తింగరి సన్నాసిలా ఆలోచిస్తాడు.. రాకేష్‌లో ఉన్న లోపమేంటి? | Amarnath Vasireddy On Corporate Education System And Parenting | Sakshi
Sakshi News home page

తింగరి సన్నాసిలా ఆలోచిస్తాడు.. రాకేష్‌లో ఉన్న లోపమేంటి?

Published Tue, Aug 2 2022 7:23 AM | Last Updated on Tue, Aug 2 2022 10:21 AM

Amarnath Vasireddy On Corporate Education System And Parenting - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అదో కార్పొరేట్   స్కూలు. ఏడో  తరగతి .టీచర్ ఇంగ్లీష్ లో  పాఠం చెబుతున్నాడు .‘ సూర్యుడు , భూమి ఒకే సరళ రేఖ లో వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది . అమ్బరా, పెనంబ్రా.. ‘ అంటూ  పాఠ్యపుస్తకం లో ఉన్నది వున్నట్టుగా , గడగడా పాఠం అప్పచెప్పినట్టు టీచర్ చెప్పుకొంటూ పోతున్నాడు . రాకేష్ కు ఇదేదీ అర్థం  కావడం లేదు.  ‘ సర్ .. భూమి చంద్రుడు పక్కపక్కనే ఉంటారు కదా . మధ్యలో ఎటువంటి అడ్డు లేదు కదా ?  మరి చంద్రుడు ఎందుకు కనిపించడు ?‘ అడిగాడు. టీచర్ తడబడుతూ‘ రెండింటికి మధ్య సూర్యుడు వస్తాడు అని చెప్పా కదా ? అయినా ఎప్పుడూ అనుమానాలే . వెదవ  . నువ్వు ... నీ  మొఖం . నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే . క్లాస్ బయట అరగంట నిలబడు‘ శిక్ష విధించాడు.రాకేష్ క్లాస్ బయట నిల్చొన్నాడు . క్లాసులో పిల్లలు హేళనగా నవ్వుతున్నారు . వారు పాఠాన్ని బట్టి కొట్టడం లో దిట్టలు

తనకేమో ఆలా చేయడం ఇష్టం ఉండదు . ప్రతిదీ ఆలోచిస్తాడు . సూర్యుడు,  భూమికి చంద్రుడికి మధ్యన వచ్చేస్తే  భూమి భస్మీపటలం అయిపోతుందని తన అనుమానం . తనకింకా ఎన్నో అనుమానాలు . ఊటీ , సిమ్లా కొండ ప్రాంతాలు . కొండపైకి పొతే సూర్యుడికి కాస్తో కూస్తో దగ్గరగా  పోయినట్టే కదా . అంటే ఎక్కువ వేడి ఉండాలి . కానీ కొండ ప్రాంతాలు ఎందుకు చల్లగా ఉంటాయి ? భూమి  తిన్నగా ఉండదు . తన చుట్టూ తానూ తిరుగుతూ,  సూర్యుడి చుట్టూ తిరుగు తుంటుంది  . దీనికి పెట్రోల్ ఎవడు కొట్టిస్తాడు ?  ఇంత శక్తి ఎక్కడినుంచి వస్తుంది ? ఉత్తర ధ్రువ దేశాలు సరే . న్యూజిలాండ్ లాంటి దేశాల్లో మనుషులు,  వాహనాలు తలకిందులుగా వేలాడుతుంటాయా ? సముద్రాల్లోని నీరు కిందకు కారిపోదా? 

నదిలోని నీరు తాగడానికి వీలుగా  ఉంటుంది . అది సముద్రం లో కలిస్తే ఎందుకు ఉప్పగా మారి పోతుంది? ఉత్తర భారత దేశం లోని నదులు జీవ నదులు . గోదావరి కృష్ణ నదులు ఎందుకు సంవత్సరమంతా ప్రవహించవు ? హుస్సేన్ సాగర్ లో ఎందుకు మంచు కురవదు ?

బకెట్ నీటిలో  కాళ్ళు  పెట్టి ఎండలో నిల్చుంటే పచ్చని చెట్లలా తాను కూడా ఆహారాన్ని తయారు చేసుకోవచ్చా? మనిషి కోతి  నుంచి పరిణామం చెందితే ఇంకా కోతులు ఎందుకున్నాయి ? అవి మనుషులుగా ఎప్పుడు మారుతాయి ?  ఇవన్నీ అడగాలని పిస్తుంది .  టీచర్లు   కొడుతారు  . క్లాస్మేట్స్ నవ్వుతారు . అందుకే  నోరు మూసుకొంటాడు .

రాకేష్ ఇంటికి వచ్చాడు . ఇంట్లో న్యూ జెర్సీ తాత ఉన్నాడు. అయన ఎప్పుడు ఇంటికి వచ్చినా,  అమెరికా లోని తన కొడుకు కూతురు గురించి గొప్పలు  చెబుతాడు . ఇండియా వేస్ట్ అంటాడు . అయన తో మాట్లాడాలి అని ఎన్నో సార్లు అనుకొన్నాడు . అమెరికా జీవన విధానం ఎందుకు గొప్పదని అయన అనుకొంటున్నాడు అని తెలుసుకోవాలి  .
ఇంటికి రావడం తోటే మమ్మీ ‘ రాకేష్ .. నువ్వు పోయి చదువుకో . హోమ్ వర్క్ చేసుకున్నాక డిన్నర్ . అటు పై రెండు పాఠాలు అప్ప చెప్పాలి ‘ అని టార్గెట్ ఇచ్చింది . ఉసురో మంటూ వెళ్లి తలుపు వేసుకొన్నాడు .

పుస్తకం తెరిచాడు. తన మదినిండా ప్రశ్నలే ?అమెరికా డాలర్ ఒక్కటికి మనది 80 రూపాయిలా ? ఎందుకు ? మన డబ్బుకు అంత తక్కువ విలువ ఎందుకు ? అసలు దీన్ని ఎవరు నిర్ణయిస్తారు ? ఒక డాలర్ కు ఒక రూపాయి అయితే అమెరికా లోని మనవారందరూ తిరిగి వచ్చేస్తారా ? కొడుకు కూతురు అక్కడ స్థిరపడితే కొంతమంది అంకుల్స్ ఇక్కడ  ప్లాట్స్ కొంటారెందుకు ? తాను అమెరికాకు రెండు సార్లు వెళ్ళాడు . వాళ్ళు తలనుంచి కిందదాకా లావుగా ఉంటారు . ఇక్కడ పెద్దవారు కడుపు దగ్గరే లావుగా ఉంటారెందుకు ? అమెరికా వాతావరణానికి తెల్లబడితే అక్కడికి వెళ్లిన ఇండియన్స్ ఎందుకు బ్రౌన్ కలర్ లోనే ఉన్నారు  ?

భూమి తిరుగుతూ ఉంటుంది కదా. అమెరికాకి పోవడానికి విమానమే ఎక్కాలా ? గాలిలో కొన్ని గంటలు నిలబడితే హైదరాబాద్ , ముంబై , అరేబియా సముద్రం , అరబ్ .. ఇలా నెమ్మదిగా కిందకు చూస్తూ అమెరికా వచ్చినప్పుడు దూకొచ్చుగా ?ఇండియా ఎందుకు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం గానే ఉంది ? ప్రతి ఇంటికి నోట్ల ప్రింటింగ్ మెషిన్ ఇచ్చేస్తే అందరూ దండిగా నోట్లు ముద్రించుకొని కోటీశ్వరులు అయిపోవచ్చుగా ?‘ ఆలోచనల తో బుర్ర తిరుగుతోంది .

ఈ లోగా అమ్మ నాన్న రూమ్ లోకి వచ్చారు . తనేమో తన క్లాస్ మెట్ దగ్గర తీసుకొన్న ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ పై ఒక చిన్న పుస్తకం చదవాలి అని  తెరిచి ఉంచాడు  . రోబో లు  మన జీవితాలను ఎలా మార్చేస్తాయి అని అందులో వివరించారు.‘ చూడండి  బాబాయ్ ! ఇదీ వీడి వాలకం . వెదవ!  అసలు పుస్తకాలు  చదవడు. బుర్ర తక్కువ సన్నాసి .ఎప్పుడూ ఏదో కాలక్షేపం పుస్తకాలు కావాలంటాడు .   పిచ్చాడిలా ఆలోచిస్తుంటాడు. గౌతమ బుద్ధుడు అనుకొంటాడు . పక్కింటి అమ్మాయి సెంట్ పర్సెంట్ . వీడు ముప్పై  నలబై . రేపు పొద్దున్న దాని దగ్గర  నౌకరు అవుతాడు . ఆలా కాదులే .. నువ్వు ఈ సారి అమెరికా కు వెళుతున్నప్పుడు చెప్పు .. వీడిని పంపుతాను .  ఇంట్లో నౌకర్లు దొరకడం కష్టం అంటున్నావుగా . అక్కడ పనిలోపెట్టుకోమని చెప్పు‘ .. అమ్మ చెబుతోంది. నాన్న,  తాను ఫ్రెండ్ దగ్గరనుంచి బతిమలాడి తీసుకొని వచ్చిన పుస్తకాన్ని చించేసాడు  .

తనకు మొదట్లో అవమానంగా ఉండేది . ఇప్పుడది మామూలయిపోయింది  . తనకు బుర్ర లేదు . పిచ్చి ఆలోచనలు చేస్తాను .. తాను నౌకరు ఉద్యోగానికి మాత్రేమే  పనికొస్తాను ‘ డాడీ,  మమ్మీ , స్కూల్ లో టీచర్ లు చెప్పేది ఇదే . విని విని దీనికే ఫిక్స్ అయిపోయాడు. ఇంటికి వెళితే అమ్మ చెప్పే మాటలు  ..‘ పుస్తకం తీయి . చదువు . నోట్లో గొణుక్కొంటావేంటి ? గట్టిగా చదువు . చదివింది అరగంటలో పొల్లు పోకుండా అప్ప చెప్పాలి‘. నాన్న లేట్ నైట్ ఇంటికి వస్తాడు . ఆదివారాలు ఆయన అడిగే ప్రశ్నలు ‘ ఎన్ని మార్కులు వచ్చాయి ? ఎందుకింత తక్కువ మార్కులు?  ‘  మార్కులు  చెబితే‘ అసలే నాకే పుట్టవారా నువ్వు ? నీ మొఖం చూపొద్దు .  ఈ సారి ఇదే మార్కులు వస్తే హుస్సేన్ సాగర్ లో దూకి చావు . ఇంటికి మాత్రం రావొద్దు .‘ అని మాటలు . 

తనకు బతకాలనిపించడం లేదు . ఇది తన ఇల్లేనా ? ఈ ఇంట్లో తన స్థానం ఏంటి ? అమ్మ నాన్న కు తనపై ఎందుకింత కోపం ? అర్థం కాని పాఠాల్ని బట్టి గొట్టడం తనకు ఇష్టం ఉండదు . చేతకాదు .ఏమి చెయ్యాలో అర్థం కాదు.ఐఐటీ లో సీట్ సాధించి అమెరికా లో జాబ్ చెయ్యాలి అని తల్లితండ్రులు ఎప్పుడో డిసైడ్ చేసేసారు . ఐఐటీ ఫౌండేషన్ కోర్స్. తనకు మాత్రం స్పేస్ సైంటిస్ట్ లేదా ఎకనామిస్ట్ కావాలని ఆశ. ఆ మాట చెబితే అందరూ పగలపడి నవ్వుతారు . ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా?  అంటారు . ఉట్టి అంటే ఎలా ఉంటుందో తనకు తెలియదు. స్వర్గానికి ఎక్కడం ఎందుకు ? పుణ్యం చేస్తే దేవుడే తీసుకొని పోతాడు కదా ? తన అనుమానం . తనకే ఎందుకిన్ని అనుమానాలు ? 

ఊళ్ళో అమ్మమ్మ ఉంది . సమ్మర్ హాలిడేస్ లో ఊరిలో గడపాలని తన ఆశ . బియ్యం చెట్లు ఎలా బియ్యం పండ్లను కాస్తాయో చూడాలి . చెరకును గానుగ ఆడితే నల్లటి బెల్లం వస్తుందట . అదే షుగర్ ఫ్యాక్టరీ కు పంపితే తెల్లటి చక్కర. ఎందుకిలా ?ఊళ్ళో ఒకప్పుడు బావులు ఉండేవట . వాటిలో ఆ రోజుల్లో పిల్లలు ఈత కొట్టేవారట . ఇప్పుడేమో బోర్ బావులు . ఎంత లోతుకు డిగ్ చేసినా నీరు రావడం లేదు . ఎందుకు ? గ్రామాల్లో రైల్వే పట్టాలను మరుగుదొడ్లుగా వాడుతారెందుకని ? మలం ఎప్పుడూ కంపుకొడుతుందా ?  లేక హీరోలు హీరోయిన్ లు అమెరికా లోని తెల్లవారు .. వీరి మలం సువాసనను కలిగి ఉంటుందా ? అసలు మలం ఎందుకు వస్తుంది. మనం తినే ఆహారం లో అరగని పదార్థలు ఉంటేనే కదా ? రోజూ పోషకాలను ఇచ్చే టాబ్లెట్స్  సెలైన్ వాటర్ తీసుకొంటే టాయిలెట్లకు వెళ్లాల్సిన అవసరముండదు కదా ?

అమ్మమ్మ వూరికి ఎప్పుడు మూడో క్లాసులో ఉన్నప్పుడు ఒక సారి తీసుకొని వెళ్లారు . అదీ పది రోజులు . సమ్మర్ హాలిడేస్ వస్తే తనకు స్పెషల్ క్లాసులు . మాథ్స్ ఫిజిక్స్ లో తాను వీక్ అట .
తనకేమో తనకు చదువు చెప్పే టీచర్ లకే సబ్జెక్టు రాదు అనిపిస్తుంది . నాలుగో క్లాసులో మాథ్స్ టీచర్ ఒక ప్రశ్న అడిగాడు . నెలకు 29  రోజులున్న నెల ఏది ? అని . తాను జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రతినెల కు 29  రోజులు ఉంటాయి అని చెబితే టీచర్ అరగంట గోడ కుర్చీ వేయించాడు . తన తప్పేంటో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదు . 

మొన్న  ఫిజిక్స్ క్లాస్ .. ఆకాశం లో రాత్రి ఇన్ని నక్షత్రాలు చూసాము అని పిల్లలు టీచర్  తో చెబుతున్నారు . ఇప్పుడు ఆకాశం లో ఉన్న నక్షత్రాలను మన జీవిత కాలం లో చూడలేము మనకు కనిపించేది ఎప్పుడో తాతల కాలం నాటి  దృశ్యం అని తాను చెబితే టీచర్ గొడ్డుని బాదినట్టు బాదేశాడు. 

రాకేష్ తండ్రి రియల్ ఎస్టేట్ కంపెనీలో మేనేజర్. తల్లి గృహిణి . ఒకడే కొడుకు. రియల్ బూమ్ ఉన్నప్పుడు పరవాలేదు . మిగతా టైం లో ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా తెలియడం లేదు. తాము పడుతున్న బాధలు కొడుకు పడకూడదు . బంధువుల పిల్లలు ఎక్కువమంది అమెరికా లో సెటిల్ అయ్యారు . హ్యాపీగా ఉన్నారు. తమ కొడుకు ఐఐటీ లో సీట్ కొట్టాలి . జీవితం లో స్థిరపడాలి . పిల్లాడి విద్య కోసం వీరు ఎంత త్యాగానికైనా సిద్ధం . సంవత్సరానికి తనకు తన భార్య కు మూడు జతల బట్టలే .నగ కొనాలన్న ఆశ ఆమె మనసులోనే దాచేసుకొంది. సంవత్సరానికి లక్ష ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్ లో ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ లో చేర్పించారు . వీడేమో చదవడు. తింగరి సన్నాసి లా ఆలోచిస్తాడు. అదీ రాకేష్ తల్లితండ్రుల మనోవేదన . 

ఇప్పడు రాకేష్ ని వెంటబెట్టుకొని దంపతులిద్దరూ ఒక సైకియాట్రిస్ట్ వద్దకు వచ్చారు . రాకేష్ లోని లోపం ఏంటి ?దీన్ని  ఎలా సరిదిద్దాలి ? వాడిని దారిలో ఎలా పెట్టాలి అదే వారిముందున్న సమస్య. మీకేమైనా సమాధానం  తెలిస్తే చెప్పండి . పాపం...  కన్న బిడ్డను ప్రాణంగా చూసుకొంటూ బతుకుతున్న ఆ తల్లితండికి సాయం  చేయండి.ఇది రాకేష్‌ ఒక్కడి సమస్యే కాదు.. మన చుట్టున్న లక్షలాది మంది పిల్లలు, వారి తల్లితండ్రుల సమస్య. ముందు సమాజంలో పేరుకుపోయిన కొన్ని భావనలను గుర్తించండి. పిల్లలకు మేలు చేస్తున్నామా? కీడు చేస్తున్నామా తెలుసుకోండి. 


-అమర్నాద్ వాసిరెడ్డి
ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement