
పిల్లల్ని ‘ఎక్కడున్నావ్?’ అని అడిగితే.. విసుక్కుంటారు.
‘ఎప్పుడూ ఇదే ప్రశ్నా’ అంటారు! ‘ఏ? అడక్కూడదా?’ అంటే..
‘మీరు అన్నీ మీ మమ్మీడాడీకి చెప్పే చేశారా?’ అని ఎదురు ప్రశ్న వేస్తారు!
‘టైమ్స్ హ్యావ్ ఛేంజ్డ్.. మీరు కూడా మారాలి’... అంటారు!
డజెంట్ మేటర్.. డోన్ట్ కేర్. పిల్లలు ఏమనుకుంటేనేం?
పిల్లలు ఏమైపోతున్నారన్నదే మనకు ఇంపార్టెంట్.
మీ సోకాల్డ్ మోడర్న్ పేరెంటింగ్‌ని ఆపేయండి. ఎక్కడున్నారని, ఏం చేస్తున్నారని...
ఇంకా ఎందుకు రాలేదని.. పిల్లల్ని అడగండి.
ఇవాళ సమాజం ఏమనుకుంటుందోనని డిసిప్లీన్ తగ్గిస్తే...
రేపు సమాజం ఏమంటుందో.. అది విని భరించగలమా?
వదినా... మాన్వి ఉందా?’’ ఫోన్‌లో అడిగింది ఆ ఆడపడచు తన అన్న భార్యను. లేదు... సుచరితా.. ఎందుకు?’’ మామూలుగానే ప్రశ్నించింది అరుంధతి. ‘ఎక్కడికెళ్లింది?’’ ఆరా తీస్తున్నట్టు సుచరిత. ‘‘ఏదో సెమినార్ అటెండ్ చేయడానికి వెళ్లింది’’ ఆడపడచు అలా ఆరా తీయడం నచ్చని అరుంధతి కాస్త అసహనంగానే సమాధానమిచ్చింది. ‘అబద్ధం వదినా.. అది మీకు అబద్ధం చెప్పింది’’ తటపటాయిస్తూ అంది సుచరిత. ‘అబద్ధమేంటి?’’ కాస్త చిరాగ్గా అరుంధతి. ‘‘అబద్ధం.. కాలేజ్, సెమినార్ అన్నీ అబద్ధమే. మాన్వి ఫ్రెండ్స్‌తో కలిసి రిసార్ట్‌లో ఉంది’’ చెప్పేసింది సుచరిత. ‘‘ఏం మాట్లాడుతున్నావ్ సుచరితా?’’ షాకింగ్‌గా అంది అరుంధతి. ‘‘అవునొదినా.. నేను చూశాను. రవి వాళ్ల ఫ్రెండ్ అమ్మాయి ఎంగేజ్‌మెంట్ అయితే వెళ్లాం. అదే రిసార్ట్‌లో మాన్వి వాళ్ల ఫ్రెండ్స్‌తో కనిపించింది వదినా...’’ చూడకూడనిది చూశానన్నట్టుగా సందేహంగా చెప్పింది సుచరిత. అరుంధతిక నోటమాటరాలేదు.
వదినా.. ఇంకోమాట.. నువ్వేమీ అనుకోకపోతే...’ అంటూ ఆగింది ఆడపడచు. ఇంకా అనుకోవడానికేముందిలే అని మనసులో అనుకొని ‘‘భలేదానివే చెప్పు’’ అంది అరుంధతి.
‘‘ఫ్రెండ్స్‌తో కలిసి డ్రింక్ చేస్తూ కనపడింది’’ అంది సుచరిత. దానికి అరుంధతి సమాధానం మౌనమే అయింది. ఆ తర్వాత ఫోన్ డిస్కనెక్ట్ చేసిన శబ్దం వినిపించింది సుచరితకు. నిట్టూర్చి తన పనిలో పడిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది వదిన నుంచే. ‘‘ఆ.. చెప్పొదినా...’’ ఆత్రంగా సుచరిత. ‘‘మీ అన్నయ్యతో ఈ విషయమేమీ చెప్పకు, మాట్లాడకు.. అసలు ప్రస్తావనే తీసుకురాకు’’ అర్థింపు కన్నా ఆజ్ఞే వినపడింది ఆమె స్వరంలో. ‘‘అలాగే వదినా.. కాని మాన్వి జాగ్ర...’’ అని సుచరిత అంటుండగానే ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది అరుంధతి.
కలిమి.. లేమి అరుంధతి, వినయ్‌లది సంపన్న కుటుంబం. వాళ్లకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి మాన్విత, అబ్బాయి అభిమన్యు. అమ్మాయి ట్వెల్త్ క్లాస్ చదువుతోంది. అబ్బాయి టెన్త్. వినయ్‌కి బిజినెస్ ఉంది. లాభసాటిగా నడుస్తోంది. వ్యాపారం నిమిత్తం నెలలో దాదాపు 20 రోజులు బయటే ఉంటాడు. ఊళ్లో ఉన్న రోజుల్లో కూడా కార్పోరేట్ ఆఫీస్ పనుల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతాడు. అరుంధతీ బిజీ కిట్టి పార్టీలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్స్‌తో. డబ్బుకి కొదవలేకపోవడంతో పిల్లలు అడిగిందల్లా ఇస్తూ వాళ్లకు ఏ లోటూ రాకుండా పెంచారు..
పెంచుతున్నారు.
పిల్లల వ్యవహారాల్లో జోక్యం చేసుకుండా, బయటకు వెళ్తున్నాం అని పిల్లలు చెబితే ఎక్కడికి అని అడగడం కూడా మంచి పేరెంటింగ్ కాదనే భావనలో పిల్లల ప్రైవసీని గౌరవిస్తూ ‘‘ఎడ్యుకేటెడ్ అండ్ సివిలైజ్డ్’’ పేరెంట్స్‌గా ఉంటున్నారు. అందుకే ఆ రోజు అమ్మాయి సెమినార్ అనగానే ‘ఏం సెమినార్? ఎక్కడ? ఎందుకు..’ లాంటి ప్రశ్నలేమీ వేయకుండా అవేర్‌నెస్ ఉన్న అమ్మగా కూతురిని పంపింది కావల్సినన్ని డబ్బులు ఇచ్చి మరీ! ఇప్పుడు ఆడపడచు చెప్పిన విషయం కన్నా ఆమె కంట్లో తన కూతురు పడిందనేదే అరుంధతిని బాధపెడుతోంది. అమె దృష్టిలో ఆడపడుచు ఒక నాగరిక సమాజం గురించి ఏమీ తెలియని సాధారణ గృహిణి. అందుకే తన కూతురు ఆమెకు తప్పుగా కనిపిస్తోంది.. ఆ విషయాన్ని చుట్టాల్లో ప్రచారం చేస్తుందేమోననే భయం.. తన భర్తకు ఎలా సినిమా చూపిస్తోందననే ఆందోళనే ఆమెను వెంటాడుతున్నాయి తప్ప సెమినార్ అని చెప్పి వెళ్లిన కూతురు రిసార్ట్స్‌లో ఏం చేస్తోంది? తాగడం, పార్టీలు ఏంటి అని అనుమానపడట్లేదు. ‘సుచరిత ఓ మొద్దు.. ఆమెలాగే నా పిల్లలూ ఉండాలనుకుంటోంది. కంట్రీ ఉమన్’ అనుకుంటూ ఆ రోజు సాయంకాలం ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి చీర సెలక్షన్‌లో పడిపోయింది అరుంధతి.
రాత్రి తొమ్మిది..
‘‘అరుంధతి.. మాన్వి ఇంకా ఇంటికి రాలేదు?’’ అరుంధతి వాళ్ల అత్తగారు ఫోన్ చేశారు పార్టీలో ఉన్న అరుంధతికి. ‘‘అబ్బ.. వస్తుందిలే అత్తయ్యా..’’ విసుక్కొని పెట్టేసింది. కాని కూతురు ఇంకా ఇంటికి రాలేదు అన్న నిజంతో అన్యమనస్కం అయిపోయింది. కూతురి సెల్‌కి ఫోన్ చేసింది. స్విచ్డ్ ఆఫ్. గుండె చప్పుడు ఒక్కసారిగా వేగం పెరిగింది. మళ్లీ మళ్లీ ప్రయత్నించింది. అయినా స్విచ్డ్ ఆఫే! మొదటిసారి అసలు భయమంటే ఏంటో తెలిసింది ఆమెకు. కొడుకుకి ఫోన్ చేసింది. మాన్విత గురించి వాకబు చేసింది. మోడర్న్ పేరెంటింగ్‌లో పెరిగిన వాడు అక్క సొంత విషయాలు తెలుసుకోవడం, జోలికి వెళ్లడం అనాగరికమనే అభిప్రాయాన్ని ఏర్పర్చుకున్నాడు. అందుకే తల్లికి ‘డోంట్ నో’ అని సమాధానమిచ్చాడు చాలా కాజువల్‌గా. ఆ ఆన్సర్‌కి చిర్రెత్తుకొచ్చింది అమ్మకు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. భర్తకు కాల్ చేసింది. డోంట్ డిస్టర్బ్ మోడ్‌లో ఉంది ఆయన ఫోన్. ఒక్కసారిగా అక్కడున్న సోఫాలో కూలబడిపోయింది నిస్సత్తువగా. తేరుకొని సుచరితకు ఫోన్ చేసింది. ‘‘సుచరితా.. మాన్వి ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తోంది..’’ అని కంగారుగా. ‘‘అయ్యో.. టెన్షన్ పడకు వదినా.. నేను, ఆయన వస్తున్నాం’’ అంటూ ఫోన్ పెట్టేసింది.
రాత్రి పదకొండున్నర... అరుంధతివాళ్లింట్లో..
మాన్విత ఫ్రెండ్స్‌లో అరుంధతికి తెలిసిన వాళ్లే తక్కువ. వాళ్లలో కూడా అందరి ఫోన్‌నంబర్స్ ఆమె దగ్గర లేవు. ఉన్న కొంతమందికి కాల్ చేసి మాన్విత గురించి వాకబు చేశారు. అసలు సెమినార్ ఏమీ లేదని, తమకైతే అలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదని జవాబిచ్చారు వాళ్లు. అది విని బిక్కచచ్చిపోయింది అరుంధతి. ఆలస్యం చేస్తే లాభం లేదు.. పోలీస్ కంప్లయింట్ ఇద్దామని సుచరిత వాళ్లాయన అంటుండగా హాల్లో అలా గోడల కోసం నడుస్తున్న టీవీ మీద పడింది వాళ్ల దృష్టి.. అందులో స్క్రోలింగ్‌ను చదివింది సుచరిత అలవాటుగా.. ఫలానా రిసార్ట్‌లో ఫలానా కాలేజ్ పిల్లలు కొంతమంది రేవ్ పార్టీ చేసుకుంటుండగా పోలీసులు రైడ్ చేశారు అని. భర్తకు చూపించింది. అంతలోకే దాని తాలూకు వార్త కూడా ప్రసారం అవసాగింది. మాన్విత మొహానికి స్కార్ఫ్ కట్టుకొని పోలీస్ వ్యాన్‌లోకి ఎక్కుతోంది. అది మాన్వితే.. తను ఉదయం చూసినప్పుడు అదే డ్రెస్‌లో ఉంది. మొహానికి ముసుగు కట్టుకున్నా ఆ కళ్లను మరిచిపోలేదు. సుచరిత తల్లి కళ్లను పోలి ఉంటాయి అవి. ఆ దృశ్యాన్ని అప్రయత్నంగా తన వదినక్కూడా చూపించింది. అరుంధతీ చూసింది. నిజమే! అది మాన్వితే. తన కూతురే! నివ్వెరపోయింది. నోటమాటరాక... ప్రతిమలా నిలబడిపోయింది తన పెంపకంలోని లోపాన్ని తలచుకుంటూ!
నిఘా వద్దు.. పర్యవేక్షణ చాలు
టీనేజ్ పిల్లల మీద నిఘా పెట్టడం సరికాదు. అలాగని పట్టించుకోకుండా ఉండడం మంచిదికాదు. టీనేజ్‌లో ఉన్నవాళ్లను ఎక్కడికెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని గుచ్చిగుచ్చి అడిగినా నిజం చెప్పరు. వాళ్ల ప్రైవసీ కోసం కంప్లీట్‌గా వదిలేయడం తప్పే. వీలైనంత సమాచారం రాబడుతూ ఉండాలి. ఒక కన్నేసి ఉంచాలి. తల్లిదండ్రులు, లేదంటే తల్లి, తండ్రిలో ఎవరైనా ఒకరు వాళ్లకు అందుబాటులో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. పిల్లలు ప్రతి విషయం మనతో షేర్ చేసుకునే చనువునివ్వాలి. వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే వాళ్ల మీద కొంచెం అనుమానంతో కూడా ఉండాలి మనం. ఎందుకంటే వాళ్లు టీనేజ్‌పిల్లలు కాబట్టి. ఎటైనా వెళ్తున్నాం.. లేదా ఏదైనా చేస్తున్నాం అని చెబితే ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించాలి. వాళ్లు నిజం దాస్తున్నారు అనిపించినప్పుడు నిలదీయకుండా ‘‘నాకైతే అలా అనిపించట్లేదే.. ’’ అనే డౌట్‌ను వ్యక్తం చేయాలి. అంటే వాళ్లంతట వాళ్లు నిజం చెప్పే టెక్నిక్‌ను ఉపయోగించాలి. మనం నిజం చెబితే పెద్దవాళ్లు కాదనరు అనే నమ్మకాన్ని పిల్లలకు కల్పిస్తూనే ఆ నమ్మకాన్ని కాపాడుకునే బాధ్యతను, అవసరాన్ని పిల్లలకు నేర్పించాలి. వాళ్లను పర్యవేక్షిస్తూ ఉండాలి.
– డాక్టర్ పద్మ పాల్వాయి, చైల్డ్ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్
-శరాది