
ఆగర్భ మిత్రులుగా తీర్చిదిద్దండి
పేరెంటింగ్ టిప్స్
కేర్, కేర్ మంటూ అప్పుడే పుట్టిన చిన్న బాబును/పాపను చూస్తే ఇంటిల్లపాది సంతోషం, ఇంటి వారసుడొచ్చాడనో, మహాలక్ష్మి వచ్చిందనో!
అయితే వీరందరికీ దూరంగా ముఖంపై దిండు పెట్టుకొని/మంచం కింద దూరి చిన్ని బుజ్జాయి కంటే ముందు పుట్టిన పాప/బాబు కంటి నిండా నీళ్లు నింపుకుంటారు. అమ్మ నన్ను పట్టించుకోవటం లేదని, మరెవరో వచ్చి అమ్మ ఒడిలో హాయిగా నిద్ర పోతున్నారని.
క్రమంగా అమ్మ ఒడిలోని పాప/బాబు పెద్దవారవుతారు... సోదర సోదరిల మధ్య విరోధం వస్తుంది. ఆటల్లో పోటీ నిలుస్తుంది. తల్లిదండ్రుల ప్రేమకోసం పోరాటం మొదలవుతుంది. ఫలితం పిల్లల మధ్య ఘర్షణ.
దీనినే ఇంగ్లీషులో సిబ్లింగ్ రైవలరీ అంటారు. తమకు సరైన గుర్తింపు లభించటంలేదని, తమ కన్నా సోదర, సోదరులనే బాగా చూసుకుంటున్నారనే నెగెటివ్ భావన పిల్లల్లో ఇలాంటి ప్రవర్తనకు కారణం అవుతుంది. ఇలా జరక్కుండా ఉండాలంటే... చంటి పిల్లలను గమనిస్తూనే, పెద్దపిల్లలపై దృష్టి సారించాలి. వారిని కూడా పట్టించుకుంటూ ఉండాలి. వయసులో పెద్దపిల్లలు చిన్నవారిని బాగా చూసుకోవాలని చెప్పాలి. వారిమధ్య సంబంధాన్ని వివరించాలి. పిల్లల ఆందోళనను అర్థం చేసుకోవాలి.
పిల్లలందరికీ సమప్రాధాన్యత ఇవ్వడం వల్ల వారిమధ్య ఆత్మన్యూనత తలెత్తదు. సోదర, సోదరుల మధ్య ప్రేమ, దయ, జాలి లక్షణాలు పెంపొందించి వారి మధ్య మంచి రిలేషన్ ఏర్పడటానికి కృషి చేయాలి. ఒక్కొక్కరిని విడివిడిగా ప్రశ్నించి, వారి మధ్య గొడవలకు గల కారణాలు తెలుసుకొని వాటిని పరిష్కరించడం వల్ల వారిమధ్య ఆరోగ్య కరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు.