jayamma
-
ఆస్పత్రి దూరమై.. రహదారి నరకమై..
చింతూరు: సకాలంలో వైద్యం అందకపోవడంతో అప్పుడే పుట్టిన మగబిడ్డ మృత్యువాత పడిన విషాద ఘటన చింతూరు మండలం కలిగుండంలో శుక్రవారం చోటు చేసుకుంది. కలిగుండం గ్రామానికి చెందిన కుంజా జయమ్మ స్థానిక మినీ అంగన్వాడీ కేంద్రంలో వర్కర్‌గా పనిచేస్తున్నది. గర్భిణీ అయిన జయమ్మకు ఇటీవల పరీక్షలు నిర్వహించగా వచ్చేనెల 18న కాన్పు అయ్యే అవకాశముందని వైద్యులు చెప్పినట్లు ఆమె భర్త సీతారాం తెలిపాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున జయమ్మకు అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు భర్త సీతారాం సిద్ధమయ్యాడు. తమ గ్రామం నుంచి వాహన సౌకర్యం లేకపోవడంతో ఆమెను రెండు కిలోమీటర్ల దూరంలోని పేగకు కాలినడకన తీసుకెళ్లేందుకు గ్రామస్తుల సాయం కోరాడు. మార్గమధ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న చంద్రవంక వాగును ప్రాణాలకు తెగించి దాటించి పేగకు చేరుకున్నారు. అప్పటికే పురిటి నొప్పులతో అల్లాడిన జయమ్మకు వ్యయప్రయాసతో గుండెల్లోతు నీళ్లలో వాగు దాటడంతోపాటు, రెండు కిలోమీటర్లు కాలినడకన రావడంతో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆమెకు తోడుగా వచ్చిన ఆశా కార్యకర్త వెంటనే పేగలోనే ఓ ఇంటిలో కాన్పు చేయడంతో జయమ్మ మగబిడ్డకు జన్మనిచ్చి0ది. బిడ్డను కాపాడుకునేందుకు.. పుట్టిన బిడ్డకు అస్వస్థతగా ఉండడంతో ఆ బిడ్డను కాపాడుకునేందుకు పేగ నుంచి ఆటోలో ఏడు కిలోమీటర్ల దూరంలోని ఏడుగురాళ్లపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని, చింతూరు ఏరియా ఆస్పత్రిలోని చిన్నపిల్లల వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్సులో చింతూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి మార్గమధ్యంలోనే బిడ్డ మృతి చెందిందని చెప్పారు. దీంతో బిడ్డను కోల్పోయిన దంపతులు గుండెలవిసేలా రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. -
జయమ్మ విజయం.. కట్టె గానుగ ద్వారా తీసిన నూనె విదేశాలకు..
‘‘ఒక చోటే ఉంటున్నాం. చేసిన పనే చేస్తున్నాం. ఎదుగూ బొదుగు లేకుండా.. గానుగెద్దు జీవితంలా గడిపేస్తున్నాం..’’ అని చాలా మందిలో ఒక అసంతృప్తి ఉంటుంది. ఆరుపదుల వయసు దాటిన జయమ్మ జీవితంకూడా గతంలో ఇదే విధంగా ఉండేది. కానీ, గానుగ చక్రం పట్టుకొని ఆరుపదుల వయసులో విజయం వైపుగా అడుగులు వేస్తోంది జయమ్మ. చదువు లేకపోయినా, వయసు కుదరకపోయినా నవతరానికీ స్ఫూర్తిగా నిలుస్తున్న కోట్ల జయమ్మ స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా, గండీడ్ మండలం, జక్లపల్లి గ్రామం. గానుగ నూనె వ్యాపారాన్ని అంచెలంచెలుగా వృద్ధి చేస్తూ తనతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తుంది. ఆరోగ్యదాయిని పేరుతో ప్రాచీనకాలం గానుగ నూనె ప్రాచుర్యాన్ని ఎల్లలు దాటేలా చేస్తోంది. జయమ్మది వ్యసాయ కుటుంబం. భర్త పిల్లలతో కలిసి పొలం పనులు చేసుకోవడంతో పాటు పాల ఉత్పత్తిని కొనసాగించేది. జయమ్మ నాలుగేళ్ల క్రితం రొమ్ము క్యాన్సర్‌బారిన పడింది. జబ్బు నుండి కోలుకునే క్రమంలో తనకు కలిగిన ఆలోచనను అమలులో పెట్టిన విధానం గురించి జయమ్మ ఇలా చెబుతుంది.. ‘‘పట్నంలో క్యాన్సర్‌కి చికిత్స చేయించుకున్నాను. డాక్టర్లు పదిసార్లు్ల కీమోథెరఫీ చేయాలన్నారు. ఈ సమయంలో ఓ డాక్టర్ గానుగ నూనె వాడమని, ఆహారంలో మార్పులు కూడా చేసుకోమని చెప్పాడు. దీంతో మహబూబ్‌నగర్‌లో కరెంట్ గానుగ నుండి వంట నూనెలు తెచ్చి వాడుకునేవాళ్లం. అప్పుడే వచ్చింది ఆలోచన మేమే గానుగను ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని. కరెంట్‌తో నడిచేది కాకుండా ఎద్దులతో తిరిగే కట్టె గానుగ గురించి వెతికాం. మైసూరులో ఉందని తెలిసి, అక్కడికెళ్లి చూశాం. అలా మూడేళ్ల క్రితం ఎద్దుల కట్టె గానుగను ఏర్పాటు చేసి, నూనె తీయడం ప్రారంభించాం. పల్లి, కొబ్బర, ఆవిసె, కుసుమ, నువ్వులతో నూనె తీయడం ప్రారంభించాం. ఏడాది పాటు శిక్షణ... గానుగ ఏర్పాటు చేసిన తర్వాత పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం వాళ్లు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో, నేను చేస్తున్న పని వివరించాను. ఎలాగైనా అందరికీ మంచి గానుగ నూనె అందించాలి అని చెప్పాను. ఏడాది పాటు నెలకు కొన్ని రోజుల చొప్పున మార్కెటింగ్ గురించి కూడా శిక్షణ ఇచ్చారు. అప్పటి వరకు మా చుట్టుపక్కల వారికే గానుగ నూనె అమ్మేదాన్ని. శిక్షణ తర్వాత మరో ఐదు గానుగలను ఏర్పాటు చేశాను. 15 లక్షల రూపాయల పెట్టుబడితో షెడ్డు నిర్మించి కట్టెగానుగలను ఏర్పాటు చేసి నూనె ఉత్పత్తి పెంచాను. ఇతర రాష్ట్రాల నుంచి... వివిధ రకాల నూనెలను గానుగ ద్వారా తీసేందుకు అవసరమైన ముడి సరుకులకు ఒరిస్సా, కర్ణాటక నుంచి కూడా తెప్పిస్తాను. ప్రతి నెల ఆరు టన్నుల పల్లీలు, రెండు టన్నుల కొబ్బరి, మూడు టన్నుల కుసుమ, రెండు టన్నుల నువ్వులు తీసుకుంటున్నాను. వీటిలో గడ్డి నువ్వులు ఒరిస్సా నుండి, కుసుమ, కొబ్బరి కర్ణాటక నుండి, పల్లీలు, నువ్వులు మహబూబ్‌నగర్ నుండి దిగుమతి చేసుకుని నూనె తీస్తున్నాను’ అని వివరించింది జయమ్మ. కార్యక్రమాల ఏర్పాటు... గానుగలను ఏర్పాటు చేసిన తర్వాత 4 సార్లు 170 మందికి గానుగ నూనె తయారీపై శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది జయమ్మ. వారందరికీ వసతి, భోజన సదుపాయాలను కల్పించింది. ఆరోగ్యదాయిని పేరుతో వివిధ జిల్లాల్లో కొత్తగా ఎనిమిది గానుగలను ఏర్పాటు చేసేందుకు సహకరించింది. దీంతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడ ఆరోగ్యదాయిని పేరుతో చేపడుతోంది. పాఠశాలకు వాటర్ ఫిల్టర్, పుస్తకాలు, కరెంటు సౌకర్యం కల్పించడం వంటివి కూడ చేపడుతూ జయమ్మ ఆదర్శంగా నిలుస్తుంది. ‘మరో నాలుగు గానుగలు ఏర్పాటు చేసి అమెరికాకు కూడా ఇక్కడి నూనెలు ఎగుమతి చేస్తా. కల్తీ నూనెలకు అడ్డుకట్ట వేసి స్వచ్చమైన నూనెను అందిచడమే లక్ష్యం’ అంటూ గానుగల నిర్వహణ చూడటంలో మునిగిపోయింది జయమ్మ. విదేశాలకు ఎగుమతి ‘ఇప్పుడు మా ఊరు జక్లపల్లి నుండి కట్టె గానుగ ద్వారా తీసిన నూనె విదేశాలకు కూడా ఎగమతి అవుతుంది. హైద్రాబాద్‌లోని ఓ సంస్థ సహకారంతో దుబాయ్, సింగపూర్, మలేషియాలకూ పంపుతున్నాం. మూడు నెలలకొకసారి దాదాపు 4 వేల లీటర్ల నూనెను ఎగుమతి చేస్తున్నాం. గానుగ తీసిన పిప్పిని పశువుల దాణాగా వాడుతున్నాం. పశువుల దాణాకు ఇక్కడ మంచి గిరాకీ ఉంది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు కొరియర్ ద్వారా స్వచ్ఛమైన కల్తీలేని నూనెను పంపుతున్నాం. మా కుటుంబ సభ్యులతో పాటు మరో 15 మంది ఈ నూనె వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నారు’ అని వివరించింది జయమ్మ. చేతి నిండా పని గానుగ ఏర్పాటైనప్పటి నుండి ఇక్కడ పనిచేస్తున్నా. అంతకు ముందు వ్యవసాయ పనులకు వెళ్లేదాన్ని. కొన్నాళ్లు పని ఉండేది. కొన్నాళ్లు ఖాళీగా ఉండేదాన్ని. ఈ గానుగలు వచ్చాక చేతి నిండా పని దొరుకుతుంది. పని కోసం వెదుకులాడే అవసరం లేకుండా పోయింది. – లక్ష్మి, జక్లపల్లి – బోయిని గోపాల్, గండీడ్, మహబూబ్‌నగర్, సాక్షి -
వైఎస్ మాతృమూర్తి జయమ్మకు నివాళి
పులివెందుల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాతృమూర్తి వైఎస్ జయమ్మ జీవితం అందరికీ ఆదర్శమని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. వైఎస్ జయమ్మ 16వ వర్ధంతిని వైఎస్సార్ జిల్లా పులివెందులలో మంగళవారం నిర్వహించారు. లయోలా డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైఎస్ జయమ్మ, వైఎస్ రాజారెడ్డి ఘాట్లకు వెళ్లిన విజయమ్మ వారి సమాధుల వద్ద పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే ఉన్న జార్జిరెడ్డి, వివేకానందరెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఘాట్లతోపాటు ఇతర కుటుంబ సభ్యుల సమాధులను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు పాస్టర్లు ఆనంద్, నరేష్కుమార్, మృత్యుంజయులు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ సుధీకర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్, కమిషనర్ నరసింహారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జయమ్మ పార్కుకు చేరుకుని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ జయమ్మకు తమ కుటుంబంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. పులివెందుల ప్రాంతంలో ఎవరికి కష్టమొచ్చినా తన బిడ్డలకు కష్టం వచ్చినట్లుగా ఆమె భావించేవారన్నారు. వైఎస్సార్‌ను మాట తప్పని.. మడమ తిప్పని నేతగా తీర్చిదిద్దడంలో, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం వెనుక వైఎస్ జయమ్మ పాత్ర ఎంతో ఉందన్నారు. ఆమె జీవితాన్ని అంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. -
అందరికీ అమ్మ.. వైఎస్ జయమ్మ
పులివెందుల : అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు.. కానీ ఏమీ అడగకుండానే అందరికి అన్నీ పంచి ఇచ్చిన అమ్మ వైఎస్ జయమ్మ. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాతృమూర్తి వైఎస్ జయమ్మ. ఆమె జీవించి ఉన్నంతకాలం పులివెందులకు సంబంధించిన ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అనునిత్యం దాన, ధర్మాలలో మునిగిపోయేవారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కావాలన్న చిరకాల వాంఛ నెరవేరిన తర్వాత 2006 జనవరి 25వ తేదీన ఆమె తుదిశ్వాస వదిలారు. అంతకుమునుపు 2003లో వైఎస్ఆర్ ప్రజల కష్టసుఖాలను తెలుసుకొనేందుకు పాదయాత్ర చేసిన సందర్భంలో తల్లిగా వైఎస్ జయమ్మ కుమిలిపోతూనే.. బిడ్డకు మంచి జరగాలని ప్రతిరోజు ప్రారి్థంచేవారు. అంతేకాదు 1999 ప్రాంతంలో విపరీతమైన కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు ఐదారు వందల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని కలి్పంచి ప్రశంసలు అందుకున్నారు. 1995నుంచి 2000 వరకు పులివెందుల సర్పంచ్‌గా పనిచేసిన వైఎస్ జయమ్మ అప్పటి ప్రభుత్వం నుంచి ఉత్తమ సర్పంచ్ అవార్డుతోపాటు పంచాయతీని ఆదర్శంగా నిలిపి ఉత్తమ పంచాయతీ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. వైఎస్ జయమ్మ జీవించినంత కాలం ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తూ పులివెందుల అమ్మగా గుర్తింపు పొందారు. ఆమె మరణించి నేటికి సరిగ్గా 15ఏళ్లు అవుతోంది. నేడు వైఎస్ జయమ్మ వర్ధంతి దివంగత వైఎస్ రాజారెడ్డి సతీమణి వైఎస్ జయమ్మ 15వ వర్ధంతిని సోమవారం పులివెందులలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. వైఎస్ జయమ్మ సమాధి వద్ద ప్రార్థనలతోపాటు జయమ్మ పార్క్‌లోని విగ్రహం వద్ద పలువురు వైఎస్ కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తల్లి, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళులరి్పంచనున్నారు. వైఎస్ కుటుంబ సభ్యులతోపాటు పలువురు వైఎస్ఆర్ అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. -
అందరికీ అమ్మ.. జయమ్మ
వైఎస్ఆర్ జిల్లా, పులివెందుల : అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు.. కానీ అడగకుండానే అందరికి అన్నీ పెట్టిన అమ్మ వైఎస్ జయమ్మ. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాతృమూర్తి ఆమె. పులివెందుల ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ దాతృత్వం ప్రదర్శించేవారు. తన బిడ్డ రాజశేఖరరెడ్డి సీఎం కావాలన్న చిరకాల వాంఛ నెరవేరిన తర్వాత 2006 జనవరి 25వ తేదీన జయమ్మ కన్నుమూశారు. 2003లో వైఎస్ఆర్ ప్రజల కష్టసుఖాలను తెలుసుకొనేందుకు పాదయాత్ర చేసిన సందర్భంలో తల్లిగా తల్లడిల్లిపోతూనే బిడ్డకు మంచి జరగాలని కోరుకునేవారు.1999లో కరువు కరాళ నృత్యం చేస్తున్న సమయంలో పది మందికీ పట్టెడు అన్నం పెట్టి జన్మ సార్థకత చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రోజూ ఐదారు వందల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించి మన్ననలందుకున్నారు. 1995నుంచి 2000వరకు పులివెందుల సర్పంచ్‌గా పనిచేశారు. అప్పటి ప్రభుత్వం నుంచి ఉత్తమ సర్పంచ్ అవార్డు పొందారు. పంచాయతీని ఆదర్శంగా నిలిపి ఉత్తమ పంచాయతీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇలా .. పులివెందుల అమ్మగా జయమ్మ గుర్తింపు పొందారు. నేడు వైఎస్ జయమ్మ వర్ధంతి దివంగత వైఎస్ రాజారెడ్డి సతీమణి వైఎస్ జయమ్మ 14వ వర్ధంతి శుక్రవారం పులివెందులలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు పాలు పంచుకోనున్నారు. వైఎస్ జయమ్మ సమాధి వద్ద ప్రార్థనలు చేయనున్నారు. జయమ్మ పార్క్‌లో ఆమె విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్ కుటుంబ సభ్యులతోపాటు పలువురు వైఎస్ఆర్ అభిమానులు కూడా పాల్గొంటారు. -
డెంగ్యూతో మహిళా న్యాయమూర్తి మృతి
సాక్షి, హైదరాబాద్ : డెంగ్యూ జ్వరంతో ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం జయమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆమె హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జయమ్మ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హైకోర్టు విభజనలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన ఆమె గత ఏడాది డిసెంబర్లో ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. -
భార్య జెడ్పీటీసీ.. కోడలు ఎంపీటీసీ
నవాబుపేట/మొయినాబాద్ రూరల్: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కుటుంబానికి అదృష్టం బాగానే కలిసి వచ్చింది. ఆయన భార్య, కుమారుడు జెడ్పీటీసీలుగా, కోడలు ఎంపీటీసీగా విజయం సాధించారు. నవాబుపేట మండలం చించల్‌పేట గ్రామానికి చెందిన యాదయ్య పేద కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. పీఏసీఎస్ డైరెక్టర్‌గా అడుగుపెట్టిన ఆయనకు అవకాశాలు కలిసి వచ్చాయి. సొసైటీ డైరెక్టర్ నుంచి సింగిల్ విండో చైర్మన్‌గా, అనంతరం ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్సార్ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్‌గా వ్యవహరించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి చేవెళ్ల నుంచి గెలుపొందారు. యాదయ్య ప్రాదేశిక ఎన్నికల బరిలో తన భార్య కాలె జయమ్మ నవాబుపేట జెడ్పీటీసీగా విజయం సాధించారు. మొయినాబాద్ జెడ్పీటీసీగా కొడుకు శ్రీకాంత్ గెలిచారు. ఆయన రెండో కోడలు దుర్గాభవాని నవాబుపేట మండలం చించల్‌పేట ఎంపీటీసీగా విజయాన్ని కైవసం చేసుకున్నారు. నవాబుపేట ఎంపీపీ బరిలో దుర్గాభవాని ఉందని విశ్వసనీయ సమాచారం. -
పులివెందులలో ఘనంగా వైఎస్ జయమ్మ వర్దంతి
-
కాకినాడ నడిబొడ్డున మహిళ హత్య
కాకినాడ రూరల్: కాకినాడ బ్యాంక్‌పేటలో ఓ మహిళ హత్యకు గురైంది. పేటలో నివాసం ఉంటున్న పెంకే విజయలక్ష్మి అలియాస్ జయమ్మ (54) గురువారం తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. ఈమెను ముందు పీక నొక్కి, అనంతరం ఇనుప రాడ్డుతో తల పగలగొట్టి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన జయమ్మకు భర్త చనిపోయి ఏడేళ్లయ్యింది. ఏడాదిన్నర క్రితం మండపేటకు చెందిన కట్టా వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో కొద్ది రోజుల పాటు సహజీవనం చేసిందని, అనంతరం ఏడాది క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే హత్యకు కారణాలు ఎవరికీ అంతుపట్టడం లేదని చెబుతున్నారు. జయమ్మ ఇంటికి, ఆమె ఇంటి చుట్టుపక్కల వాళ్లింటికి వెళ్లి రావడానికి కేవలం మూడు అడుగుల సందు మాత్రమే ఉంది. వెళ్లిన మార్గం గుండానే రాకపోకలు సాగించాలి. జయమ్మకు రెండు అంతస్తుల డాబా ఇల్లు ఉండగా ఓ పోర్షన్లో ఆమెతో పాటు ఆమె రెండో భర్త కట్టా వెంకటేశ్వర్లు ఉంటూ మిగిలిన పోర్షన్లు అద్దెకు ఇచ్చారు. ఈ ఇంటితో పాటు జయమ్మకు మండపేటలో రెండు డాబా ఇళ్లు, ఎకరంన్నర వ్యవసాయ భూమి ఉందని, వ్యవసాయ భూమిపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుందని పోలీసులు చెబుతున్నారు. పదేళ్లుగా జయమ్మ మండపేట నుంచి వచ్చి బ్యాంకుపేటలో ఉన్న ఇంట్లో కొద్ది రోజులు ఉండి వెళుతుంటుందని స్థానికులు చెబుతున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. ఏడాదిగా రెండో భర్త వెంకటేశ్వర్లుతో వచ్చి ఇక్కడ ఉంటోందంటున్నారు. నెల రోజుల క్రితం బ్యాంకుపేట వచ్చి తన ఇంట్లోనే రెండో భర్త వెంకటేశ్వర్లుతో ఉంది. ఈమెకు పిల్లలు లేకపోవడంతో అక్క కుమార్తెను పెంచి పెళ్లి చేసిందని, రెండో భర్తగా చేసుకున్న వెంకటేశ్వర్లుకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల ఉన్నారని పోలీసులు వివరించారు. జయమ్మ హత్య జరగడానికి కారణాలు ఏమిటనేది తెలియలేదు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి హత్య జరిగిన ప్రాంతాన్ని తనిఖీ చేశారు. జయమ్మ హత్య జరిగిన మంచం కింద కట్టా వెంకటేశ్వర్లు స్వల్ప గాయాలతో ఉండడం గమనించిన పోలీసులు, స్థానికులు అతడిని వైద్య నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. వెంకటేశ్వర్లుకు తగిలిన గాయం పెద్దదేమీ కాదని, అయితే ఇతడిని హత్య ఎలా జరిగిందని పోలీసులు ప్రశ్నిస్తే ఎవరో వచ్చి తమపై దాడి చేశారని, ఎవరనేది తాను చెప్పలేనని, మండపేటలో ఓ షావుకారుకి, జయమ్మకు ఆస్తి గొడవలు ఉన్నాయని, వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులకు వివరించినట్టు సమాచారం. బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈ హత్య చేశారా? లేక జయమ్మ ఆస్తులు ఎవరికైనా వెళ్లిపోతాయని ఆమెతో ఉంటున్న వ్యక్తులే ఈ హత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య గురువారం తెల్లవారుజామున జరిగి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని క్రైమ్ డీఎస్పీ పల్లపురాజు, డీఎస్పీ రవివర్మ, త్రీటౌన్ సీఐ దుర్గారావు సందర్శించి సంఘటనకు దారి తీసిన పరిస్థితులను పరిశీలించారు. జయమ్మ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ దుర్గారావు తెలిపారు. శవపం^నామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. -
జయమ్మకు నారీ శక్తి పురస్కారం ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ : నారీ శక్తి పురస్కారాన్ని 2017 సంవత్సరానికిగానూ తెలంగాణ నుంచి జయమ్మ అందుకున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మహిళలను గుర్తించి కేంద్రం నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్ఐవీ నియంత్రణకు, సెక్స్ వర్కర్ల కుటుంబాల పరిరక్షణకు చేస్తున్న ఉద్యమాలకు గుర్తింపుగా తెలగాణకు చెందిన జయమ్మను నారీ శక్తి పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది. గురువారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. అమాయక మహిళలను పడుపు వృత్తిలోకి నెట్టుతున్న శక్తులను అడ్డుకోవాలని, హెచ్ఐవీ నియంత్రణపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
బైక్‌పైనుంచి జారిపడి మహిళ మృతి
ఉరవకొండ రూరల్ : బైక్‌పై నుంచి జారిపడిన మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. బంధువులు, పోలీసులు తెలిపిన మేరకు... వై.రాంపురం గ్రామానికి చెందిన మల్లప్ప భార్య జయమ్మ (45) తన కొడుకు అనిల్‌తో కలిసి ద్విచక్రవాహనంపై శనివారం వై.రాంపురం నుంచి విరుపాపల్లికు బయల్దేరింది. మార్గం మధ్యలో దిచక్రవాహనం మీద నుండి కిందకు పడి తీవ్ర గాయాలపాలైంది. ఈమెను హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
దొంగనోట్ల చెలామణి: నటి అరెస్టు
బనశంకరి: నకిలీనోట్ల చెలామణికి పాల్పడుతున్న శాండిల్‌వుడ్ ఆర్టిస్ట్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన గురువారం కర్ణాటకలోని డాబస్‌పేటే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు...కన్నడ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన జయమ్మ గురువారం డాబస్‌పేటే వద్ద రూ. 2 వేల నకిలీనోట్లు చెలామణి చేస్తుండగా అనుమానం వచ్చిన ఓ షాపు యజమాని ఆమెను ప్రశ్నించాడు. దీంతో జయమ్మ అక్కడ నుంచి ఉడాయించడానికి ప్రయత్నించింది. తక్షణం స్దానికులు జయమ్మ ను వెంబడించి పట్టుకోగా ఆమె వద్ద భారీగా నోట్లు లభించాయి. దీనిపై వారు డాబస్‌పేటే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు జయమ్మతో పాటు ఆటోడ్రైవరు గోవిందరాజును అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నిర్మాతలు, కొందరు నటులు నకిలీనోట్లు చెలామణికి పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పోలీసులు జయమ్మ సెల్‌ఫోన్ ఆధారంగా కేసు విచారణ చేపడుతున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సమాచార శాఖ ఇన్చార్జ్ ఏడీ తిమ్మప్ప బదిలీ
అనంతపురం అర్బన్ : సమాచార, పౌర సంబంధాల శాఖ ఇన్చార్జ్ ఏడీ తిమ్మప్పకి ఏడీగా పదోన్నతి కల్పిస్తూ తిరుపతికి బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేసింది. తిమ్మప్ప స్థానంలో డీపీఆర్ఓ జయమ్మకి ఏడీ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. -
నీ వెంటే నేను..!
రెండు ప్రాణాలను బలికొన్న అనుమానం – భార్య మృతితో భర్త మనస్తాపం – రైలు కింద పడి ఆత్మహత్య అనంతపురం న్యూసిటీ/ కంబదూరు : అనుమానం రెండు ప్రాణాలను బలిగొంది. మనస్పర్థలతో భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమించి భార్య చనిపోగా.. మనస్తాపంతో భర్త రైలుకిందపడి ప్రాణం తీసుకున్నాడు. వివరాల్లోకెళితే... కంబదూరు మండలం నూతిమడుగు గ్రామానికి చెందిన హనుమంతరాయుడు (30) రెండేళ్ల క్రితం కర్ణాటకలోని హులికట్టకు చెందిన జయమ్మ (28)ను రెండో వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు వీరి సంసారం సాఫీగా సాగింది. ఆ తర్వాత నుంచి భార్య ప్రవర్తనపై భర్త అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఇదే విషయంపై గొడవపడేవారు. ఈ నెల రెండో తేదీన భార్యాభర్తలు మరోసారి గొడవపడి మనస్తాపంతో ఇద్దరూ కలిసి పురుగుమందు తాగారు. బంధువులు గమనించి వారిని కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. హనుమంతరాయుడు కోలుకున్నాడు. చికిత్స పొందుతున్న జయమ్మ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. భార్య మృతి చెందిందన్న సమాచారం తెలుసుకున్న హనుమంతరాయుడు అనంతపురంలోని రామ్‌నగర్ రైల్వే ట్రాక్ వద్ద రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వచ్చి బోరున విలపించారు. హనుమంతరాయుడు తన మొదటి భార్యను అనుమానంతోనే విడిచిపెట్టినట్లు తెలిసింది. భార్యాభర్తల మృతితో నూతిమడుగులో విషాదం అలుముకుంది. ఎస్ఐ నరసింహుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉసురు తీసిన కట్నం వేధింపులు
పుట్టపర్తి అర్బన్ : అదనపు కట్నం జ్వాలలకు వివాహిత బలైంది. పుట్టింటికి పంపించేసి.. డబ్బు తీసుకురాకపోతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవచ్చని బెదిరించడమే కాకుండా ఆమెపై లేనిపోని అభాండాలు వేశారు. ఈ అవమాన భారాన్ని భరించలేక ఆమె పుట్టింట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువుకు చెందిన రైతు బత్తల రామచంద్ర, నారాయణమ్మ దంపతుల చిన్న కుమార్తె జయమ్మ (32)కు కదిరి పట్టణంలోని కుటాగుళ్లలోని సత్యనారాయణ, శివమ్మ దంపతుల కుమారుడు రమేష్‌తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో వధువు తల్లిదండ్రులు రూ.25 వేల నగదు, ఐదు తులాల బంగారు కట్నం కింద ఇచ్చారు. ఏడాది తర్వాత రమేష్ తిరుపతికి మకాం మార్చాడు. అక్కడే చీరల షాపులో పనిచేస్తూ భార్యనుప పోషించుకునేవాడు. డబ్బు అవసరమైనపుడల్లా భార్య ద్వారా ఆమె పుట్టింటి నుంచి తెచ్చుకునేవాడు. ఈ క్రమంలో సొంతంగా బట్టలషాపు పెట్టుకునేందుకు అదనంగా డబ్బు తీసుకురావాలని తల్లి శివమ్మ, తమ్ముడు సాయితో కలసి వేజయమ్మను వేధించడం మొదలు పెట్టాడు. డబ్బు తీసుకురాలేదన్న కారణంతో ఆరు నెలల కిందట ఆమెను పుట్టింటికి పంపించేశాడు. అప్పటి నుంచి కుట్టుమిషన్ కుడుతూ తల్లిదండ్రుల వద్దే ఉండిపోయింది. గత ఆదివారం మరిది సాయి మొహర్రం వేడుకలకు వచ్చి.. ఒదినపై లేనిపోని అభాడాలు వేసి.. డబ్బు తీసుకురాకపోతే తమ ఇంటికి రావద్దని చెప్పి వెళ్లిపోయాడు. ఇవన్నీ అవమానంగా భావించిన జయమ్మ సోమవారం రాత్రి 11 గంటలకు ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రూరల్ ఎస్ఐ రాఘవరెడ్డి సిబ్బందితో గ్రామానికి చేరుకొని మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భర్త రమేష్, అత్త శివమ్మ, మరిది సాయిలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
గోపవరం: మండలంలోని రాచాయపేట పంచాయతీ చెన్నవరం గ్రామానికి చెందిన చింతంరెడ్డి జయమ్మ (50) గురువారం రాత్రి విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మల్లుబలరామిరెడ్డి అనే రైతు ఊరి సమీపంలో ఉన్న పొలంలో వరి పంటను సాగు చేశాడు. ఆ పంటలోకి కోతులు వస్తున్నాయని, వాటికి అడ్డుకట్ట వేసేందుకు పొలం చుట్టూ విద్యుత్తు తీగలను ఏర్పాటు చేశారు. పగలు కూడా కరెంటు తీగలను అలాగే ఉంచారు. ఈ విషయం తెలియని జయమ్మ గడ్డి కోసుకునేందుకు పొలంలోకి వెళ్లింది. కరెంటు తీగలు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. జయమ్మ ఇంటిలో ఆమె ఒక్కరే నివసిస్తున్నారు. ఇంటికి వచ్చిందా రాలేదా అని చూసే వారు లేరు. తాళం వేసి ఉండటంతో బద్వేలుకు వెళ్లి ఉండవచ్చేమో అని చుట్టు పక్కల ఉన్న వారు అనుకున్నారు. రాత్రి 10 గంటలు అవుతున్నా రాకపోవడంతో స్థానికులు పక్కనే ఉన్న పొలం వద్దకు వెళ్లి చూశారు. అప్పటికే జయమ్మ మృతి చెంది ఉండటాన్ని గమనించారు. కాగా జయమ్మకు భర్తతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది. భర్త బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. జయమ్మ మృతి చెందిన విషయాన్ని స్థానికులు కువైట్‌లో ఉన్న ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన పొలం ప్రాథమిక పాఠశాల పక్కనే ఉండటం గమనార్హం. మృతురాలి బంధువులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఐ నరసింహారెడ్డి తెలిపారు. -
చెరువులో మునిగి యువకుని మృతి
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం టెంకవరం గ్రామానికి చెందిన పెంచలయ్య(26) అనే యువకుడు ఆదివారం మధ్యాహ్నం చెరువులో మునిగి మృతిచెందాడు. టెంకవరం గ్రామానికి చెందిన కొండయ్య, జయమ్మ దంపతులకు పెంచలయ్య ఒక్కడే సంతానం. అతను చెన్నైలో తాపీ పని చేసేవాడు. సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం ఎనుములను తోలుకుని వెళ్లాడు. చెరువులో వాటితో పాటు ఈతకొడుతుండగా నీటిలో కంపచెట్టు ఉన్న విషయం తెలియక మునక వేశాడు. కంప చెట్టులో ఇరుక్కుపోయి మృతిచెందాడు. గమనించిన స్థానికులు మృతదేహాన్ని వెలికి తీశారు. ఒక్కగోనొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.