కాలచక్రం | Funday story world in this week | Sakshi
Sakshi News home page

కాలచక్రం

Published Sun, Sep 30 2018 1:29 AM | Last Updated on Sun, Sep 30 2018 1:29 AM

Funday story world in this week - Sakshi

అంబాలాల్‌ వైవాహిక జీవితంలోని ఓ దశాబ్ద కాలం సంతాన సౌఖ్యం లేకుండానే గడిచిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, డాక్టర్లతో పాటు స్వాములు, బాబాల చుట్టూ తిరిగినా, చివరికి మాయమంత్రాలు ప్రయోగించినా ఆయనకు సంతాన భాగ్యం కలగలేదు. ఇక తనకు సద్గతి ప్రాప్తించే మార్గం లేదనుకున్నాడు. తను పోయాక కొరివి పెట్టేవాడు లేనట్టే అని నిర్ధారణకొచ్చాడు. అయితే పదకొండో సంవత్సరం అద్భుతం జరిగింది. ఆయన భార్య రుక్మిణి గర్భం దాల్చింది. నవమాసాల తర్వాత పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. అంతవరకు నిస్సారంగా గడిచిన ఆ దంపతుల జీవితంలోకి హఠాత్తుగా వసంతం వచ్చినట్టయింది. లేకలేక కలిగిన బిడ్డ నామకరణం వేడుకని అంబాలాల్‌ వైభవంగా జరిపాడు. బాగా ఆలోచించి కొడుక్కి భగవత్‌ ప్రసాద్‌ అనే పేరు పెట్టాడు. ఆ బిడ్డ నిజంగానే భగవంతుని ప్రసాదం గనుక ఆ పేరు పెట్టాడు. పైగా భగవత్‌ని పక్కన పెట్టినా ప్రసాద్‌ అన్న పొట్టి పేరు పలకటానికి సౌకర్యంగా ఉంటుంది.

భగవత్‌ ప్రసాద్‌ తొలి పుట్టినరోజుని అంబాలాల్‌ ఘనంగా జరిపాడు. వీధిలోని వారందర్నీ పిలిచి స్వీట్లు పంచిపెట్టాడు. తనకొచ్చే నెలజీతాన్ని ఒక్కరోజులోనే ఖర్చు పెట్టేశాడు. అంబాలాల్‌కి తన ఏకైక కుమారుడంటే వల్లమాలిన ప్రేమ. ఎండవల్ల పిల్లవాడి శరీరం వేడెక్కినా కంగారుపడి వెంటనే పిల్లల డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లేవాడు. ఊర్లో దొరికే అన్ని రకాల ఆటబొమ్మల్ని తెచ్చి పిల్లవాడికిచ్చేవాడు. మూడేళ్ల వయసు రాగానే భగవత్‌ప్రసాద్‌ని నగరంలోనే పేరు పొందిన స్కూల్‌లో చేర్పించాడు. ప్రతిరోజూ ఉదయం తనే పిల్లవాణ్ణి స్కూలుకి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేవాడు. సాయంత్రం స్కూలు వదలకముందే అక్కడికెళ్లి మైదానంలో కొడుకు కోసం ఎదురుచూస్తూ కూర్చునేవాడు. ఇంట్లో ఉన్నంతసేపు కూడా పిల్లవాడి బాధ్యత తనదే. భార్యని ఇంటి పనులకే పరిమితం చేశాడు.ఒక్కమాటలో చెప్పాలంటే అంబాలాల్‌ తన కొడుకుని అచ్చం ఓ రాకుమారునిలా పెంచాడు. అతను అడిగిన దాన్ని ఆగమేఘాల మీద తీసుకొచ్చి ఇచ్చేవాడు. చాక్లెట్‌ తింటానంటే చాక్లెట్‌ ప్యాకెట్‌ తీసుకొచ్చేవాడు. బిస్కెట్‌ కావాలంటే నాలుగైదు రకాల బిస్కెట్లు తీసుకొచ్చేవాడు. సినిమాకెళతానంటే సినిమాకి, పార్కుకెళతానంటే పార్కుకి తీసుకెళ్లేవాడు. అంబాలాల్‌కి వచ్చే జీతంలో ఓ పెద్ద భాగం కొడుకు విలాసాలకే ఖర్చయ్యేది.దాంతో నెలాఖరులో డబ్బుకి కటకట ఏర్పడి కొంత అప్పు చేయాల్సి వచ్చేది. కానీ కొడుకు ఆనందం కన్నా అప్పులు ముఖ్యం కాదు. ఈ రోజు కొడుకు కోసం చేస్తున్నదంతా వృథా కాదు.వృద్ధాప్యంలో ఇదే కొడుకు తనను ఊతకర్రలా ఆదుకుంటాడని అంబాలాల్‌ తన మనసుకు నచ్చచెప్పుకొనేవాడు. చిన్నతనంలోనే కొడుక్కి అడిగిందల్లా ఇచ్చేస్తూ విలాసాలకు అలవాటు చేస్తే రేపు పెద్దయ్యాక అతను మొండిగా తయారవుతాడని అంబాలాల్‌ని అప్పుడప్పుడు భార్య అడ్డుకొనేది. కానీ లేకలేక కలిగిన కొడుకు పట్ల భర్తకి గల ప్రేమను చూసి ముచ్చటపడి కోపాన్ని దిగమింగుకొనేది.
అదృష్టవశాత్తు నాలుగేళ్ల తర్వాత అంబాలాల్‌ దంపతులకు మరో కొడుకు పుట్టాడు. భార్యాభర్తలిద్దరూ ఆనందంతో పొంగిపోయారు.

అయితే ఇంట్లోకి కొత్త కుటుంబసభ్యుడు రావడంతో ఖర్చు పెరిగింది. దాంతో అంతవరకు భగవత్‌ప్రసాద్‌ కోసం పెడుతున్న దుబారా ఖర్చుకి కోత పడింది. ఖర్చులో మాత్రమే కాదు, భగవత్‌ప్రసాద్‌ కోసం అంబాలాల్‌ కేటాయించే సమయంలోనూ కోతపడింది. అంతకుముందు అంబాలాల్‌ ఇంటికి రాగానే భగవత్‌ప్రసాద్‌ను ఎత్తుకుని ముద్దుపెట్టుకునేవాడు. ఇప్పుడు తండ్రిని చూసి భగవత్‌ప్రసాద్‌ ‘నాన్నా... నాన్నా’ అని పిలుస్తుంటే వాణ్ణి ఎత్తుకోవడానికి చేతులు చాచి అంతలోనే చిన్నకొడుకు ఏడుపు విని ఆ ఎత్తిన చేతులతోనే చిన్నవాణ్ణి ఎత్తుకునేవాడు. అది చూసి భగవత్‌ప్రసాద్‌ కోపంతో ఏడుపు లంకించుకునేవాడు. ఒక్కోసారి మితిమీరిన కోపంతో చేతిలో ఉన్న వస్తువుని తండ్రిపైకి విసిరేసేవాడు. ఓరోజు అతను అలాగే తన చేతిలో ఉన్న కొయ్యబొమ్మను తండ్రిపైకి విసిరేశాడు. అంబాలాల్‌ గబుక్కున తలకాయ కిందికి వంచి తప్పించుకున్నాడు. లేకపోతే ఆ కొయ్యబొమ్మ తగిలి అతడి నెత్తి బొప్పికట్టేది. ఆ దృశ్యం చూసిన రుక్మిణి పరిగెత్తుకొచ్చి కోపంతో భగవత్‌ప్రసాద్‌ చెంప వాయించింది. దాంతో భగవత్‌ బిగ్గరగా ఏడుపు లంకించుకున్నాడు. ఇంతకుముందు ఇదే సంఘటన జరిగి ఉంటే అంబాలాల్‌ భార్యను చెడామడా తిట్టి భగవత్‌ని బుజ్జగించేవాడు. కానీ ఈసారి ఆయన మౌనంగా ఉండిపోయాడు. భార్యను తిట్టలేదు. భగవత్‌ను సముదాయించలేదు. దానికి బదులు చిన్నకొడుకుని ఎత్తుకుని ఆడించసాగాడు. అది చూసి భగవత్‌ కోపంగా మరింతగా రగిలిపోసాగాడు. 

కాలం గిర్రున తిరిగింది.అంబాలాల్‌ కొడుకులిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు.స్వతహాగా పెద్దవాడికి ఉడుకురక్తం కాగా, చిన్నవాడైన రమేష్‌ శాంతిస్వరూపుడు.ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఉన్నంత తేడా ఉండేది. భగవత్‌ చిన్న చిన్న విషయాలకే ఉద్రేకంతో ఊగిపోయేవాడు. ఓసారైతే అలిగి ఇంట్లోంచి బయటికెళ్లిపోయాడు. అంబాలాల్‌ అతని కోసం ఎక్కడెక్కడో వెదికాడు. భగవత్‌ వారం వరకు తన అమ్మమ్మ ఊర్లో ఉండి ఇంటికి తిరిగి వచ్చాడు. కొడుకు వ్యవహారం చూసి అంబాలాల్‌ కలత చెందేవాడు. ఎన్నో నోములు నోచి కన్న ఆ పిల్లవాడి పెంపకంలో ఎక్కడ తప్పు జరిగిందో ఆయనకు అంతు పట్టలేదు. మరోపక్క తమ రక్తమే పంచుకు పుట్టిన చిన్నవాడు అన్నకు పూర్తిగా భిన్నమైనవాడు. ఎప్పుడూ శాంతంగా, నమ్రతగా ఉంటాడు. పెద్దవాడు మనసుని గాయపరచినప్పుడల్లా అంబాలాల్‌ చిన్నవాడి ప్రేమతో సాంత్వన పొందేవాడు.భగవత్‌కి ఉద్యోగం దొరకగానే పెళ్లిచేశాడు అంబాలాల్‌.ఇంటికి కోడలు వచ్చింది. బాగా చదువుకున్న అమ్మాయి. ఉద్యోగం కూడా చేస్తోంది. అందువల్ల ఆమె అత్త మామల్ని పట్టించుకునేది కాదు. పైగా వారిపై భర్తకి లేనిపోని చాడీలు చెప్పేది. ఓరోజు ఏదో విషయం మీద రుక్మిణి కోడల్ని తిట్టింది. దాంతో కోడలు ఏడుపు లంకించుకుంది. అప్పుడే భగవత్‌ ఇంటికొచ్చాడు.తల్లి మీద మండిపడ్డాడు. ఇందులో రుక్మిణి తప్పేం లేదు. అంబాలాల్‌ సర్ది చెప్పబోయాడు. దాంతో భగవత్‌ మరింత రగిలిపోయాడు. మాటా మాటా పెరిగింది. అతడు అప్పటికప్పుడే భార్యతో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.అప్పటికే రిటైరైన అంబాలాల్‌కి పింఛన్‌ డబ్బుతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. కొడుకు హఠాత్తుగా ఇల్లు వదిలేసి పోవటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. ఆయనకి గుండెనొప్పి వచ్చింది. రమేష్‌ వెంటనే తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. గండం తప్పింది. అయితే అప్పటి నుంచి అంబాలాల్‌ రోజూ బీపీ, కొలెస్ట్రాల్‌ తగ్గించే మాత్రల్ని వాడాల్సి వచ్చింది. మరోపక్క రుక్మిణి ఆరోగ్యం కూడా క్షీణించింది.  అదృష్టవశాత్తు అప్పుడే రమేష్‌కి ఉద్యోగం దొరికింది. దాంతో అందరూ నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు. మరో ఏడాదికల్లా రమేష్‌ పెళ్లి జరిగింది. తమ్ముడి పెళ్లికి భగవత్‌ రాలేదు.అయినా అంబాలాల్‌ పట్టించుకోలేదు. కష్టకాలంలో పెద్దకొడుకు తమను వదిలేసి వెళ్లిపోయినప్పుడే అతను చనిపోయినట్టు భావించాడు అంబాలాల్‌. తనకు రమేష్‌ ఒక్కడే కొడుకు అనుకున్నాడు.వృద్ధాప్యంలో తమకు ఊతకర్రలా సాయపడతాడని ఆశలన్నీ చిన్నకొడుకు మీదే పెట్టుకున్నాడు. రమేష్‌ భార్య కూడా భర్తలాగే శాంతంగా, సౌమ్యంగా ఉండేది. అత్తమామల్ని బాగా చూసుకునేది. ఓరోజు రమేష్‌ ఆనందంగా ఇంటికొచ్చాడు. తనకు ప్రమోషన్‌ లభించిందని, కంపెనీ తనను భార్యతో సహా అమెరికాకి పంపిస్తుందని చెప్పాడు. రమేష్‌కది శుభవార్తే కానీ అంబాలాల్‌కి మాత్రం అది దుర్వార్తగా కనిపించింది.ముసలితనంలో కొడుకు, కోడలు లేకుండా తాము ఎలా ఉండాలి? అనే చింత పట్టుకుంది. అయితే కొడుక్కి జీతం పెరగడం వల్ల తమకు సౌకర్యాలు కూడా పెరుగుతాయని ఆశ పుట్టింది. అరవై ఏళ్లుగా తను చీకటి, దుర్గంధం నిండిన పాతకాలం నాటి ఇంట్లోనే బతికాడు. ఇప్పుడు కొడుక్కి ఆదాయం పెరిగితే ఈ పాత కొంప అమ్మేసి మంచి ఇంట్లో హాయిగా ఉండొచ్చనుకున్నాడు. ఈ ఆశతోనే కొడుకు అమెరికాకి వెళ్లటానికి ఒప్పుకున్నాడు. రమేష్‌ కొంత అప్పుచేసి మంచి సూటు, బూటు, టై వంటివి కొనుక్కుని భార్యతో కలిసి అమెరికా విమానమెక్కాడు.

ఎయిర్‌పోర్టులో కొడుకు కోడలు ఎక్కిన విమానం గాలిలోకి ఎగిరి కనుమరుగయ్యే వరకు కళ్లు విప్పార్చి చూశాడు అంబాలాల్‌. ఉదాసీనంగా ఇంటికి తిరిగొచ్చాడు. అతనికి అన్నం సయించలేదు. సరిగా నిద్రపట్టలేదు. అయితే మరుసటి రోజు ఉదయమే అమెరికా నుంచి ఫోనొచ్చింది. ఫోన్‌లో కొడుకు స్వరం వినగానే అంబాలాల్‌ ఆనందంతో పొంగిపోయాడు.‘‘నాన్నగారు! మేం అమెరికా చేరుకున్నాం’’ అవతలి నుంచి ఆనందంగా పలికాడు రమేష్‌.‘‘చాలా మంచిది బాబూ!’’‘‘మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నా? నిన్న రాత్రి మాత్రలు వేసుకున్నారా?’’ ఆదుర్దాగా అడిగాడు రమేష్‌. కొడుక్కి తన ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధను చూసి అంబాలాల్‌ ఆనందంతో పొంగిపోయాడు. వేల మైళ్ల దూరం వెళ్లినా తన మందుల గురించి మర్చిపోని కొడుకు ఉన్నాడని గ్రహించాక ఆయనకి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టయింది. తర్వాత రమేష్‌ తన తల్లిని కూడా కుశల ప్రశ్నలు అడిగాడు. ఆనందంతో ఇద్దరి కళ్లు చెమ్మగిల్లాయి.

వారం తర్వాత రమేష్‌ నుంచి నాలుగు పేజీల పెద్ద ఉత్తరం వచ్చింది. తాము విమానం ఎక్కినప్పటి నుంచి అమెరికాలో దిగే వరకు, తాముంటున్న నగర విశేషాలన్నీ రాశాడు. చివర్లో ‘మీరు సమయానికి మందులు వేసుకోండి. నేను లేనని నిర్లక్ష్యం చెయ్యకండి’ అని రాయటం మర్చిపోలేదు. అంత పెద్ద ఉత్తరంలో ఆ చివరి మాటలే అంబాలాల్‌ని ఆనందపరిచాయి. ఆ తర్వాత రమేష్‌ ఉత్తరాలు క్రమం తప్పకుండా రాసాగాయి. అంబాలాల్‌ కూడా ఎంతో ఓపికగా జవాబులు రాసేవాడు. తన కొడుకు తొందరగా తండ్రి కావాలని కోరుకునేవాడు. అయితే ఆ శుభవార్త వినటానికి అంబాలాల్‌కి చాలాకాలం పట్టింది. తనకు మనవడు పుట్టాడని తెలియగానే వీధిలోని వారందరికీ మిఠాయిలు పంచిపెట్టాడు. తండ్రి కోరికపై రమేష్‌ తన పుత్రుడి ఫొటో పంపించాడు. దాన్ని అంబాలాల్‌ వీధిలోని వారందరికీ చూపించాడు. ఫొటోని తన తలగడ కిందే పెట్టుకొని ఉదయం లేవగానే చూసేవాడు. అలా మనవడి ముఖం చూస్తే ఆయనకి రోజంతా ఉల్లాసంగా గడిచిపోయేది.అయితే తర్వాత మూడు నెలల వరకు రమేష్‌ నుంచి ఉత్తరం రాలేదు. నెలకి కనీసం ఒక్క ఉత్తరమైనా రాసే కొడుకు మూడు నెలలుగా ఉత్తరం రాయకపోవడంతో అంబాలాల్‌ కలవరపడ్డాడు. తీరిక దొరకలేదో లేక ఏదైనా సమస్యతో బాధపడుతున్నాడో తెలుసుకోవాలని తనే ఉత్తరం రాశాడు. జవాబు కోసం అసహనంగా ఎదురు చూడసాగాడు. 

నెల గడిచినా జవాబు రాలేదు. అంబాలాల్‌లో అసహనం పెరగసాగింది. ఐఎస్‌డీ కాల్‌ చెయ్యాలంటే రెండొందల దాకా బిల్లవుతుంది. అయినా ధైర్యం చేసి ఫోన్‌ చేశాడు. కోడలు మాట్లాడింది. రమేష్‌ ఆఫీసుకెళ్లాడని చెప్పింది. బిల్లు పెరుగుతుందనే భయంతో కుశల ప్రశ్నలడిగి ఫోన్‌ పెట్టేశాడు. కొద్ది రోజుల తర్వాత రమేష్‌ నుంచి ఉత్తరం వచ్చింది. అంబాలాల్‌ ఆత్రంగా తెరిచి చూశాడు. మునపటిలా పెద్ద ఉత్తరం కాదు. నాలుగంటే నాలుగు వాక్యాలున్నాయి. తనకు క్షణం కూడా తీరిక దొరకటంలేదని మాత్రమే రాశాడు. అంబాలాల్‌ ఉత్తరాన్ని రెండు మూడుసార్లు దీక్షగా చదివాడు. ఉత్తరంలో ఎక్కడా ‘నాన్నా, సమయానికి మందులు వేసుకోండి. అమ్మ ఎలా ఉంది?’లాంటి మాటలు లేవు. తొందర్లో మర్చిపోయినట్లున్నాడు. మరోసారి తీరిగ్గా ఉత్తరం రాస్తాడనుకున్నాడు. చాలాకాలానికి కొడుకు నుంచి ఉత్తరం వచ్చినందుకు అంబాలాల్‌ దంపతులు సంతోషంగా ఆరోజు మసాలా కిచిడీ వండుకొని తిన్నారు.మరో రెండు నెలలు గడిచినా రమేష్‌ నుంచి ఉత్తరం రాలేదు.అంబాలాల్‌లో మళ్లీ అసహనం పెరగసాగింది. కొడుకుతో మాట్లాడాలన్న తపన పెరిగింది. ధైర్యం చేసి మరోసారి ఐఎస్‌డీ కాల్‌ చేశాడు. అదృష్టవశాత్తు రమేష్‌ ఫోన్‌ ఎత్తాడు. అంబాలాల్‌ ఉత్సాహంగా మాట్లాడాడు. కాని రమేష్‌ ముక్తసరిగా మాట్లాడి ఫోన్‌ పెట్టేశాడు. అయినా అంబాలాల్‌ నిరాశపడలేదు. కొడుకుతో మాట్లాడినందుకు తృప్తిపడ్డాడు. బిల్‌ ఎక్కువవుతుందని అతను త్వరగా ఫోన్‌ పెట్టేశాడు. తర్వాత తనే తీరిగ్గా రమేష్‌ ఫోన్‌ చేస్తాడనుకున్నాడు.కానీ అలా జరగలేదు. రమేష్‌ నుంచి ఫోన్‌ రాలేదు. చాలారోజులు గడిచాయి. ఇప్పుడు అంబాలాల్‌కి ఫోన్‌ చేసే శక్తిలేదు. కంటిచూపు బాగా తగ్గింది. ఎలాగోలా కష్టపడి ఓ ఉత్తరం రాశాడు. జవాబు రాలేదు. నెల తర్వాత మరో ఉత్తరం రాశాడు. దానికీ సమాధానం లేదు. ఇంకో నెలకి మరొకటి రాశాడు. స్పందన రాలేదు. నాలుగో ఉత్తరం రాశాక ఓపిక నశించింది. జవాబు వస్తుందన్న ఆశ కూడా అడుగంటింది. పెద్దకొడుకు పోట్లాడి తన జీవితంలోంచి వెళ్లిపోయాడు. చిన్నకొడుకు పోట్లాడలేదు. కానీ ఎండాకాలంలో గాలిలోకి ఇంకిపోయే వాననీటిలా నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. తేడా ఆచరణలోనే. ఫలితం ఒక్కటే!అంబాలాల్‌ తన వైవాహిక జీవితంలోని తొలి పదేళ్లు తనకు సంతానం లేదని బాధపడ్డాడు.ఇప్పుడు ఆయేన జీవనసంధ్యలోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. ఓ కాలచక్రం పరిపూర్ణమైందనిపించింది.
గుజరాతీ మూలం : విజయ్‌ శాస్త్రి
 అనువాదం: రంగనాథ రామచంద్రరావు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement