మార్గమధ్యంలోనే మహిళకు కాన్పు
ఆస్పత్రికి తరలించేలోపే బిడ్డ మృతి
చింతూరు: సకాలంలో వైద్యం అందకపోవడంతో అప్పుడే పుట్టిన మగబిడ్డ మృత్యువాత పడిన విషాద ఘటన చింతూరు మండలం కలిగుండంలో శుక్రవారం చోటు చేసుకుంది. కలిగుండం గ్రామానికి చెందిన కుంజా జయమ్మ స్థానిక మినీ అంగన్‌వాడీ కేంద్రంలో వర్కర్‌గా పనిచేస్తున్నది. గర్భిణీ అయిన జయమ్మకు ఇటీవల పరీక్షలు నిర్వహించగా వచ్చేనెల 18న కాన్పు అయ్యే అవకాశముందని వైద్యులు చెప్పినట్లు ఆమె భర్త సీతారాం తెలిపాడు.
అయితే శుక్రవారం తెల్లవారుజామున జయమ్మకు అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు భర్త సీతారాం సిద్ధమయ్యాడు. తమ గ్రామం నుంచి వాహన సౌకర్యం లేకపోవడంతో ఆమెను రెండు కిలోమీటర్ల దూరంలోని పేగకు కాలినడకన తీసుకెళ్లేందుకు గ్రామస్తుల సాయం కోరాడు. మార్గమధ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న చంద్రవంక వాగును ప్రాణాలకు తెగించి దాటించి పేగకు చేరుకున్నారు.
అప్పటికే పురిటి నొప్పులతో అల్లాడిన జయమ్మకు వ్యయప్రయాసతో గుండెల్లోతు నీళ్లలో వాగు దాటడంతోపాటు, రెండు కిలోమీటర్లు కాలినడకన రావడంతో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆమెకు తోడుగా వచ్చిన ఆశా కార్యకర్త వెంటనే పేగలోనే ఓ ఇంటిలో కాన్పు చేయడంతో జయమ్మ మగబిడ్డకు జన్మనిచ్చి0ది.
బిడ్డను కాపాడుకునేందుకు..
పుట్టిన బిడ్డకు అస్వస్థతగా ఉండడంతో ఆ బిడ్డను కాపాడుకునేందుకు పేగ నుంచి ఆటోలో ఏడు కిలోమీటర్ల దూరంలోని ఏడుగురాళ్లపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని, చింతూరు ఏరియా ఆస్పత్రిలోని చిన్నపిల్లల వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని సూచించారు.
అంబులెన్సులో చింతూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి మార్గమధ్యంలోనే బిడ్డ మృతి చెందిందని చెప్పారు. దీంతో బిడ్డను కోల్పోయిన దంపతులు గుండెలవిసేలా రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment