ఆడపిల్ల పుట్టిందని ‘తలాక్’!
- మగబిడ్డ కోసం బాబా ఇచ్చిన మందులు వాడాలన్న అత్తింటివారు
- కాదన్నందుకు గృహిణికి వేధింపులు...
- చివరకు ఆడబిడ్డ పుట్టడంతో విడాకుల నోటీసులు
హైదరాబాద్: మగబిడ్డ కోసం గృహిణిని వేధించిన అత్తింటివారు... చివరకు ఆడపిల్ల పుట్టడంతో ఆమెను వదిలించుకోవడానికి సిద్ధమయ్యారు. బాబా చెప్పినట్టు నడుచుకోనందుకు, ఆయన ఇచ్చిన మందులు వాడనం దుకే మగ పిల్లాడు పుట్టలేదంటూ కోడలిని హింసించారు. భర్తకు మొరపెట్టుకుంటే నిర్ధాక్షిణ్యంగా విడాకుల నోటీసులు పంపి అతడు నిలువునా వంచించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అత్త, మామతో పాటు నకిలీ బాబానూ చార్మినార్ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్య నారాయణ మంగళవారం ఈ వివరాలు వెల్లడించారు.
నాంపల్లికి చెందిన ముజఫర్ హుస్సేన్ కుమార్తె హబీబా ఫాతిమా(19)ను మొఘల్‌పురావాసి మహ్మద్ సాదిక్ కుమారుడు మహ్మద్ మన్సూర్ అలియాస్ సైఫ్‌కు ఇచ్చి 2016 ఆగస్టులో వివాహం జరిపించారు. 10 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.5 లక్షల నగదును కట్నంగా సమర్పించారు. పెళ్లయిన కొద్ది రోజులకే మన్సూర్ పని నిమిత్తం అబుదాబీ వెళ్లాడు. ఫాతిమా గర్భవతి అయింది. వెంటనే అత్త సమీనాసుల్తానా(50), మామ మహ్మద్ సాదిక్ (55) తమకు మగ పిల్లవాడు కావాలని, అది జరగాలంటే తమకు తెలిసిన బాబా వద్దకు వెళ్లి మందులు తీసుకోవాలన్నారు.
వద్దంటున్నా ఫాతిమాను బలవం తంగా మొఘల్‌పురాలో ఉండే షేక్ అబ్దుల్ రహీం అలియాస్ బాయిమియా(68) వద్దకు తీసుకెళ్లారు. బాబా ఆమెకు కొన్ని మందులిచ్చి, గర్భంపై నూనె రాయాలని సూచించాడు. అందుకు రూ.20 వేలు తీసుకున్నాడు. బాబా అనుచిత ప్రవర్తన గమనించిన ఫాతిమా.. అత్త, మామలకు విషయం చెప్పింది. దీన్ని పట్టించుకోని అత్త.. తానూ అలా బాబా వద్ద మందులు తీసుకోవడం వల్లే నీ భర్త పుట్టాడంటూ చెప్పింది.
మొరపెట్టుకున్నా పట్టించుకోని భర్త...
ఈ క్రమంలో అక్టోబర్‌లో ఫాతిమా అబుదాబీలో ఉన్న భర్త వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పింది. మగబిడ్డ పుట్టాలంటే బాబా చెప్పినట్టు నడుచుకోవాల్సిందేనని మన్సూర్ కూడా తెగేసి చెప్పి, ఈ ఏడాది జనవరిలో ఫాతిమాను తిరిగి పంపించాడు. తిరిగొచ్చిన కోడలిని అత్త, మామలు తరచూ బాబా వద్దకు తీసుకెళ్లారు. విసుగెత్తిన ఫాతిమా తాను బాబా వద్దకు రానని మొండికేయడంతో ఆమెను గోడకేసి కొట్టి హింసించారు. ఈ ఏడాది మేలో ఫాతిమా ఆడపిల్లకు జన్మనిచ్చింది.
రూ.10 లక్షలు తెమ్మని వేధింపులు...
ఆడబిడ్డ జన్మించడంతో ఆగ్రహించిన అత్త, మామలు... బాబా వద్ద మందులు తీసుకోనందుకే ఇలా జరిగిందని ఫాతిమాను హింసించారు. ఇందుకు శిక్షగా పుట్టింటి నుంచి రూ.10 లక్షలు తీసుకురావాలని అత్త, మామలతో పాటు ఆడపడచులూ డిమాండ్ చేశారు. తాను ఇచ్చుకోలేనని తండ్రి ముజఫర్ చెప్పడంతో ఫాతిమాకు ‘తలాక్–ఇ–బయీన్’ పేరుతో విడాకుల నోటీసులు పంపించారు. దీంతో బాధితురాలు చార్మినార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్త, మామ, నకిలీ బాబాను అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. త్వరలోనే ఫాతిమా భర్తను అరెస్ట్ చేస్తామని డీసీపీ తెలిపారు. పాతబస్తీలో 20 మంది వరకు నకిలీ బాబాలు ఉన్నారని.. వారిలో ఆరుగురిపై రౌడీషీట్లు తెరిచామని డీసీపీ తెలిపారు.