శిక్షణ తరగతుల్లో గుండెపోటుతో హెచ్‌ఎం మృతి
ఏలూరు జిల్లా, ఆగిరిపల్లిలో ఘటన
రెసిడెన్షియల్ విధానంలో మూడు రోజులుగా శిక్షణ
శిక్షణ నిలిపివేయాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
సాక్షి, అమరావతి/నూజివీడు/నూజివీడు, ఆగిరిపల్లి: నాయకత్వ లక్షణాల అభివృద్ధిపై ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో హెచ్‌ఎం టి.వి.రత్నకుమార్ (55) గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం, తోటపలి్లలోని హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో బుధవారం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా, ఉండి మండలం, ఉణుదుర్రు హైసూ్కల్ ఇన్‌చార్జి హెచ్‌ఎంగా పనిచేస్తున్న రత్నకుమార్ ఈనెల 4వ తేదీ నుంచి ఇక్కడ శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు.
బుధవారం వేకువజామున రత్నకుమార్‌కు గుండెపోటు రాగా, తోటి ఉపాధ్యాయులు గన్నవరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. మృతుడి స్వగ్రామం గణపవరం మండలం, కేశవరం కాగా భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.
రత్నకుమార్ ఆకస్మిక మృతితో సమగ్ర శిక్ష, అదనపు స్పెషల్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఏఎస్‌పీడీ) కేవీ శ్రీనివాసులరెడ్డి, సీమ్యాట్ డైరెక్టర్ మస్తానయ్య, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించి శిక్షణ తరగతులను రద్దు చేశారు. కాగా ఈనెల 4న ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు 9వ తేదీతో ముగియనున్నాయి.
ఆగిరిపల్లిలో ప్రధానోపాధ్యాయుల ఆందోళన
టీవీ రత్నకుమార్ మృతికి నిరసనగా హెచ్‌ఎంలు బుధవారం ఉదయం హీల్ ప్యారడైజ్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. తీవ్రమైన ఒత్తిడి, భయం, ఆందోళన, సమయానికి అందని వైద్యసాయం వల్లే రత్నకుమార్ మృతి చెందారని హెచ్‌ఎంలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజులుగా ఉదయం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకూ నిర్విరామంగా, నిర్బంధంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని వాపోయారు.
200 మందికి పైగా హెచ్‌ఎంలు శిక్షణ పొందుతుంటే కనీసం వైద్య సదుపాయాలు కూడా కల్పించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఎం మృతికి కారణమైన అధికారులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కంటే టీడీపీ కూటమి ప్రభుత్వంలో మరిన్ని యాప్‌లు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నిర్బంధ శిక్షణ నిలిపివేయాలి: ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
కనీస మౌలిక వసతులు లేకుండా శిక్షణల పేరిట ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి హితవు పలికాయి. హెచ్‌ఎం రత్నకుమార్ మృతిపై ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నిర్బంధ శిక్షణలతో ఉపాధ్యాయులను ప్రభుత్వం శిక్షిస్తోందని షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సుధాకర్, కార్యదర్శి కె. కుమార్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని, జీవో 117 రద్దు చేస్తామని ఉపాధ్యాయులను నమ్మించి, మోసగించారని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి. మనోజ్‌కుమార్ తెలిపారు.
రత్నకుమార్ మృతిని తమను కలచి వేసిందని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ రావు వెల్లడించారు. కుంటి సాకులతో నిర్లక్ష్యపూరితంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) విమర్శించింది. విశ్రాంతి లేని పని ఒత్తిడి కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ స్పష్టం చేశారు. ఆగిరిపల్లి శిక్షణ కేంద్రంలో కనీస వైద్య సౌకర్యం కూడా లేదని ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment