ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది శ్రద్ధా వాకర్ హత్యోదంతం. దేశ రాజధానిలో ప్రియుడి చేతిలో కిరాతకంగా హత్యకు గురైంది ఆమె. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో దాచి.. ఆపై నగరంలో అక్కడక్కడ పడేశాడు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా. ఆలస్యంగా వెలుగు చూసి వార్తల్లో ప్రముఖంగా నిలిచిన ఈ కేసుపై మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆడబిడ్డల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతో ఎలాంటి సంబంధం లేదని వాళ్లు చెప్పినా సరే ఆ మాటల్ని పట్టించుకోకూడదు. వాళ్లను నిరంతరం గమనిస్తూ ఉండాలి అని తల్లిదండ్రులకు సూచించారామె. ఢిల్లీ ఉదంతంపై స్పందిస్తూ.. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ, ఆమె ఆచూకీ గురించి ఆలస్యంగా పట్టించుకున్నారు ఆమె కుటుంబ సభ్యులు. కాబట్టి, జరిగిన దారుణానికి బాధ్యత ఆ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులపై కూడా ఉంటుంది అని కిరణ్‌బేడీ తెలిపారు.
శ్రద్ధ తల్లిదండ్రులు ఆమె బాగోగుల గురించి మరింత పట్టించుకుని ఉండాల్సింది. ఆమె ఉంటున్న ఫ్లాట్ చుట్టుపక్కల వాళ్లు, యజమాని సైతం బాధ్యతగా వ్యవహరించి ఉండాల్సింది. ఒకరకంగా ఈ ఘటనకు ఆమె కుటుంబమే కారణంగా అనిపిస్తోంది. అంతేకాదు.. ఇది సమాజ వైఫల్యం, స్నేహితులది కూడా అని కిరణ్‌బేడీ ఓ జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు.
ఆడపిల్లను పెంచే సామాజిక బాధ్యతపై ఆమె స్పందిస్తూ.. స్వతంత్ర భావజాలం అలవర్చుకునేలా అమ్మాయిలను పెంచాలని ఆమె తల్లులకు సూచించారు. ఆపై వారు(ఆడపిల్లలు) ఎలా ఉంటారో? ఎక్కడ జీవిస్తారో? అని ఆందోళన చెందొద్దని, వారికి భరోసా ఇవ్వడం కుటుంబం యొక్క బాధ్యత అని ఆమె అభిప్రాయపడ్డారు. శ్రద్దా వాకర్ హత్య కేసు దర్యాప్తుపైనా స్పందించిన కిరణ్ బేడీ.. డేటింగ్ యాప్‌లో శ్రద్ధకు నిందితుడు అఫ్తాబ్ ఎలా దగ్గరయ్యాడు? అనే కోణంలోనూ తప్పనిసరిగా దర్యాప్తు చేపట్టాలని అధికారులకు సూచించారామె.
సంబంధిత వార్త: శ్రద్ధ శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో రొమాన్స్!
Comments
Please login to add a commentAdd a comment