ఇది హత్యా లేక ప్రమాదమా?
చిత్తూరు జిల్లాలో ఘటన
జేసీబీ తొట్టి మీద పడి చనిపోయిన డ్రైవర్
పోలీసులకు సమాచారమివ్వని నిర్వాహకుడు
మృతదేహాన్ని బైక్‌పై ఆస్పత్రికి తరలింపు.. జేసీబీ మాయం
సాక్షి టాస్క్‌ఫోర్స్: టీడీపీ నేత నడుపుతున్న క్వారీలో ఆదివారం జేసీబీ డ్రైవర్ మృతిచెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బైక్‌పైనే మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకురావడంతో అది ప్రమాదమా! లేక హత్యా! అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మాదిగబండలోని అక్రమ క్వారీ కథ ఇది..స్థానికుల కథనం ప్రకారం.. మాదిగబండ సమీపంలోని సర్వే నంబర్లు 1367,1345, 1376లో 4.43 హెక్టార్లలో రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ కోసం శరత్‌కుమార్ గనులశాఖ అనుమతులతో క్వారీ నడుపుతున్నారు.
ఈక్రమంలో నిబంధనలు పాటించడంలేదని అధికారులు క్వారీకి అనుమతులు రద్దుచేస్తూ ఈ నెల 1న నోటీసులిచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే ఆ క్వారీని టీడీపీ నేత జనార్థన్‌నాయుడు స్వాధీనం చేసుకుని నడుపుతున్నారు. దీని కరెంటు బిల్లులు రూ.20.09 లక్షలు కట్టాలని నోటీసులు ఇచ్చిన విద్యుత్ అధికారులు.. బకాయిలు చెల్లించకపోయినా స్పందించలేదు. అనర్హత వేటుపడిన ఈ క్వారీని మైనింగ్ అధికారులు సీజ్ చేయకుండా వదిలేశారు. ఇన్ని ఉల్లంఘనల మధ్య యథేచ్ఛగా నడుస్తున్న ఈ క్వారీలో ఇప్పుడు జేసీబీ డ్రైవర్ మృతి చెందాడు.
ప్రమాదమా? చంపేశారా?
ఈ క్వారీలో ఎర్రగొండేపల్లికి చెందిన చిన్నస్వామి (38) జేసీబీ ఆపరేటర్‌గా చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం జేసీబీ ముందు భాగంలో తొట్టి వద్ద చిన్నస్వామి గ్రీజు వేస్తుండగా సెల్వ అనే వ్యక్తి జేసీబీ క్యాబిన్‌లో కూర్చొన్నాడు. సెల్వి సెల్‌ఫోన్ చూస్తూ గేర్ వేయడంతో జేసీబీ తొట్టె కిందికెళ్లిపోయి, గ్రీజు వేస్తున్న చిన్నస్వామిపై పడిందని, దాని కింద నలిగి అతను మృతి చెందినట్టు చెబుతున్నారు.
పోలీసులను పిలవకుండానే మృతదేహాన్ని బైక్‌పై ఆస్పత్రికి తెచ్చారు. క్వారీలో ఉన్న జేసీబీని మాయం చేశారు. దీంతో ఇది ప్రమాదమా లేక ఉద్దేశపూర్వకంగా చిన్నస్వామిని జేసీబీతో కొట్టి చంపేశారా అన్న అనుమాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
క్వారీ యజమాని ఆదేశాలతో ఆ ప్రాంతానికి చెందిన పలువురు అధికార పార్టీ నాయకులు మృతుడి కుటుంబానికి ఎంతోకొంత పరిహారం చెల్లించి కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. మృతుల బంధువులు మీడియాతో మాట్లాడకుండా అడ్డుకున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఏం జరి గిందనేది తెలుస్తుందని పలమనేరు టౌన్ సీఐ చంద్రశేఖర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment