పిల్లల్ని ఒంటరిగా ఇంట్లో వొదిలి వెళ్తున్నారా..? | Precautions Should be Taken when Leaving Children Alone | Sakshi
Sakshi News home page

పిల్లల్ని ఒంటరిగా ఇంట్లో వొదిలి వెళ్తున్నారా..?

Published Thu, Jul 28 2022 12:02 AM | Last Updated on Thu, Jul 28 2022 2:48 AM

Precautions Should be Taken when Leaving Children Alone - Sakshi

ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు కాపలా ఉండే రోజులు పోయాయి. తల్లిదండ్రులు ఉద్యోగాలకు.. వేరే ఏవైనా పనులకు వెళ్లాలి. నగరాల్లో అయినా పల్లెల్లో అయినా ఒక్కోసారి ఇంట్లో ఒంటరిగా పిల్లల్ని ఒదిలి వెళ్లక తప్పడం లేదు. గంటలో వచ్చేస్తాం.. రెండు గంటల్లో వచ్చేస్తాం.. అని చెప్పి వెళ్లినా ప్రాణం పీకుతూనే ఉంటుంది. పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్లేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

పిల్లలు ఇంట్లో ఉంటే తాతయ్యో అమ్మమ్మో గతంలో చూసుకునేవారు. ఇంట్లో ఇంకా పెళ్లి కావలసిన మేనత్తో చదువుకుంటున్న బాబాయో ఉండేవారు. లేదంటే పక్కింట్లో కూచోబెట్టి వెళ్లేవారు. ఇప్పుడు ఇవన్నీ దాదాపుగా ఏ ఇంట్లోనూ సాధ్యం కావడం లేదు. ఉదయం లేచి పిల్లలు స్కూలుకు వెళ్లి సాయంత్రం వారు ఇంటికి చేరుకునే సమయానికి తల్లో, తండ్రో ఇంట్లో ఉంటే ఒక సంగతి. లేదా తల్లిదండ్రులు వచ్చేలోగా ఆ ఒకటి రెండు గంటల సమయాన్ని పిల్లలు తాళం తీసుకుని ఒంటరిగా ఉండాల్సి వస్తే వాళ్ల కోసం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు పిల్లల సెలవు రోజుల్లో వారు రానవసరం లేని పనులు ఉంటాయి. కార్యాలు ఉంటాయి. కొన్నిసార్లు పెద్దలు సినిమాకు వెళ్లాలనుకుంటే వారికి నచ్చని వాటికి రారు. ఇద్దరు పిల్లలు ఉంటే వారు ఒకరికొకరు తోడుంటే కొంత బెటర్‌. కాని ఒక్కరే సంతానం ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. 

ఏ వయసులో ఒంటరిగా వదలొచ్చు?
ఇది చాలా ముఖ్యమైన విషయం. అమెరికాలో దీనిపై పరిశోధన చేసిన వాలెంటీర్ల బృందం 12 ఏళ్లు వచ్చాకే పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లొచ్చని, పన్నెండు లోపల వదిలితే వారిని ప్రమాదంలో నెట్టినట్టేనని తేల్చారు. 12 ఏళ్ల లోపు పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్లడం ‘చట్టప్రకారం నేరం’ అని నిర్ధారించే వరకు కొన్ని పాశ్చాత్య దేశాలు వెళుతున్నాయి. మన దేశంలో ఈ దిశగా ఏ చర్చా లేకపోయినా 12 ఏళ్లలోపు పిల్లలను ఒంటరిగా ఇంట్లో వదిలి రెండు మూడు గంటలు వెళ్లడం వారి పట్ల ‘నిర్లక్ష్యం’ వహించడమేనని నిపుణులు అంటున్నారు.

గ్యాస్, కరెంట్‌ ప్లగ్గులు
ఇంటి నుంచి పెద్దలు పిల్లల్ని వదిలి వెళ్లేప్పుడు తప్పనిసరిగా గ్యాస్‌ను, అనవసరంగా ఆన్‌లో ఉన్న స్విచ్‌లను (గీజర్‌/ఐరన్‌ బాక్స్‌/మిక్సీ) ఆఫ్‌ చేసి వెళ్లాలి. వాటి దగ్గరకు వెళ్లవద్దని గట్టిగా చెప్పాలి. ఒక ఫోన్‌ ఇంట్లో వదిలి వెళ్లాలి. దానికి స్క్రీన్‌ లాక్‌ ఉంటే ఎలా తీసి కాల్‌ చేయాలో నేర్పించాలి. అంతే కాకుండా అపార్ట్‌వెంట్‌/ఇరుగు పొరుగులలో నమ్మకమైన మిత్రుని నంబర్‌ ఏదో చెప్పి అది ఏ పేరుతో ఫోన్‌లో ఉందో చూపాలి. అర్జెంట్‌ అనిపిస్తే ఆ ఇరుగుపొరుగు వారికి ఫోన్‌ చేయమని చెప్పాలి. తల్లిదండ్రుల నంబర్లు, ఊళ్లోనే ఉన్న దగ్గరి బంధువుల (బాబాయ్‌/పిన్ని) నంబర్లు మొత్తం నాలుగైదు కంఠతా వచ్చి ఉండేట్టు చూడాలి. ఫ్రిజ్‌ మీద కూడా ముఖ్యమైన నంబర్లను కాగితం మీద రాసి అంటించి ఉంచవచ్చు.

తలుపు ఎవరికి తీయాలి
తలుపు ఎవరికి తీయాలి అనేది మరో ముఖ్యమైన సంగతి. అపరిచితులు ఎవరో... స్నేహితులు ఎవరో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. అపరిచితులు ఏం చెప్పినా తలుపు తియ్యనే కూడదని నేర్పాలి. పరిచితులు మీరు లేని టైమ్‌లో వస్తామంటే వద్దని చెప్పడమే మంచిది. వారు మరీ ముఖ్యులైతే పిల్లలకు పరిచయం ఉంటే వారు వచ్చినప్పుడు మాత్రమే తలుపు తీయాలని చెప్పాలి. గ్యాస్‌/పేపర్‌ బిల్‌/ పాల బిల్‌ వీటి కోసం వచ్చినా తలుపు లోపలి నుంచే మళ్లీ రండి అని చెప్పి పంపించేయడం నేర్పాలి. తలుపు లోపలి నుంచి గడి పెట్టుకోవడం లేదా తలుపు తీసి ఉంచి గ్రిల్‌కు తాళం వేసి పెట్టుకోవడం నేర్పాలి. తాళం ఒక గుర్తుండే చోటులో పెట్టుకోవాలని చెప్పాలి. తాళం వేశాక దానిని ఎక్కడో పడేసి మర్చిపోకుండా ఈ ఏర్పాటు. ముఖ్యం ఎవరికీ అనవసరంగా ఫోన్‌ చేయకూడదని ఎవరైనా ఫోన్‌ చేసినా ఇంట్లో ఒంటరిగా ఉన్నానని చెప్పకుండా తర్ఫీదు ఇవ్వాలి.
పదిహేనేళ్లు దాటే వరకూ పిల్లల్ని ఒంటరిగా వదిలితే తప్పక అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ప్రమాదాలను నివారించాలి.

ఆహారం, యాక్టివిటీ
పిల్లలు ఒంటరిగా ఉన్నంత మాత్రాన వాళ్లు ఇంట్లో ఏ పని చేసినా చెల్లుబాటు అవుతుందన్న సంకేతం ఇవ్వరాదు. ‘కాసేపు టీవీ చూడు... కాసేపు ఫోన్‌ చూడు... మిగిలిన టైమ్‌లో ఇదిగో ఈ పుస్తకం చదవాలి, ఈ బొమ్మ గీయాలి, ఈ పజిల్స్‌ ఫిల్‌ చేయాలి’... ఇలా టాస్క్‌ ఇచ్చి వెళ్లాలి. మీరొచ్చే సమయానికి టాస్క్‌ పూర్తి చేస్తే మెచ్చుకోలు కానుకలు తప్పక ఇవ్వాలి. బయటకు వెళ్లే పని ఆలస్యం అవ్వొచ్చు ఒక్కోసారి. అందుకని వారి కోసం స్నాక్స్‌ తప్పక పెట్టాలి. ఏదైనా తేలికపాటి టిఫిన్‌ బాక్స్‌ పెట్టి ఏది ఎప్పుడు తినాలో చెప్పాలి. పిల్లలు మందులు వేసుకోవాల్సి ఉంటే ఆ మందులు మనమే ఒక దగ్గర పెట్టాలి... అధిక డోసు ప్రమాదం లేకుండా... వేరే మందులు వేసుకోకుండా.

నో హెడ్‌ఫోన్స్‌
పిల్లలు హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని సినిమా/ కంప్యూటర్‌/ ఫోన్‌ చూడటాన్ని ఆ టైమ్‌లో నిషేధించాలి. ఎందుకంటే ఫుల్‌ వాల్యూమ్‌ పెట్టుకుని హెడ్‌ఫోన్స్‌లో వింటుంటే బెల్‌ కొట్టినా ఫోన్‌ మోగినా వినపడదు. తల్లిదండ్రులు కాల్‌ చేస్తే రెస్పాన్స్‌ రాకపోతే అనవసరంగా కంగారు పడాల్సి వస్తుంది. అలాగే తలుపు తీసి పెట్టి పక్కింటికి వెళ్లడం, కారిడార్‌లో ఆడుకోవడం, ఇంటి బయట సైకిల్‌ తొక్కడం చేయరాదని చెప్పాలి. పెద్దలు ఎంత ముఖ్యమైన పని మీద బయటకెళ్లినా మధ్య మధ్య పిల్లలకు ఫోన్‌ చేసి వారు ఏం చేస్తున్నారో కనుక్కోవాలి. అలాగే వెళ్లే ముందు ఇరుగు పొరుగున ఉన్న నమ్మకమైన వ్యక్తులకు తాము బయటకు వెళుతున్నట్టు తెలియ చేస్తే వారు ఒక కన్ను వేసి పెట్టే వీలుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement