మంచిమాట
సాధారణంగా పెంపకం విషయంలో ఆడపిల్లలకి ఎన్నో జాగ్రత్తలు చెప్పటం చూస్తాం. మగపిల్లలకి చెప్పవలసినది ఏమీ లేదని చాలా మంది అభిప్రాయం. ఈ కారణంగానే సమాజంలో ఎన్నో అయోమయ పరిస్థితులు, అలజడులు, అరాచకాలు.
ముఖ్యంగా ఆడపిల్లలకి సమాజం మీద ఏవగింపు, కోపం, పురుషద్వేషం పెరిగి అవాంఛనీయ సంఘటనలకి దారి తీయటం జరుగుతోంది. అమ్మాయిలు విప్లవభావాల పట్ల ఆకర్షించబడటం, పెళ్లి చేసుకోవద్దు అనుకోటం, చేసుకున్నా విడాకులు తీసుకోవటం, కుటుంబాలు విచ్ఛిన్నం కావటం, లేదా అమ్మాయిలనే పెళ్లి చేసుకోవటమో, సహజీవనం చేయటమో జరుగుతోంది. ఇవన్నీ కొంతవరకైనా అదుపులో ఉండి సమాజంలో సమరసత ఉండటానికి మగపిల్లలని సరిగా పెంచటం ప్రధానం.
మన తరువాతి తరం వారికి మనం ఏం నేర్పిస్తున్నాం? అని కాస్త వివేచన చేస్తే ... అమ్మో! ఎంత భయం వేస్తుందో! మన ప్రవర్తన ద్వారా నేర్పే విషయాలే కాదు, మన మాటలు, ఆదేశాలు, ఉపదేశాలు, బోధలు మొదలైనవి కూడా తలుచుకుంటే బాధ కలుగుతుంది. ఆడ, మగ వివక్ష ఇంట్లోనే మొదలవుతుంది. ఆడపిల్ల పుట్టిందనగానే ముందుగా ‘‘అయ్యో!’’ అనేది తల్లే. పెంపకంలోనూ తేడా చూపిస్తారు.
ఉదాహరణకి ఇంట్లో అమ్మాయిని తల్లే అంటుంది ‘‘ఆడపిల్లవి నీకెందుకు?’’ అని. అంటే ఆడపిల్ల కొన్ని విషయాలు పట్టించుకోకూడదు. అవసరం లేదు. కొడుకు కూడా కొన్ని పట్టించుకోకూడదు. కానీ అవి వేరు. అవి ఇంటి విషయాలు, వంటవిషయాలు మొదలైనవి. ఇంక కొన్ని కుటుంబాలలో ఆస్తిపాస్తులు పంచి ఇవ్వటం మాట అటుంచి కూతురిని ఇంటిపని చెయ్యమని, కొడుకుని చదువుకోమని చెప్పేవారు కనపడుతూనే ఉన్నారు.
ఇద్దరినీ సమానంగా చూడటం ఎట్లా కుదురుతుంది? ఆడపిల్లలు కొంచెం నాజూకుగా ఉంటారు, మగపిల్లలు కాస్త మొరటుగా ఉంటారు కదా! అనిపించటం సహజం. సమానత్వం అంటే వారి పట్ల ప్రవర్తించే తీరు సమానంగా ఉండటం. వారికి ఇష్టమయినవి, వారి అభిరుచులకు తగినవి అందించటం. నిజానికి మగపిల్లలైనా ఏ ఇద్దరికీ ఒకే రకమైన అభిరుచులు, లక్ష్యాలు ఉండవు కదా! ఒకరికి ఇంజనీరింగ్ ఇష్టమైతే మరొకరికి వైద్యవృత్తి ఇష్టం, వేరొకరికి వ్యవసాయం మీద మక్కువ ఉండవచ్చు. వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వటం తల్లితండ్రుల కర్తవ్యం. అదే ఆడపిల్లల విషయంలో కూడా పాటించాలి. ఇదిప్రోత్సాహం మాత్రమే. అసలు చేయవలసినది మగపిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు.
ఆడపిల్లలని గౌరవించటం నేర్పాలి. ఇది తండ్రి ప్రవర్తన వల్ల కలుగుతుంది. తండ్రి తల్లిని గౌరవిస్తూ ఉంటే కొడుకు కూడా తల్లిని, స్త్రీలని గౌరవిస్తాడు. చీటికి మాటికి భార్యని భర్త చులకన చేస్తూ ఉంటే కొడుకుకి ఆడవారిని తక్కువగా చూడటం అలవాటు అవుతుంది. తరువాతి కాలంలో ఈ భావం సరి అవటం కష్టం. ఇటువంటి పెంపకంలో పెరిగిన వారే ఆడపిల్లలని ఏడిపించటం నుండి యాసిడ్ దాడులు, అత్యాచారాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. ఏ ఇంట్లో తండ్రి తల్లిని అగౌరవపరచడో, ఆడపిల్లలని బరువుగా భావించ కుండా ఉంటారో ఆ ఇంట్లో పెరిగిన మగపిల్లలు తోటి ఆడపిల్లలతో మర్యాదగా ప్రవర్తిస్తారు. అటువంటి వాళ్ళు ఉన్న సమాజంలో మన ఆడపిల్లలు కూడా భద్రంగా ఉంటారు.
ప్రతి క్షణం ఆడపిల్ల, మగపిల్లవాడు అనే మాటని అని వారికి ఆ సంగతి గుర్తు చేస్తూ ఉండకూడదు. ఇంటి పనులన్నీ ఇద్దరి చేత సమానంగా చేయిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ రోజులలో ఆడ, మగ అందరు ఉద్యోగం చేస్తున్నారు. మగవారి బాధ్యత అయిన సంపాదించటంలో ఆడవారు భాగస్వామ్యం వహిస్తున్నప్పుడు, ఇంటి పనిలో మగవారు కూడా భాగస్వామ్యం వహించాలి అని చిన్నప్పుడే బుర్రకి ఎక్కించాలి. ముందు తిన్నకంచం తీయటం, వంటపనిలో సహాయం చేయటం అలవాటు చేయాలి. లేక΄ోతే కోడలు అత్తగారి పెంపకాన్ని తప్పు పడుతుంది.
– డా. ఎన్. అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment