గోపవరం: మండలంలోని రాచాయపేట పంచాయతీ చెన్నవరం గ్రామానికి చెందిన చింతంరెడ్డి జయమ్మ (50) గురువారం రాత్రి విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మల్లుబలరామిరెడ్డి అనే రైతు ఊరి సమీపంలో ఉన్న పొలంలో వరి పంటను సాగు చేశాడు. ఆ పంటలోకి కోతులు వస్తున్నాయని, వాటికి అడ్డుకట్ట వేసేందుకు పొలం చుట్టూ విద్యుత్తు తీగలను ఏర్పాటు చేశారు. పగలు కూడా కరెంటు తీగలను అలాగే ఉంచారు. ఈ విషయం తెలియని జయమ్మ గడ్డి కోసుకునేందుకు పొలంలోకి వెళ్లింది. కరెంటు తీగలు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. జయమ్మ ఇంటిలో ఆమె ఒక్కరే నివసిస్తున్నారు. ఇంటికి వచ్చిందా రాలేదా అని చూసే వారు లేరు. తాళం వేసి ఉండటంతో బద్వేలుకు వెళ్లి ఉండవచ్చేమో అని చుట్టు పక్కల ఉన్న వారు అనుకున్నారు. రాత్రి 10 గంటలు అవుతున్నా రాకపోవడంతో స్థానికులు పక్కనే ఉన్న పొలం వద్దకు వెళ్లి చూశారు. అప్పటికే జయమ్మ మృతి చెంది ఉండటాన్ని గమనించారు. కాగా జయమ్మకు భర్తతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది. భర్త బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. జయమ్మ మృతి చెందిన విషయాన్ని స్థానికులు కువైట్‌లో ఉన్న ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన పొలం ప్రాథమిక పాఠశాల పక్కనే ఉండటం గమనార్హం. మృతురాలి బంధువులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్‌ఐ నరసింహారెడ్డి తెలిపారు.