లాలయేత్ పంచ వర్షాణి దశవర్షాణి తాడయేత్
‘ప్రాప్తేషు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్’
పిల్లలను ఐదు సంవత్సరాల పాటు లాలించాలి. పది సంవత్సరాల పాటు దండించాలి. పదహారో సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి పిల్లలను స్నేహితుల్లాగ చూడాలి అంటాడు చాణుక్యుడు. మనం కన్న బిడ్డలే కదా, వారి మీద మనకు సర్వాధికారాలు ఉన్నాయి కదా, వారిని ఏమన్నా చెల్లిపోతుంది అనుకోవటం తప్పు అంటున్నారు సైకాలజిస్టులు. పిల్లల్ని చిన్నతనంలో అనవసరంగా తిడుతూ, కఠినంగా మాట్లాడుతూ వారిని అవమానించినట్లుగా మాట్లాడుతుంటే వారిలో బుద్ధి వికాసం తగ్గిపోతుందని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ జరిపిన సర్వేలో తెలిసింది.
పిల్లల్ని ప్రేమగా మందలించాలే కానీ, కఠిన శిక్షలు విధిస్తూ, మనసు గాయపడేలాంటి ములుకుల్లాంటి మాటలతో బాధించటం వల్ల వారు మానసికంగా ఎదగలేకపోతారు. పిల్లలు తల్లిదండ్రుల నుంచి అనురాగం, అభిమానం ఆశిస్తారు. అందుకు బదులుగా తిట్లు శాపనార్థాలు వస్తుంటే, ఆ పసి మనసు తట్టుకోలేకపోతుంది. పసి హృదయాలను గాజు బొమ్మల్లా పదిలంగా కాపాడుకోవాలంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. అందుకే వారు ఏది చెప్పినా జాగ్రత్తగా వింటూ, వారి ఆలోచనలను స్వాగతిస్తూ, వారు సక్రమమార్గంలో ఎదిగేలా తల్లిదండ్రులు సహకరించాలి.
పదే పదే కోపం తెచ్చుకోవటం, కొట్టడం, భయపెట్టడం, వేధించటం... వంటి అస్త్రాలను పిల్లల మీదకు సంధిస్తుంటే, వారి మెదడు ఎదుగుదల తగ్గిపోతుంది. ముఖ్యంగా కౌమార దశలో అంటే టీనేజ్‌లో ఉన్న వారి మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ‘డెవలప్‌మెంట్ అండ్ సైకాలజీ’ వారు ప్రచురించారు. డా. సబ్రీనా సఫ్రెన్.. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సులో ఈ విషయాలను వెల్లడించారు. పిల్లల పట్ల కటువుగా ఉండటం తప్పేమీ కాదనుకుంటారు పెద్దలు.
సమాజం కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తుంది. ఏదో ఒక దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది తల్లిదండ్రులు ఇదే ఆలోచనతో ఉంటారని ఈ పరిశోధన చెబుతోంది. ‘మాట్లాడే మాటలు పిల్లల ఎదుగుదలలో మార్పులు తీసుకువస్తాయి. తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే... మాటిమాటికీ పిల్లల్ని దండించటం వల్ల పిల్లల మానసిక ఎదుగుదలకు అవరోధం ఏర్పడుతుందని’ అంటారు సఫ్రెన్. పిల్లల్ని లైంగికంగా, శారీరకంగా, మానసికంగా బాధకు గురి చేస్తుంటే, వారిలో ఏదో తెలియని ఆరాటం, విచారం పెరుగుతాయి.
వారు ఎదుగుతున్న కొద్దీ ఈ విచారం ఒత్తిడిగా మారుతుంది. అందుకే పిల్లల్ని బాల్యం నుంచి మంచి మాటలు, మంచి కథలు చెబుతూ పెంచాలి. ఎటువంటి సమయంలోనైనా తల్లిదండ్రుల అండదండలు ఉంటాయనే భరోసా కల్పించాలి. కొట్టడం, తిట్టడం, నిందించం, అసభ్య పదాలు ఉపయోగించటం వల్ల... పిల్లలలో తెలివితేటలు తగ్గిపోతాయని ఈ సర్వే చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment