
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఈ కేంద్రాలు ఉండేవని, తొలుత గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. శాసనమండలిలో మంగళవారం కేసీఆర్ కిట్ పథకంపై లఘు చర్చ జరిగింది. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రిలో త్వరలో ఇన్‌పేషెంట్ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఏడాదికి 6.50 లక్షల ప్రసవాలు జరిగేవని, అందులో 30 శాతం మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతుండేవని చెప్పారు.
కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టాక ప్రభుత్వ ఆసుపతుల్లో ప్రసవాలు 55 శాతం పెరిగాయన్నారు. గర్భిణులకు రూ.12–13 వేలు ఇస్తున్నామన్నారు. ఈ పథకం కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.605 కోట్లు కేటాయించామన్నారు. కేసీఆర్ కిట్ పథకం కింద రాష్ట్రంలో 98,189 ప్రసవాలు జరిగాయని, సిజేరియన్లు తగ్గాయన్నారు. కేసీఆర్ కిట్‌కు సభ్యుల నుంచి ప్రశంసలు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment