత పట్టించుకుని ఉండాల్సింది. ఆమె ఉంటున్న ఫ్లాట్ చుట్టుపక్కల వాళ్లు, యజమాని సైతం బాధ్యతగా వ్యవహరించి ఉండాల్సింది. ఒకరకంగా ఈ ఘటనకు ఆమె కుటుంబమే కారణంగా అనిపిస్తోంది. అంతేకాదు.. ఇది సమాజ వైఫల్యం, స్నేహితులది కూడా అని కిరణ్‌బేడీ ఓ జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు. ఆడపిల్లను పెంచే సామాజిక బాధ్యతపై ఆమె స్పందిస్తూ.. స్వతంత్ర భావజాలం అలవర్చుకునేలా అమ్మాయిలను పెంచాలని ఆమె తల్లులకు సూచించారు. ఆపై వారు(ఆడపిల్లలు) ఎలా ఉంటారో? ఎక్కడ జీవిస్తారో? అని ఆందోళన చెందొద్దని, వారికి భరోసా ఇవ్వడం కుటుంబం యొక్క బాధ్యత అని ఆమె అభిప్రాయపడ్డారు. శ్రద్దా వాకర్ హత్య కేసు దర్యాప్తుపైనా స్పందించిన కిరణ్ బేడీ.. డేటింగ్ యాప్‌లో శ్రద్ధకు నిందితుడు అఫ్తాబ్ ఎలా దగ్గరయ్యాడు? అనే కోణంలోనూ తప్పనిసరిగా దర్యాప్తు చేపట్టాలని అధికారులకు సూచించారామె. సంబంధిత వార్త: శ్రద్ధ శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో రొమాన్స్! -
Sitterwizing: పిల్లలతో కూచోండి దగ్గరగా చూడండి
పిల్లల విషయంలో ప్రతిదాంట్లో జోక్యం చేసుకునే తల్లిదండ్రుల పెంపకాన్ని ‘హెలికాప్టర్ పేరెంటింగ్’ అంటారు. అన్ని వాళ్లే నేర్చుకుంటారులే అని పిల్లల్ని పూర్తిగా వదిలేయడాన్ని ‘ఫ్రీ రేంజ్ పేరెంటింగ్’ అంటారు. అయితే... ఈ రెండూ సరి కాదని నిపుణులు అంటారు. అందుకే ఇప్పుడు ‘సిటర్‌వైజింగ్’ ట్రెండ్ నడుస్తోంది. పిల్లలతో కూచుని వారు చేసే పనిని పక్కన నుండి చూడటమే సిటర్‌వైజింగ్. తమ పక్కనే తల్లిదండ్రులు ఉంటూ తాము చేసే పనులను ఆనందిస్తున్నారు అనే భావన పిల్లలకు మేలు చేస్తోంది. అలాగే పిల్లలను దగ్గరి నుంచి గమనించడం తల్లిదండ్రులకు వారిని చేరువ చేస్తోంది. ఈ ‘సిటర్‌వైజింగ్’ మనం కూడా ఫాలో కావచ్చు. తల్లిదండ్రులను గిల్టీలోకి నెట్టే మాటలు ఉంటాయి. ‘మీరు పిల్లలతో సరిగ్గా గడపడం లేదు’, ‘వాళ్లను గాలికి వదిలేశారు’, ‘వాళ్లు ఏం తింటున్నారో ఏం చదువుతున్నారో కూడా చూడటం లేదు’, ‘వాళ్లతో ఆడుకోవడం లేదు’... ఇలాంటివి. లేదా ‘మీరు పిల్లల్ని మరీ అతిగా పట్టించుకుంటున్నారు’, ‘వారికి ఊపిరాడనివ్వడం లేదు’, ‘హిట్లర్‌లాగా పెంచుతున్నారు’... ఇలా. ఈ రెండు రకాల కామెంట్లూ తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తాయి. ఏదైనా తప్పు చేస్తున్నామా అని అయోమయంలో పడేస్తాయి. పిల్లల్ని అస్సలు పట్టించుకోకపోవడం లేదా అతిగా పట్టించుకోవడం... రెండూ కూడా ప్రతికూల ఫలితాలే ఇస్తాయంటారు నిపుణులు. అందుకే ఇప్పుడు ‘సిటర్‌వైజింగ్’ ట్రెండ్‌లోకి వచ్చింది. మామూలుగా పర్యవేక్షిస్తే సూపర్వైజింగ్. పిల్లలతో పాటు కూచుని వారిని పర్యవేక్షిస్తే అది ‘సిటర్‌వైజింగ్’. ► ఏమిటి ఈ సిటర్‌వైజింగ్ అమెరికాలో టీచర్‌గా పని చేసి, పేరెంటింగ్ టిప్స్ ఇచ్చే సోషల్ ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు పొందిన సూసీ అలిసన్ తన పిల్లలతో తాను సమయం గడపడాన్ని ‘సిటర్‌వైజింగ్’ అంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటే తను పక్కనే కూచుని వారిని ఆడుకోవడం చూడటాన్ని వీడియోగా పోస్ట్ చేస్తూ ‘ఇదే ఇప్పుడు అవసరమైన సిటర్‌వైజింగ్’ అంది. దాంతో ఇది ట్రెండ్‌గా మారింది. తల్లిదండ్రులు చాలామంది ఇన్‌స్టాలో, ఫేస్బుక్లో రీల్స్ చేసి మరీ తమ పిల్లలతో తాము చేస్తున్న సిటర్‌వైజింగ్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ► పిల్లలతో కూచోవాలి పిల్లలతో కూచోవాలి... అలాగే మనం కూడా రిలాక్స్ కావాలి... అంటే ఇద్దరూ ప్రయోజనం పొందేలా స్నేహం పెంచుకునేలా చూసుకోవడమే సిటర్‌వైజింగ్. ఉదాహరణకు పిల్లలు ఆడుకుంటూ ఉంటే పార్క్‌లు వారికి సమీపంలో కూచుని అవసరమైన ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అమ్మ దగ్గరే ఉంది అని పిల్లలు బెరుకు లేకుండా ఉంటారు. అలాగే అమ్మ తమని చూస్తూ ఉంది అని ఉత్సాహంగా ఆడతారు. అలాగే పిల్లల ఆట మీద ఒక కన్నేసి పెట్టి వారు ఎంజాయ్ చేయడం చూసి తల్లి కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంటికి తిరిగెళుతూ ఆ కబుర్లు మాట్లాడుకోవచ్చు. పిల్లలు చదువుకుంటూ ఉంటే పక్కనే కూచుని తల్లి ల్యాప్‌టాప్ మీద ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటే తండ్రి తల్లికి సాయంగా కూరగాయలు తరుగుతూ ఉండొచ్చు. తమ సమీపంలో తల్లిదండ్రులు ఉన్నారని, తాము చదువుకోవడం చూసి వారు మెచ్చుకుంటారని భావించిన పిల్లలు చదువుకుంటారు. తమ పనులు తాము చేసుకుంటూనే తల్లిదండ్రులు వారి చదువు ఎలా సాగుతున్నదో పరిశీలించవచ్చు. పిల్లలు వీడియో గేమ్స్ ఆడేటప్పుడు కూడా పక్కన సోఫాలో వొత్తిగిలి తల్లో, తండ్రో పేపర్ తెరిస్తే వీడియో గేమ్స్ ఎలాంటివి ఆడాలో ఎంతసేపు ఆడాలో పిల్లలకు చెప్పకుండానే అర్థమైపోతుంది. పిల్లలను సినిమా హాలు దగ్గర వదిలిపెట్టి తిరిగి పికప్ చేసుకోవడం కన్నా వారితో కలిసి సినిమా చూడటమే తల్లిదండ్రులతో వారి దగ్గరితనానికి దారి తీస్తుందని అంటారు నిపుణులు. ► అవసరమైన ప్రమేయం పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో కచ్చితంగా అరగంటో గంటో కూచోవడం వారి ఏదో ఒక చర్య సమయంలో తోడు ఉన్నామని భావన కల్పించడం ముఖ్యం అంటున్నారు నిపుణులు. పిల్లలు ఆత్మవిశ్వాసంతో నేర్చుకోవడానికే కాదు ఏదైనా ప్రమాదం వస్తే దాపునే తల్లిదండ్రులు ఉన్నారు తమనే చూస్తున్నారనే ధైర్యం వారికి ఉంటుంది. అదే సమయంలో వారితో కలిసి వ్యాయామం చేయడం, చెస్ ఆడటం, వారు అడిగితే హోమ్‌వర్క్‌కు సలహా ఇవ్వడం ఇవన్నీ కూడా మంచి పేరెంటింగ్ కిందకు వస్తాయి. మరీ దగ్గరగా మరీ దూరంగా కాకుండా అక్కర ఉన్నంత మేరకే ప్రమేయం చూపుతూ ‘వారికి స్వేచ్ఛ ఉంది, అలాగే మా జవాబుదారీతనం ఉంది’ అనే భావన కలిగించడమే ఈ సిటర్‌వైజింగ్. తల్లిదండ్రుల చేతికి ఫోన్లు వచ్చాక లేదా బతుకుబాదరబందీ వల్ల పరుగులో మునిగిపోయాక తీరిగ్గా పిల్లల పక్కన ఎంతసేపు కూచుంటున్నామో పిల్లల్ని ఎంతసేపు కూచోబెట్టుకుంటున్నామో ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలి. ‘కూచుని’ ఆలోచించాలి. ఇది ఇరుపక్షాలకు మంచిది. తమ సమీపంలో తల్లిదండ్రులు ఉన్నారని, తాము చదువుకోవడం చూసి వారు మెచ్చుకుంటారని భావించిన పిల్లలు చదువుకుంటారు. తమ పనులు తాము చేసుకుంటూనే తల్లిదండ్రులు వారి చదువు ఎలా సాగుతున్నదో పరిశీలించవచ్చు. -
తింగరి సన్నాసిలా ఆలోచిస్తాడు.. రాకేష్‌లో ఉన్న లోపమేంటి?
అదో కార్పొరేట్ స్కూలు. ఏడో తరగతి .టీచర్ ఇంగ్లీష్ లో పాఠం చెబుతున్నాడు .‘ సూర్యుడు , భూమి ఒకే సరళ రేఖ లో వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది . అమ్బరా, పెనంబ్రా.. ‘ అంటూ పాఠ్యపుస్తకం లో ఉన్నది వున్నట్టుగా , గడగడా పాఠం అప్పచెప్పినట్టు టీచర్ చెప్పుకొంటూ పోతున్నాడు . రాకేష్ కు ఇదేదీ అర్థం కావడం లేదు. ‘ సర్ .. భూమి చంద్రుడు పక్కపక్కనే ఉంటారు కదా . మధ్యలో ఎటువంటి అడ్డు లేదు కదా ? మరి చంద్రుడు ఎందుకు కనిపించడు ?‘ అడిగాడు. టీచర్ తడబడుతూ‘ రెండింటికి మధ్య సూర్యుడు వస్తాడు అని చెప్పా కదా ? అయినా ఎప్పుడూ అనుమానాలే . వెదవ . నువ్వు ... నీ మొఖం . నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే . క్లాస్ బయట అరగంట నిలబడు‘ శిక్ష విధించాడు.రాకేష్ క్లాస్ బయట నిల్చొన్నాడు . క్లాసులో పిల్లలు హేళనగా నవ్వుతున్నారు . వారు పాఠాన్ని బట్టి కొట్టడం లో దిట్టలు తనకేమో ఆలా చేయడం ఇష్టం ఉండదు . ప్రతిదీ ఆలోచిస్తాడు . సూర్యుడు, భూమికి చంద్రుడికి మధ్యన వచ్చేస్తే భూమి భస్మీపటలం అయిపోతుందని తన అనుమానం . తనకింకా ఎన్నో అనుమానాలు . ఊటీ , సిమ్లా కొండ ప్రాంతాలు . కొండపైకి పొతే సూర్యుడికి కాస్తో కూస్తో దగ్గరగా పోయినట్టే కదా . అంటే ఎక్కువ వేడి ఉండాలి . కానీ కొండ ప్రాంతాలు ఎందుకు చల్లగా ఉంటాయి ? భూమి తిన్నగా ఉండదు . తన చుట్టూ తానూ తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగు తుంటుంది . దీనికి పెట్రోల్ ఎవడు కొట్టిస్తాడు ? ఇంత శక్తి ఎక్కడినుంచి వస్తుంది ? ఉత్తర ధ్రువ దేశాలు సరే . న్యూజిలాండ్ లాంటి దేశాల్లో మనుషులు, వాహనాలు తలకిందులుగా వేలాడుతుంటాయా ? సముద్రాల్లోని నీరు కిందకు కారిపోదా? నదిలోని నీరు తాగడానికి వీలుగా ఉంటుంది . అది సముద్రం లో కలిస్తే ఎందుకు ఉప్పగా మారి పోతుంది? ఉత్తర భారత దేశం లోని నదులు జీవ నదులు . గోదావరి కృష్ణ నదులు ఎందుకు సంవత్సరమంతా ప్రవహించవు ? హుస్సేన్ సాగర్ లో ఎందుకు మంచు కురవదు ? బకెట్ నీటిలో కాళ్ళు పెట్టి ఎండలో నిల్చుంటే పచ్చని చెట్లలా తాను కూడా ఆహారాన్ని తయారు చేసుకోవచ్చా? మనిషి కోతి నుంచి పరిణామం చెందితే ఇంకా కోతులు ఎందుకున్నాయి ? అవి మనుషులుగా ఎప్పుడు మారుతాయి ? ఇవన్నీ అడగాలని పిస్తుంది . టీచర్లు కొడుతారు . క్లాస్మేట్స్ నవ్వుతారు . అందుకే నోరు మూసుకొంటాడు . రాకేష్ ఇంటికి వచ్చాడు . ఇంట్లో న్యూ జెర్సీ తాత ఉన్నాడు. అయన ఎప్పుడు ఇంటికి వచ్చినా, అమెరికా లోని తన కొడుకు కూతురు గురించి గొప్పలు చెబుతాడు . ఇండియా వేస్ట్ అంటాడు . అయన తో మాట్లాడాలి అని ఎన్నో సార్లు అనుకొన్నాడు . అమెరికా జీవన విధానం ఎందుకు గొప్పదని అయన అనుకొంటున్నాడు అని తెలుసుకోవాలి . ఇంటికి రావడం తోటే మమ్మీ ‘ రాకేష్ .. నువ్వు పోయి చదువుకో . హోమ్ వర్క్ చేసుకున్నాక డిన్నర్ . అటు పై రెండు పాఠాలు అప్ప చెప్పాలి ‘ అని టార్గెట్ ఇచ్చింది . ఉసురో మంటూ వెళ్లి తలుపు వేసుకొన్నాడు . పుస్తకం తెరిచాడు. తన మదినిండా ప్రశ్నలే ?అమెరికా డాలర్ ఒక్కటికి మనది 80 రూపాయిలా ? ఎందుకు ? మన డబ్బుకు అంత తక్కువ విలువ ఎందుకు ? అసలు దీన్ని ఎవరు నిర్ణయిస్తారు ? ఒక డాలర్ కు ఒక రూపాయి అయితే అమెరికా లోని మనవారందరూ తిరిగి వచ్చేస్తారా ? కొడుకు కూతురు అక్కడ స్థిరపడితే కొంతమంది అంకుల్స్ ఇక్కడ ప్లాట్స్ కొంటారెందుకు ? తాను అమెరికాకు రెండు సార్లు వెళ్ళాడు . వాళ్ళు తలనుంచి కిందదాకా లావుగా ఉంటారు . ఇక్కడ పెద్దవారు కడుపు దగ్గరే లావుగా ఉంటారెందుకు ? అమెరికా వాతావరణానికి తెల్లబడితే అక్కడికి వెళ్లిన ఇండియన్స్ ఎందుకు బ్రౌన్ కలర్ లోనే ఉన్నారు ? భూమి తిరుగుతూ ఉంటుంది కదా. అమెరికాకి పోవడానికి విమానమే ఎక్కాలా ? గాలిలో కొన్ని గంటలు నిలబడితే హైదరాబాద్ , ముంబై , అరేబియా సముద్రం , అరబ్ .. ఇలా నెమ్మదిగా కిందకు చూస్తూ అమెరికా వచ్చినప్పుడు దూకొచ్చుగా ?ఇండియా ఎందుకు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం గానే ఉంది ? ప్రతి ఇంటికి నోట్ల ప్రింటింగ్ మెషిన్ ఇచ్చేస్తే అందరూ దండిగా నోట్లు ముద్రించుకొని కోటీశ్వరులు అయిపోవచ్చుగా ?‘ ఆలోచనల తో బుర్ర తిరుగుతోంది . ఈ లోగా అమ్మ నాన్న రూమ్ లోకి వచ్చారు . తనేమో తన క్లాస్ మెట్ దగ్గర తీసుకొన్న ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ పై ఒక చిన్న పుస్తకం చదవాలి అని తెరిచి ఉంచాడు . రోబో లు మన జీవితాలను ఎలా మార్చేస్తాయి అని అందులో వివరించారు.‘ చూడండి బాబాయ్ ! ఇదీ వీడి వాలకం . వెదవ! అసలు పుస్తకాలు చదవడు. బుర్ర తక్కువ సన్నాసి .ఎప్పుడూ ఏదో కాలక్షేపం పుస్తకాలు కావాలంటాడు . పిచ్చాడిలా ఆలోచిస్తుంటాడు. గౌతమ బుద్ధుడు అనుకొంటాడు . పక్కింటి అమ్మాయి సెంట్ పర్సెంట్ . వీడు ముప్పై నలబై . రేపు పొద్దున్న దాని దగ్గర నౌకరు అవుతాడు . ఆలా కాదులే .. నువ్వు ఈ సారి అమెరికా కు వెళుతున్నప్పుడు చెప్పు .. వీడిని పంపుతాను . ఇంట్లో నౌకర్లు దొరకడం కష్టం అంటున్నావుగా . అక్కడ పనిలోపెట్టుకోమని చెప్పు‘ .. అమ్మ చెబుతోంది. నాన్న, తాను ఫ్రెండ్ దగ్గరనుంచి బతిమలాడి తీసుకొని వచ్చిన పుస్తకాన్ని చించేసాడు . తనకు మొదట్లో అవమానంగా ఉండేది . ఇప్పుడది మామూలయిపోయింది . తనకు బుర్ర లేదు . పిచ్చి ఆలోచనలు చేస్తాను .. తాను నౌకరు ఉద్యోగానికి మాత్రేమే పనికొస్తాను ‘ డాడీ, మమ్మీ , స్కూల్ లో టీచర్ లు చెప్పేది ఇదే . విని విని దీనికే ఫిక్స్ అయిపోయాడు. ఇంటికి వెళితే అమ్మ చెప్పే మాటలు ..‘ పుస్తకం తీయి . చదువు . నోట్లో గొణుక్కొంటావేంటి ? గట్టిగా చదువు . చదివింది అరగంటలో పొల్లు పోకుండా అప్ప చెప్పాలి‘. నాన్న లేట్ నైట్ ఇంటికి వస్తాడు . ఆదివారాలు ఆయన అడిగే ప్రశ్నలు ‘ ఎన్ని మార్కులు వచ్చాయి ? ఎందుకింత తక్కువ మార్కులు? ‘ మార్కులు చెబితే‘ అసలే నాకే పుట్టవారా నువ్వు ? నీ మొఖం చూపొద్దు . ఈ సారి ఇదే మార్కులు వస్తే హుస్సేన్ సాగర్ లో దూకి చావు . ఇంటికి మాత్రం రావొద్దు .‘ అని మాటలు . తనకు బతకాలనిపించడం లేదు . ఇది తన ఇల్లేనా ? ఈ ఇంట్లో తన స్థానం ఏంటి ? అమ్మ నాన్న కు తనపై ఎందుకింత కోపం ? అర్థం కాని పాఠాల్ని బట్టి గొట్టడం తనకు ఇష్టం ఉండదు . చేతకాదు .ఏమి చెయ్యాలో అర్థం కాదు.ఐఐటీ లో సీట్ సాధించి అమెరికా లో జాబ్ చెయ్యాలి అని తల్లితండ్రులు ఎప్పుడో డిసైడ్ చేసేసారు . ఐఐటీ ఫౌండేషన్ కోర్స్. తనకు మాత్రం స్పేస్ సైంటిస్ట్ లేదా ఎకనామిస్ట్ కావాలని ఆశ. ఆ మాట చెబితే అందరూ పగలపడి నవ్వుతారు . ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా? అంటారు . ఉట్టి అంటే ఎలా ఉంటుందో తనకు తెలియదు. స్వర్గానికి ఎక్కడం ఎందుకు ? పుణ్యం చేస్తే దేవుడే తీసుకొని పోతాడు కదా ? తన అనుమానం . తనకే ఎందుకిన్ని అనుమానాలు ? ఊళ్ళో అమ్మమ్మ ఉంది . సమ్మర్ హాలిడేస్ లో ఊరిలో గడపాలని తన ఆశ . బియ్యం చెట్లు ఎలా బియ్యం పండ్లను కాస్తాయో చూడాలి . చెరకును గానుగ ఆడితే నల్లటి బెల్లం వస్తుందట . అదే షుగర్ ఫ్యాక్టరీ కు పంపితే తెల్లటి చక్కర. ఎందుకిలా ?ఊళ్ళో ఒకప్పుడు బావులు ఉండేవట . వాటిలో ఆ రోజుల్లో పిల్లలు ఈత కొట్టేవారట . ఇప్పుడేమో బోర్ బావులు . ఎంత లోతుకు డిగ్ చేసినా నీరు రావడం లేదు . ఎందుకు ? గ్రామాల్లో రైల్వే పట్టాలను మరుగుదొడ్లుగా వాడుతారెందుకని ? మలం ఎప్పుడూ కంపుకొడుతుందా ? లేక హీరోలు హీరోయిన్ లు అమెరికా లోని తెల్లవారు .. వీరి మలం సువాసనను కలిగి ఉంటుందా ? అసలు మలం ఎందుకు వస్తుంది. మనం తినే ఆహారం లో అరగని పదార్థలు ఉంటేనే కదా ? రోజూ పోషకాలను ఇచ్చే టాబ్లెట్స్ సెలైన్ వాటర్ తీసుకొంటే టాయిలెట్లకు వెళ్లాల్సిన అవసరముండదు కదా ? అమ్మమ్మ వూరికి ఎప్పుడు మూడో క్లాసులో ఉన్నప్పుడు ఒక సారి తీసుకొని వెళ్లారు . అదీ పది రోజులు . సమ్మర్ హాలిడేస్ వస్తే తనకు స్పెషల్ క్లాసులు . మాథ్స్ ఫిజిక్స్ లో తాను వీక్ అట . తనకేమో తనకు చదువు చెప్పే టీచర్ లకే సబ్జెక్టు రాదు అనిపిస్తుంది . నాలుగో క్లాసులో మాథ్స్ టీచర్ ఒక ప్రశ్న అడిగాడు . నెలకు 29 రోజులున్న నెల ఏది ? అని . తాను జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రతినెల కు 29 రోజులు ఉంటాయి అని చెబితే టీచర్ అరగంట గోడ కుర్చీ వేయించాడు . తన తప్పేంటో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదు . మొన్న ఫిజిక్స్ క్లాస్ .. ఆకాశం లో రాత్రి ఇన్ని నక్షత్రాలు చూసాము అని పిల్లలు టీచర్ తో చెబుతున్నారు . ఇప్పుడు ఆకాశం లో ఉన్న నక్షత్రాలను మన జీవిత కాలం లో చూడలేము మనకు కనిపించేది ఎప్పుడో తాతల కాలం నాటి దృశ్యం అని తాను చెబితే టీచర్ గొడ్డుని బాదినట్టు బాదేశాడు. రాకేష్ తండ్రి రియల్ ఎస్టేట్ కంపెనీలో మేనేజర్. తల్లి గృహిణి . ఒకడే కొడుకు. రియల్ బూమ్ ఉన్నప్పుడు పరవాలేదు . మిగతా టైం లో ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా తెలియడం లేదు. తాము పడుతున్న బాధలు కొడుకు పడకూడదు . బంధువుల పిల్లలు ఎక్కువమంది అమెరికా లో సెటిల్ అయ్యారు . హ్యాపీగా ఉన్నారు. తమ కొడుకు ఐఐటీ లో సీట్ కొట్టాలి . జీవితం లో స్థిరపడాలి . పిల్లాడి విద్య కోసం వీరు ఎంత త్యాగానికైనా సిద్ధం . సంవత్సరానికి తనకు తన భార్య కు మూడు జతల బట్టలే .నగ కొనాలన్న ఆశ ఆమె మనసులోనే దాచేసుకొంది. సంవత్సరానికి లక్ష ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్ లో ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ లో చేర్పించారు . వీడేమో చదవడు. తింగరి సన్నాసి లా ఆలోచిస్తాడు. అదీ రాకేష్ తల్లితండ్రుల మనోవేదన . ఇప్పడు రాకేష్ ని వెంటబెట్టుకొని దంపతులిద్దరూ ఒక సైకియాట్రిస్ట్ వద్దకు వచ్చారు . రాకేష్ లోని లోపం ఏంటి ?దీన్ని ఎలా సరిదిద్దాలి ? వాడిని దారిలో ఎలా పెట్టాలి అదే వారిముందున్న సమస్య. మీకేమైనా సమాధానం తెలిస్తే చెప్పండి . పాపం... కన్న బిడ్డను ప్రాణంగా చూసుకొంటూ బతుకుతున్న ఆ తల్లితండికి సాయం చేయండి.ఇది రాకేష్ ఒక్కడి సమస్యే కాదు.. మన చుట్టున్న లక్షలాది మంది పిల్లలు, వారి తల్లితండ్రుల సమస్య. ముందు సమాజంలో పేరుకుపోయిన కొన్ని భావనలను గుర్తించండి. పిల్లలకు మేలు చేస్తున్నామా? కీడు చేస్తున్నామా తెలుసుకోండి. -అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు. -
పిల్లల్ని ఒంటరిగా ఇంట్లో వొదిలి వెళ్తున్నారా..?
ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు కాపలా ఉండే రోజులు పోయాయి. తల్లిదండ్రులు ఉద్యోగాలకు.. వేరే ఏవైనా పనులకు వెళ్లాలి. నగరాల్లో అయినా పల్లెల్లో అయినా ఒక్కోసారి ఇంట్లో ఒంటరిగా పిల్లల్ని ఒదిలి వెళ్లక తప్పడం లేదు. గంటలో వచ్చేస్తాం.. రెండు గంటల్లో వచ్చేస్తాం.. అని చెప్పి వెళ్లినా ప్రాణం పీకుతూనే ఉంటుంది. పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్లేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? పిల్లలు ఇంట్లో ఉంటే తాతయ్యో అమ్మమ్మో గతంలో చూసుకునేవారు. ఇంట్లో ఇంకా పెళ్లి కావలసిన మేనత్తో చదువుకుంటున్న బాబాయో ఉండేవారు. లేదంటే పక్కింట్లో కూచోబెట్టి వెళ్లేవారు. ఇప్పుడు ఇవన్నీ దాదాపుగా ఏ ఇంట్లోనూ సాధ్యం కావడం లేదు. ఉదయం లేచి పిల్లలు స్కూలుకు వెళ్లి సాయంత్రం వారు ఇంటికి చేరుకునే సమయానికి తల్లో, తండ్రో ఇంట్లో ఉంటే ఒక సంగతి. లేదా తల్లిదండ్రులు వచ్చేలోగా ఆ ఒకటి రెండు గంటల సమయాన్ని పిల్లలు తాళం తీసుకుని ఒంటరిగా ఉండాల్సి వస్తే వాళ్ల కోసం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు పిల్లల సెలవు రోజుల్లో వారు రానవసరం లేని పనులు ఉంటాయి. కార్యాలు ఉంటాయి. కొన్నిసార్లు పెద్దలు సినిమాకు వెళ్లాలనుకుంటే వారికి నచ్చని వాటికి రారు. ఇద్దరు పిల్లలు ఉంటే వారు ఒకరికొకరు తోడుంటే కొంత బెటర్. కాని ఒక్కరే సంతానం ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏ వయసులో ఒంటరిగా వదలొచ్చు? ఇది చాలా ముఖ్యమైన విషయం. అమెరికాలో దీనిపై పరిశోధన చేసిన వాలెంటీర్ల బృందం 12 ఏళ్లు వచ్చాకే పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లొచ్చని, పన్నెండు లోపల వదిలితే వారిని ప్రమాదంలో నెట్టినట్టేనని తేల్చారు. 12 ఏళ్ల లోపు పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్లడం ‘చట్టప్రకారం నేరం’ అని నిర్ధారించే వరకు కొన్ని పాశ్చాత్య దేశాలు వెళుతున్నాయి. మన దేశంలో ఈ దిశగా ఏ చర్చా లేకపోయినా 12 ఏళ్లలోపు పిల్లలను ఒంటరిగా ఇంట్లో వదిలి రెండు మూడు గంటలు వెళ్లడం వారి పట్ల ‘నిర్లక్ష్యం’ వహించడమేనని నిపుణులు అంటున్నారు. గ్యాస్, కరెంట్ ప్లగ్గులు ఇంటి నుంచి పెద్దలు పిల్లల్ని వదిలి వెళ్లేప్పుడు తప్పనిసరిగా గ్యాస్‌ను, అనవసరంగా ఆన్‌లో ఉన్న స్విచ్‌లను (గీజర్/ఐరన్ బాక్స్/మిక్సీ) ఆఫ్ చేసి వెళ్లాలి. వాటి దగ్గరకు వెళ్లవద్దని గట్టిగా చెప్పాలి. ఒక ఫోన్ ఇంట్లో వదిలి వెళ్లాలి. దానికి స్క్రీన్ లాక్ ఉంటే ఎలా తీసి కాల్ చేయాలో నేర్పించాలి. అంతే కాకుండా అపార్ట్‌వెంట్/ఇరుగు పొరుగులలో నమ్మకమైన మిత్రుని నంబర్ ఏదో చెప్పి అది ఏ పేరుతో ఫోన్లో ఉందో చూపాలి. అర్జెంట్ అనిపిస్తే ఆ ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేయమని చెప్పాలి. తల్లిదండ్రుల నంబర్లు, ఊళ్లోనే ఉన్న దగ్గరి బంధువుల (బాబాయ్/పిన్ని) నంబర్లు మొత్తం నాలుగైదు కంఠతా వచ్చి ఉండేట్టు చూడాలి. ఫ్రిజ్ మీద కూడా ముఖ్యమైన నంబర్లను కాగితం మీద రాసి అంటించి ఉంచవచ్చు. తలుపు ఎవరికి తీయాలి తలుపు ఎవరికి తీయాలి అనేది మరో ముఖ్యమైన సంగతి. అపరిచితులు ఎవరో... స్నేహితులు ఎవరో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. అపరిచితులు ఏం చెప్పినా తలుపు తియ్యనే కూడదని నేర్పాలి. పరిచితులు మీరు లేని టైమ్‌లో వస్తామంటే వద్దని చెప్పడమే మంచిది. వారు మరీ ముఖ్యులైతే పిల్లలకు పరిచయం ఉంటే వారు వచ్చినప్పుడు మాత్రమే తలుపు తీయాలని చెప్పాలి. గ్యాస్/పేపర్ బిల్/ పాల బిల్ వీటి కోసం వచ్చినా తలుపు లోపలి నుంచే మళ్లీ రండి అని చెప్పి పంపించేయడం నేర్పాలి. తలుపు లోపలి నుంచి గడి పెట్టుకోవడం లేదా తలుపు తీసి ఉంచి గ్రిల్‌కు తాళం వేసి పెట్టుకోవడం నేర్పాలి. తాళం ఒక గుర్తుండే చోటులో పెట్టుకోవాలని చెప్పాలి. తాళం వేశాక దానిని ఎక్కడో పడేసి మర్చిపోకుండా ఈ ఏర్పాటు. ముఖ్యం ఎవరికీ అనవసరంగా ఫోన్ చేయకూడదని ఎవరైనా ఫోన్ చేసినా ఇంట్లో ఒంటరిగా ఉన్నానని చెప్పకుండా తర్ఫీదు ఇవ్వాలి. పదిహేనేళ్లు దాటే వరకూ పిల్లల్ని ఒంటరిగా వదిలితే తప్పక అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ప్రమాదాలను నివారించాలి. ఆహారం, యాక్టివిటీ పిల్లలు ఒంటరిగా ఉన్నంత మాత్రాన వాళ్లు ఇంట్లో ఏ పని చేసినా చెల్లుబాటు అవుతుందన్న సంకేతం ఇవ్వరాదు. ‘కాసేపు టీవీ చూడు... కాసేపు ఫోన్ చూడు... మిగిలిన టైమ్‌లో ఇదిగో ఈ పుస్తకం చదవాలి, ఈ బొమ్మ గీయాలి, ఈ పజిల్స్ ఫిల్ చేయాలి’... ఇలా టాస్క్ ఇచ్చి వెళ్లాలి. మీరొచ్చే సమయానికి టాస్క్ పూర్తి చేస్తే మెచ్చుకోలు కానుకలు తప్పక ఇవ్వాలి. బయటకు వెళ్లే పని ఆలస్యం అవ్వొచ్చు ఒక్కోసారి. అందుకని వారి కోసం స్నాక్స్ తప్పక పెట్టాలి. ఏదైనా తేలికపాటి టిఫిన్ బాక్స్ పెట్టి ఏది ఎప్పుడు తినాలో చెప్పాలి. పిల్లలు మందులు వేసుకోవాల్సి ఉంటే ఆ మందులు మనమే ఒక దగ్గర పెట్టాలి... అధిక డోసు ప్రమాదం లేకుండా... వేరే మందులు వేసుకోకుండా. నో హెడ్‌ఫోన్స్ పిల్లలు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని సినిమా/ కంప్యూటర్/ ఫోన్ చూడటాన్ని ఆ టైమ్‌లో నిషేధించాలి. ఎందుకంటే ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని హెడ్‌ఫోన్స్‌లో వింటుంటే బెల్ కొట్టినా ఫోన్ మోగినా వినపడదు. తల్లిదండ్రులు కాల్ చేస్తే రెస్పాన్స్ రాకపోతే అనవసరంగా కంగారు పడాల్సి వస్తుంది. అలాగే తలుపు తీసి పెట్టి పక్కింటికి వెళ్లడం, కారిడార్‌లో ఆడుకోవడం, ఇంటి బయట సైకిల్ తొక్కడం చేయరాదని చెప్పాలి. పెద్దలు ఎంత ముఖ్యమైన పని మీద బయటకెళ్లినా మధ్య మధ్య పిల్లలకు ఫోన్ చేసి వారు ఏం చేస్తున్నారో కనుక్కోవాలి. అలాగే వెళ్లే ముందు ఇరుగు పొరుగున ఉన్న నమ్మకమైన వ్యక్తులకు తాము బయటకు వెళుతున్నట్టు తెలియ చేస్తే వారు ఒక కన్ను వేసి పెట్టే వీలుంటుంది. -
పేరెంటింగ్: భయం కాదు... భరోసా పెరగాలి
ఆదివారం పిల్లలను తీసుకుని పార్కుకు వెళ్లారు సంగీత దంపతులు. లోపలికి అడుగుపెట్టగానే పార్కులో ఎత్తైన గోడ అడ్వెంచర్వాల్ మీదనే పడింది పిల్లల దృష్టి. పోటీ పడి పరుగందుకున్నారిద్దరూ. ఎవరు ముందు గోడ దగ్గరకు వెళ్తారో అనేది ఒక పోటీ. ఎవరు ముందు గోడ ఎక్కుతారోననేది మరో పోటీ. వాళ్ల పరుగును అందుకోలేక, పరుగెత్తి వెళ్లకుండా ఉండలేక ఆయాసపడుతున్నారు తల్లిదండ్రులు. గోడ ఎక్కే ప్రయత్నంలో పిల్లలు కింద పడతారేమోననే భయం. వారి ఆందోళనను ఆపుకోలేక వెనుక నుంచి ‘పడిపోతారు, జాగ్రత్త’ అని పిల్లలకు వినిపించేటట్లు పెద్దగా అరుస్తున్నారు. ఈ ఆందోళననే వద్దంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు. పిల్లలకు చెప్పాల్సింది ‘పడిపోతారు, జాగ్రత్త’ అని కాదు. ‘జాగ్రత్తగా ఎక్కండి, కింద మేమున్నాం’ అని భరోసానివ్వాలంటున్నారు. పిల్లలకు నీళ్లు కనిపిస్తే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. చెట్టు కనిపిస్తే చిటారు కొమ్మకు వేళ్లాడే వరకు మనసు ఊరుకోదు. అనుక్షణం పిల్లలను ఓ కంట కాచుకుంటూ ఉండడం మంచిదే, కానీ అడుగడుగునా వాళ్ల ఉత్సాహానికి అడ్డుకట్ట వేయడం మాత్రం మంచిదికాదు. పిల్లలకు భయం తెలియదు, పెద్దవాళ్లు తమ భయాన్ని పిల్లల మెదళ్లలోకి రవాణా చేస్తారు. ఇది పిల్లల మెదళ్లలో ఇంకిపోతుంది. ఫలితంగా తమ మీద తమకు నమ్మకం నశిస్తుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఇదే గుర్తు పిల్లల మాటల్ని జాగ్రత్తగా వినాలంటారు సైకాలజిస్ట్ సుదర్శిని. ‘అమ్మా ఆ చెట్టు పై కొమ్మ మీదకు వెళ్తే ఎలా ఉంటుంది, ఆ గోడ వెనుక ఏముంటుంది’ అని వాళ్ల నోటి వెంట వచ్చిందీ అంటే... అంతకంటే ముందు ఆ ఆలోచన వాళ్ల మెదడులో పుట్టిందనే కదా అర్థం. చెట్టు పై కొమ్మ మీదకు వెళ్తే జరిగే ప్రమాదాన్ని వివరించాలి. చెట్టు మీద ఎంతవరకు వెళ్లడం క్షేమకరమో చెప్పి, వాళ్లను చెట్టు ఎక్కమని, ‘నీ భద్రత కోసం కింద మేముంటాం’ అని చెప్పాలి. చెట్టు ఎక్కడం నేర్పించడమే కరెక్ట్. అంతే తప్ప, పిల్లలకు తమ కళ్లతో ప్రపంచాన్ని చూపిస్తూ, తమ కాళ్లతో నడిపిస్తూ పెంచడం సరైన పెంపకం కాదంటారామె. పిల్లలు తమ ప్రయత్నంతో కిందపడిపోతే చేయి అందించి లేపడమే బెస్ట్ పేరెంటింగ్. పడకుండా పెంచాలనుకోకూడదు. పిల్లలు తమ తొలి ప్రయత్నంలో సక్సెస్ కాకపోతే మరో ప్రయత్నం చేయడానికి ప్రోత్సహించాలి. అంతేకానీ ‘నీ వల్ల కాదులే, ఇక మానుకో’ అని నిరుత్సాహపరచకూడదు. ఏ తీరున పెంచుతున్నాం? ‘‘ఒక తరంలో... యాభై ఏళ్ల కిందట దాదాపుగా అన్ని ఇళ్లలోనూ అథారిటేరియన్ పేరెంటింగ్ ఉండేది. ఒకరకంగా అది నియంతృత్వమే. ‘మేము తల్లిదండ్రులం. మేము నిర్ణయిస్తాం. పిల్లలు అనుసరించి తీరాల్సిందే. అదే క్రమశిక్షణ’ అనుకునేవాళ్లు. పాతికేళ్ల కిందట పరిస్థితి పూర్తిగా పెర్మిసివ్గా మారిపోయింది. అంటే... పిల్లలు దేనికీ నొచ్చుకోకూడదన్నట్లు వాళ్లు అడిగీ అడగక ముందే అన్నీ అమర్చడం. అవసరం ఉన్నాలేకపోయినా అడిగినవన్నీ కొనిచ్చి మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ముఖ్యంగా గడచిన తరంలో ఆర్థిక ఇబ్బందులును ఎదుర్కొన్న వాళ్లు ఈ తరంలో తమ పిల్లలకు అవసరానికి మించి అన్నీ సమకూర్చేయడం, తమకు దక్కని సంతోషాలన్నీ పిల్లలకు మిక్కిలిగా అందాలని తాపత్రయపడడం ఎక్కువగా కనిపిస్తోంది. నిజానికి ఇది మంచి ఫలితాలనివ్వదు. అలాగే నెగ్లెక్ట్ఫుల్ పేరెంటింగ్ అనేది ఫలానా రోజుల్లో అని కాదు, అప్పుడూ ఇప్పుడూ కూడా కనిపిస్తోంది. పిల్లల్ని గాలికి వదిలినట్లే ఉంటుంది తల్లిదండ్రుల తీరు. ఇది ఏ మాత్రం స్వాగతించలేని పేరెంటింగ్ అన్నమాట. ఇక అందరూ అంగీకరించి తీరాల్సిన పేరెంటింగ్ స్టైల్స్‌లో ఒకటి ‘అథారిటేటివ్ పేరెంటింగ్’ మాత్రమే. ఇందులో తల్లిదండ్రులు నిర్ణయాధికారులుగా ఉండరు. పేరెంట్స్– పిల్లలు సమానమే. ఇరువురూ ఒకరి అభిప్రాయాలను మరొకరు వినాలి. పరస్పరం చర్చించుకుని, మంచిచెడులు విశ్లేషించుకుని తుది నిర్ణయం మీద ఒక అంగీకారానికి రావాలని చెప్తుంది ఈ థియరీ. పిల్లలకు కొన్ని పరిమితమైన లిమిట్స్‌లో ఫ్రీడమ్ ఉంటుంది. అలాగే పెద్దవాళ్లకూ బాధ్యతల పరిధులతో కూడిన పేరెంటింగ్ ఇది. ఇక పిల్లల్లో ఉన్న బెస్ట్ క్వాలిటీస్‌ని గుర్తించి అందులో శిక్షణ ఇప్పించి, కరెక్ట్‌గా చానలైజ్ చేసి పిల్లలను తీర్చిదిద్దడం అత్యున్నతమైన పేరెంటింగ్. దీనినే ‘పాజిటివ్ పేరెంటింగ్’ అంటారు. అథారిటేటివ్, పాజిటివ్ పేరెంటింగ్లు రెండూ అనుసరించాల్సిన పద్ధతులే అని, పిల్లల పెంపకంలో అవలంబించాల్సిన పద్దతిని వివరించారు సైకాలజిస్ట్. ఇది ఓ కళ పిల్లల్ని పెంచడం అనేది అద్భుతమైన కళ. మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేసి నైపుణ్యం సాధించవచ్చు అనే అవకాశం ఇందులో ఉండదు. ఉన్నది ఒక్కటే జీవితం అన్నట్లు... తల్లిదండ్రుల చేతిలో ఉన్నది ఒక్కటే అవకాశం. విజయవంతమైనా, విఫలమైనా అది ఆ ఒక ప్రయత్నంలోనే. అందుకే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మన భయాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేయకూడదు. ప్రోత్సాహం ద్వారా వారి మీద వాళ్లకు నమ్మకం కలిగించాలి. సెల్ఫ్ ట్రస్ట్ కోల్పోయే విధంగా భద్రంగా పెంచినట్లయితే... వాళ్లు భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరో ఒకరి ఆధారాన్ని వెతుక్కుంటూ ఉంటారు. గోడ ఎక్కడంలో జారిపడితే, పడకుండా ఎక్కగలిగే వరకు మాత్రమే వెంట ఉండి ధైర్యం చెప్పాలి. అలాగే ‘చెట్టు ఎక్కాల్సింది నువ్వే, నువ్వు నేర్చుకునే వరకు నీకు సహాయంగా ఉంటాను’ అనే భరోసాను మాత్రమే తల్లిదండ్రులు ఇవ్వాల్సింది. ‘పడిపోతావు కాబట్టి చెట్టు ఎక్కవద్దు’ అని భయపెట్టడం మానాల్సిందే. ఇందులో మరోమాటకు తావులేదు. డాక్టర్ సుదర్శని సబ్బెళ్ళ క్లినికల్ సైకాలజిస్ట్, జి జి హెచ్, కాకినాడ – వాకా మంజులారెడ్డి -
63 ఏళ్ల వయసులో ఎనిమిదోసారి తండ్రి కాబోతున్న నటుడు
Alec Baldwin 63 Years Expecting Seventh His Child With Wife Hilaria: హాలీవుడ్ నటుడు అలెక్ బాల్డ్విన్ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఇప్పటికే ఆరుగురి సంతానం ఉన్న ఈ 63 ఏళ్ల యాక్టర్‌కు ఏడో సంతానం కలగనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అలెక్ భార్య, అమెరికన్ యోగా శిక్షకురాలు హిలేరియా బాల్డ్విన్ పంచుకున్నారు. 'గత కొన్నేళ్లుగా అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ అప్స్ అండ్ డౌన్స్ చవిచూశాం. ఇప్పుడు ఒక ఉత్తేజకరమైన, సంతోషకరమైన అప్ను చూడబోతున్నందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మా కుటుంబంలోకి మరో బాల్డ్వినిటో రానుంది. ఇప్పుడు మా కుటుంబం పూర్తయిందని నమ్ముతున్నాం. ఈ ఆశ్చర్యకరమైన వార్తతో మేము చాలా సంతోషంగా ఉన్నాం.' అంటూ ఆమె రాసుకొచ్చారు. కాగా హిలేరియా 2019 ఏప్రిల్‌లో గర్భస్రావం కావడంతో బిడ్డకు జన్మనివ్వలేకపోయింది. 2021లో రస్ట్ మూవీ షూటింగ్లో అలెక్ ప్రాప్ గన్‌తో యాక్సిడెంటల్‌గా సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ను చంపడంతోపాటు డైరెక్టర్‌ను గాయపరిచాడు. దీంతో ఈ కటుంబం చిక్కుల్లో పడింది. అలాంటి అనిశ్చితి పరిస్థితుల మధ్య వారు సంతానాన్ని ఆశించలేకపోయారు. ఇప్పుడు 2022లో మళ్లీ ఒక బిడ్డకు తల్లిదండ్రలు కాబోతుండటంతో సంతోషంగా ఉంది అలెక్ ఫ్యామిలీ. అలాగే హిలేరియా తన పోస్ట్‌తో పాటు తాను, తన భర్త అలేక్ వారి ఆరుగురు పిల్లలతో ఆడుకుంటున్న వీడియో కూడా షేర్ చేశారు. వారికి కుమార్తెలు లూసియా విక్టోరియా 13 నెలలు, కార్మెన్ గాబ్రియేలా 8 ఏళ్లు, కుమారులు రాఫెల్ థామస్ 6, లియోనార్డో ఏంజెల్ చార్లెస్ 5, రోమియో అలెజాండ్రో డేవిడ్ 3, ఎడ్వర్డో పావో లుకాస్ 18 నెలలు ఉన్నారు. అంతేకాకుండా అలెక్‌కు 26 ఏళ్ల కూతురు ఐర్లాండ్ బాల్డ్వీన్ కూడా ఉంది. ఆమె అలెక్, తన మాజీ భార్య కిమ్ బాసింగర్ల కుమార్తె. View this post on Instagram A post shared by Hilaria Thomas Baldwin (@hilariabaldwin) -
పిల్లలతో కఠినంగా మాట్లాడొద్దు.. కారణం ఏంటంటే!
లాలయేత్ పంచ వర్షాణి దశవర్షాణి తాడయేత్ ‘ప్రాప్తేషు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్’ పిల్లలను ఐదు సంవత్సరాల పాటు లాలించాలి. పది సంవత్సరాల పాటు దండించాలి. పదహారో సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి పిల్లలను స్నేహితుల్లాగ చూడాలి అంటాడు చాణుక్యుడు. మనం కన్న బిడ్డలే కదా, వారి మీద మనకు సర్వాధికారాలు ఉన్నాయి కదా, వారిని ఏమన్నా చెల్లిపోతుంది అనుకోవటం తప్పు అంటున్నారు సైకాలజిస్టులు. పిల్లల్ని చిన్నతనంలో అనవసరంగా తిడుతూ, కఠినంగా మాట్లాడుతూ వారిని అవమానించినట్లుగా మాట్లాడుతుంటే వారిలో బుద్ధి వికాసం తగ్గిపోతుందని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ జరిపిన సర్వేలో తెలిసింది. పిల్లల్ని ప్రేమగా మందలించాలే కానీ, కఠిన శిక్షలు విధిస్తూ, మనసు గాయపడేలాంటి ములుకుల్లాంటి మాటలతో బాధించటం వల్ల వారు మానసికంగా ఎదగలేకపోతారు. పిల్లలు తల్లిదండ్రుల నుంచి అనురాగం, అభిమానం ఆశిస్తారు. అందుకు బదులుగా తిట్లు శాపనార్థాలు వస్తుంటే, ఆ పసి మనసు తట్టుకోలేకపోతుంది. పసి హృదయాలను గాజు బొమ్మల్లా పదిలంగా కాపాడుకోవాలంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. అందుకే వారు ఏది చెప్పినా జాగ్రత్తగా వింటూ, వారి ఆలోచనలను స్వాగతిస్తూ, వారు సక్రమమార్గంలో ఎదిగేలా తల్లిదండ్రులు సహకరించాలి. పదే పదే కోపం తెచ్చుకోవటం, కొట్టడం, భయపెట్టడం, వేధించటం... వంటి అస్త్రాలను పిల్లల మీదకు సంధిస్తుంటే, వారి మెదడు ఎదుగుదల తగ్గిపోతుంది. ముఖ్యంగా కౌమార దశలో అంటే టీనేజ్‌లో ఉన్న వారి మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ‘డెవలప్మెంట్ అండ్ సైకాలజీ’ వారు ప్రచురించారు. డా. సబ్రీనా సఫ్రెన్.. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సులో ఈ విషయాలను వెల్లడించారు. పిల్లల పట్ల కటువుగా ఉండటం తప్పేమీ కాదనుకుంటారు పెద్దలు. సమాజం కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తుంది. ఏదో ఒక దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది తల్లిదండ్రులు ఇదే ఆలోచనతో ఉంటారని ఈ పరిశోధన చెబుతోంది. ‘మాట్లాడే మాటలు పిల్లల ఎదుగుదలలో మార్పులు తీసుకువస్తాయి. తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే... మాటిమాటికీ పిల్లల్ని దండించటం వల్ల పిల్లల మానసిక ఎదుగుదలకు అవరోధం ఏర్పడుతుందని’ అంటారు సఫ్రెన్. పిల్లల్ని లైంగికంగా, శారీరకంగా, మానసికంగా బాధకు గురి చేస్తుంటే, వారిలో ఏదో తెలియని ఆరాటం, విచారం పెరుగుతాయి. వారు ఎదుగుతున్న కొద్దీ ఈ విచారం ఒత్తిడిగా మారుతుంది. అందుకే పిల్లల్ని బాల్యం నుంచి మంచి మాటలు, మంచి కథలు చెబుతూ పెంచాలి. ఎటువంటి సమయంలోనైనా తల్లిదండ్రుల అండదండలు ఉంటాయనే భరోసా కల్పించాలి. కొట్టడం, తిట్టడం, నిందించం, అసభ్య పదాలు ఉపయోగించటం వల్ల... పిల్లలలో తెలివితేటలు తగ్గిపోతాయని ఈ సర్వే చెబుతోంది. -
నమ్మకమే ముఖ్యం కొంచెం నిఘా కూడా..
ప్రీతీ నిగమ్, నగేష్ కర్రా ఇద్దరూ టీవీ, సినిమా ఆర్టిస్టులు. వీరి కొడుకు ఆర్యన్ కర్రా వరల్డ్ రోలర్ ఇన్లైన్ హాకీ 2019కి తెలంగాణ నుంచి పాల్గొన్న ఏకైక ప్లేయర్. కూతురు అదితి ‘లా’ చదువుతోంది. భార్య టాలెంట్‌ను ప్రోత్సహించడంతో పాటు కొడుకు అథ్లెటిక్స్‌లో రాణించడానికి వెన్నుదన్నుగా ఉండాలని నగేష్ తను చేస్తున్న ఐటీ జాబ్‌ను వదులుకున్నారు. పిల్లలపైన ఎప్పుడూ నమ్మకం ఉంచడంతో పాటు కొద్దిగా నిఘా కూడా అవసరం అంటారు తల్లిగా ప్రీతీ. తల్లిదండ్రులిద్దరూ గ్లామర్ ప్రపంచంలో ఉంటూ పిల్లలిద్దరినీ వారికిష్టమైన రంగంలో ప్రోత్సహిస్తున్న ప్రీతీ నిగమ్, నగేష్ కర్రా పేరెంటింగ్ గురించి అడిగితే ఇలా ఎన్నో విషయాలు పంచుకున్నారు. యాక్టింగ్, పేరెంటింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? నగేష్ కర్రా: యాక్టింగ్ నా ప్యాషన్. మొదట సీరియల్స్ లో నటిస్తుండేవాడిని. కార్వి గ్రూప్‌లో ఐటీ జాబ్ చేసేవాడిని. ఆర్యన్ మూడేళ్ల వయసు నుంచి టీవీలో ఒలంపిక్ గేమ్స్ వచ్చినప్పుడు చాలా ఆసక్తిగా చూసేవాడు. అది గమనించి స్పోర్ట్స్‌లో ప్రోత్సహించాలనుకున్నాం. అలా, జిమ్నాస్టిక్స్ స్కూల్లో జాయిన్ చేశాం. బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇప్పించాం. ఎనిమిదేళ్ల వయసులో జిమ్నాస్టిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించాడు. అప్పుడనుకున్నాను జాబ్, యాక్టింగ్ అంటూ బిజీగా ఉంటే పిల్లల టాలెంట్‌కి సపోర్ట్ ఉండదని, ముఖ్యంగా కొన్నాళ్లు ఆర్యన్ వెన్నంటే ఉండటం అవసరం అనుకున్నాను. ఇదే విషయం ప్రీతికి చెప్పాను. మంచి జాబ్ వదులుకోవడం ఎందుకు, యాక్టింగ్ మానేస్తాను అంది. తనకు నటనలో మంచి టాలెంట్ ఉంది. మానుకోవద్దని చెప్పాను. మాది మధ్య తరగతి కుటుంబం. డబ్బు ఇబ్బందులు రాకుండా ఎలా చూసుకోవాలో ఇద్దరం చర్చించుకున్నాం. అన్నీ ఓకే అనుకున్నాక పదేళ్ల క్రితం జాబ్‌కి రిజైన్ చేశాను. పాప స్కూల్ ఏజ్‌లోనే తన గోల్ ఏంటో చెప్పేసింది. అలా తనని ‘లా’ వైపు ప్రోత్సహించాం. ప్రీతీ నిగమ్: 14 ఏళ్ల వయసులోనే ఆర్యన్ ఇండియన్ ఇన్లైన్ హాకీ టీమ్‌లో పాల్గొన్నాడు. వాడి కృషి వెనక వాళ్ల నాన్న సపోర్ట్ ఎక్కువ. ఇప్పుడంటే పిల్లలు కొద్దిగా పెద్దవారయ్యారు. వాళ్లను వాళ్లు చూసుకోగలరనే ౖధైర్యం మా ఇద్దరికీ వచ్చేసింది. చిన్నప్పుడు కొంచెం కష్టంగానే ఉండేది. మా అమ్మనాన్న ఇద్దరూ టీచర్లుగా చేసి, రిటైర్ అయ్యారు. వారితో మేం ఉండటం వల్ల పిల్లలకు మంచి క్రమశిక్షణ అలవడింది. ఆ విధంగా మేం ఎంతో అదృష్టవంతులం. ► ఇద్దరూ బిజీగా ఉంటారు, టైమ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది? నగేష్: ఉదయం ఐదు గంటలకల్లా అందరం నిద్ర లేస్తాం. ఆర్యన్ మా కన్నా ఎక్కువ కష్టపడతాడు. ఉదయం 4:30 కి నిద్రలేస్తే తిరిగి పడుకోవడానికి రాత్రి 11 అవుతుంది. రోజూ ఉదయం ఐదారు కిలోమీటర్లు జాగింగ్ చేస్తాడు. తర్వాత జిమ్. ఆ తర్వాత కాలేజీ. ఇంటికి వస్తూనే తిరిగి 4కి మళ్లీ ప్రాక్టీస్‌కి వెళతాడు. ప్రీతి: ముందే రాత్రే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటాను. దానిని బట్టి పనులు అవుతూ ఉంటాయి. ఇంట్లో అందరం బిజీ అవడంతో పిల్లలు వారి పనులు వారు చేసుకునేలా అలవాటయ్యారు. ► పిల్లలకు సంబంధించిన విషయాల్లో వారి ఫుడ్ హ్యాబిట్స్ ప్రధానంగా ఉంటాయి. వీటి గురించి.. నగేష్: ఆర్యన్ స్పోర్ట్స్ వైపుగా ఉండటం వల్ల ఇంట్లో అందరికీ పోషకాహారం పట్ల అవగాహన ఉంది. ఆర్యన్ డైట్ చార్ట్ ఫాలో అవుతాడు. ఎనర్జీ లెవల్స్ పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తాడు. ప్రీతి: చిన్నప్పుడు పిల్లలిద్దరూ జంక్‌ఫుడ్ తినేవాళ్లు. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ మూడేళ్ల నుంచి ఇద్దరూ మానేశారు వాటి సైడ్ ఎఫెక్ట్ అర్ధమై. ఆర్యన్ తన టీమ్ లో మిగతా వారికి ఫుడ్ విషయంలోనూ రోల్ మోడల్‌గా ఉండాలని చెబుతుంటాడు. ► అమ్మాయి.. అబ్బాయి అనే తేడాలు చూపడం గురించి.. ప్రీతి: ‘అమ్మాయివి నువ్వు ఈ పనులే చేయాలి, అబ్బాయి ఫలానా పనులే చేయాలి’ అని చెప్పను. మా అమ్మనాన్నలు కూడా అలాంటి తేడాలు చూపలేదు. కానీ, అక్కను బాగా చూసుకోవాలని మాత్రం ఆర్యన్‌కి చెబుతుంటాను. నగేష్: వేరు వేరుగా చూడాలనే ఆలోచన మా పెద్దల నుంచే రాలేదనుకుంటాను. సేవా గుణంలోనూ ఇద్దరూ ముందుంటారు. ఈ గుణం కూడా మా పెద్దల నుంచి వచ్చిందనుకుంటాం. ► మనీ మేనేజ్మెంట్ గురించి పిల్లలకు సూచనలు ఏమైనా..? నగేష్: మా కష్టాన్ని పిల్లలిద్దరూ అర్ధం చేసుకుంటారు. ఆర్యన్ స్పోర్ట్ కొంచెం ఖర్చుతో కూడుకున్నదే. నేషనల్ ఇంటర్నేషనల్ లెవల్స్‌కి వెళ్లాలంటే రాష్ట్రాలు, దేశాలు దాటాలి. కానీ, అన్నీ బడ్జెట్లోనే చూసుకుంటాడు. వెళ్లాల్సిన చోటు, టికెట్, రూమ్ బుకింగ్ అన్నీ మ్యానేజ్ చేసుకుంటాడు. ఈ గేమ్‌కి గవర్నమెంట్ ఫండింగ్ లేకపోవడంతో వాళ్ల టీమ్‌లో ఉన్నవారితో ఖర్చులు కలిసి వచ్చేలా షేర్ చేసుకుంటాడు. దీనివల్ల ఖర్చు ఎంత, అమ్మనాన్నలు ఎలా కష్టపడుతున్నారు అనే విషయాల మీద అవగాహన వచ్చేసింది. అదితి కూడా అంతే. చాలా బాగా అర్థం చేసుకుంటుంది. ప్రీతి: మా పిల్లలు రూపాయి ఖర్చు చేయాల్సి వచ్చినా మాకు చెప్పనిదే చేయరు. పిల్లల ముందు డబ్బు విషయాలు కూడా చర్చకు వస్తాయి. ఖర్చు పెట్టాలనుకునే ప్రతీ రూపాయి విలువ తెలుసుకోవాలని చెబుతుంటాను. ► స్పోర్ట్స్ .. చదువు బ్యాలెన్స్ ఎలా? ప్రీతి: పిల్లలిద్దరూ చదువులో ముందుంటారు. ఆర్యన్ గేమ్స్ అంటూ వేరే స్టేట్స్‌కి వెళ్లినా, వస్తూనే క్లాస్‌కి వెళ్లిపోతాడు. వాడిని వాళ్ల లెక్చరర్లు బాగా అభిమానిస్తారు. క్రమశిక్షణ గురించి చెప్పడం కన్నా మనం ఆచరిస్తూ పిల్లలను ఆచరించేలా చేయాలనేది మా పద్ధతి. కొంతమంది టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు యాక్టింగ్ పీల్డ్లోకి వస్తాం అంటుంటారు. అలాంటప్పుడు ముందు డిగ్రీ పూర్తి చే యండి, దాంతో పాటు ఏదైనా ఒక అంశంలో నైపుణ్యం సాధించమని చెబుతాను. అదితి లా చేస్తుంటే.. ఆర్యన్ బిబిఎ చేస్తున్నాడు. నగేష్: టాలెంట్ ఉండాలి. దీంతో పాటు చదువూ ఉండాలి. అప్పుడే, మరింత ఉన్నతంగా ఎదగలరు. స్పోర్ట్స్‌లో ఉన్నాం కదా అని చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. లక్కీగా ఆర్యన్‌కి చదువుపై మంచి ఇంట్రస్ట్ ఉంది. వాళ్ల ఇండియన్ టీమ్ కెప్టెన్ డిఎస్పి కూడా. దీంతో చదువులో కూడా రాణించాలనేది ఆర్యన్ పట్టుదల. పిల్లలు బయటి ప్రపంచాన్ని కూడా చూస్తుంటారు కాబట్టి, వారేం కావాలో కూడా వారే డిసైడ్ చేసుకుంటారు. పేరెంట్స్‌గా మన గైడెన్స్, సపోర్ట్ ఉంటే చాలు. ► టీనేజ్ పిల్లల తల్లిదండ్రులుగా మీ పెంపకం? నగేష్: నేను కొంచెం స్ట్రిక్ట్‌గానే ఉంటాను. వాళ్లమ్మ దగ్గర మాత్రం గారాలు పోతుంటారు. ఆర్యన్‌ది చాలా సాఫ్ట్ నేచర్. చెప్పింది అర్ధం చేసుకుంటాడు. ఇప్పుడు ఆర్యన్ వయసు 18. అదితి టీనేజ్ కంప్లీట్ అయ్యింది. వాడిలో నచ్చే మరో గుణం అహంకారం అస్సలు చూపకపోవడం. ఇది వాళ్ల అమ్మను చూసి నేర్చుకున్నాడని అనిపిస్తుంది నాకు. ప్రీతికి యాక్టింగ్‌లో నేషనల్ అవార్డులూ వచ్చాయి. అమితాబచ్చన్, శ్యామ్‌బెనగల్... వంటి వారితో వర్క్ చేసింది. అయినా తను ఎక్కడా అహం చూపదు. పెద్దలను గమనిస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు కూడా అలాగే ఉంటారు. పిల్లల కెరియర్‌కు ఉపయోగపడేలా వారి సబ్జెక్ట్స్‌కు సంబంధించిన చర్చలు కూడా ఇంట్లో ఉంటుంటాయి. ప్రీతి: నా చిన్నతనంలో అమ్మనాన్నలు, ఇప్పుడు నగేష్ నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. నా మీద నమ్మకం ఉంచారు. అదే నమ్మకం నేను పిల్లల మీద ఉంచుతాను. స్వేచ్ఛను ఇస్తూనే గమనింపు కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. ఒకసారి వదిలేయాలి. ఇంకొసారి తెలియజేసేలా చెప్పాలి. పట్టుకొని పీడించి, వాదిస్తే మొండితనం మొదలవుతుంది. ఎనిమిదేళ్ల వయసు నుంచి ఆర్యన్ రోజూ గాయత్రి చేస్తాడు. దీని వల్ల ఆధ్యాత్మిక భావన కూడా ఎక్కువే. కొంచెం కామ్ మెంటాలిటీ. అక్కాతమ్ముడికి షేరింగ్, కేరింగ్ కూడా ఎక్కువే కాబట్టి ఈజీగా బ్యాలెన్స్ అవుతుంటుంది. అబ్బాయిలు ముందు ఇంట్లో ఆడవాళ్లను గౌరవిస్తే బయటా అలాగే ఉంటారనే విషయాలు మాత్రం తరచూ చెబుతుంటాను. – సంభాషణ: నిర్మలారెడ్డి -
'క్షమాపణ' నా పిల్లలకు చెప్పక్కర్లేదు
కోర్ట్నీ కర్దేషియన్ అమెరికన్ మీడియా ప్రముఖురాలు. మోడల్. కాలిఫోర్నియాలో ఉంటారు. అయితే ఏ రోజూ ఆమె గురించి వినని దేశమే ఉండదు. ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. కిమ్, క్లో అని ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఫ్యాషన్ రంగంలో ప్రసిద్ధులు వాళ్లు. కోర్ట్నీకి 40ఏళ్లుంటాయి. 2006లో పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. కొడుకు, కూతురు, మళ్లీ ఒక కొడుకు. భర్త స్కాట్. కోపం వచ్చినప్పుడు భార్యాభర్తలు విడిపోతుంటారు. ఎడబాటుగా అనిపించినప్పుడు తిరిగి కలుస్తుంటారు. జీవితంలో తనకేవీ పశ్చాత్తాపాలు లేవంటారు కోర్ట్నీ. ఈ సంగతిని ఆమె తరచు టీవీ రియాల్టీ షోలలో చెబుతుంటారు. నిన్ననో, మొన్ననో కోర్ట్నీని మళ్లీ ఎవరో అడిగారు. అయితే వేరేలా అడిగారు. ‘‘మీ జీవితంలో మీరు చేసిన.. ‘క్షమాపణ చెప్పనవసరం లేని పని’ ఏమిటో ఒకటి చెప్పండి’’ అని! ఆ ప్రశ్నకు కోర్ట్నీ చెప్పిన సమాధానమే ఆమెను మళ్లీ వార్తల్లోకి తెచ్చింది. ‘‘ఒక పనికి మాత్రం నేను ఎప్పటికీ క్షమాపణ చెప్పనవసరం లేదు’’ అన్నారు! క్షమాపణ చెప్పనవరసం లేని ఆ పనిని కోర్ట్నీ తన పిల్లల విషయంలో చేశారట! బహుశా తండ్రిని అప్పుడప్పుడు పిల్లలకు దూరం చేయడం ఆమె చేసిన‘ క్షమాపణ చెప్పనవసరం లేని పని’ అని మనం అనుకోవచ్చు. కానీ అది కాదట. ‘‘నా పిల్లల్ని నేను వారి మూతిపై ముద్దు పెట్టుకున్నాను. అందుకు మాత్రం వారికి క్షమాపణ చెప్పక్కర్లేదు’’ అని నవ్వేశారు కోర్ట్నీ. తర్వాత పేరెంటింగ్ గురించి కొద్దిసేపు మాట్లాడారు. పదేళ్ల కొడుకు, ఏడేళ్ల కూతురు, ఐదేళ్ల కొడుకు. ఇక కోర్ట్నీ కన్నా పెద్ద పేరెంట్ ఎవరుంటారు? కోర్ట్నీ లాంటి తల్లులు తప్ప. ‘‘ఈ ఏజ్‌లోని పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. పిల్లలు మాట వినరు కదా. నా కష్టమేదో నేను పడుతున్నాను. అప్పటికీ ఎవరో ఒకరు నాకు అక్కర్లేని సలహాలు ఇస్తుంటారు.. పిల్లల్ని అలా పెంచాలి, ఇలా పెంచాలి అని. అప్పుడు నాకు ఒళ్లు మండిపోతుంది’’ అన్నారు కోర్ట్నీ. మండినందుకు కూడా ఆమె క్షమాపణ చెప్పక్కర్లేదు. పిల్లల పెంపకంలో ఒకరి అనుభవం ఇంకొకరికి పనికి రాదు కదా.