ఉసురు తీసిన కట్నం వేధింపులు
పుట్టపర్తి అర్బన్ : అదనపు కట్నం జ్వాలలకు వివాహిత బలైంది. పుట్టింటికి పంపించేసి.. డబ్బు తీసుకురాకపోతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవచ్చని బెదిరించడమే కాకుండా ఆమెపై లేనిపోని అభాండాలు వేశారు. ఈ అవమాన భారాన్ని భరించలేక ఆమె పుట్టింట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువుకు చెందిన రైతు బత్తల రామచంద్ర, నారాయణమ్మ దంపతుల చిన్న కుమార్తె జయమ్మ (32)కు కదిరి పట్టణంలోని కుటాగుళ్లలోని సత్యనారాయణ, శివమ్మ దంపతుల కుమారుడు రమేష్‌తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో వధువు తల్లిదండ్రులు రూ.25 వేల నగదు, ఐదు తులాల బంగారు కట్నం కింద ఇచ్చారు. ఏడాది తర్వాత రమేష్ తిరుపతికి మకాం మార్చాడు.
అక్కడే చీరల షాపులో పనిచేస్తూ భార్యనుప పోషించుకునేవాడు. డబ్బు అవసరమైనపుడల్లా భార్య ద్వారా ఆమె పుట్టింటి నుంచి తెచ్చుకునేవాడు. ఈ క్రమంలో సొంతంగా బట్టలషాపు పెట్టుకునేందుకు అదనంగా డబ్బు తీసుకురావాలని తల్లి శివమ్మ, తమ్ముడు సాయితో కలసి వేజయమ్మను వేధించడం మొదలు పెట్టాడు. డబ్బు తీసుకురాలేదన్న కారణంతో ఆరు నెలల కిందట ఆమెను పుట్టింటికి పంపించేశాడు. అప్పటి నుంచి కుట్టుమిషన్ కుడుతూ తల్లిదండ్రుల వద్దే ఉండిపోయింది. గత ఆదివారం మరిది సాయి మొహర్రం వేడుకలకు వచ్చి.. ఒదినపై లేనిపోని అభాడాలు వేసి.. డబ్బు తీసుకురాకపోతే తమ ఇంటికి రావద్దని చెప్పి వెళ్లిపోయాడు. ఇవన్నీ అవమానంగా భావించిన జయమ్మ సోమవారం రాత్రి 11 గంటలకు ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రూరల్ ఎస్‌ఐ రాఘవరెడ్డి సిబ్బందితో గ్రామానికి చేరుకొని మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భర్త రమేష్, అత్త శివమ్మ, మరిది సాయిలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.