పిల్లల్లో మెడనొప్పి అంతగా కనిపించకపోయినా అరుదేమీ కాదు. వాళ్ల రోజువారీ అలవాట్లవల్ల కొద్దిమందిలో అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు వీపు వెనక పుస్తకాల బ్యాగ్ తాలూకు బరువు మోస్తూ... మెడను ముందుకు చాపి నడుస్తూ ఉండటం, స్కూళ్లలో బెంచీల మీద కూర్చుని... చాలాసేపు మెడ నిటారుగా ఉంచడం, కంప్యూటర్ మీద ఆటలాడుతూ చాలాసేపు మెడను కదిలించకుండా ఉంచడం వంటి అనేక అంశాలతో మెడనొప్పి రావచ్చు. ఇలాంటి పిల్లల చేత తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించేలా చేయడం వల్ల మెడనొప్పిని నివారించవచ్చు.
స్కూల్లో తమ బెంచీ నుంచి డెస్క్‌కూ / ఇంట్లో తమ రీడింగ్ టేబుల్ నుంచి తమ కుర్చీకీ తగినంత దూరంలో ఉందా, పిల్లల ఎత్తుకు తగినట్లుగా ఉందా అన్నది చూసుకోవాలి. లేదంటే తల్లిదండ్రులు ఆ రీడింగ్ టేబుల్ ఎత్తును అడ్జెస్ట్ చేయాలి. వాటికి తగినట్లుగా తమ కూర్చునే భంగిమ (పోష్చర్) సరిగా ఉందా అన్నది కూడా తల్లిదండ్రులు పరిశీలించాలి. ∙స్కూల్లో లేదా ఇంట్లో... చదివే సమయాల్లో వెన్నును కంఫర్టబుల్‌గా ఉంచుకోవాలి. వెన్ను ఏదో ఒక వైపునకు ఒంగిపోయేలా కూర్చోకూడదు. అదే పనిగా చదవకుండా మధ్య మధ్య గ్యాప్ ఇస్తుండాలి. ∙పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతూ... మెడను చాలాసేపు నిటారుగా ఉంచడం సరికాదు.
మధ్యమధ్యన మెడకు విశ్రాంతినిస్తూ ఉండాలి. ∙పిల్లలు వీడియోగేమ్స్ మాత్రమే కాదు... గ్రౌండ్‌లోనూ ఆటలాడేలా పేరెంట్స్ ప్రోత్సహించాలి. ∙ఊబకాయం ఉన్న పిల్లల్లో మెడనొప్పి వచ్చే అవకాశాలెక్కువ. అందుకే వారు తినే తినుబండారాలు ఆరోగ్యకరంగా ఉండాలి. వీలైనంతవరకు జంక్‌ఫుడ్ /బేకరీ ఐటమ్స్‌కు దూరంగా ఉంచాలి. ఈ జాగ్రత్తలు మెడనొప్పిని నివారిస్తాయి. అప్పటికే మెడనొప్పి ఉంటే తగ్గిస్తాయి. ఇవి పాటించాక కూడా తగ్గకపోతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment