
పెరుగుతున్న నిద్రలేమి సమస్య
నిద్రలేమితో బీపీ, సుగర్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఆస్కారం
మొబైల్, టీవీలు అతిగా చూడడం వల్ల సమస్య
విజయనగరం ఫోర్ట్: మానవుని జీవనశైలిలో మార్పులు, అధికంగా మొబైల్ వాడడం, టీవీ ఎక్కువగా చూడడం వల్ల అధికశాతం మంది నిద్రలేమి బారిన పడుతున్నారు. ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పనిచేయడం, జంక్‌ఫుడ్స్ ఎక్కువగా తినడం, రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోవడం, రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వహించడం వల్ల తగినంత నిద్ర ఉండదు. దీని వల్ల వారు బీపీ, సుగర్, ఊబకాయం, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, థైరాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. చాలా మంది నిద్ర లేకపోతే ఏంజరుగుతుంది? అని తేలికగా తీసుకుంటారు.
అర్ధరాత్రి వరకు చాలా మంది నిద్రపోరు. దీని వల్ల అనేక సమస్యల బారిన పడతారు. నిద్రలేమి వల్ల ఓఎస్‌ఏ (అబ్‌్సట్రక్ట్రివ్ స్లీప్ అస్నియా) అనే సమస్యకు గురవుతారు. ఈ సమస్య ఉన్న వ్యక్తి శ్వాస తీసుకోవడం పదేపదే ఆగిపోవడం, ఊపిరి లోతుగా తీసుకోవడం (అల్పశ్వాస) జరుగుతుంది. అదేవిధంగా పెద్దగా గురక పెట్టడం, శ్వాస పునఃప్రారంభం అయినప్పడు ఉక్కిరిబిక్కిరి అయి వింత శబ్దాలు రావడం, పగటి సమయంలో మధ్యమధ్య కునుకుపాట్లు పడుతూ ఉండడం, అలసటగాను, మత్తుగాను ఉంటుంది.
మద్యం తాగడం, పొగతాగడం, స్థూలకాయం వల్ల ఓఎస్‌ఏ సమస్య తీవ్రతరం అవుతుంది. చిన్నపిల్లల్లో అయితే ఎదుగుదల ఉండదు. మానసిక సమస్యల బారిన పడతారు.నెలకు 1000 మంది వరకు నిద్ర లేమి సమస్య బారిన పడుతున్నారు.
6నుంచి 7 గంటల నిద్ర అవసరం
ప్రతి వ్యక్తి రోజులో 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. ఇలా నిద్ర పోవడం వల్ల హార్మోన్స్ తయారవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. పనిచేయడానికి అవసరమైన శక్తి తయారవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది.
జాగ్రత్తలు
నిద్రలేమి సమస్య బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయమం చేయాలి. కనీసం రోజులో 6 గంటలు నిద్ర పోవాలి. నిద్రలేమి సమస్య ఉన్నట్లయితే పలమనాలజిస్టునుగాని, ఈఎన్‌టీ వైద్యుడిని గాని సంప్రదించాలి. ఊబకాయం రాకుండా చూసుకోవాలి. పానీపూరీ, చాట్, పిజ్జా, బర్గర్లు వంటివి ఎక్కువగా తినకూడదు.
ఎక్కువ మందికి నిద్రలేమి సమస్య
చాలామంది నిద్రలేమి సమస్య బారిన పడుతున్నా రు. అయితే ఈసమస్యకు ఎవరిని సంప్రదించాలో చాలామందికి తెలియదు. పలమనాలజిస్టునుగాని, ఈఎన్‌టీ వైద్యుడిని గానీ సంప్రదించాలి. ఆరోగ్యంగా జీవించడం కోసం రోజులో 6 నుంచి 7 గంటల పాటు నిద్రపోవాలి. సెల్‌ఫోన్ ఎక్కువగా వినియోగించకూడదు. అదేవిధంగా టీవీ కూడా గంటల తరబడి చూడకూడదు. - డాక్టర్ బొత్స సంతోష్‌కుమార్,అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment