నీ వెంటే నేను..!
రెండు ప్రాణాలను బలికొన్న అనుమానం
– భార్య మృతితో భర్త మనస్తాపం
– రైలు కింద పడి ఆత్మహత్య
అనంతపురం న్యూసిటీ/ కంబదూరు : అనుమానం రెండు ప్రాణాలను బలిగొంది. మనస్పర్థలతో భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమించి భార్య చనిపోగా.. మనస్తాపంతో భర్త రైలుకిందపడి ప్రాణం తీసుకున్నాడు. వివరాల్లోకెళితే... కంబదూరు మండలం నూతిమడుగు గ్రామానికి చెందిన హనుమంతరాయుడు (30) రెండేళ్ల క్రితం కర్ణాటకలోని హులికట్టకు చెందిన జయమ్మ (28)ను రెండో వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు వీరి సంసారం సాఫీగా సాగింది. ఆ తర్వాత నుంచి భార్య ప్రవర్తనపై భర్త అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఇదే విషయంపై గొడవపడేవారు.
ఈ నెల రెండో తేదీన భార్యాభర్తలు మరోసారి గొడవపడి మనస్తాపంతో ఇద్దరూ కలిసి పురుగుమందు తాగారు. బంధువులు గమనించి వారిని కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. హనుమంతరాయుడు కోలుకున్నాడు. చికిత్స పొందుతున్న జయమ్మ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. భార్య మృతి చెందిందన్న సమాచారం తెలుసుకున్న హనుమంతరాయుడు అనంతపురంలోని రామ్‌నగర్ రైల్వే ట్రాక్ వద్ద రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వచ్చి బోరున విలపించారు. హనుమంతరాయుడు తన మొదటి భార్యను అనుమానంతోనే విడిచిపెట్టినట్లు తెలిసింది. భార్యాభర్తల మృతితో నూతిమడుగులో విషాదం అలుముకుంది. ఎస్‌ఐ నరసింహుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.