
ఇంట్లో చంపేసి మృతదేహాన్ని క్వారీలో పడేసిన వైనం
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఘటన
పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సోమవారం తెల్లవారుజామున జరిగన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జానపాడు గ్రామానికి చెందిన తాటి కొండలు, తాటి ఆదిలక్ష్మి(30)లు భార్యాభర్తలు. నిత్యం పని నిమిత్తం పిడుగురాళ్ల పట్టణంలోని సున్నపు బట్టీలకు వస్తుంటారు. ఈ క్రమంలో వేముల ఏడుకొండలు అనే బట్టీ మేస్త్రీతో ఆదిలక్ష్మికి పరిచయమేర్పడింది. దీంతో ఆదిలక్ష్మి కొండలను వదిలిపెట్టి ఐదేళ్లుగా పిడుగురాళ్ల పట్టణంలో పిల్లలతో పాటు ఏడుకొండలుతో సహజీవనం సాగిస్తోంది.
ఆదిలక్ష్మి డ్వాక్రా ద్వారా రూ.3 లక్షలు తీసుకుందని, ఆ డబ్బుల విషయంలో ఆదిలక్ష్మికి, ఏడుకొండలకు తరచూ గొడవలు జరుగుతుంటాయని స్థానికులు చెప్పారు. రోజులాగే పిల్లలిద్దరూ వారి అమ్మమ్మ ఇంటికి పడుకునేందుకు వెళ్లారు. ఉదయాన్నే నిద్రలేచి ఇంటికి వచ్చి చూడగా ఇల్లు మొత్తం రక్తంతో ఉంది. వెంటనే పిల్లలు వారి అమ్మమ్మకు విషయం చెప్పడంతో అమ్మమ్మతో పాటు చుట్టుపక్కల బంధువులు వచ్చి చూడగా.. ఇంటి నుంచి దారి పొడవునా రక్తపు మరకలు కనిపించాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి రక్తపు మరకలను చూసుకుంటూ వెళ్లగా కొత్తగా కడుతున్న స్కూల్ సమీపంలోని క్వారీ వద్ద తాళిబొట్టు, రక్తపు మరకలు కనిపించాయి. వారు వెంటనే క్వారీలోకి దిగి వెతకగా ఆదిలక్ష్మి మృతదేహం లభ్యమైంది. వెంటనే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు తెలిపారు. పోలీసుల అదుపులో నిందితుడు ఏడుకొండలు ఉన్నట్టు తెలిసింది. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment