వరకట్న వేధింపులు, భర్త, అత్త పెట్టే చిత్రహింసలు భరించలేక బెస్తరపల్లికి చెందిన చంద్రకళ (29) ఆదివారం ఉదయం పుట్టినింటిలో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
కుందుర్పి : వరకట్న వేధింపులు, భర్త, అత్త పెట్టే చిత్రహింసలు భరించలేక బెస్తరపల్లికి చెందిన చంద్రకళ (29) ఆదివారం ఉదయం పుట్టినింటిలో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... బెస్తరపల్లికి చెందిన వడ్డె నారాయణమూర్తి మూడో కూతురు చంద్రకళ (29)కు కర్ణాటక మాగడి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి లీలావలి కుమారుడు జగన్నాథ్‌తో గత ఏఫ్రెల్ 4న ఘనంగా పెళ్లి జరిపించారు.కట్నకానుకల కింద 4 తులాల బంగారం, రూ. 25 వేల నగదును కానుకగా ఇచ్చారు.
అదనపు కట్నం కోసం వేధింపులు
ఏప్రిల్ 12న మెట్టినిల్లు మాగడికి వెళ్లిన చంద్రకళకు అదనపు కట్నం తీసుకురావాలని భర్త జగన్నాథ్, అత్త లీలావతి రోజూ వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తుండడంతో తనను చంపుతారనే భయంతో జూన్ 2న పుట్టినిల్లు బెస్తరపల్లి వచ్చి తండ్రి మూర్తితో కలిసి కుందుర్పి పోలీస్‌షే్టషన్లో వరకట్న వేధింపులు, హత్యాయత్నం కింద భర్త జగన్నాథ్ అత్త లీలావతిపై కేసు పెట్టారు. దీంతో పోలీసులు జగన్నాథను 22 రోజులు రిమాండ్‌లో కూడా పెట్టారు. ఇటీవల విడుదలైన జగన్నాథ్, తల్లి వారం రోజుల క్రితం పోలీస్‌షే్టషన్‌కు వచ్చిన భార్య చంద్రకళను దుర్భాషలాడుతూ నాకు నీవు అవసరం లేదని త్వరలోనే వేరేపెళ్లి చే సుకుంటానని చెప్పాడు.
ఎనిమిదేళ్లక్రితం తల్లిభాగ్యమ్మ చనిపోగా తండ్రి, తమ్ముడితో ఉంటున్న చంద్రకళకు భర్త వేధింపులు తోడై మనోవేదనతో కుంగిపోయేది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతిపై తండ్రి మాట్లాడుతూ ’’ ఆదివారం తాను సొంతపనుల నిమిత్తం కళ్యాణదుర్గం వెళ్లగా తన కుమారుడు అనిల్‌కుమార్ (పెళ్లి కాలేదు) వ్యవసాయ తోటలోకి వెళ్లి ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చాడు. దూలానికి ఉరివేసుకొని వేలాడుతున్న చంద్రకళను చూసి విషయాన్ని ఫోన్లో చెప్పాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వేణుగోపాల్ తెలిపారు.