చెట్టు కూలి ఒకరి దుర్మరణం
ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు..
రాజమహేంద్రిలో కుండపోత
వేమగిరిలో అత్యధికంగా 12.4 సెం.మీ. వర్షపాతం
మరో మూడు రోజులు వానలే
సాక్షి, విశాఖపట్నం/నెట్‌వర్క్: ద్రోణి ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. తీవ్రమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. అనేక చోట్ల పిడుగులు పడగా.. ఏడుగురు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలుచోట్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
రాజమహేంద్రవరంలో కుండపోత వర్షానికి వీధులు జలమయమయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో 12.4 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. మండపేట (కోనసీమ)లో 12, రాజమహేంద్రవరం 9.2, నూజివీడు (ఏలూరు) 7.3, మచిలీపట్నం (కృష్ణా) 7.3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 45 చోట్ల 2 నుంచి 6 సెం.మీ. వర్షపాతం రికార్డయింది. ఏలూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం సుమారు గంటసేపు ఈదురుగాలులు, ఉరుములతోపాటు మోస్తరు వర్షం కురిసింది. నందిగామ పాత బస్టాండ్ ప్రాంతంలో జాతీయ రహదారిపై దాదాపు అడుగుమేర నీరు నిలిచింది.
పిడుగుపాటుకు గురై.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన కవల నాగేశ్వరరావు (55), ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో పర్సా రామారావు (44), ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం ఎర్రకాలువ ప్రాంతంలో కరిపోతుల నాగేశ్వరరావు (72), పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరులో మొక్కజొన్న కోతలకు వెళ్లిన తల్లీకూతుళ్లు బొందెల నాగేంద్రమ్మ (53), నాగరాణి(33), పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కుందురువారిపాలెంకు చెందిన ఆవుల కోటేశ్వరరావు (42), అతని మేనల్లుడు జమ్ముల గోపి(35) మరణించారు. పశ్చిమ గోదావరిజిల్లా శృంగవృక్షంలోని వట్టూరి వారి వీధిలో మంగళవారం వీచిన ఈదురుగాలులకు కొబ్బరి చెట్టు కూలి నిమ్మల శ్రీనివాస్ (49) అనే వ్యవసాయ కూలీ మృత్యువాతపడ్డాడు.
తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాధారణం కంటే 2–5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. లద్దగిరి (కర్నూలు)లో 43.3, ఎండ్రపల్లి (ప్రకాశం) 43.2, మద్దూరు (వైఎస్సార్), మంగ నెల్లూరు (తిరుపతి)లో 42.9 చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరో మూడు రోజులు వానలే..
అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో అల్లాడుతున్న రాష్ట్రానికి మంగళవారం ఉపశమనం లభించింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బుధవారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, పల్నాడు, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని తెలిపింది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో జల్లులకు ఆస్కారం ఉందని వివరించింది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment