
బెస్ట్ పేరెంట్స్, పిలల పెంపకం గురించి సైకాలజీలు, ప్రముఖులు విద్యావేత్తల ప్రసంగాల్లో వింటుంటాం. కానీ వాటిని ఓ ఏడేళ్ల చిన్నారి అలవోకగా ఆశ్చర్యపరిచేలా చెబుతుంటే..ఇది నిజమేనా అనిపిస్తుంది కదా..!. కానీ ఇది నమ్మకతప్పని సత్యం. పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ చిన్నారి తల్లిదండ్రుల పెంపకం, చిన్నారులతో పేరెంట్స్ ఎలా వ్యవహరించాలి వంటి వాటి గురించి విస్తుపోయేలా చెప్పేస్తుంది. ఆ ప్రసంగం ఓ చిన్నారి చెబుతున్న చిట్టి మాటల్ల లేవు. ఓ అనుభవశాలి లేదా నిపుణులు చెబుతున్న విలువైన పాఠాలే వలే ఉన్నాయి. చిన్నారుల వద్ద అపార జ్ఞానం ఉంటుందనేందుకు ఈ చిన్నారే ఉదాహరణ అనేలా అద్భతంగా ప్రసంగించింది పేరెంటింగ్ గురించి. మరీ ఆ చిన్నారి ఎవరు..? ఆమె చెబుతున్న అద్భుతమైన పేరెంటింగ్ చిట్కాలేంటో చూద్దామా..!.
టెడ్ స్పీకర్ మోలీ రైట్ అనే ఏడేళ్ల చిన్నారి పేరెంటింగ్ గురించి చక చక మాట్లాడేస్తోంది. పిల్లలతో ప్రతి పేరెంట్ సంభాషణ ఎలా ఉంటుందనే ప్రశ్న లెవనెత్తి.. ప్రతి తల్లిదండ్రులు తమ పెంపకం గురించి ఆలోచించుకునేలా ప్రసంగించింది. సైకాలజీ నిపుణుల మాదిరిగా పిల్లలను ఎలా పెంచితే మంచిదో విపులంగా వివరించింది.
ఇవన్నీ ఓ ఏడేళ్ల చిన్నారి నోటి నుంచి వస్తున్నాయా..? అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ చిన్నారి స్పీచ్ తల్లిదండ్రులందర్నీ తమ తీరుపై విశ్లేషించుకునేలా చేస్తుంది. అంతేగాదు తమ పిల్లల తెలితేటలను ఎంత తక్కువగా అంచనావేస్తున్నామనే విషయాన్ని గ్రహించేలా చేస్తుంది కూడా.
చివరగా ఆమె ప్రసంగంలో పేరెంటింగ్ అనేది జీవితాంత నేర్చుకునే ఓ అద్భుతమైన ప్రక్రియ అని, ఇక్కడ చిన్నారులే వారికి గురువుల్లా కొత్త కొత్త విషయాలను తెలుసుకునేలా చేస్తారంటూ వయసుకి మించి పెద్ద పెద్ద విషయాలను చెప్పింది ఆ చిన్నారి మోలీ. అంతేగాక చాలామంది తల్లిదండ్రులు చేసే సాధారణ తప్పులని ఎత్తి చూపడమే కాకుండా పిల్లలతో ఎలా వ్యవహరించాలనే దానిపై దృష్టి సారించేలా చేసింది.
అలాగే పిల్లలకు పేరెంటింగ్‌గా అందివ్వాల్సిన భద్రత, సంరక్షణ గురించి నొక్కి చెప్పింది. దీంతోపాటు తల్లిదండ్రులు ఎక్కువ సేపు ఫోన్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లకే పరిమితం కావొద్దనే విషయాన్ని హైలెట్ చేసింది. పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ప్రతి తల్లిదండ్రులు వారితో గడిపేందుకు సమయం కచ్చితంగా కేటాయించాలని నొక్కి చెప్పింది. ఆ చిన్నారి టెడ్ స్పీకర్ నుంచి ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సి అమూల్యమైన పాఠాలేంటో చూద్దామా..!.
గర్భం నుంచే కనెక్షన్ ప్రారంభం..
తల్లి గర్భం ధరించినప్పటి నుంచే తల్లిదండ్రులుగా ఉండటం ప్రారంభమవుతుందన్న విషయాన్ని గుర్తు చేసింది. కడుపుతో ఉన్నప్పటి నుంచే పొట్టను నిమురుతూ శిశువుతో బలమైన బంధాన్ని ఏర్పరుచుకుంటారని, అక్కడ నుంచి ఇరువురి మధ్య బలమైన బంధం ఏర్పడుతుందని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని పరిశోధనలు సైతం జనన పూర్వం నుంచే తల్లి ద్వారా శిశువుకి భద్రతా భావాన్ని ప్రభావితం చేస్తుందని వెల్లడించాయి.
సేవా, కమ్యూనికేషన్
శిశువుగా ఉన్నప్పుడు చిన్నారులకు చేసే సేవ, వారితో జరిపే కమ్యూనికేషన్‌ని బట్టి తల్లిదండ్రులే తన సంరక్షకులని గుర్తించడం జరుగుతుందని అంటోంది. అలాగే అధ్యయనాల్లోకూడా నవజాత శిశువులకు చేసే సపర్యలు, వారితో మాట్లాడే చర్య ఇవన్నీ భావోద్వేగా మేధస్సుకి కీలకమైన నాడీ సంబంధాలను బలపరుస్తుందని పేర్కొంది కూడా.
ఆట రీచార్జ్ అయ్యేలా చేస్తుంది..
పిల్లలు ఆట ద్వారా చాలా నేర్చుకుంటారు. కథ చెప్పడం, పాడటం వంటి కార్యకలాపాలతో వారికి సమస్య పరిష్కార సామర్థ్యాలను, భావోద్వేగ నియంత్రణ, సామాజిక నైపుణ్యాలు తదితరాలు మెరుగుపడతాయని అంటోంది చిన్నారి మోలీ. ఆట మాదిరిగా సాధన చేయిస్తే చదువులో కూడా మెరుగ్గా రాణించగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.
నోరు విప్పనివ్వండి..
మనలో చాలామంది పిల్లలు గట్టిగా మాట్లాడకూదనో లేక ఎదురు తిరగకూడదనో గమ్మున మాట్లాడనివ్వరు పెద్దలు. కానీ ఇది వారి ఎదుగుదలన అణిచేస్తుందట. ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం కూడా ఉంటుందట. వారి భావాలను, ఆలోచనలను చెప్పే స్వేచ్ఛని ఇస్తే... బలమైన కమ్యునికేషన్ నైపుణ్యాలు అవడతాయి.
బొమ్మలు కంటే విలువైంది వారితో గడపటం..
విహార యాత్రలకు తిప్పడం, విలువైన బొమ్మలు కొనడం వంటి వాటికంటే ముఖ్యమైనది వారితో గడపటం. వారి అంతులేని ప్రశ్నలకు ఓపికగా మీరిచ్చే సమాధానాలు వారికి భావోద్వేగ భద్రత, స్వీయ ప్రాముఖ్యతను తెలియజేస్తుందట.
మన సర్కిలే వారి భవిష్యత్తుకి సోపానం..
మనకు ఉండే స్నేహితులు, బంధువుల కారణంగా వారికి మంచిగా పెరిగే వాతావరణాన్ని అందిస్తుందట. ప్రపంచ దృష్టి కోణంపై వారికొక అవగాహన ఏర్పడతుందట. ఇదే వారికి ఉపాధ్యాయల పట్ల ఎలా వ్యవహరించాలనేది తెలుసుకునేలా చేస్తుందట కూడా.
వారి ఆలోచనకు విలువ ఇద్దాం..
తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పుల్లో ఒకటి వారి కలలను పిల్లలపై రుద్దడమేనని చెబుతోంది చిన్నారి మోలీ. వారేమి అవ్వాలనుకుంటున్నారు, అభిరుచి తదితరాల గురించి తెలుసుకుని మార్గదర్శకత్వం చేయాలే తప్ప మన ఆశలను వారిపై బలవంతంగా రుద్దకూడదట. అప్పుడే పిల్లలు మంచిగా వృద్ధిలోకి రాగలుగుతారంటోంది మోలీ. పిలల్లు అభివృద్ధి చెందేలా పెంచుతున్నామా లేదా అని విశ్లేషించుకునేలా..? అద్భుతంగా ప్రసంగించింది పిన్న వయస్కురాలైన టెడ్ స్పీకర్ మోలీ.
(చదవండి: పని చేసే తల్లుల బ్రెస్ట్ ఫీడింగ్ పాట్లు..! నటి రాధికా ఆప్టే సైతం..)
Comments
Please login to add a commentAdd a comment