రీల్స్, షార్ట్ వీడియోస్ చూసేవారికి రక్తపోటు ముప్పు
చైనాలోని హెబేయ్ మెడికల్ యూనివర్సిటీ వెల్లడి
రాత్రి నిద్ర పోయే ముందు రీల్స్, షార్ట్ వీడియోలు చూసే వారిపై అధ్యయనం
సాక్షి, అమరావతి: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వినోదం, వ్యాపార ప్రకటనలు, ప్రచారాల్లో రీల్స్, షార్ట్ వీడియోస్ హవా నడుస్తోంది. పిల్లలు, కుర్రకారు, పెద్దలు కూడా మొబైల్ రీల్స్ చూడటానికి గంటల సమయం కేటాయిస్తున్నారు.
కొంచెం ఖాళీ సమయం దొరికితే చాలు మొబైల్‌లో ఫేస్ బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా యాప్‌లు ఓపెన్ చేయడం.. అందులో వచ్చే షార్ట్ వీడియోస్, రీల్స్ చూస్తూ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం ఓ దైనందిన కార్యక్రమం అయిపోయింది.
ఇది రాన్రాను ఓ వ్యసనంలా మారి, విలువైన సమయాన్ని హరించడంతో పాటు, అధిక రక్తపోటు (బీపీ) ముప్పు తెస్తోందని చైనాలోని హెబేయ్ మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 4,318 మంది యువత, మధ్య వయసు వారిపై చేసిన అధ్యయనంలో వెల్లడైన వివరాలను తాజాగా బీఎమ్‌సీ జర్నల్‌లో ప్రచురించారు.
తొమ్మిది నెలల పాటు విశ్లేషణ
ఈ శాస్త్రవేత్తలు 2023 జనవరి నుంచి సెప్టెంబరు వరకు మెడికల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్న 4,318 మంది యువకులు, మధ్య వయస్కుల ఆరోగ్య రికార్డులను విశ్లేషించారు. 2,245 మంది పురుషులు, 1893 మంది స్త్రీలపై ఈ అధ్యయనం చేశారు. వారికి పలు రకాల పరీక్షలు నిర్వహించి, రాత్రిళ్లు నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్లల్లో ఎంత సేపు రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తున్నారనే అంశాన్ని పరిశీలించారు.
రాత్రిళ్లు ఎక్కుసేపు రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తూ గడిపే యువత, మధ్య వయసు వారిలో బీపీ బారినపడే ప్రమాదం పెరుగుతున్నట్లు నిర్ధారించారు. రీల్స్, షార్ట్ వీడియోలు చూసే సమయాన్ని వీలైనంత తగ్గించాలని, ఈ వ్యసనాన్ని పూర్తిగా వీడితే మంచిదని సూచించారు. దీంతోపాటు శరీర బరువును అదుపులో పెట్టుకోవడం, రక్తంలో కొవ్వు, చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment