Male child
-
ఆస్పత్రి దూరమై.. రహదారి నరకమై..
చింతూరు: సకాలంలో వైద్యం అందకపోవడంతో అప్పుడే పుట్టిన మగబిడ్డ మృత్యువాత పడిన విషాద ఘటన చింతూరు మండలం కలిగుండంలో శుక్రవారం చోటు చేసుకుంది. కలిగుండం గ్రామానికి చెందిన కుంజా జయమ్మ స్థానిక మినీ అంగన్వాడీ కేంద్రంలో వర్కర్‌గా పనిచేస్తున్నది. గర్భిణీ అయిన జయమ్మకు ఇటీవల పరీక్షలు నిర్వహించగా వచ్చేనెల 18న కాన్పు అయ్యే అవకాశముందని వైద్యులు చెప్పినట్లు ఆమె భర్త సీతారాం తెలిపాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున జయమ్మకు అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు భర్త సీతారాం సిద్ధమయ్యాడు. తమ గ్రామం నుంచి వాహన సౌకర్యం లేకపోవడంతో ఆమెను రెండు కిలోమీటర్ల దూరంలోని పేగకు కాలినడకన తీసుకెళ్లేందుకు గ్రామస్తుల సాయం కోరాడు. మార్గమధ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న చంద్రవంక వాగును ప్రాణాలకు తెగించి దాటించి పేగకు చేరుకున్నారు. అప్పటికే పురిటి నొప్పులతో అల్లాడిన జయమ్మకు వ్యయప్రయాసతో గుండెల్లోతు నీళ్లలో వాగు దాటడంతోపాటు, రెండు కిలోమీటర్లు కాలినడకన రావడంతో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆమెకు తోడుగా వచ్చిన ఆశా కార్యకర్త వెంటనే పేగలోనే ఓ ఇంటిలో కాన్పు చేయడంతో జయమ్మ మగబిడ్డకు జన్మనిచ్చి0ది. బిడ్డను కాపాడుకునేందుకు.. పుట్టిన బిడ్డకు అస్వస్థతగా ఉండడంతో ఆ బిడ్డను కాపాడుకునేందుకు పేగ నుంచి ఆటోలో ఏడు కిలోమీటర్ల దూరంలోని ఏడుగురాళ్లపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని, చింతూరు ఏరియా ఆస్పత్రిలోని చిన్నపిల్లల వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్సులో చింతూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి మార్గమధ్యంలోనే బిడ్డ మృతి చెందిందని చెప్పారు. దీంతో బిడ్డను కోల్పోయిన దంపతులు గుండెలవిసేలా రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. -
మగపిల్లల పెంపకం
సాధారణంగా పెంపకం విషయంలో ఆడపిల్లలకి ఎన్నో జాగ్రత్తలు చెప్పటం చూస్తాం. మగపిల్లలకి చెప్పవలసినది ఏమీ లేదని చాలా మంది అభిప్రాయం. ఈ కారణంగానే సమాజంలో ఎన్నో అయోమయ పరిస్థితులు, అలజడులు, అరాచకాలు. ముఖ్యంగా ఆడపిల్లలకి సమాజం మీద ఏవగింపు, కోపం, పురుషద్వేషం పెరిగి అవాంఛనీయ సంఘటనలకి దారి తీయటం జరుగుతోంది. అమ్మాయిలు విప్లవభావాల పట్ల ఆకర్షించబడటం, పెళ్లి చేసుకోవద్దు అనుకోటం, చేసుకున్నా విడాకులు తీసుకోవటం, కుటుంబాలు విచ్ఛిన్నం కావటం, లేదా అమ్మాయిలనే పెళ్లి చేసుకోవటమో, సహజీవనం చేయటమో జరుగుతోంది. ఇవన్నీ కొంతవరకైనా అదుపులో ఉండి సమాజంలో సమరసత ఉండటానికి మగపిల్లలని సరిగా పెంచటం ప్రధానం. మన తరువాతి తరం వారికి మనం ఏం నేర్పిస్తున్నాం? అని కాస్త వివేచన చేస్తే ... అమ్మో! ఎంత భయం వేస్తుందో! మన ప్రవర్తన ద్వారా నేర్పే విషయాలే కాదు, మన మాటలు, ఆదేశాలు, ఉపదేశాలు, బోధలు మొదలైనవి కూడా తలుచుకుంటే బాధ కలుగుతుంది. ఆడ, మగ వివక్ష ఇంట్లోనే మొదలవుతుంది. ఆడపిల్ల పుట్టిందనగానే ముందుగా ‘‘అయ్యో!’’ అనేది తల్లే. పెంపకంలోనూ తేడా చూపిస్తారు. ఉదాహరణకి ఇంట్లో అమ్మాయిని తల్లే అంటుంది ‘‘ఆడపిల్లవి నీకెందుకు?’’ అని. అంటే ఆడపిల్ల కొన్ని విషయాలు పట్టించుకోకూడదు. అవసరం లేదు. కొడుకు కూడా కొన్ని పట్టించుకోకూడదు. కానీ అవి వేరు. అవి ఇంటి విషయాలు, వంటవిషయాలు మొదలైనవి. ఇంక కొన్ని కుటుంబాలలో ఆస్తిపాస్తులు పంచి ఇవ్వటం మాట అటుంచి కూతురిని ఇంటిపని చెయ్యమని, కొడుకుని చదువుకోమని చెప్పేవారు కనపడుతూనే ఉన్నారు. ఇద్దరినీ సమానంగా చూడటం ఎట్లా కుదురుతుంది? ఆడపిల్లలు కొంచెం నాజూకుగా ఉంటారు, మగపిల్లలు కాస్త మొరటుగా ఉంటారు కదా! అనిపించటం సహజం. సమానత్వం అంటే వారి పట్ల ప్రవర్తించే తీరు సమానంగా ఉండటం. వారికి ఇష్టమయినవి, వారి అభిరుచులకు తగినవి అందించటం. నిజానికి మగపిల్లలైనా ఏ ఇద్దరికీ ఒకే రకమైన అభిరుచులు, లక్ష్యాలు ఉండవు కదా! ఒకరికి ఇంజనీరింగ్ ఇష్టమైతే మరొకరికి వైద్యవృత్తి ఇష్టం, వేరొకరికి వ్యవసాయం మీద మక్కువ ఉండవచ్చు. వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వటం తల్లితండ్రుల కర్తవ్యం. అదే ఆడపిల్లల విషయంలో కూడా పాటించాలి. ఇదిప్రోత్సాహం మాత్రమే. అసలు చేయవలసినది మగపిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఆడపిల్లలని గౌరవించటం నేర్పాలి. ఇది తండ్రి ప్రవర్తన వల్ల కలుగుతుంది. తండ్రి తల్లిని గౌరవిస్తూ ఉంటే కొడుకు కూడా తల్లిని, స్త్రీలని గౌరవిస్తాడు. చీటికి మాటికి భార్యని భర్త చులకన చేస్తూ ఉంటే కొడుకుకి ఆడవారిని తక్కువగా చూడటం అలవాటు అవుతుంది. తరువాతి కాలంలో ఈ భావం సరి అవటం కష్టం. ఇటువంటి పెంపకంలో పెరిగిన వారే ఆడపిల్లలని ఏడిపించటం నుండి యాసిడ్ దాడులు, అత్యాచారాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. ఏ ఇంట్లో తండ్రి తల్లిని అగౌరవపరచడో, ఆడపిల్లలని బరువుగా భావించ కుండా ఉంటారో ఆ ఇంట్లో పెరిగిన మగపిల్లలు తోటి ఆడపిల్లలతో మర్యాదగా ప్రవర్తిస్తారు. అటువంటి వాళ్ళు ఉన్న సమాజంలో మన ఆడపిల్లలు కూడా భద్రంగా ఉంటారు. ప్రతి క్షణం ఆడపిల్ల, మగపిల్లవాడు అనే మాటని అని వారికి ఆ సంగతి గుర్తు చేస్తూ ఉండకూడదు. ఇంటి పనులన్నీ ఇద్దరి చేత సమానంగా చేయిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ రోజులలో ఆడ, మగ అందరు ఉద్యోగం చేస్తున్నారు. మగవారి బాధ్యత అయిన సంపాదించటంలో ఆడవారు భాగస్వామ్యం వహిస్తున్నప్పుడు, ఇంటి పనిలో మగవారు కూడా భాగస్వామ్యం వహించాలి అని చిన్నప్పుడే బుర్రకి ఎక్కించాలి. ముందు తిన్నకంచం తీయటం, వంటపనిలో సహాయం చేయటం అలవాటు చేయాలి. లేక΄ోతే కోడలు అత్తగారి పెంపకాన్ని తప్పు పడుతుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
ఆడ పిల్ల వద్దమ్మా..
బల్మూర్ (అచ్చంపేట): మగ సంతానం కోసం ఆ తల్లిదండ్రులు నలుగురు పిల్లలను కన్నారు.. అయితే ఐదో కాన్పులోనూ ఆడ శిశువే జన్మించడంతో వదిలించుకోవాలనుకున్నారు. ఈ మేరకు కన్న పేగు బంధాన్ని కూడా కాదనుకుని అంగన్వాడీ టీచర్‌కు సమాచారమిచ్చారు. అంగన్వాడీ సిబ్బంది ఎంత నచ్చచెప్పినా ఆ దంపతులు వినకపోవడంతో చివరకు శిశువును శిశు సంరక్షణ గృహానికి చేర్చారు. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని బాణాల గ్రామానికి చెందిన రామావత్ దస్లీ–నిరంజన్ దంపతులకు ఇది వరకే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఇందులో ఓ కూతురు అనారోగ్యంతో కన్నుమూసింది. ఆ తర్వాత మళ్లీ గర్భం దాల్చిన దస్లీ శనివారం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మళ్లీ ఆడ శిశువుకే జన్మనిచ్చింది. దీంతో ఇప్పటికే ఉన్న ముగ్గురు ఆడ పిల్లలకు తోడు ఈ శిశువు భారం మోయలేమని గ్రామ అంగన్వాడీ టీచర్ అనితకు సమాచారం ఇచ్చారు. దీంతో సూపర్వైజర్ విజయలక్ష్మి, ఇతర సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చినా వారు వినలేదు. దీంతో శిశువును మహబూబ్‌నగర్‌లోని శిశు సంరక్షణ గృహం అధికారులకు అప్పగించారు. -
సాకలేక పది వేలకు అమ్మేసింది
ఇబ్రహీంపట్నంరూరల్: సాకలేక కన్నబిడ్డను విక్రయించింది ఆ తల్లి. ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఆదిబట్ల సీఐ బిక్షపతి, ఎస్ఐ మోహన్‌రెడ్డి వెల్లడించారు. బాలాపూర్ మండలం కుర్మల్‌గూడ గ్రామంలోని ఇందినగర్ గుడిసెల్లో నివాసం ఉంటున్న పైడాల బాలరాజ్ భార్య పద్మ అలియాస్ మంగ కూలి పని చేసుకొని జీవనం సాగించేది. మంగకు మూడు నెలల మగ శిశువు ఉన్నాడు. కొన్ని నెలల క్రితం మంగ భర్త బలరాజ్ వదిలేయడంతో ఒంటరిగా నివాసం ఉంటోంది. కొద్ది రోజుల క్రితం మంగ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. సంపాదన లేక బిడ్డను సాకలేని పరిస్థితి ఏర్పడింది. సరైన పోషణ కోసం మూడు నెలల మగబిడ్డను అమ్మడానికి మంగ సిద్ధమైంది. ఈ క్రమంలో పక్కనే రాజీవ్‌గృహకల్పలో నివాసం ఉంటున్న వారికి అమ్మకానికి పెట్టింది. మగ శిశువును రూ.10వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ నెల 23న సాయంత్రం కుమ్మరి లక్ష్మమ్మకు మంగ తన మూడు నెలల బిడ్డను ఇచ్చి రూ.500 తీసుకుంది. మిగతా డబ్బులు త్వరలోనే ఇస్తామని లక్ష్మమ్మ శిశువును తీసుకెళ్లింది. అయితే, లక్ష్మమ్మ ఇంటి పక్కల వారికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. లక్ష్మమ్మ దంపతులను విచారించగా.. మంగ దగ్గర కొనుగోలు చేసినట్టు తెలిపారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. శిశువు తల్లి మంగ, కొనుగోలు చేసిన లక్ష్మమ్మ చెన్నయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మూడు నెలల బాబును అంగన్వాడీ అధికారుల సమక్షంలో శిశువిహార్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
అన్న కాదు.. కీచకుడు
శివమొగ్గ: చెల్లెలు వరసయ్యే బాలికకు మత్తుమాత్రలు ఇచ్చి ఒక కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడగా, బాలిక గర్భవతై మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని శికారిపుర తాలూకాలో ఆలçస్యంగా వెలూగు చూసింది. వివరాలు.. యువరాజ్ నాయక్ (22) అనే కీచకుడు తన చిన్నాన్న కూతురు (16)పై కన్నేశాడు. ఆమె ఇంటర్ చదువుతోంది. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. దీంతో నిందితుడు తరచూ వారి ఇంటికి వెళ్తూ బాలికకు మాయమాటలు చెప్పి నిద్రమాత్రలు ఇస్తూ అత్యాచారం జరిపేవాడు. ఈ నెల 24వ తేదీన బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రాగా, ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు జరిపిన వైద్యులు బాలిక 8 నెలల గర్భవతిగా గుర్తించారు. నొప్పులు పెరగడంతో వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేసి మగబిడ్డను వెలికితీశారు. బాలిక ఈ బిడ్డ తనకు వద్దని చెప్పడంతో పిల్లల దత్తత కేంద్రానికి అప్పగిస్తామని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. బాలికకు నిద్ర మాత్రలు ఇచ్చి అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువరాజ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
ఆడపిల్ల పుట్టిందని ‘తలాక్’!
- మగబిడ్డ కోసం బాబా ఇచ్చిన మందులు వాడాలన్న అత్తింటివారు - కాదన్నందుకు గృహిణికి వేధింపులు... - చివరకు ఆడబిడ్డ పుట్టడంతో విడాకుల నోటీసులు హైదరాబాద్: మగబిడ్డ కోసం గృహిణిని వేధించిన అత్తింటివారు... చివరకు ఆడపిల్ల పుట్టడంతో ఆమెను వదిలించుకోవడానికి సిద్ధమయ్యారు. బాబా చెప్పినట్టు నడుచుకోనందుకు, ఆయన ఇచ్చిన మందులు వాడనం దుకే మగ పిల్లాడు పుట్టలేదంటూ కోడలిని హింసించారు. భర్తకు మొరపెట్టుకుంటే నిర్ధాక్షిణ్యంగా విడాకుల నోటీసులు పంపి అతడు నిలువునా వంచించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అత్త, మామతో పాటు నకిలీ బాబానూ చార్మినార్ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్య నారాయణ మంగళవారం ఈ వివరాలు వెల్లడించారు. నాంపల్లికి చెందిన ముజఫర్ హుస్సేన్ కుమార్తె హబీబా ఫాతిమా(19)ను మొఘల్పురావాసి మహ్మద్ సాదిక్ కుమారుడు మహ్మద్ మన్సూర్ అలియాస్ సైఫ్‌కు ఇచ్చి 2016 ఆగస్టులో వివాహం జరిపించారు. 10 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.5 లక్షల నగదును కట్నంగా సమర్పించారు. పెళ్లయిన కొద్ది రోజులకే మన్సూర్ పని నిమిత్తం అబుదాబీ వెళ్లాడు. ఫాతిమా గర్భవతి అయింది. వెంటనే అత్త సమీనాసుల్తానా(50), మామ మహ్మద్ సాదిక్ (55) తమకు మగ పిల్లవాడు కావాలని, అది జరగాలంటే తమకు తెలిసిన బాబా వద్దకు వెళ్లి మందులు తీసుకోవాలన్నారు. వద్దంటున్నా ఫాతిమాను బలవం తంగా మొఘల్‌పురాలో ఉండే షేక్ అబ్దుల్ రహీం అలియాస్ బాయిమియా(68) వద్దకు తీసుకెళ్లారు. బాబా ఆమెకు కొన్ని మందులిచ్చి, గర్భంపై నూనె రాయాలని సూచించాడు. అందుకు రూ.20 వేలు తీసుకున్నాడు. బాబా అనుచిత ప్రవర్తన గమనించిన ఫాతిమా.. అత్త, మామలకు విషయం చెప్పింది. దీన్ని పట్టించుకోని అత్త.. తానూ అలా బాబా వద్ద మందులు తీసుకోవడం వల్లే నీ భర్త పుట్టాడంటూ చెప్పింది. మొరపెట్టుకున్నా పట్టించుకోని భర్త... ఈ క్రమంలో అక్టోబర్‌లో ఫాతిమా అబుదాబీలో ఉన్న భర్త వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పింది. మగబిడ్డ పుట్టాలంటే బాబా చెప్పినట్టు నడుచుకోవాల్సిందేనని మన్సూర్ కూడా తెగేసి చెప్పి, ఈ ఏడాది జనవరిలో ఫాతిమాను తిరిగి పంపించాడు. తిరిగొచ్చిన కోడలిని అత్త, మామలు తరచూ బాబా వద్దకు తీసుకెళ్లారు. విసుగెత్తిన ఫాతిమా తాను బాబా వద్దకు రానని మొండికేయడంతో ఆమెను గోడకేసి కొట్టి హింసించారు. ఈ ఏడాది మేలో ఫాతిమా ఆడపిల్లకు జన్మనిచ్చింది. రూ.10 లక్షలు తెమ్మని వేధింపులు... ఆడబిడ్డ జన్మించడంతో ఆగ్రహించిన అత్త, మామలు... బాబా వద్ద మందులు తీసుకోనందుకే ఇలా జరిగిందని ఫాతిమాను హింసించారు. ఇందుకు శిక్షగా పుట్టింటి నుంచి రూ.10 లక్షలు తీసుకురావాలని అత్త, మామలతో పాటు ఆడపడచులూ డిమాండ్ చేశారు. తాను ఇచ్చుకోలేనని తండ్రి ముజఫర్ చెప్పడంతో ఫాతిమాకు ‘తలాక్–ఇ–బయీన్’ పేరుతో విడాకుల నోటీసులు పంపించారు. దీంతో బాధితురాలు చార్మినార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్త, మామ, నకిలీ బాబాను అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. త్వరలోనే ఫాతిమా భర్తను అరెస్ట్ చేస్తామని డీసీపీ తెలిపారు. పాతబస్తీలో 20 మంది వరకు నకిలీ బాబాలు ఉన్నారని.. వారిలో ఆరుగురిపై రౌడీషీట్లు తెరిచామని డీసీపీ తెలిపారు. -
‘అమ్మ’మ్మా..
- మగ సంతానం కోసం పదో కాన్పు వరకు వేచిచూసిన దంపతులు - ఎట్టకేలకు ఫలించిన నిరీక్షణ - పదకొండు మంది సంతానంలో బతికున్నది ఐదుగురే.. చందంపేట: ఒకటికాదు..రెండు కాదు.. వరుసగా పది కాన్పులు. పదకొండు మంది సంతానం. పదిహేనేళ్ల క్రితం వివాహమైన ఆ మహిళ 180 నెలల్లో ఏకంగా 90 నెలలు బిడ్డలను మోస్తూనే ఉంది.. ఆడశిశువులు పుట్టడం.. వారిని సాకలేకమని శిశుగృహాల పాలు చేస్తూనే.. మగ బిడ్డ కోసం మళ్లీ మళ్లీ ప్రయత్నించింది. చివరకు పదో కాన్పులో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి.. మగ సంతానం కావాలనే కాంక్షను తీర్చుకుంది. నల్లగొండ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో మగ సంతానం పట్ల గిరిజనులకున్న మోజుకు ఈ ఘటన అద్దం పడుతోంది. చందంపేట మండలం తెల్దేవర్పల్లి గ్రామపంచాయతీ మోత్యతండాకు చెందిన నూన్సావత్ బద్యా, లక్ష్మీ దంపతులకు పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. అయితే మొదటి కాన్పు నుంచి తొమ్మిదో కాన్పు వరకు లక్ష్మీ ఆడ పిల్లలనే జన్మనిచ్చింది. అయితే మగ పిల్లాడు కావాలనే కొరికతో పదో కాన్పు వరకూ ఆ దంపతులు వేచి చూశారు. తాజాగా లక్ష్మి ఈ నెల 22న పదవ కాన్పులో ఆడ, మగ శిశువులకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే సదరు దంపతులు గతంలో రెండు కాన్పుల్లో జన్మించిన ఆడ శిశువులను సాకలేమని దేవరకొండ, నల్లగొండ ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. పుట్టిన పదకొండు మందిలో ప్రస్తుతం ఐదుగురు పిల్లలు మాత్రమే బతికుండగా మిగతా పిల్లలు అనారోగ్య కారణాలతో చనిపోయారని వారి బంధువులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు పదవ కాన్పులో పుట్టిన ఆడ శిశువును అయినా సాకుతారా లేదా అనేది వేచిచూడాలి. -
ముళ్ల కంపల్లో పసికందు
అప్పుడే పుట్టిన మగ శిశువును నిర్దాక్షిణ్యంగా ముళ్లపొదల్లో పడేసి వెళ్లారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్టూరు మండలం తాటివారిపాలెంలో జరిగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో శనివారం అర్ధరాత్రి శిశువు ఏడుపు వినిపించడంతో కాలనీకి చెందిన తొట్టెంపూడి ముక్కోటి, మంగమ్మ దంపతులు ఇంటి పరిసరాల్లో గాలించగా ముళ్లపొదల్లో పసివాడు కనిపించాడు. శిశువును ఆదివారం ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం చిలకలూరిపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. తమకు 25 సంవత్సరాలుగా సంతానం లేదని, ఈ బిడ్డ తమకు దేవుడిచ్చిన వరమని తామే పెంచుకుంటామని ఆ దంపతులు తెలిపారు. -
మగబిడ్డ ఖరీదు రూ.60వేలు
కన్నకొడుకును విక్రయించిన తండ్రి గజపతినగరం, న్యూస్‌లైన్: వ్యసనాలకు బానిసై న ఓ తండ్రి తన పొట్ట నింపుకోవడం కోసం కన్నకొడుకునే రూ.60 వేలకు విక్రయించాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని వాత్సర్ల కామేష్, అరుణలకు నెలన్నర కిందట కొడుకు పుట్టాడు. వీరికి అంతకు ముందే ఇద్దరు కొడుకులు, ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల నెపంతో ఏడాది కిందట ఒక కొడుకును స్థానికంగానే రూ.20 వేలకు అమ్మినట్లు సమాచారం. ఇటీవల పుట్టిన కొడుకును కూడా రూ.60 వేలకు విక్రయించాడు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు కామేష్‌ను నిలదీయగా, తన కొడుకును తాను అమ్ముకుంటానని తెగేసి చెప్పడంతో వారు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో అధికారులు బాబును స్వాధీనం చేసుకుని విజయనగరంలోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ వ్యవహారంలో పాత్ర వున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.